Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మస్క్ అంతరిక్షంలో… అంబానీ అంగట్లో! బిజినెస్ దిగ్గజాల రెండు భిన్న ప్రపంచాలు!!

November 24, 2026 by M S R

.

ఒకాయన అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నాడు. మరో ఆయన ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్లతో మార్కెట్లోకి దిగుతున్నాడు. ఒకాయన అంగారకుడిపై మనుషులను నివసింపజేయాలని కలలు కంటున్నాడు. ఇంకొకాయన భారతదేశంలోని ప్రతి ఇంట్లో, ప్రజల ప్రతి అవసరంలో తన వ్యాపారం ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకరు ఎలాన్ మస్క్. మరొకరు ముఖేష్ అంబానీ.

సోషల్ మీడియాలో కనిపించిన ఓ సరదా మీమ్ ఇద్దరు ప్రపంచ కుబేరుల వ్యాపార తత్వాల మధ్య ఉన్న ఆసక్తికరమైన తేడాను చక్కగా పట్టుకుంది. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగాలు, మరోవైపు ముఖేష్ అంబానీ ఇండిపెండెన్స్ బిస్కెట్లు! పైకి చూస్తే నవ్వొస్తుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇద్దరి వ్యాపార సామ్రాజ్యాల నిర్మాణంలో కనిపించే రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు ఆశ్చర్యపరుస్తాయి.

Ads

musk vs ambani

అంబానీకి ప్రతి అవసరంలోనూ ఓ వ్యాపార అవకాశం! మనిషికి ఏం కావాలి? తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు, ఇంట్లో సరుకులు, చేతిలో ఫోన్, వినోదం కోసం టీవీ, ప్రయాణానికి పెట్రోల్, ఇంటర్నెట్… ఇలా మనిషి రోజువారీ జీవితంలో అవసరమయ్యే ప్రతిదాంట్లోనూ ఓ వ్యాపార అవకాశాన్ని అంబానీ వెతుకుతాడు.

రిలయన్స్ ప్రయాణాన్ని గమనిస్తే ఇదే కనిపిస్తుంది. ఒకప్పుడు పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ రంగాల్లో బలమైన పునాది వేసుకున్న సంస్థ క్రమంగా టెలికాం, రిటైల్, వినియోగ వస్తువులు, మీడియా, డిజిటల్ సేవల వరకు విస్తరించింది.

జియోతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టి డేటా ధరల స్వరూపాన్నే మార్చేశాడు. రిలయన్స్ రిటైల్ ద్వారా కిరాణా నుంచి ఫ్యాషన్ వరకు వినియోగదారుడి దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడు ఇండిపెండెన్స్ బ్రాండ్‌తో బిస్కెట్లు, 15 రూపాయల క్యాంపా ష్యూర్ సహా ఇతర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల మార్కెట్లోనూ తన వాటా పెంచుకోవాలని చూస్తున్నాడు.

అంటే అంబానీ వ్యాపార సూత్రం చాలా సులభం. ప్రజలు ఏం కొంటున్నారు? ఎంతకు కొంటున్నారు? ఆ మార్కెట్లో మనం ఎంత వాటా సంపాదించవచ్చు? ఇదే లెక్క.

మస్క్ ఆలోచనల్లోనే మరో ప్రపంచం! ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యాన్ని పరిశీలిస్తే మరో రకమైన ఆలోచనా విధానం కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లతో ఆటోమొబైల్ రంగాన్ని మార్చాలనుకున్నాడు. పునర్వినియోగ రాకెట్లతో అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని తగ్గించాలని ప్రయత్నించాడు. స్టార్‌లింక్‌తో ఉపగ్రహాల ద్వారా ప్రపంచానికి ఇంటర్నెట్ అందిస్తున్నాడు. న్యూరాలింక్‌తో మానవ మెదడుకు కంప్యూటర్ సాంకేతికతను అనుసంధానించే ప్రయోగాలు చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ అడుగుపెట్టాడు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించి వదిలేయడం కాదు, తిరిగి భూమిపైకి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించాలన్న ఆలోచనే స్పేస్‌ఎక్స్ ప్రయాణంలో కీలకమైన మలుపు. అంతరిక్ష ప్రయాణాన్ని ఖరీదైన ప్రభుత్వ కార్యక్రమం నుంచి పునరావృతమయ్యే వాణిజ్య కార్యకలాపంగా మార్చాలన్నది ఆ ప్రయత్నం వెనుక ఉన్న లక్ష్యం.

ఇక అంగారకుడిపై మానవ నివాసాలు ఏర్పాటు చేయాలన్నది మస్క్ దీర్ఘకాలిక కల. ఇప్పటికైతే అది సాధించిన వాస్తవం కాదు. కానీ అలాంటి కలను వ్యాపార సంస్థకు ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడమే మస్క్ ఆలోచనా పరిధిని తెలియజేస్తుంది. మస్త్ భవిష్యత్తును కలకంటాడు… అంబానీ వర్తమానంలో బతుకుతాడు.

