.
కాంగ్రెస్‌కు దూరంగా ప్రాంతీయ పార్టీలు..! మోదీకి కలిసొచ్చే పరిణామాలేనా..? ఈ ఆలోచనకు తమిళనాడు నుంచి శ్రీకారం చుడుతున్న పార్టీ డీఎంకే… కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఆ పార్టీ జాతీయ రాజకీయాల్లో తన తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది… డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సోదరి, పార్టీ కీలక నేత కనిమొళి వరుసగా ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తుండటమే అందుకు కారణం…
- ముందుగా ముంబై వెళ్లి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ… ఆ తర్వాత ఢిల్లీలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలేతో చర్చలు… తాజాగా కోల్‌కతాలో మమతా బెనర్జీతో గంటకు పైగా సమావేశం… ఈ వరుస భేటీలన్నింటినీ కలిపి చూస్తే… ఇది కేవలం మర్యాదపూర్వక పరామర్శల పరంపర కాదనే అనుమానాలు రావడం సహజమే… కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలకు ఒక జాతీయ వేదిక సాధ్యమా అన్నదే అసలు చర్చగా కనిపిస్తోంది…
Ads
ఇక్కడే కాంగ్రెస్‌కు ఎదురవుతున్న చిక్కు అర్థమవుతుంది… తమిళనాడులో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన డీఎంకే.. ఎన్నికల తర్వాత మాత్రం అదే కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకుంది… కాంగ్రెస్ తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని టీవీకేకు మద్దతు ప్రకటించడంతో డీఎంకే తీవ్రంగా స్పందించింది… చివరకు ఇండియా కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చి, ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కొత్త సమీకరణాలపై దృష్టి పెట్టింది…
అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పరిస్థితి మరో రకమైన రాజకీయ వైరుధ్యాన్ని బయటపెడుతోంది…
కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న మమత… వర్తమానంలో మాత్రం వరుస దెబ్బలు తింటూ కాంగ్రెస్‌తో అవసరార్థం దోస్తీ అంటోంది… తప్పదు… అనివార్యంగా, వేరే దిక్కులేక నందిగ్రామ్ ఉపఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది… తాజా వార్తల ప్రకారం మరో సీటులో కూడా… అంతే కాదు, అసోంలోని ఒక ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి…
ఎస్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు… అలాగే వర్తమానంలో మమత వేరే దిక్కులేక కాంగ్రెస్‌కు జై అంటున్నా సరే, ఆ స్టాండ్ మీద నిలబడదు… థర్డ్ ఫ్రంట్ ఆమె ఆలోచనలే భాగమే…
-
ఏమో, బీజేపీతో పొత్తు ఉండదు అంటున్న కేసీయార్ పార్టీ మమత అండ్ కనిమొళితో సయోధ్యతో థర్డ్ ఫ్రంట్‌కు సరే అంటుందా..? ఆ కోపంతో మోదీషా కన్నెర్ర చేస్తే తట్టుకునే శక్తి కేసీయార్ అండ్ కంపెనీకి ఉందా…? అది చూడాలి… కేసీయార్ జాన్ జిగ్రీ జగన్ ధోరణి కూడా వేచిచూడాలి…
- ఎందుకంటే… మోదీషా కన్నెర్ర చేస్తే… నిజంగా కళ్లురిమితే జగన్, కేటీయార్, కేసీయార్ జైళ్లలో ఉంటారు… రియాలిటీ అది… కానీ మోదీషా అవకాశవాద లెక్కలు వేరు… అందరికీ పవిత్రతీర్థం ఇచ్చి పునీతులు చేసే బాపతు…
మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌తో సంబంధాల విషయంలో ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లకు తమ తమ రాజకీయ లెక్కలు ఉన్నాయి… ఈ పార్టీల నేతలతో కనిమొళి భేటీలు జరపడం వల్లే ఇప్పుడు మరో ప్రశ్న ముందుకొస్తోంది…
ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి మాత్రమేనా? లేక కాంగ్రెస్ లేకుండా కూడా బీజేపీ వ్యతిరేక రాజకీయ వేదిక ఏర్పడగలదా? ఇదే అసలు ప్రశ్న…
ఆప్ ఇప్పటికే కాంగ్రెస్‌తో అనేక రాష్ట్రాల్లో విభేదాల దారిలో నడుస్తోంది… డీఎంకే బహిరంగంగానే బయటకు వచ్చింది… బెంగాల్‌లో మమతకు కాంగ్రెస్‌తో పొత్తు అవసరం ఉన్న చోట అవసరం మేరకు సహకారం ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో ఇరు పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది… మహారాష్ట్రలోనూ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌తో తమ సొంత సమీకరణాలున్నాయి…
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తమ భవిష్యత్తు రాజకీయాలను నిర్మించుకోవాలా వద్దా అన్న విషయంలో స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తున్నాయి…
వెరసి… బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తుల మధ్యే సమన్వయం కష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది… గత ఎన్నికలకు ముందున్న స్థితికి ఇది భిన్నమైన సిట్యుయేషన్… ఇది కాంగ్రెస్‌కు మాత్రం ఒక పెద్ద రాజకీయ ప్రశ్న.
ఎందుకంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒకే నాయకత్వాన్ని ముందుకు తేవాలంటే ప్రాంతీయ పార్టీలు ఆ నాయకత్వాన్ని అంగీకరించాలి… కానీ తమిళనాడు నుంచి బెంగాల్ వరకు, ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వరకు ప్రాంతీయ నాయకుల రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్ర స్థాయి శత్రుత్వాలు, సీట్ల లెక్కలు వేర్వేరుగా ఉన్నాయి…
అందుకే ‘బీజేపీ వ్యతిరేకత’ ఒక్కటే అందరినీ కలిపే సిమెంట్‌గా పనిచేయడం లేదు… ఇక నిజంగానే కాంగ్రెస్‌ను పక్కనపెట్టి ఒక ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడితే దాని స్వరూపం ఎలా ఉంటుంది? ఎవరు నాయకుడు? ప్రధాని అభ్యర్థి ఎవరు? సీట్ల పంపకం ఎలా? కాంగ్రెస్‌తో ఎన్నికల తర్వాత సంబంధం ఎలా? బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమేనా.. లేక కాంగ్రెస్‌కూ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు.
ముఖ్యంగా ఈ సమీకరణాన్ని ‘యాంటీ-హిందూ ఫ్రంట్’గా పిలవాలా..? ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒకే ప్రత్యామ్నాయ శిబిరం అనే 2024 నాటి ఫార్ములా ఇప్పుడు అంత సులభంగా కనిపించడం లేదు… పాత సమీకరణాల్ని వదిలేసి, కాంగ్రెస్ కాడి కింద పడేసి… సొంత ఫ్రంట్ కట్టే దిశలో కనిమొళి సీరియస్ పాత్ర పోషిస్తోంది… 2028 లేదా 2029 లెక్కలకు ప్రస్తుతం పునాదులు పడుతున్నాయన్నది నిజం..!!
Share this Article