.
రాతి కోటల వెనుక రాక్షస పర్వం… గ్రానైట్ సామ్రాజ్యంలో మైనర్ బాలికలపై దారుణాలు! ఎప్‌స్టీన్ ఉదంతాన్ని గుర్తుచేస్తున్న తమిళనాడు పారిశ్రామికవేత్త బాగోతం! దాతృత్వం, పలుకుబడి వెనుక దాగిన చీకటి కోణాలు! పెన్‌డ్రైవ్‌తో మొదలైన దర్యాప్తు.. వెలుగులోకి వస్తున్న బాధితులు!
కేసును మూసేయాలనుకున్న పోలీసులపైనా సిట్ విచారణ! 9 కేసులు.. 18 మంది బాలికలు.. 10 మంది అరెస్టులు! ఓ భారీ నెట్‌వర్క్ బద్దలు…
Ads
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతం గుర్తుందా? సంపద, పలుకుబడి, అధికార వర్గాలతో సంబంధాలు.. వాటి మాటున సాగిన లైంగిక దోపిడీ వ్యవహారం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇప్పుడు భారతదేశంలోనూ అలాంటి పోలికలు గుర్తుకొచ్చే ఒక భయానక ఉదంతం వెలుగులోకి వస్తోంది.
అయితే ఇది ఎప్‌స్టీన్ కేసుతో సమానమైన అంతర్జాతీయ నెట్‌వర్క్ అని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ తమిళనాడుకు చెందిన ఒక గ్రానైట్ వ్యాపారవేత్త చుట్టూ వెలుగులోకి వస్తున్న ఆరోపణలు, వాటి వెనుక కనిపిస్తున్న వ్యవస్థీకృత సహకారం, పోలీసు యంత్రాంగం పాత్రపై అనుమానాలు మాత్రం విస్మయానికి గురిచేస్తున్నాయి.

85 ఏళ్ల పారిశ్రామికవేత్త.. తొమ్మిది కేసులు! ముసలోడే గానీ..? తమిళనాడుకు చెందిన జెమ్ గ్రానైట్స్ వ్యవస్థాపకుడు, గ్రానైట్ వ్యాపారవేత్త ఆర్. వీరమణి (84)… ఇప్పుడు మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న వార్తలు, పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి…
ఈ వ్యవహారం బయటపడింది ఒక పెన్‌డ్రైవ్‌తో! 2025 అక్టోబరులో ఒక గుర్తుతెలియని వ్యక్తి బాలల హక్కుల కార్యకర్తకు పెన్‌డ్రైవ్ అందించాడు. అందులో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఉన్నట్టు సమాచారం. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొదట్లో దర్యాప్తు ముందుకు సాగలేదు. వీడియోలో ఉన్న బాలికను గుర్తించలేకపోతున్నామని, తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ 2026 ఫిబ్రవరిలో కేసును మూసివేయాలని పోలీసులు ప్రయత్నించారు.
- కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. ప్రత్యేక పోక్సో కోర్టు పోలీసుల క్లోజర్ రిపోర్టును అంగీకరించలేదు. మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత వీడియోలోని బాలికను గుర్తించడం, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు ఆగస్టు 29న వీరమణితో పాటు ఆయనకు సన్నిహితులైన శాంతి, ఆమె భర్త మహేంద్ర సిమ్హన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఒక పెన్‌డ్రైవ్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న బాధితులు! తొలుత ఒక వీడియోతో మొదలైన ఈ వ్యవహారం క్రమంగా విస్తరించింది. మరికొందరు బాలికలు, బాధితులు ముందుకొచ్చారు. గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా తెరపైకి వచ్చాయి. వీరమణికి సహకరించారన్న ఆరోపణలతో డ్రైవర్లు, మాజీ ఉద్యోగులు, ఇతర సిబ్బందిపైనా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మొదట్లో ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోపణగా కనిపించిన వ్యవహారం ఇప్పుడు అనేక మంది పాత్రపై, ఓ పెద్ద నెట్‌వర్క్ మీద, కోర్టు నేతృత్వంలో దర్యాప్తు జరిగే స్థాయికి చేరింది.
ఈ దర్యాప్తులో ఇప్పటివరకు 18 మంది మైనర్ బాలికలు బాధితులుగా ఉన్నట్టు సిట్ గుర్తించింది. తొమ్మిది కేసులు నమోదయ్యాయి. వీరమణితో పాటు ఆయన సహచరులు, సిబ్బంది కలిపి పది మందిని అరెస్టు చేశారు. ఒక నిందితుడు విదేశాల్లో పరారీలో ఉండటంతో అతడిపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు.
