Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళేశ్వరం బ్లండర్స్‌..! నిపుణులకూ రిపేర్ ప్లాన్స్ అంతుబట్టడం లేదు..!!

September 30, 2026 by M S R

.

పనిమంతుడైన మేస్త్రీ పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట… అవును, కేసీయార్ కట్టిన మూడు గోదావరి బరాజులన్నీ ఆ తప్పుల తడకల పందిళ్లే… ఎందుకు ఈ కటువు కామెంట్ అంటే, ఆ కూలిన పందిళ్లను నిలబెట్టడానికి ఏం చేయాలో ఏ మేస్త్రీ చెప్పలేకపోవడం… చివరకు పందిరేసిన ఖర్చుకు పదిరెట్ల చమురు వదిలే దురవస్థ… ఇంకాస్త కటువైన నిజం ఏమిటంటే… ఆ పందిళ్లను గాలికి వదిలేసి, గంగార్పణం అనుకుని, కొత్త ఉపయుక్త పందిరిని జాగ్రత్తగా కట్టుకోవడం మేలనే భావన…

కాస్త నేపథ్యంలోకి వెళ్దాం… ఉపగ్రహ చిత్రాలపై అడ్డంగా మూడు గీతలు గీసి, అక్కడ బరాజులు కట్టండి అన్నాడు సాగునీటి మేస్త్రీ కేసీయార్… తనే డిజైనర్, తనే బిల్డర్, తనే ప్లానర్, తనే ఇంజినీర్, తనే సూపర్‌వైజర్… తీరా ఏమైంది..? మేడిగడ్డ తస్కింది, అన్నారానికి బుంగలు పడ్డయ్, సుందిళ్ల కూడా సేమ్ సేమ్… కన్నెపల్లి పంపుహౌజూ మునిగిపోయింది… వెరసి మూడు బరాజులు పఢావు పడ్డయ్…

Ads

kaleswaram

చివరకు మిగిలిందేమిటయ్యా అంటే… నదికి నడకలు నేర్పిన కేసీయార్ అనే విపరీత ఖర్చు భజనలు, ఆ పాత కమీషన్లు, అవినీతి అక్రమాల దుర్వాసనలు మాత్రమే… ఈ నిర్వాకానికి తోడు మస్తు కట్టారుపో అని కంట్రాక్టర్లకు రాసిచ్చేసరికి వాడేమో రిపేర్ ఖర్చు నేనెందుకు భరిస్తాను అని మొరాయిస్తున్నాడు… పోనీ, నిన్ను పదేళ్లు మోసిన మా ఖర్మ, మేమే రిపేర్ చేసుకుంటాం, ఎలా రిపేర్ చేయాలో, అసలు తప్పు ఎక్కడెక్కడ ఎంత తీవ్రంగా ఉందో చెప్పాలని రేవంత్ రెడ్డి పలు సాగునీటి నిర్మాణ సంస్థలను అడిగితే…

medigadda

మూణ్నాలుగు సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరీక్షలు నిర్వహించి… మొత్తానికి నాసిరకం అని తేల్చాయి… ఆ పనిమంతుడు కేసీయార్ డొల్ల పనితనం నిర్ధారించాయి… కానీ దాన్ని ఎలా రిపేర్లు చేయాలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతున్నాయి… 1) ప్రతి బరాజుకు ఓ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి… 2) తస్కిన మేడిగడ్డ ఏడో బ్లాకును మొత్తం తీసేసి, కొత్తగా కట్టుకోవాలి… 3) ఓవర్ ఫ్లో డ్యామ్ బదులు అక్కడ నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్ నిర్మించాలి… 4) బరాజులకు ఎగువన రెండు వైపులా వరద మళ్లింపు కాలువలను కట్టాలి… 5) కేసీయార్ నిర్వాకంతో సీకెంట్ పైల్స్ పునాదులుగా కట్టడమే పెద్ద బ్లండర్ కాబట్టి డయాఫ్రమ్ వాల్స్‌ పునాదులను షీట్ పైల్స్ టెక్నాలజీతో రక్షించాలి… 6) మూడు బరాజుల పునాదుల కింద భారీగా బుంగలు పడ్డాయి కదా, అవన్నీ గ్రౌటింగుతో పూడ్చాలి…

medigadda

చారాణా ఖర్చుతో ఇల్లు కడితే, బారాణా రిపేర్లు!

సరే, ఎలాగూ ఒరిజినల్ ప్రాణహిత ప్రాజెక్టులో ఉన్నట్టు చౌక, అధిక ప్రయోజకర తుమ్మడిహెట్టిని కడితే, దాన్ని సుందిళ్లకు లింక్ చేసుకుని వాడుకుందాం అనేది తాజా ప్లాన్… మంచిదే… దాంతోపాటు అన్నారం కూడా రిపేర్ చేస్తే… ఆ రెండు బరాజులు వాడకానికి వస్తాయి, అవసరమున్నప్పుడు వాడుకుని, కేసీయార్ చేసిన ద్రోహానికి ఓ పరిష్కారం చూపవచ్చు…

kaleswaram

మరి మేడిగడ్డ..? నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్, బరాజ్ పొడవునా కొత్తగా డయాఫ్రమ్ వాల్, దానికి షీట్ పైల్స్ పునాదులు… ఖర్చు మళ్లీ తడిసి మోపెడు… ఐనా వరద ఉధృతికి ఉంటుందో ఉండదో తెలియదు, అందుకని వరద వచ్చినప్పుడు కాస్త దూరంలో ఉండే పంప్ హౌజును నదీప్రవాహం నుంచి ఎత్తిపోతలకు వాడుకోవచ్చు, నీటి నిల్వ ప్రమాదకరం కాబట్టి మేడిగడ్డను అలా కేసీయార్ నిర్వాకానికి ‘ప్రబల ఉదాహరణ’గా అలాగే ఉంచేసి, టూరిస్ట్ స్పాట్ చేయడం మేలు అని ఓ ప్రముఖ ఇంజినీర్ వ్యంగ్య వ్యాఖ్య… ఇదీ కేసీయార్ పాలన, నిర్మాణ ప్రణాళికలు, వైఫల్యాలకు ఓ విషాద సూచిక!!

kannepalli

రీసెంట్ రేవంత్ ప్రభుత్వ నిర్ణయాల్లో మెచ్చుకోదగిన అంశం ఒకటి కనిపించింది… ఆల్రెడీ ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి అత్యంత ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడుతున్న ప్రభుత్వం కాళేశ్వరం మూడు బరాజుల రిపేర్లకు ఆ ఆర్మీ ఇంజినీర్లు, అధికార్ల సేవల్ని వాడుకోవాలనే నిర్ణయం… ఆర్మీ కూడా సరేనంది… కనీసం అన్నారం, సుందిళ్ల బరాజులనైనా తిరిగి వాడుకునే పరిస్థితి వస్తే అది తెలంగాణకు మేలు, కేసీయార్ చేసిన ద్రోహ, అక్రమ, అవినీతి, నాసిరకం నిర్మాణాలకు అసలైన ‘మరమ్మత్తు…

కాళేశ్వరం

తెలంగాణ మలిదశ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు… ఆ పోరాటం చూపి గద్దెనెక్కిన కేసీయార్ నీళ్లపై తెలంగాణకు చేసిన ద్రోహచరిత్రలో కాళేశ్వరం ఓ చిన్న ఎపిసోడ్ మాత్రమే… తవ్వితో బోలెడు పెంకాసులు… మన దేశంలో కూడా ఏ బర్మా సైనిక పాలకులో ఉండి ఉంటే… కాళేశ్వరం అక్రమార్కులందరి ఆస్తులు జప్తు చేసి, ఆ డబ్బుతో రిపేర్లు చేయించి, ఆనక శిక్షించేవారేమో..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాళేశ్వరం బ్లండర్స్‌..! నిపుణులకూ రిపేర్ ప్లాన్స్ అంతుబట్టడం లేదు..!!
  • ‘ఏం చేస్తరు? ఉరి తీయరు కదా? – మేడారం నుంచి వాషింగ్టన్ !!
  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions