Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాలేజీలోనే ప్రత్యేకంగా ‘OYO’ రూమ్స్ – ఇది మరీ అరాచకం !!

September 16, 2026 by M S R

.

ఎప్పుడూ చెప్పుకునేదే కదా… ఒక ముఖ్యమంత్రి ఎలా పాలించకూడదో, ఒక లీడర్ ఎలా ఉండకూడదో చెప్పడానికి మమతా బెనర్జీ ప్రబలమైన ఉదాహరణ అని! బీజేపీ అధికారంలోకి వచ్చాక, కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి కొరడా పట్టుకుని కదులుతుంటే… పాత బాధితులు, పాత అక్రమాల కథలన్నీ బయటికి వస్తున్నాయి ధైర్యంగా!

ఇదీ అంతే… మమతా బెనర్జీ చీకటి పాలనకు మరో ఉదాహరణ… కాలేజీలో ‘OYO రూములు’… విద్యార్థినులకు ‘కాంప్రమైజ్’ ఒత్తిడి? సురేంద్రనాథ్ లా కాలేజీలో అసలు ఏం జరుగుతోంది? అటెండెన్స్ గొడవ నుంచి బయటకొస్తున్న సంచలన ఆరోపణలు

Ads

కోల్‌కతాలోని సురేంద్రనాథ్ లా కాలేజీ ఇప్పుడు ఒక సాధారణ అటెండెన్స్ వివాదంతో వార్తల్లోకి రాలేదు. ఒకప్పుడు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు కావాల్సిన 75 శాతం అటెండెన్స్ నిబంధనపై మొదలైన గొడవ… ఇప్పుడు కాలేజీలో రాజకీయ జోక్యం ఎంతవరకు ఉంది? విద్యార్థులపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి? విద్యార్థినులకు ‘కాంప్రమైజ్’ చేయమని చెప్పేవారా? కాలేజీ ప్రాంగణంలో అనుమానాస్పద గదులు ఎందుకు ఉన్నాయి? అనే ప్రశ్నల వరకు వెళ్లింది.

బెంగాల్ మీడియాలో వెలువడుతున్న తాజా కథనాలు చూస్తే ఇది ఒక కాలేజీ గొడవ కంటే పెద్ద వ్యవహారంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు వివాదం మొదలైంది 75 శాతం అటెండెన్స్ నిబంధనతో. బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన హాజరు శాతం తప్పనిసరి అని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.

అయితే చాలామంది విద్యార్థులకు అంత హాజరు లేదని, అందువల్ల పరీక్షలు రాయనివ్వబోమన్న నిర్ణయంతో విద్యార్థుల్లో ఆగ్రహం మొదలైంది. విద్యార్థుల వాదన మాత్రం మరోలా ఉంది. కొన్ని నెలల క్రితం క్లాసులను ఉదయం 8 గంటల నుంచి ఏకంగా ఉదయం 6 గంటలకు మార్చడం, అటెండెన్స్ రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, కొన్నిసార్లు పేపర్ చిట్స్ లేదా వాట్సాప్ ద్వారా హాజరు నమోదు చేయడం వల్లే సమస్యలు వచ్చాయని వారు ఆరోపించారు.

ఇక్కడే వ్యవహారం వేడెక్కింది. వైస్ ప్రిన్సిపల్, టీచర్-ఇన్-చార్జ్ మొహమ్మది తరన్నుమ్‌ను విద్యార్థులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు దాదాపు 23 గంటల పాటు ఘెరావ్ చేశారు. తనతో ఉన్న ఆరుగురు టీచర్లను బయటకు పంపించారని, తనను ఒంటరిగా ఉంచి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదని, లైట్లు ఆపేశారని తరన్నుమ్ ఆరోపించారు. చివరకు తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె చెప్పారు.

అయితే ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చింది. ఆమె రాజీనామా లేఖలో కుటుంబ, ఆరోగ్య, వ్యక్తిగత కారణాలు పేర్కొన్నప్పటికీ, మరుసటి రోజు మీడియాతో మాట్లాడుతూ తాను స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని, విద్యార్థుల ఒత్తిడితో రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. సెప్టెంబర్ 12న ఆమె మరోసారి మీడియా ముందుకొచ్చి “నేను రాజీనామా చేయలేదు… విధుల్లో కొనసాగుతాను” అని ప్రకటించారు. తనపై విద్యార్థులను రెచ్చగొట్టింది కొత్త గవర్నింగ్ బాడీ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే కౌస్తవ్ బాగ్చీ అని ఆమె ఆరోపించారు.

ఇంతవరకు ఇది అటెండెన్స్, కాలేజీ పరిపాలన, రాజకీయ జోక్యం మధ్య నడుస్తున్న వివాదంలానే కనిపించింది. కానీ ఆ తర్వాత బయటకొచ్చిన ఆరోపణలు కథను పూర్తిగా మరో మలుపు తిప్పాయి.

“కాంప్రమైజ్‌తో అటెండెన్స్…” కొంతమంది విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ కాలేజీలో విద్యార్థినులపై “కాంప్రమైజ్” కావాలని ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. అలా చేయకపోతే అటెండెన్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేవారని వారి వాదన. విద్యార్థినులు తమ వద్దకు వచ్చి ఏడ్చేవారని, పరీక్షలకు హాజరయ్యే విషయంలో కూడా ఇలాంటి ఒత్తిళ్లు ఉండేవని ఒక విద్యార్థి ఆరోపించినట్లు బెంగాలీ మీడియా రిపోర్ట్ చేసింది.

