.
మోదీ కాదు… షా కాదు… బెంగాల్ బీజేపీ టికెట్ల ఎంపిక, జోష్ వెనుక కనిపించని ఆ కేరక్టర్ ఎవరు? … పార్టీల ఎన్నికల వ్యూహం అంటే సాధారణంగా గుర్తొచ్చేది పెద్ద నాయకులే. ఢిల్లీ నుంచి మోదీ, షా వస్తారు. సభలు పెడతారు. ప్రసంగాలు చేస్తారు. వ్యూహాలు రచిస్తారు. అభ్యర్థుల ఎంపికలోనూ వాళ్లదే తుది మాట అనుకుంటాం.
కానీ 2026 బెంగాల్ ఎన్నికల తర్వాత ఒక్కసారి అభ్యర్థుల జాబితాలను వెనక్కి తిరిగి చూస్తే… మరో కథ కనిపిస్తుంది. అక్కడ ఒకే రకమైన ఫార్ములా పదే పదే కనిపిస్తోంది. బాధితురాలు… బాధితురాలి తల్లి… సాధారణ మహిళ… అధికార వ్యవస్థతో పోరాడిన మహిళ… ఇప్పుడు హత్యకు గురైన నాయకుడి కుటుంబ సభ్యురాలు.
Ads
ఇది యాదృచ్ఛికమా? లేక బెంగాల్ బీజేపీ రాజకీయాల్లో తెర వెనుక పనిచేస్తున్న కొత్త ఆలోచనా? మరో కేరక్టరా..? ఇప్పటి నందిగ్రామ్ నిర్ణయం ఈ ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది.
ఆర్జీకర్ నుంచి నందిగ్రామ్ దాకా… ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తల్లి రత్నా దేబ్‌నాథ్‌కు బీజేపీ పానిహాటి టికెట్ ఇచ్చింది. అప్పటికి అది కేవలం ఓ అభ్యర్థి ఎంపిక కాదు. ఆర్జీకర్ ఘటనతో ముడిపడిన ఆగ్రహాన్ని నేరుగా ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావడం.
ఆమె ఎన్నికల్లో గెలిచారు. పానిహాటిలో 87,977 ఓట్లు సాధించి టీఎంసీ అభ్యర్థిపై 28,836 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. అంటే ఒక విషాదానికి ప్రతీకగా నిలిచిన తల్లి… రాజకీయ ప్రతినిధిగా మారారు.
అక్కడితో ఆ ఫార్ములా ఆగలేదు…. సందేశ్‌ఖాలీ ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రేఖా పాత్రాను బీజేపీ 2026 ఎన్నికల్లో హింగల్‌గంజ్ నుంచి పోటీ చేయించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బసీర్హాట్ నుంచి ఓడిపోయిన ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఈసారి ఆమె గెలిచారు—1,00,207 ఓట్లతో 5,421 ఓట్ల ఆధిక్యంతో.
ఆమెను సందేశ్‌ఖాలీ మహిళలపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన వేధింపులు, భూవివాదాలు, హింసకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ప్రతీకగా బీజేపీ ముందుకు తెచ్చింది.
ఇక మూడో కథ మరింత ఆసక్తికరం… కాలితా మాజి… ఒకప్పుడు నెలకు సుమారు రూ.2,500 సంపాదించే పనిమనిషి… బీజేపీ ఆమెను ఔస్గ్రామ్ నుంచి పోటీ చేయించింది. ఎన్నికల్లో ఆమె 12,535 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా వచ్చాయి.
అంటే ఇక్కడ కేవలం ‘బాధితురాలి సెంటిమెంట్’ మాత్రమే లేదు. సాధారణ మహిళను రాజకీయ శక్తిగా మార్చే మరో పొర కూడా ఉంది.
ఇప్పుడు… నందిగ్రామ్! ఇదే నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారింది. నందిగ్రామ్ ఉప ఎన్నికకు హసిరాణి రథ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె ఎవరో కాదు… శుభేందు అధికారి మాజీ పీఏ చంద్రమాథ్ రథ్ తల్లి.
చంద్రమాథ్ రథ్ మే 6న కాల్పుల్లో హత్యకు గురయ్యారు. అది 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే జరిగింది. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు అదే కుటుంబంలోని తల్లికి… అదీ సాధారణ నియోజకవర్గంలో కాదు. నందిగ్రామ్‌లో టికెట్…!!
శుభేందు అధికారి తన సొంత రాజకీయ బలాన్ని నిర్మించుకున్న, బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రతీకాత్మకంగా మారిన నియోజకవర్గం ఇది… నిజానికి హసిరాణి రథ్ పూర్తిగా రాజకీయాలకు కొత్త వ్యక్తి కూడా కాదు. ఆమె గతంలో ఐదుసార్లు పంచాయతీ, పంచాయతీ సమితి ఎన్నికల్లో గెలిచిన స్థానిక నాయకురాలని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. అంటే ఆమెకు స్థానిక రాజకీయ అనుభవం కూడా ఉంది.
కానీ ఆమెకు ఉన్న మరో గుర్తింపు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తప్పకుండా ముందుకు వస్తుంది. “హత్యకు గురైన శుభేందు అధికారి సన్నిహితుడి తల్లి.” అంటే మళ్లీ అదే ఎమోషన్. మళ్లీ ఒక కుటుంబ విషాదం. మళ్లీ ఒక మహిళ. మళ్లీ ఒక రాజకీయ పోరాటానికి వ్యక్తిగత కథను జతచేయడం. మరి ఇది యాదృచ్ఛికం ఎలా అవుతుంది?
ఆర్జీకర్ తల్లి… సందేశ్‌ఖాలీ మహిళ… గృహ సహాయకురాలిగా జీవించిన కాలితా మాజి… ఇప్పుడు హత్యకు గురైన శుభేందు అధికారి పీఏ తల్లి… ఈ నాలుగు కథలను పక్కపక్కన పెట్టండి. ఇక్కడ కనిపిస్తున్న రాజకీయ నమూనా ఆసక్తికరంగా ఉంది.
“మా పార్టీ సిద్ధాంతం ఇదీ” అని చెప్పడం ఒక రాజకీయ ప్రచారం. కానీ… “మీరు అనుభవించిన బాధను మేము రాజకీయ స్వరంగా మారుస్తున్నాం” అని చెప్పడం మరో రకమైన రాజకీయ కమ్యూనికేషన్. బెంగాల్‌లో బీజేపీ ఈ రెండో మార్గాన్ని గట్టిగా ఉపయోగించినట్లు 2026 ఎన్నికల అభ్యర్థుల ఎంపికను చూస్తే అనిపిస్తుంది.
ఇది కేవలం మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. దీనికి మరో కోణం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో బీజేపీకి సంప్రదాయ రాజకీయ కుటుంబాల కంటే కొత్త కథలు అవసరమయ్యాయా?
ఆ కథల్లో కన్నీరు ఉంది. అన్యాయం అనే ఆరోపణ ఉంది. పోరాటం ఉంది. వ్యక్తిగత విషాదం ఉంది. చివరికి… బ్యాలెట్ పేపర్ మీద ఒక గుర్తు ఉంది. అసలు ఆ ‘కనిపించని కేరక్టర్’ ఎవరు? ఇక్కడే అసలు ప్రశ్న.
మోదీనా? షానా? శుభేందు అధికారా? లేదా వీళ్లందరి కంటే పైన ఒక “రాజకీయ కథనమో మరో కనిపించని కేరక్టరో” పనిచేస్తోందా? అదెవరు?
ఎందుకంటే ఢిల్లీ నాయకులు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి స్థానిక అభ్యర్థి కథను తయారు చేయలేరు. అది స్థానిక రాజకీయాన్ని చదివే వ్యవస్థ చేయాలి. ఎక్కడ బాధిత కుటుంబం ఉంది? ఎక్కడ అధికార వ్యతిరేక భావనకు ప్రతీకగా నిలిచిన మహిళ ఉంది?
ఎక్కడ సామాన్య జీవిత నేపథ్యం ఉన్న వ్యక్తిని ముందుకు తెస్తే రాజకీయ సందేశం బలపడుతుంది? ఎక్కడ వ్యక్తిగత విషాదం ఒక పెద్ద రాజకీయ కథనంతో కలుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికి అభ్యర్థులను ఎంచుకునే ఒక సిస్టమ్ పనిచేస్తోందని మాత్రం ఈ వరుస పరిణామాలు సూచిస్తున్నాయి.
అది ఒక వ్యక్తి కావచ్చు. ఒక చిన్న వ్యూహ బృందం కావచ్చు. రాష్ట్ర స్థాయి నాయకత్వంలోని ఒక కోర్ గ్రూప్ కావచ్చు. లేదా కేంద్ర– రాష్ట్ర నాయకత్వాల మధ్య పనిచేసే అభ్యర్థుల ఎంపిక వ్యవస్థ కావచ్చు. పేరు మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ దాని ‘ఫార్ములా’ మాత్రం కనిపిస్తోంది.
Share this Article