.
“నా కోసం ఎండిన కట్టెలు ముందే సిద్ధంగా ఉంచుకున్నా… అవే నా చివరి ఆస్తి” తడి కట్టెలతో పొగ వచ్చి, చుట్టూ ఉన్నవారి కళ్లలో నీళ్లు వస్తే, వాళ్లు తన కోసం ఏడుస్తున్నారని తాను అనుకుంటానంటూ నానా పటేకర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి… “మనిషి ఎంత సంపాదించినా చివరికి వెంట తీసుకెళ్లేది ఏమీ లేదు” అన్న విషయాన్ని ఆయన చాలా సింపుల్‌గా తనదైన స్థయిల్లో చెప్పాడు…
మనం నానా పటేకర్ గురించి ఇన్ని చెప్పుకుంటున్నాం కదా… గొప్ప నటుడు, దేశం కోసం కార్గిల్ వార్‌లోకి వెళ్లాడు… నిరాడంబర జీవితం ఎట్సెట్రా… కానీ..? ఏ మనిషీ పరిపూర్ణుడు కాడు అంటారు కదా… ఏదో ఓ మచ్చ, ఓ మరక జీవితాంతం బదనాం చేస్తూనే ఉంటుంది… వెలుతురుకు అది మరో పార్శ్వం… అదీ ఓసారి చెప్పుకుందాం…
Ads
వెలుతురుకు మరో పార్శ్వం..! నానా పటేకర్ మరణంపై తనుశ్రీ దత్తా స్పందనలో ఆ ‘ఈవిల్ డెడ్’ ఏంటి? ఒక మనిషి చనిపోయినప్పుడు.. అతడి గురించి మాట్లాడటానికి మిగిలేది అతడు చేసిన మంచి మాత్రమే కాదు. అతడి జీవితంలో పడిన మరకలూ ఉంటాయి. కొన్ని మరకలు కాలంతో మసకబారిపోతాయి. కొన్ని మాత్రం మనిషి పోయినా.. జ్ఞాపకాల్లో మిగిలిపోతాయి.
నానా పటేకర్ విషయంలో ఇప్పుడు అదే కనిపిస్తోంది. 75 ఏళ్ల వయసులో నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూశాడు. దాదాపు ఐదు దశాబ్దాల నట జీవితంలో ఎన్నో గొప్ప పాత్రలు, జాతీయ అవార్డులు, పద్మశ్రీ, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర.. ఇవన్నీ ఒకవైపు. మరోవైపు 2018లో బాలీవుడ్‌ను కుదిపేసిన మీటూ ఆరోపణలు. ఆ ఆరోపణలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మరో రకంగా మార్మోగింది.

ఇప్పుడు ఆయన మరణవార్తపై స్పందించిన నటి తనుశ్రీ దత్తా మాటల్లో మాత్రం ఓ విచిత్రమైన నర్మగర్భం కనిపించింది. “వార్త విన్నాను. ఈరోజు నా పని మీద దృష్టి పెట్టాలి. సాయంత్రానికి మీడియా అంతా ‘ఈవిల్ డెడ్’ గురించే మాట్లాడుతుందేమోనని ఆందోళనగా ఉంది. కుటుంబానికి సానుభూతి.. కానీ..”
అక్కడితో ఆమె వీడియో ఆగిపోయింది. నానా పటేకర్ పేరు ఆమె ఎక్కడా చెప్పలేదు. కానీ చెప్పాల్సిన పనిలేదు… కానీ.. ‘Evil Dead’ అనే రెండు పదాలు మాత్రం చాలామందికి ఏం గుర్తు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆమెలో కోపం చల్లారలేదనీ, అదలాగే మండుతోందనీ అర్థమవుతూనే ఉంది…
ఆ రెండు పదాల్లోనే అంత కథ ఉందా? ఉంది. ఎందుకంటే నానా పటేకర్‌తో తనుశ్రీ దత్తాకు ఉన్న వివాదం సాధారణ సినిమా గొడవ కాదు. 2008లో Horn Ok Pleassss సినిమా షూటింగ్ సమయంలో తనపై నానా పటేకర్ అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలోనే ఆమె CINTAAకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అయితే ఆ వ్యవహారం అప్పట్లో పెద్దగా ముందుకు వెళ్లలేదు.
పదేళ్ల తర్వాత.. 2018లో అదే ఆరోపణలను ఆమె మళ్లీ బయటకు తీసుకురావడంతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి అది ఒక కీలక మలుపుగా మారింది. నానా పటేకర్ మాత్రం ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. ఆ తర్వాత కేసు పోలీసుల దాకా వెళ్లింది.

2019లో ముంబై పోలీసులు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ B-summary report దాఖలు చేశారు. దర్యాప్తులో 13 మంది సాక్షులను ప్రశ్నించినప్పటికీ, తనుశ్రీ చెప్పినట్టు నానా పటేకర్ అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్షంగా ధృవీకరించే సాక్ష్యం తమకు లభించలేదని పోలీసులు చెప్పారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది.
2025లో మేజిస్ట్రేట్ ఈ వ్యవహారాన్ని dispose చేసినప్పుడు.. “ఆరోపణలు నిజం” అని కానీ, “ఆరోపణలు అబద్ధం” అని కానీ కోర్టు తేల్చలేదు. 2008 ఘటనపై 2018లో కేసు నమోదైనందున చట్టపరమైన కాలపరిమితి సమస్య వచ్చిందని పేర్కొంది. అంటే.. ఇది నానా పటేకర్ నిర్దోషి అని కోర్టు విచారణ చేసి ఇచ్చిన తుది తీర్పు కాదు; అలాగే తనుశ్రీ ఆరోపణ నిజమని నిర్ధారించిన తీర్పూ కాదు.
అందుకే ఈ కథలో తీర్పు చెప్పే హక్కు మనకు లేదు. కానీ ఒక వాస్తవం మాత్రం ఉంది. ఆ ఆరోపణలు నానా పటేకర్ పేరుకు ఒక మరకగా మిగిలిపోయాయి.
వెలుతురులో ఉన్నవాడికి నీడ కూడా ఉంటుంది! నానా పటేకర్ జీవితం చూస్తే మరో పార్శ్వం కనిపిస్తుంది. చిన్నతనంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో నెలకు కేవలం రూ.35 సంపాదిస్తూ సినిమా పోస్టర్లు వేసిన బాలుడి నుంచి.. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన నటుడిగా ఎదిగాడు. ఆయన సంపదపై మీడియా అంచనాలు రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉన్నాయి.
అయితే నానా జీవనశైలి మాత్రం ఆ సంపదను పెద్దగా ప్రదర్శించేది కాదు. ముంబైలోని ఆయన 750 చదరపు అడుగుల ఫ్లాట్ ఒకప్పుడు సుమారు రూ.1.1 లక్షలకు కొన్నదని, ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుంది… గోవాలోనూ ఆయనకు నివాసం ఉంది. పుణె సమీపంలోని ఖడక్వాస్లాలో సుమారు 27 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది…

ఆ ఫామ్‌హౌస్ కూడా స్టార్ హీరోల విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ల తరహాలో ఉండేది కాదు. అక్కడ వ్యవసాయం చేసేవాడు. వరి, గోధుమలు, సజ్జలు, కూరగాయలు పండించేవాడు. పశువులను పెంచేవాడు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం రైతులు, అక్కడ పనిచేసే వారికీ ఉపయోగపడేలా చూసేవాడు… ట్రూ ఫామ్ హౌస్…
రైతుల ఆత్మహత్యల కుటుంబాలకు సహాయం చేయడానికి నటుడు మకరంద్ అనస్పురేతో కలిసి నామ్ ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాల్లో సంస్థ పనిచేసింది. అంటే.. ఒకే మనిషిలో ఇన్ని పార్శ్వాలు…
ఒకవైపు క్రాంతివీర్, పరిందా, సలామ్ బాంబే, అబ్ తక్ ఛప్పన్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే నటుడు. మరోవైపు రైతుల కోసం పనిచేసిన వ్యక్తి. ఒకవైపు కోట్ల ఆస్తులు ఉన్న స్టార్. మరోవైపు సాధారణ జీవితం ఇష్టపడిన మనిషి. అదే సమయంలో.. తనుశ్రీ దత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పేరుకు అంటుకున్న మరక కూడా ఉంది…
Share this Article