2004లో బాలిక ఆత్మహత్య.. ఇప్పుడు మళ్లీ తెరపైకి! ఈ వ్యవహారంలో మరో కలచివేసే అంశం 2004లో జరిగిన ఒక బాలిక మరణం. అప్పట్లో పదకొండో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన దర్యాప్తులో ఆమెపై లైంగిక దాడి జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లి ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వీరమణిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది.
ఆ బాలిక మరణానికి సంబంధించిన అంశం అప్పట్లోనే సరిగా విచారణకు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా? ఆమె కుటుంబం చేసిన ఆరోపణలపై అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఈ ప్రశ్నలు మరోసారి చర్చకు వస్తున్నాయి. అయితే ఈ కేసులోనూ ఆరోపణలను న్యాయస్థానం నిర్ధారించాల్సి ఉంది.
నేరాన్ని ఆపాల్సిన పోలీసులే కాపాడారా? ఈ ఉదంతంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఇదే. 2025లో పెన్‌డ్రైవ్ అందినప్పటికీ దర్యాప్తు ముందుకు సాగకపోవడం, ఆ తర్వాత కేసును మూసివేయాలని ప్రయత్నించడం వెనుక అసలు కారణాలేమిటన్నది ఇప్పుడు సిట్ పరిశీలిస్తోంది.
మరోవైపు, వీరమణిపై వచ్చిన ఆరోపణల గురించి 2024 నవంబరులోనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందిందన్న అంశం కూడా బయటపడింది. కాంగ్రెస్ నేత రంజన్ కుమార్ అప్పటి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించాడు…
- ఈ నేపథ్యంలో అప్పటి చెన్నై పోలీసు కమిషనర్ ఏ. అరుణ్, అసిస్టెంట్ కమిషనర్ ఎం.ఏ. యాస్మిన్ సహా ఏడుగురు పోలీసు సిబ్బందిని మొదటి కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చినట్టు వార్తలు వచ్చాయి. బాలలపై నేరాల సమాచారాన్ని నమోదు చేయకపోవడం, దర్యాప్తులో సాక్ష్యాలకు సంబంధించిన అక్రమాలు వంటి ఆరోపణలపై వారిపైనా విచారణ సాగుతోంది.
అంటే ఇప్పుడు ప్రశ్న కేవలం ఒక పారిశ్రామికవేత్త నేరాలకు పాల్పడ్డాడా లేదా అన్నది మాత్రమే కాదు. ఒకవేళ ఆరోపణల్లో నిజం ఉంటే, ఇంతకాలం ఈ వ్యవహారం ఎందుకు బయటకు రాలేదు? ఫిర్యాదులు అందినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థ ఎందుకు విఫలమైంది? అనే అంశాలు కూడా సమాధానం కోరుతున్నాయి.
720 పేజీల ఛార్జ్‌షీట్.. రెండో ఛార్జ్‌షీట్ కూడా! సిట్ దర్యాప్తు వేగం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 14 ఏళ్ల దళిత బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఒక కేసులో వీరమణి, ఆయన ఇద్దరు డ్రైవర్లపై నవంబర్ 11న 720 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలైంది. 40 మంది సాక్షుల వాంగ్మూలాలను అందులో పొందుపరిచారు. కేసు నమోదైన 46 రోజుల్లోనే ఈ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం.
ఇక నవంబర్ 23న రెండో ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసినట్టు నవంబర్ 25న పోలీసులు ప్రకటించారు. తొమ్మిది కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుండగా, మిగిలిన కేసుల్లోనూ తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
సంపదకు రక్షణ కవచం చట్టం కాకూడదు! ఈ మొత్తం ఉదంతం మన వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన లోపాలను మరోసారి బయటపెడుతోంది. ఒకవేళ ఒక వ్యక్తి వద్ద సంపద, రాజకీయ పరిచయాలు, అధికారులతో సంబంధాలు ఉంటే చట్టం కూడా నిస్సహాయంగా మారిపోతుందా? బాధితులు న్యాయం కోసం ఇన్నేళ్లు ఎదురుచూడాల్సిందేనా? ఒక పెన్‌డ్రైవ్ బయటకు రాకపోతే, ఒక కోర్టు క్లోజర్ రిపోర్టును తిరస్కరించకపోతే ఈ వ్యవహారం ఇక్కడిదాకా వచ్చేదా?
ఎప్‌స్టీన్ ఉదంతంతో పోల్చడం కన్నా ఈ కేసులోని అసలు భయానక కోణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలు, వారికి సహకరించినట్టు అనుమానిస్తున్న వ్యక్తులు, గతంలో ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోని అధికారుల పాత్ర.. ఇవన్నీ తేలాల్సి ఉంది…
Share this Article