.
Bharadwaja Rangavajhala …. ‘పోలేవు నీవూ … రాలేను నేనూ …
నీ దారిలోనే నే దాగినానూ’ ….
సుశీల పాడిన సోలోల్లో పెద్దగా జనంలోకి రాని మెలోడీ. నారాయణరెడ్డి రాసిన ఈ గీతం బి.శంకర్ స్వరపరచారు. హైద్రాబాద్ కు చెందిన గజల్ సింగర్ అయిన బి. శంకర్ రావు చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందించారు.
ఆయన సంగీతం అందించిన సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చుగానీ …
ఆయన సంగీతం మాత్రం ఫెయిల్ కాలేదు.
Ads
నిజానికి ఆయన చేసిన పాటలు విని, ఆయా సినిమాలకు వెళ్లి దెబ్బతిన్న సందర్బాలున్నాయి.
ఉదాహరణకు జాలాది రాసిన
‘ఘల్లు ఘల్లున కాలి గజ్జలందెలు మ్రోగ’ పాటయూ …
దానితో పాటు ‘ఎన్నాళ్లీ తలపులు’ అనే గీతమూ
రేడియోలో తెగ వినేసి, సదరు చిత్రము చల్ మోహనరంగ బెజవాడ శాంతి థియేటర్ లో విడుదలైతే వెళ్లి బాబోయ్ అనుకున్నాం.
కృష్ణ, దీప ఈ చిత్రంలో నాయికా నాయకులు.
అలాగే కృష్ణ గారే నటించిన మనుషులు మట్టి బొమ్మలు సినిమా కూడా.
‘నీలో …. విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయే’ అంటూ నారాయణరెడ్డి రాసిన పాటొకటి ఉంటుంది.
సుశీల బాలు పాడారు.
ఈ పాట ఒక్కసారి వింటే … చాలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
ఇందులోనే మోదుకూరి జాన్సన్ రాసిన సరస్వతి నమస్తుభ్యం పాట ఉంటుంది.
అది కూడా చాలా బావుంటుంది.
ఆయన ట్యూన్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
గజల్ సొగసులు కనిపిస్తూనే ఉంటాయి.
ఇక కృష్ణ, జమున నటించిన అమాయకుడు చిత్రంలో పాటలన్నీ బావుంటాయి.
ముఖ్యంగా పి.బి.శ్రీనివాస్ పాడిన దేవులపల్లి వారి సాహిత్యం
‘అనుకోనా …
ఇది కల అనుకోనా …
నిజమనుకోనా …
అయినది కాదని కానిది అవునని అనుకోనా’
అంటూ సాగే గీతం కానీండి …
ఇప్పుడు మీకు పంచిన సుశీల గారి సోలో గానీండి, గజల్ పోకడల్లో సాగినవే.
అమాయకుడులోనే ఘంటసాల మాస్టారు పాడిన పాటొకటి ఉంటుంది.
‘మనిషైతే … మనసుంటే … కనులు కరగాలిరా …
కరిగి కరుణ కురియాలిరా …
ఆగి ఆగి సాగిపోరా సాగిపోతూ చూడరా …
వేగిపోయే వెన్నెన్ని బ్రతుకులో వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో …
వేచి ఉన్నాయిరా …’
అంటూ సాగుతుందీ గీతం.
ఘంటసాల కంఠం కూడా ఈ పాటలో చాలా ప్రత్యేకంగా పలుకుతుంది.
ఇది కూడా సాధారణంగా వినిపించే ట్యూను కాదు.
పుల్లయ్య గారి ‘అల్లుడే మేనల్లుడు’ సినిమాకు శంకర్ పనిచేయడం విశేషమే.
పద్మశ్రీ బ్యానర్ లో ఎక్కువ సినిమాలకు మాస్టర్ వేణు సంగీతం అందించారు.
ఈ సినిమాకు మాత్రం శంకర్ ను తీసుకున్నారు.
ఈ సినిమాలోనూ ఘంటసాలతో పాడించిన సోలో ఒకటుంది.
‘జాబిల్లి వచ్చాడే పిల్లా …’ పాట హిట్టు. దాశరథి రాశారీ గీతాన్ని.
ఇదే సినిమాలో ఘంటసాల సుశీల పాడిన యుగళగీతం ‘నీవనీ నేననీ లేనే లేవు తెరలు అడ్డు తెరలు’ అనే గీతం కూడా చాలా పాపులర్రు మాత్రమే కాదు, బావుంటుంది కూడా.
నాకు తెలిసి బి. శంకర్ సంగీతం అందించిన చిత్రాలు….
వింత ఇల్లు సంతగోల,
మనుషులు మట్టిబొమ్మలు,
పెళ్లికాని తండ్రి ,
చల్ మోహన రంగ,
అమాయకుడు,
ఇల్లు వాకిలి ,
సమాజం చేసిన పెళ్లి,
అల్లుడే మేనల్లుడు,
దెబ్బకుఠా దొంగల ముఠా.
బి.శంకర్ ఎవరైనా పిలిస్తే మద్రాసు వెళ్లడమే తప్ప తను మద్రాసులో ఉండి నిర్మాతల్ని ఆకట్టుకునే ప్రోగ్రాం పెట్టుకోలేదు.
కారణం… ఆయన ఇక్కడ గజల్ సింగర్ గా బిజీగా ఉండడమే . ఆయన మద్రాసు వచ్చారని తెలిస్తే చాలు ఎమ్మెస్వీ నుంచీ కబురొచ్చేదట. బి.శంకర్ తో గజల్స్ పాడించుకుని వినడం ఎమ్మెస్వీకి చాలా ఇష్టం.
మనుషులు మట్టిబొమ్మలు సినిమాలో ..
‘నీలో విరిసిన అందాలన్నీ’ అంటూ సినారే రాసిన డ్యూయట్ ఒకటి ఉంటుంది.
ఆ పాటలో ముదటి చరణం చివర లైను గమనించండి … ‘కార్తీక పూర్ణిమలై వెలగాలి’ అని ఉంటుంది.
అలాగే రెండో చరణానికి చివర కూడా అదే లైన్ ఉంటుంది.
ఆ మధ్య స్వరాభిషేకంలో బాలు, సునీత గార్లు పాడినప్పుడు కూడా అలానే పాడేశారు.
ఈ పాట యుట్యూబ్ లో కూడా అలానే దొరుకుతోంది.
కానీ ఒక చోట మాత్రమే కార్తీకపూర్ణిమలై వాడారు నారాయణరెడ్డి గారు. రెండో చోట చైత్రమధుర రాత్రులై అని వాడారు.
కానీ మన సింగర్స్ మాత్రం రెండు చరణాలకూ కార్తీక పూర్ణిమలే అనేస్తున్నారు …
రెండో చరణం చివర చైత్ర మధుర రాత్రులు అని వాడాలి …
ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే … ఇప్పటి జనరేషన్ కు నెట్ లో అవైలబుల్ గా ఉన్న పాటలో ఈ లోపం ఉండడం వల్ల .
దాన్నే ఫాలో అయిపోతున్నారు.
అది సాంకేతిక సమస్య వల్ల ఆ బిట్ ఎగిరిపోయింది.
దాని ప్లేస్ లో మొదటి చరణంలోని చివర ముక్కనే కాపీ చేశారు.
అలా ఉత్పన్నమైన సమస్య అన్నమాట ఇది.
లిరిక్స్ రాసిన వెబ్ సైట్లలోనూ ఇదే లోపం కొనసాగింది…
Share this Article