రిస్క్ తీసుకోవడంలోనూ ఇద్దరి దారులు వేరు! మస్క్ ప్రయాణంలో భారీ వైఫల్యాలు, ప్రయోగాత్మక దశలు, అపారమైన పెట్టుబడులు కనిపిస్తాయి. ఒక ప్రయోగం విఫలమైనా మరో ప్రయోగానికి సిద్ధపడటం అతని వ్యాపార శైలిలో భాగం.

అంబానీ కూడా తక్కువ రిస్క్ తీసుకునే వ్యాపారవేత్త ఏమీ కాదు. జియోలో భారీ పెట్టుబడులు పెట్టి, ప్రారంభంలో ఉచిత సేవలతో మార్కెట్లోకి దూసుకెళ్లడం చిన్న సాహసం కాదు. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ రిలయన్స్ భారీ పెట్టుబడులతో భవిష్యత్తుకు పునాది వేస్తోంది.

అయితే ఇద్దరి ప్రాధాన్యతల్లో తేడా కనిపిస్తుంది. అంబానీ ఇప్పటికే ఉన్న భారీ మార్కెట్‌ను గుర్తించి, దానిలోకి ప్రవేశించి, తన సంస్థకు పెద్ద స్థాయిలో వ్యాపార అవకాశాలను సృష్టించడంలో దిట్ట. మస్క్ మాత్రం ఇప్పుడున్న మార్కెట్‌తో పాటు రేపు ఏర్పడబోయే మార్కెట్‌ను కూడా ఊహించి అందుకోసం సాంకేతికతను నిర్మించాలనుకుంటాడు.

ఒకరు నేల మీద మార్కెట్‌ను విస్తరిస్తుంటే… మరొకరు అంతరిక్షంలో మార్కెట్‌ను వెతుకుతున్నాడు! అంబానీ వ్యాపారాన్ని ఓ సామాన్య భారతీయుడి జీవితంతో అనుసంధానించి చూడొచ్చు. ఉదయం టీకి బిస్కెట్ కొనడం నుంచి మొబైల్ రీచార్జ్, షాపింగ్, పెట్రోల్, వినోదం వరకు రిలయన్స్ ఉత్పత్తులు, సేవలు ఎదురవుతూనే ఉంటాయి.

మస్క్ వ్యాపారాన్ని అలా చూస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. భవిష్యత్తులో మనం ఎలా ప్రయాణిస్తాం? ప్రపంచంతో ఎలా అనుసంధానమవుతాం? అంతరిక్షాన్ని ఎలా ఉపయోగించుకుంటాం? కృత్రిమ మేధ మన జీవితాలను ఎలా మార్చబోతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వ్యాపార అవకాశాలుగా మార్చే ప్రయత్నం అతనిది.

కాకపోతే ఒకరి వ్యాపార సామ్రాజ్యంలో మనిషి నిత్యావసరాలకు పెద్దపీట కనిపిస్తే, మరొకరి వ్యాపార సామ్రాజ్యంలో మనిషి భవిష్యత్తుపై పెద్ద ప్రయోగాలు కనిపిస్తాయి. ఒకరు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌లోనూ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చూడగలడు. మరొకరు రాకెట్‌లోనూ రేపటి మానవ నాగరికతను చూడగలడు! అదీ అసలు ముచ్చట!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మస్క్ అంతరిక్షంలో… అంబానీ అంగట్లో! బిజినెస్ దిగ్గజాల రెండు భిన్న ప్రపంచాలు!!
  • అంబానీ క్యాంపాకు కోకాకోలా కౌంటర్ – 26 ఏళ్ల తరువాత గోల్డ్‌స్పాట్ !!
  • అది 30 వేల కోట్ల ‘నీటి దందా’… అందుకే అంబానీ ఏదీ వదలడు
  • ఒక్కసారి ఊహించుకొండి – శంకరాభరణం శంకరశాస్త్రిగా మంగళంపల్లి !!
  • ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే..! కేసీయార్ భారీ జలద్రోహం కథ ఇదుగో!!
  • ఆ ‘కాంతాదాసుడికి ట్రంప్- మస్క్ మద్దతు … మళ్లీ Nvidia సంచలనం !!
  • చిరంజీవి ప్రతి సినిమా కథనూ మొదట ఆయనకు చెబుతాడు..!!
  • ఓ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్రయోగమే.. మరో సమస్యగా మారితే..?
  • ఆమె హానీట్రాప్‌లో ఆ ’హాట్ చిప్’..! ఆదానీ, అంబానీలకు భలే చాన్స్ !!
  • బిస్లరీ నీరు నిజంగానే అంత డేంజరా..? ఇదీ అసలు కథ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions