.
‘కల్కి 2’లో దీపికా పాత్ర సంగతేంటి..? కొత్త నటి లేదు… మరి సుమతి ఎక్కడ? ఆమె సినిమా నుంచి తప్పుకుంటే, లేదా ఆమెను తప్పిస్తే… ఇక మొదటి భాగంలోని కీలక పాత్రను మొత్తానికే లేపేస్తారా?
ఒక హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుంటే సాధారణంగా జరిగేదేమిటి..? ఆమె స్థానంలో మరో హీరోయిన్ వస్తుంది. పాత్ర కొనసాగుతుంది. అంతే! కానీ కల్కి 2 విషయంలో మాత్రం లెక్క కాస్త విచిత్రంగా మారింది.
Ads
దీపికా పదుకొణె లేదు. కొత్త హీరోయిన్ కూడా లేదట! అయితే ఆమె పోషించిన సుమతి పాత్ర సంగతేంటి..?
హీరోయిన్ వెళ్లిపోయింది కాబట్టి పాత్ర కూడా కథలోంచి వెళ్లిపోయిందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న కల్కి 2 చుట్టూ ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్డేట్ ఈ సందేహాలకు మరింత బలం చేకూర్చింది. కల్కి 2లో కొత్తగా ఎలాంటి నటీనటుల చేరిక ఉండదని ఆయన స్పష్టం చేశాడు. ఇప్పటికే పరిచయం చేసిన పాత్రలతోనే తాము కథను కొనసాగిస్తున్నామని చెప్పాడు. అంటే… దీపికా స్థానంలో కొత్త ముఖం తీసుకొచ్చే ఆలోచన ప్రస్తుతానికి కనిపించడం లేదు.
ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. ఎందుకంటే కల్కి 2898 ADలో దీపిక పోషించిన సుమతి సాధారణ హీరోయిన్ కాదు. కథలోనే కీలకమైన ముడి ఆమె చుట్టూ ఉంది. ఆమె గర్భంలో ఉన్న శిశువే భవిష్యత్తులో కల్కి అవతారానికి కేంద్రబిందువు. ప్రభాస్ భైరవ, అమితాబ్ అశ్వత్థామ, కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ మధ్య జరిగే పోరాటానికి కూడా ఆ పాత్రతో నేరుగా సంబంధం ఉంది.
అలాంటి పాత్రను ఒక్కసారిగా “హీరోయిన్ లేదు కాబట్టి పాత్ర కూడా లేదు” అనేయడం అంత సులభమైన విషయం కాదు. అయితే ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన గాసిప్.
దీపిక తప్పుకున్న తర్వాత సాయి పల్లవి సుమతిగా వస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పట్లో నిర్మాతల నుంచి అధికారిక ధ్రువీకరణ మాత్రం లేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన “No new additions” మాటలతో ఆ ఊహాగానాలకే మరో మలుపు వచ్చింది.
అంటే…
సుమతిని మరో హీరోయిన్ చేయడం లేదా?
సుమతి పాత్రను వేరే విధంగా కథలో కొనసాగిస్తారా?
లేక…
మొదటి భాగంలో అంత కీలకంగా కనిపించిన పాత్రనే రెండో భాగంలో తగ్గించేశారా? ఇవన్నీ ఇప్పటికీ అధికారికంగా చెప్పాల్సిన ప్రశ్నలే.
అసలు గొడవ ఎక్కడ మొదలైంది?
దీపికా కల్కి 2 నుంచి తప్పుకోవడం కొత్త విషయం కాదు. 2025 సెప్టెంబర్‌లో వైజయంతీ మూవీస్ అధికారికంగా ఆమె ఇక సీక్వెల్లో భాగం కాదని ప్రకటించింది. ఆ తర్వాత అసలు కారణాలపై రకరకాల కథనాలు వచ్చాయి.
ఒకవైపు పారితోషికం, పని గంటలు, షూటింగ్ షెడ్యూల్ వంటి అంశాలపై వార్తలు వచ్చాయి. మరోవైపు కల్కి 2లో దీపిక పాత్రనే గణనీయంగా తగ్గించి, దాదాపు అతిథి పాత్ర స్థాయికి తీసుకెళ్లారని కూడా ఇండియా టుడే కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, మొదట సుమతి చుట్టూ కథను నిర్మించే ఆలోచన ఉండగా స్క్రిప్ట్ మార్పులతో ఆమె పాత్ర బాగా తగ్గిందని వర్గాలు చెప్పాయి.
అదే సమయంలో దీపికా నటుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుంచి తప్పుకున్న వ్యవహారం కూడా చర్చలో ఉండటంతో, ఆమె విషయంలో పని గంటలు, పారితోషికం, కమిట్మెంట్ వంటి అంశాలపై అప్పట్లో వరుస గాసిప్‌లు- వార్తలు వచ్చాయి. అయితే వాటిలో కొన్నింటిని మీడియా సంస్థలే తరువాత ధృవీకరించలేని రిపోర్టులుగా పేర్కొన్నాయి.
అందుకే ఇప్పటి కథలో అసలు పాయింట్ దీపిక ఎందుకు వెళ్లింది? అనేది కాదు. ఆమె వెళ్లిపోయిన తర్వాత… ఆమె పాత్రకు ఏం జరిగింది? అనేదే. ఒకప్పుడు కల్కి కథలో భవిష్యత్తు మొత్తాన్ని మోసుకెళ్లిన సుమతి ఇప్పుడు సినిమాలో కనిపిస్తుందా..? కనిపిస్తే ఎవరి రూపంలో..? లేక పాత్రను కథే మోసుకెళ్తుందా..?
హీరోయిన్ను రీప్లేస్ చేయకపోవచ్చు. కానీ పాత్రను ఎలా రీప్లేస్ చేస్తారు? ఇదే ఇప్పుడు కల్కి 2లో అసలు సస్పెన్స్.
మరి నాగ్ అశ్విన్ చెప్పిన “కొత్తవాళ్లు ఎవరూ లేరు… ఇప్పటికే ఉన్న పాత్రలతోనే కథ కొనసాగుతుంది” అనే మాటకు పూర్తి అర్థం సినిమా షూటింగ్ ముందుకు వెళ్లేకొద్దీనే తెలుస్తుంది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మధ్యలో ప్రారంభించి, 2027 మధ్య నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పాడు; విడుదల 2028 వైపు ఉండొచ్చని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి….
పాత విఠలాచార్య సినిమాల గురించి ఒక సరదా జోక్ తరచూ వినిపించేది. హీరోతోనో, హీరోయిన్తోనో, ఏదైనా ఆర్టిస్టుతోనో దర్శకుడికి గొడవ వస్తే… ఆ పాత్రను ఏం చేసేవాడో తెలుసా? కథ నుంచి తీసేయడు… కుక్కగానో, పాముగానో, ఇంకేదో జీవిగానో మార్చేసి, సినిమా మొత్తం దానితోనే కథ నడిపించేసి, క్లైమాక్స్‌లో ఒక్కసారి మనిషి రూపంలో చూపించేవాడట!
ఈగలో నాని పాత్ర గుర్తొస్తోంది కదా! మనిషి వెళ్లిపోయినా పాత్రను మాత్రం చంపకూడదు… అవసరమైతే రూపం మార్చి కథలో ఉంచాలి! మరి కల్కి 2 విషయంలో కూడా అదే ఫార్ములా ఏదైనా ఉందా?
Share this Article