ఇంకా సంచలన ఆరోపణ ఏమిటంటే— కాలేజీ ప్రాంగణంలోనే కొన్ని గదులను విద్యార్థులు “OYO రూములు”గా పేర్కొంటున్నారు. కొన్ని బెంగాలీ మీడియా కథనాల్లో ఈ గదుల్లో బెడ్లు, బెడ్‌షీట్లు, అటాచ్డ్ బాత్‌రూమ్‌లతో కూడిన విలాసవంతమైన ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంటున్నారు. (OYO రూమ్స్ అంటేనే అర్థం అవుతోంది కదా…)

ఇది విద్యార్థులు చేస్తున్న ఆరోపణ. ఆ ప్రత్యేక గదులు ఎందుకు ఉన్నాయి, వాటిని ఎందుకు, ఎవరు ఉపయోగించారు, వాటి ఉద్దేశం ఏమిటి అన్నది అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇదే వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే మరో అంశం ఉంది. కొన్ని నెలల క్రితం కాలేజీలో నిర్వహించిన క్లీనప్ డ్రైవ్ సందర్భంగా లాక్ చేసి ఉన్న గదుల నుంచి నగదు ఉన్న సూట్‌కేసులు, ఒక అక్రమ తుపాకి, ఇతర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కాలేజీ రాజకీయ కార్యకలాపాలు, స్థానిక తృణమూల్ నాయకత్వంతో సంబంధాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.

అదే నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన దేబాశిష్ బెనర్జీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ప్రభావం కాలేజీ వ్యవహారాల్లో ఉందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే కాదు— కాలేజీలో ఆ గదులు ఎందుకు ఉన్నాయి? వాటిని ఎవరు ఉపయోగించారు? నగదు, ఆయుధం అక్కడికి ఎలా వచ్చాయి? రాజకీయ నాయకులకు వాటితో ఏమైనా సంబంధం ఉందా? విద్యార్థినులపై ఎవరైనా లైంగిక ఒత్తిడి తెచ్చారా? అన్న ప్రశ్నలన్నీ ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి.

మొహమ్మది తరన్నుమ్ పాత్రపై కూడా ప్రశ్నలు … విద్యార్థుల తాజా ఆరోపణల్లో వైస్ ప్రిన్సిపల్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే తరన్నుమ్ మాత్రం తనకు “కాంప్రమైజ్” గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె తిరస్కరిస్తున్నారు. తాను రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయలేదని, అటెండెన్స్ విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరించానని ఆమె వాదన.

ఆమెకు తృణమూల్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. గతంలో వామపక్ష రాజకీయాలతో తనకు అనుబంధం ఉన్నప్పటికీ 2016లోనే పార్టీ సభ్యత్వం వదిలేశానని చెప్పారు.

అంటే ఒకవైపు విద్యార్థులు “కాలేజీలో రాజకీయ ప్రభావం, అటెండెన్స్ పేరుతో ఒత్తిళ్లు, విద్యార్థినులపై కాంప్రమైజ్ ఆరోపణలు” అంటుంటే… మరోవైపు వైస్ ప్రిన్సిపల్ “నిబంధనలు అమలు చేయడం వల్లే నన్ను టార్గెట్ చేశారు” అంటున్నారు.

ఇక గవర్నింగ్ బాడీ అధ్యక్షుడు కౌస్తవ్ బాగ్చీ మాత్రం కాలేజీలో అటెండెన్స్ వ్యవస్థలోనే అవకతవకలు ఉన్నాయని, సమస్యను పరిష్కరించేందుకు తాను విద్యార్థులతో చర్చించానని చెబుతున్నారు. 75 శాతానికి కొద్దిగా తక్కువ ఉన్న విద్యార్థులను కొన్ని షరతులతో పరీక్షలకు అనుమతించే మార్గాన్ని కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు.

చివరికి వైస్ ప్రిన్సిపల్ గదికే గంగాజల శుద్ధి! వివాదం ఎంత తీవ్రంగా మారిందో చెప్పడానికి మరో దృశ్యం కూడా బెంగాల్ మీడియాలో వచ్చింది.

తరన్నుమ్ కాలేజీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కొందరు విద్యార్థులు ఆమె గదిలో గంగాజలం చల్లి, ధూపం వెలిగించి “శుద్ధి” కార్యక్రమం నిర్వహించారు. ఒక విద్యాసంస్థలో పరిపాలనా వివాదం ఈ స్థాయికి వెళ్లడం పరిస్థితి ఎంత విషమంగా మారిందో చెప్పకనే చెబుతోంది.

ఇప్పుడు సురేంద్రనాథ్ లా కాలేజీ కథలో రెండు వేర్వేరు పొరలు కనిపిస్తున్నాయి. పైపొరలో చూస్తే ఇది 75 శాతం అటెండెన్స్ కోసం విద్యార్థులు చేసిన ఆందోళన. లోపలికి వెళ్తే మాత్రం కాలేజీ పరిపాలనలో పారదర్శకత, రాజకీయ జోక్యం, పాత క్యాష్– ఆయుధం ఘటన, అనుమానాస్పద గదులు, విద్యార్థినులపై “కాంప్రమైజ్” ఆరోపణలు వరుసగా బయటకొస్తున్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాలేజీలోనే ప్రత్యేకంగా ‘OYO’ రూమ్స్ – ఇది మరీ అరాచకం !!
  • ఔను, వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు – అందుకే బీజేపీకి ఒకేఒక వోటు !!
  • ఒకరోజు బిచ్చగాడి వేషంతో – ఆ ప్రచారంతో సాదాసీదాతనం రాదు !
  • హెరిటేజ్ ఆనవాళ్ల పరిరక్షకుడు- ఈ ఆగాఖాన్ ఎవరో తెలుసా?
  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions