Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!

October 5, 2026 by M S R

.

Taadi Prakash …. చారిత్రాత్మకమైన ‘కాశీయాత్ర’ రాసిన ఏనుగుల వీరాస్వామి చనిపోయి… అక్టోబర్ 3, 1836 –  190 సంవత్సరాలు. 56 సంవత్సరాలు మాత్రమే బతికిన ఆ మహానుభావుడు మన తెలుగువాడు. ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీయాత్ర పుస్తకం ఆయన జీవించి వుండగా ముద్రణ కాలేదు.

1838లో ఆయన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లై మొదటిసారి ముద్రించాడు. బ్రిటిష్ ప్రభుత్వం వారు 1869లో రెండోసారి ప్రచురించారు. మూడోసారి ఆ అవకాశం దిగవల్లి వెంకట శివరావు (1898-1992) గారికి వచ్చింది.

Ads

రెండోసారి ముద్రించిన పుస్తకాన్ని ఆయన సంపాదించి, అధ్యాయాలుగా విభజించి, కామాలు ఫుల్ స్టాపులూ పెట్టి, ఒక పద్ధతిగా నోట్స్ కూడా యిచ్చి 1941లో విజయవాడలో ప్రచురించాడు. దిగవల్లి యీ పని చేయకపోతే తెలుగు వాళ్ళకి వీరాస్వామి రచన దక్కేది కాదేమో!

ఆ మహా యాత్రికుడు తన గురించి ఇలా రాసుకున్నారు. “నా పేరు వీరాస్వామి. ఇంటిపేరు ఏనుగుల. చెన్నపట్నంలోని సుప్రీంకోర్టులో దుబాసీగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. మేము ఆంధ్రాని యోగి బ్రాహ్మణులం. శ్రీ వత్స గోత్రీయులం. మా యిల్లు చెన్నపట్నానికి ఉత్తరంగా, సముద్రం పక్కనున్న తండయారు వీడులో వుంది.

గత సంవత్సరం (1835) రిటైర్ అయినప్పటినుండీ ఎక్కువగా మా యింటి వెనుక తోటలో ఉన్న పెద్ద అరటి చెట్టు కింద, పడక కుర్చీలో కూర్చుని, ఇంతవరకు అచ్చు కాని నా “కాశీయాత్ర చరిత్ర” రాత ప్రతి పేజీలు తిప్పుతూ, ఆరు సంవత్సరాల క్రితం నేను చేసిన ఆ కాశీయాత్రని గుర్తుకు తెచ్చుకుంటూ, ఆనందిస్తూ వున్నాను. ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు. ఈ సాయంత్రపు నీరెండ హాయిగా ఉంది. అంతా కల మాదిరిగా వుంది. నిన్నగాక మొన్న జరిగినట్లుంది.

నా జీవితమంతా.. ఉద్యోగంలో చేరడం, యాత్రలు చేయడం, రిటైర్ అయిపోవడం కూడా జరిగిపోయింది. నా చేతిలో ఉన్న ఈ రాత ప్రతి, నా జీవిత ఫలం. ఈ పుస్తకం రాయటంలో నా జీవితం సఫలం అయిందనుకున్నాను. ఇది చాలు ఈ చిన్న జీవితానికి”

enugula veeraswamy

వీరాస్వామి పెద్దలది ప్రకాశం జిల్లా, ఒంగోలు. తండ్రి పేరు సమయ మంత్రి. ఇప్పటికీ 246 సంవత్సరాల క్రితం, వీరాస్వామి 1780లో చెన్నపట్నంలో జన్మించారు. ఆయన తొమ్మిదో యేటనే తండ్రి మరణించారు. తల్లి కష్టపడి కుర్రాణ్ని చదివించింది. దేవుణ్నే నమ్ముకోమని చెప్పింది. వీరాస్వామి వీధి బడిలోనే తెలుగు, తమిళం, సంస్కృతం నేర్చుకున్నాడు.

ఆ రోజుల్లో ఈస్టిండియా కంపెనీ వాళ్ళు ఇంగ్లీషు తెలిసిన చురుకైన పిల్లలకి పని యిస్తుండేవాళ్ళు.
అది తెలుసుకున్న వీరాస్వామి ఇంగ్లీషు బాగా చదివి 12 ఏళ్ళ వయసులోనే కంపెనీ వారి బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఆఫీసులో వాలంటీరుగా చేరి బంధువుల్ని ఆశ్చర్యపరిచాడు. అక్కడ నిజాయితీగా పనిచేసి ఇంగ్లీషుపై పట్టు సాధించి, కొంతకాలానికి హెడ్ అకౌంటెంట్‌గా ఉన్నత పదవి పొందాడు. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్ళు.

వీరాస్వామికి భార్య, కూతురు వున్నారు. పరమేశ్వరుడే తనకు అండగా వున్నాడని నమ్మి , కంచి కామాక్షినీ, మధుర మీనాక్షినీ దర్శించుకున్నాడు. దానధర్మాలు చేశాడు. క్రమంగా తెలుగు, తమిళ భాషల్లో పాండిత్యం సంపాదించగలిగాడు. భారతీయ తీర్థయాత్ర పుస్తకాలు శ్రద్ధగా చదివేవాడు.

లక్కీగా మద్రాసు సుప్రీంకోర్టులో ఇంటర్ ప్రెటర్ పదవి ఖాళీ అవుతుంది. దానికి వీరాస్వామి తగిన వాడని వెన్నెలకంటి సుబ్బారావు పంతులు సిఫార్సు చేస్తాడు. అప్పటికే మంచి పేరున్న వీరాస్వామికి ఆ పదవి దక్కుతుంది. అక్కడ కుటుంబ సమస్యల్ని తీర్చడంలో హిందూ ధర్మశాస్త్రాల్లో వున్న పాండిత్యం వీరాస్వామికి ఉపయోగపడింది.

1822 – 23 సంవత్సరాల్లో సుబ్బారావు పంతులు కుటుంబంతో సహా 13 నెలలు కాశీయాత్ర చేసుకుని క్షేమంగా తిరిగి వస్తాడు. అప్పటినుంచి వీరాస్వామిలో ఆ కోరిక బలపడింది. అప్పుడే కలకత్తా కంపెనీ మతాధికారి బిషప్ హెబర్ భారత్ యాత్రకి బయల్దేరుతాడు. ఆ అనుభవాలు మూడు సంపుటాలుగా రాస్తాడు. అవి చదివి వీరాస్వామి ఉత్తేజితుడయ్యాడు.

ఉద్యోగ ధర్మం వల్ల 50 యేళ్ళు వచ్చేదాకా యాత్రకి వెళ్ళలేకపోతాడు. ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? “అనుకొని కాశీ విశ్వనాథుడి దర్శన యాత్రకి శ్రీకారం చుడతాడు. జగదీశ్వరుండు నా చేత కొంత దేశాటనము చేయింప దలచినాడు” అనుకుని ఏర్పాట్లు మొదలుపెట్టాడు. మేమూ వస్తాం అంటూ బంధుమిత్రులు బయల్దేరారు. యాభై మంది పోగయ్యారు.

వంట పని వాళ్ళు, సవారీలు మోసే బోయీలు, సామాను మోసే కావడి వాళ్ళు, నీళ్లు మోసేవాళ్ళు, చెట్లు నరికి దారులు చేసేవారు, బంట్రోతులు, కాపలా మనుషులు… మొత్తం వంద మంది తేలారు. సూత్రధారి వీరాస్వామి. దారి దొంగల భయం, అడవి జంతువుల భయమూ వుంది. దేవుడి మీద భారం వేసి, మహాప్రయాణం మొదలైంది.

1830వ సంవత్సరం మే నెల 18వ తేదీ, శుభ ముహూర్తం రాత్రి తొమ్మిది గంటలకి భగవంతుడికి దణ్ణం పెట్టుకొని వీరాస్వామి బయలుదేరాడు. దారిలో జరిగే వింతలు, వినోదాలు అన్ని తనకు రాసి పంపుతూ ఉండాలని మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లై గట్టిగా చెప్పాడు. వీరాస్వామి, బ్రిటిష్ ఆఫీసర్ల వద్ద నుండి తన రక్షణ కోసం తీసుకున్న సర్టిఫికెట్లు, కోర్టు జడ్జి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు, ఉత్తరాలు, ఆయుర్వేద మందులు, పెట్టే, డబ్బు సంచులు పల్లకిలో పక్కనే పెట్టుకున్నాడు. డైరీ తప్పక రాయాలని అనుకున్నాడు.

ఉప్పాడ బోయీలు పల్లకిని భుజానికి ఎత్తుకున్నారు. కాగడాల వెలుతురులో, లయాత్మకమైన “ ఒ హోం… ఒ హోం…” రాగంలో భక్తులు, పనివాళ్ళు జేజేలు పలుకుతుండగా మహాయాత్ర తొలి అడుగులు వేసింది.
చెన్నపట్నం నుంచి బయల్దేరి తిరుపతి, కడప, శ్రీశైలం మీదుగా హైదరాబాద్ చేరింది. కొన్నిరోజుల బస తర్వాత నిర్మల్, నాగపూర్, జబల్‌పూర్ మీదుగా తూర్పున రీమా, మీర్జాపూర్, ప్రయాగ దాటుకుని అక్టోబర్ నాటికి తన కలల కాశీనగరం చేరుకున్నారు. అక్కడ రెండు నెలలు ఉన్నారు. క్షేత్రాలు, ఘాట్లు దర్శించి కర్మకాండలు పూర్తి చేశారు.

తిరుగు ప్రయాణం : పాట్నా, గయా, మాంగీర్, రాజమహల్ చూసుకుని కృష్ణానగర్, కలకత్తా, ఛత్రపురం వరకూ వచ్చి మట్టగువ్వల దగ్గర చిలక సరస్సు దాటుకుని శ్రీకాకుళం, విజయనగరం మీదుగా సింహాచలం చేరుకున్నారు. పిఠాపురం పక్కనున్న ఉప్పాడలో కొందరు బోయీలను మార్చుకుని రాజమహేంద్రవరం మీదుగా మచిలీపట్నం వెళ్లాడు.

అక్కడ జిల్లా జడ్జిగా వున్న మన ఆత్మ బంధువు సి.పి.బ్రౌన్‌ని కలిసి 15 రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగాడు. చిన్నగంజాం, అమ్మనబ్రోలు మీదుగా నెల్లూరు చేరాడు. చివరికి తిరువట్టూరు మీదుగా చెన్నపట్నంలోని తండయారువీడులో వున్న సొంత ఇంటికి చేరుకుంటాడు వీరాస్వామి. 15 నెలల, 15 రోజుల పల్లకి ప్రయాణం అలా ముగిసింది.

వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర చదువుతుంటే, 200 సంవత్సరాల భారతదేశ చరిత్రలోకి పల్లకి వెంట నడిచి వెళ్తున్నట్టే ఉంటుంది. నాటి సాంఘీక, ఆర్థిక, మత, రాజకీయ పరిస్థితిని వివరిస్తూ పోతాడు. దారిలో గజదొంగలు ఉంటారని తెలిసి కడప నుంచి తుపాకులు తీసుకువెళ్లాడు. అడవిలో వెళ్లేటప్ప్పుడు తుపాకులు పేల్చుకుంటూ దొంగలు, జంతువుల బారిన పడకుండా కాపాడుకున్నారు.

వర్షం నుంచి రక్షణ కోసం హైదరాబాద్‌లో డేరాలు, గుడారాలు కొనుక్కుని వెళ్లారు. 100 మంది పరివారంలో దారిలో ఇద్దరు పనివాళ్లు చనిపోయారు. వీరాస్వామి కాశీకి చేరాక 40 బిందెల గంగాజలాన్ని 10 బాడుగ గుర్రాల మీద ఎక్కించి ఇంటికి పంపిస్తాడు. కలకత్తాలో మిత్రులు వీరాస్వామికి మంచి చేపల కూరతో భోజనం పెట్టారు.

కాకినాడ పక్కనే ఉండే ఉప్పాడ బోయీల గురించి చెబుతూ, “వారు సముద్రంలో చేపలు పట్టి అమ్ముతారు. కొందరు చెన్నపట్నంలో బోయిలుగా కొలువు చేసి బతుకుతుంటారు” అని వీరాస్వామి రాశారు. ఇప్పటి 8 రాష్ట్రాల గుండా సాగిన ఆ మహాయాత్రలో వీరాస్వామి దాదాపు 4 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాడని ఒక అంచనా. పల్లకిలోనే ప్రయాణం సాగినా, నదులు వచ్చినప్ప్పుడు పడవలో, అప్ప్పుడప్ప్పుడు కాలి నడకన కూడా ప్రయాణం సాగించాడు.

  • “వీపు మీద మచ్చని చూసుకోవడానికి శక్తి లేని మనకి ఆ దేవుణ్ణి చూడటం ఎలా సాధ్యం అవుతుంది”? అనేవాడు వీరాస్వామి. ముందస్తు ప్రణాళికతో ప్రతి మజిలీలోనూ ఆయన జాగ్రత్త పడేవాడు. భారతీయ యాత్రా సాహితీ నిర్మాత రాహుల్ సాంకృత్యాయన్ (1893 ` 1963) కంటే వీరాస్వామి ఒక 100 సంవత్సరాలు ముందే యాత్రలో ఉన్నాడని తెలిసినప్ప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

1831వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఆయన కాశీ నుంచి తిరిగి వచ్చారు. బంధుమిత్రులకు గంగాజలాన్ని, పూరీ జగన్నాథుని పటాన్ని గుర్తుగా యిచ్చాడు. వీరాస్వామి రాసిన ఉత్తరాలన్నీ కలిపి మిత్రుడు శ్రీనివాస పిళ్లై పుస్తకంగా కుట్టిస్తాడు.

వీరాస్వామి, ఆ పుస్తకాన్ని తన డైరీ సాయంతో 480 అరఠావుల్లోకి తిరగరాస్తాడు. దీన్ని ప్రచురణ కోసం సిపి.బ్రౌన్‌కు పంపినా, ఆయనెందుకో పట్టించుకోలేదు. 55 సంవత్సరాల వయసులో 1835లో హెడ్ ఇంటర్‌ప్రెటర్‌గా వీరాస్వామి రిటైరయ్యారు. ఆ మరుసటి సంవత్సరమే పండితుడు, దార్శనికుడు, మహాయాత్రికుడు అయిన ఏనుగుల వీరాస్వామి కన్ను మూశారు. మిత్రుడి ఆత్మశాంతి కోసం 1838 ఏప్రిల్‌లో కాశీయాత్రా చరిత్రని శ్రీనివాస పిళ్లై ముద్రించాడు.

వీరాస్వామి రాసింది కొంత గ్రాంధికంలో, పాత తెలుగులో ఉంటుంది. దాన్ని సమగ్రంగా పరిశీలించి, ఎడిట్ చేసి పటాలతో, బొమ్మలతో ముద్రించాల్సిన, ముందు తరాల కోసం పదిలపర్చాల్సిన అవసరం ఉంది. 150 సంవత్సరాలుగా మనవాళ్లు చదువుతున్న ఈ పుస్తకం పూర్తి వాడుక భాషలో వుండాలి. ఒక దైవభక్తుడు, ధైర్యశాలి జీవితం అప్ప్పుడు మాత్రమే మనముందు వెన్నెల దారిలా పరుచుకుంటుంది.

కాలినడకన అనేక దేశాలు తిరిగి, దానిని “పాదయాత్రాంజలి” అన్నవాడూ, తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందని తెలియజెప్పిన వాడూ, ఒంగోలు వాసి, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ రాసిన వ్యాసాల్లోంచి ఈ వివరాలు సేకరించి, కుదించి రాశాను. గొప్ప భావుకుడు, రచయిత, కవి అయిన ఆది నారాయణరావు గారిదే ఆ క్రెడిట్ అంతా.

మంచి ఆర్టిస్ట్ కూడా అయిన ఆదినారాయణే వీరాస్వామి బొమ్మ వేశారు.
మనం ఎలాగూ ప్రపంచ యాత్రలు చేయలేం. అయినా… ఒక ఇబన్ బతూతా (మొరాకో)
ఒక సాహసి ఏనుగుల వీరాస్వామి
ఒక త్రిపిఠకాచార్య రాహుల్ సాంకృత్యాయన్
ఆధునిక యాత్రికుడు ఆదినారాయణల అక్షరాల అడుగు జాడల్లో చరిత్ర లోపలి పొరల్లోకి నడవడం కంటే అదృష్టం ఏముంటుందీ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడన్నా ఏనుగుల వీరాస్వామి విగ్రహం వుందా? అని అడిగాను. ‘లేదు’ అన్నారాయన. చదువుకున్న , సంస్కారవంతులైన మన బ్రాహ్మణులెవరికీ ఆ ఆలోచన రాలేదా? అని అడిగాను. ‘లేదండీ’, నాయి బ్రాహ్మణ్ణి అయిన నేనే ఒంగోలులో వీరాస్వామి విగ్రహం పెట్టే ప్రయత్నంలో వున్నాను’ అన్నారు ‘భ్రమణకాంక్ష’ రచయిత ఆదినారాయణ. ……… తాడి ప్రకాష్    9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!
  • ఉత్త స్క్రాప్! ఈ సంతను యాణ్నుంచి పట్టుకొచ్చావురా బిగ్‌బాస్..!
  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!
  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions