Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!

September 25, 2026 by M S R

.

జేమ్స్ బాండ్ అంటే ప్రపంచానికి వెంటనే గుర్తొచ్చేది గన్, గాడ్జెట్లు, కార్లు, అందమైన అమ్మాయిలు, ప్రమాదకరమైన మిషన్లు. కానీ నిజ జీవితంలో ఓ గూఢచారి అలా ఉండడు. తన పని పూర్తయిన తర్వాత కూడా తన పేరు బయటకు రాకపోవడమే అతని అసలైన విజయం. అలాంటి వ్యక్తే రమేశ్వర్ నాథ్ కావ్.

అందరూ ఇండియన్ సూపర్ జేమ్స్‌బాండ్ అని అజిత్ దోవల్‌ను చెబుతుంటారు కానీ… భారతీయ గూఢచార వ్యవస్థకు ఆద్యుడు… పవర్‌ఫుల్ స్పై వేరు… ఆయనే కావ్…  భారతదేశానికి దేశం బయట నిఘా వ్యవస్థను నిర్మించిన వ్యక్తి. ‘రా’ (R&AW) తొలి అధిపతి… తెరపై కనిపించకుండా దేశ భద్రత కోసం పనిచేసిన ఇండియన్ జెంటిల్‌మన్ స్పై…

Ads

ఇప్పుడు ఆ నిజజీవిత గూఢచారి కథే సినిమాగా రాబోతోంది… అదీ ఇంట్రస్టింగు… కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్‌తో కలిసి ఆర్.ఎన్. కావ్ జీవితంపై భారీ స్థాయి సినిమాను ప్రకటించింది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ 2028 ఆగస్టు 11న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా జర్నలిస్ట్, స్ట్రాటజిక్ అఫైర్స్ అనలిస్ట్ నితిన్ గోఖలే రాసిన R.N. Kao: Gentleman Spymaster పుస్తకం ఆధారంగా తెరకెక్కనుంది.

అయితే అసలు ఆసక్తి సినిమా ప్రకటనలో కాదు… కావ్ అనే మనిషి జీవితంలో ఉంది…. ఒక విమాన ప్రమాదం.. అంతర్జాతీయ కుట్ర!

‘కాశ్మీర్ ప్రిన్సెస్’ పేరున్న ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ నుంచి ఇండోనేషియాలోని బాండుంగ్‌కు వెళ్తోంది. విమానంలో చైనా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు ఉన్నారు. మధ్యలో విమానం పేలిపోయింది. అది సాధారణ ప్రమాదం కాదని అనుమానాలు మొదలయ్యాయి.

అప్పటికి కేవలం 37 ఏళ్ల రమేశ్వర్ నాథ్ కావ్‌ను ఈ కేసు దర్యాప్తుకు పంపారు. ఆ దర్యాప్తు ఆయనను సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, చైనా వరకు తీసుకెళ్లింది. చైనా ప్రధాని జౌ ఎన్‌లైతో కూడా ఆయనకు ఈ కేసు సందర్భంగా ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది.

అక్కడితో కావ్ కథ మొదలైందని చెప్పాలి. 1962లో చైనాతో యుద్ధం తర్వాత భారత భద్రతా వ్యవస్థలో భారీ మార్పుల అవసరం కనిపించింది. కావ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ వంటి నిఘా వ్యవస్థల నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. చివరకు 1968లో ఇందిరాగాంధీ ఆయనపై నమ్మకం ఉంచి భారత విదేశీ నిఘా సంస్థ R&AWను నిర్మించే బాధ్యత అప్పగించారు. ఆ సంస్థకు కావ్ తొలి చీఫ్ అయ్యాడు…

1971.. అసలు ‘స్పై గేమ్’ అక్కడే! కావ్ పేరు వినగానే 1971 యుద్ధం గుర్తుకురావడానికి కారణం ఉంది. తూర్పు పాకిస్థాన్‌లో పరిస్థితులు క్రమంగా ఉధృతమవుతున్న సమయంలో భారతదేశానికి అక్కడి పరిణామాలపై ఖచ్చితమైన సమాచారం అవసరం. కొత్తగా ఏర్పడిన R&AW ఆ సమాచార సేకరణలో కీలక పాత్ర పోషించింది. ముక్తి బాహినీకి సంబంధించిన శిక్షణ, తూర్పు పాకిస్థాన్‌లోని పరిణామాలపై నిఘా, పాకిస్థాన్ సైనిక ప్రణాళికలపై సమాచారం వంటి అంశాల్లో కావ్ నేతృత్వంలోని వ్యవస్థ పనిచేసింది.

యుద్ధానికి ముందు పాకిస్థాన్ భారత వైమానిక స్థావరాలపై ముందస్తు దాడి చేయవచ్చన్న కీలక సమాచారం కూడా భారత నిఘా వ్యవస్థకు చేరింది. దాంతో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. ఆ తర్వాత జరిగిన యుద్ధం 1971 డిసెంబర్‌లో పాకిస్థాన్ సైన్యం ఢాకాలో లొంగిపోవడం, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.

అంటే సినిమా తీసేవాళ్లకు ఇక్కడ ఒక సాధారణ బయోపిక్ లేదు. ఒక విమాన పేలుడు నుంచి మొదలై… ఒక దేశం తన నిఘా వ్యవస్థను నిర్మించుకోవడం… ఆ వ్యవస్థ కొన్నేళ్లకే చరిత్రను మార్చిన యుద్ధంలో కీలకంగా మారడం అనే కథ ఉంది.

జేమ్స్ బాండ్‌కు పూర్తి విరుద్ధం! ఇక్కడే ఆర్.ఎన్. కావ్ ప్రత్యేకత.  ఆయన గురించి రాసిన పుస్తకాలు, ఆయనతో పనిచేసినవారి జ్ఞాపకాల్లో కనిపించే కావ్… తెరపై కనిపించే 007కు పూర్తి విరుద్ధం. పెద్దగా మాట్లాడటం, తన విజయాలను ప్రచారం చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయనతో పనిచేసినవారు ఆయనను ‘రామ్‌జీ కావ్’ అని పిలిచేవారు. నిఘా ప్రపంచంలో ఆయన నిర్మించిన వ్యవస్థలో పనిచేసిన వారిని తర్వాత ‘కావ్‌బాయ్స్’ అని కూడా పిలిచేవారు.

అంతేకాదు… 1971 విజయానికి సంబంధించి తనకు క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నించిన వారినీ ఆయన నిరుత్సాహపరిచేవారని ఆయన సహచరుల జ్ఞాపకాల్లో కనిపిస్తుంది. ఒక సందర్భంలో బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి ఆయనను గుర్తించి, 1971లో తన పాత్రకు ప్రశంసలు అందించగా, కావ్ తనకేమీ క్రెడిట్ లేదన్నట్టుగా స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మాజీ R&AW అధికారి బి. రామన్ రాశాడు.

దేశానికి కనిపించని యుద్ధాలు చేసే వ్యక్తి… తన విజయానికి మాత్రం ఓ తెర వెనుక ఉండే కనిపించని వ్యక్తిగానే ఉండిపోయాడు.  ఇదే కారణంగా కావ్ జీవితాన్ని చాలామంది ‘జెంటిల్‌మన్ స్పై’ కథగా చూస్తారు.

ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపైకి… ఈ సినిమా ప్రకటన కూడా కొత్త విషయం కాదు. ధర్మ ప్రొడక్షన్స్ 2020లోనే నితిన్ గోఖలే పుస్తకాన్ని సినిమాగా తీసే ఆలోచనను ప్రకటించింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాజెక్టుకు అధికారికంగా విడుదల తేదీ వచ్చింది. అయితే దర్శకుడు, నటీనటులు వంటి కీలక వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే ఇంతకాలం ‘రా’ కథల్లో ఎక్కువగా కనిపించింది ఆ సంస్థలో పనిచేసిన ఫీల్డ్ ఏజెంట్లే. ఇప్పుడు ఆ సంస్థను నిర్మించిన మనిషి కథే తెరపైకి వస్తోంది. కావ్ జీవితంలో సినిమా కావడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. అంతర్జాతీయ కుట్ర, విమాన పేలుడు, చైనా, పాకిస్థాన్, 1971 యుద్ధం, సిక్కిం విలీనం, ప్రధాని కార్యాలయం, రహస్య మిషన్లు… కానీ అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏమిటంటే— ఇవన్నీ చేసిన మనిషి మాత్రం ప్రచారానికి దూరంగా నీడల్లోనే ఉండిపోయాడు…

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!
  • నరుకుడు రోగం! మితిమీరిన హింస- మతిమాలిన దర్శకత్వ ప్రతిభ!!
  • The Paradise – దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను చరిత్ర క్షమించదు…
  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!
  • ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!
  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions