.
యేడాది కాలంలో మేం చూసిన మరో ప్రపంచం … ఔను. రేపటికి నేను, నాతో 60 మంది ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి యేడాది నిండుతుంది. ఈ యేడాది జీవితం మా ముందరి జీవితం కన్నా పూర్తి భిన్నమైనది. ఈ జీవితం మేం తీసుకున్న నిర్ణయం పూర్తి సరైనదని మాలో మరింత విశ్వాసాన్ని పెంచింది. ఇందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సహకరించిన మీడియాకు ప్రత్యేక అభినందనలు.
2025 అక్టోబర్ 13న మధ్యాహ్నం మాడ్ కొండలు దిగాం. దారి పొడుగుతా వర్షం. మేమంతా గెరిల్లా వేషధారణలోనే వున్నాం. సాయంకాలం పాములగౌతమీ నది దాటాం. ప్రయాణంలో పొలాలలోని రైతులంతా విస్తుపోయి చూస్తున్నారు. ‘ఏం జరుగబోతోంది అన్నలు ఇంత వెలుతురు వుండగా, ఇలా వెళ్తున్నారు’ అన్నట్టు నివ్వెరపోయి చూస్తున్నారు.
Ads
వారికి మా ఆయుధాలు వదలడానికి మేం వెళ్తున్నామని తెలియదు. వారికి నేను నెల రోజుల క్రితం సాయుధ పోరాట తాత్కాలిక విరమణ ప్రకటన ఇచ్చిన విషయమూ తెలియదు. వారు అంతర్జాలానికి అందుబాటులో లేని ఆదివాసీ ప్రజలు. డోంగలలో మమ్మల్ని నది దాటించిన వారికి ‘మీతో తాత్కాలికంగా వీడ్కోలు తీసుకుంటున్నాం’ అని చెప్పడంతో, వారు తట్టుకోలేకపోయారు. కానీ, మారిన పరిస్థితులలో అదే మంచిది అన్న భావన వారి కళ్లల్లో వ్యక్తమైంది. వారు నిర్వేదంతో పిడికిలెత్తారు.
అక్కడి నుండి మరింత దూరం నడిచి రాత్రి 9 గంటలకు పోలీసుల వాహనాలలో కూచున్నాం. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన పోలీసులకు సాయుధంగా వున్న మేమేం చేస్తామో అని ఆందోళన, ప్రాణ భయం. మాలోనూ ఇంచుమించు అదే స్థితి. పోలీసులు మోసం చేస్తారేమో…. అనే అనుమానం, ఆందోళన. కానీ, ఒక అధికారి వచ్చి, చేయి కలిపి ఫోన్ ఇచ్చాడు. ఆవలి నుండి జిల్లా ఎస్.పీ గొంతు.
‘‘మావారు మిమ్మల్ని, మీ టీంను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్లకు మీ ఆయుధాలు ఇవ్వండి. మిమ్మల్ని మావాళ్లు క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తీసుకువస్తారు . ‘ఆయుధం వదలాలనే నిర్ణయం తీసుకున్నాక, ఎవరికీ లేని ఆయుధం నాకూ అవసరం లేదు’ అని చెప్పి నా ఆయుధం కూడ ఆ అధికారికి ఇచ్చి వాహనాలలో కూచున్నాం.
కొంత దూరం ప్రయాణం చేశాక, అడిషనల్ ఎస్.పీ గా పరిచయం చేసుకున్న అధికారి నన్ను రిసీవ్ చేసుకున్నారు. మేమంతా ఉదయం 4 గంటల ప్రాంతంలో గడ్చిరోలీ చేరాం. మేమంతా సివిల్ దుస్తుల్లో వచ్చాం.
ఉదయం 15వ తేదీ. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డీజీపీ సహరాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారుల ముందు మా లొంగుబాటు కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేమంతా వరుసగా వేదికపై ముఖ్యమంత్రికి మా ఆయుధాలు అప్పగించాం. భారత రాజ్యాంగాన్ని స్వీకరించాం. వందలాది గడ్చిరోలీ వాసులు, పెద్ద ఎత్తున మీడియా పర్సన్స్ అక్కడికి చేరుకున్నారు. వారంతా కరతళాధ్వనులతో మాకు స్వాగతం చెప్పారు.
15 అక్టోబర్ భారత విప్లవోద్యమ చరిత్రలో సదా నిలిచిపోయే రోజుగా నమోదైంది. మా నిర్ణయాన్ని ప్రత్యక్షంగా స్వాగతించిన వారు జంపన్న, మధు లాంటి అతి కొద్ది మంది మాజీ మావోయిస్టు కార్యకర్తలు కాగా, పెద్ద ఎత్తున మమ్మల్ని అభినందిస్తున్నవారు ఈనాటికి తమ సందేశాలు మాకు అందిస్తున్నారు.
హైదరాబాదు కేంద్రంగా మమ్మల్ని కొంత మంది విమర్శించారు. వారు ముఖ్యంగా నన్ను లక్ష్యంగా చేసుకొని నిరాధారమైన ఆరోపణలతో నిందించారు. సరే, అవన్నీ ఊహించుకొనే మేం నిర్ణయం తీసుకున్నందున వాటిని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. విచిత్రం ఏమంటే, మమ్మల్ని నిందిస్తున్న వారి గురించి ఇప్పటికీ అనేక మంది మాతో వారి ‘నేపథ్య చరిత్రలు’ పంచుకుంటుంటే, వారిని సరిదిద్దలేకపోయిన మా గత పొరపాటుకు పార్టీ నాయకులుగా క్షంతవ్యులం అంటున్నాం.
ఆరోజు నుండి 1 సెప్టెంబర్ 2026 వరకు మేమంతా పోలీసుల పునరావాస కేంద్రంలో వున్నాం. మా తరువాత వచ్చిన ఇంకా అనేక మంది మాతోనే కలిసి వున్నారు. మా లొంగుబాటు తరువాత పునరావాస కేంద్రాలకు బీజాపుర్, దంతెవాడ, సుకుమా జిల్లాల నుండి పెద్ద ఎత్తున కుటుంబాల వారు వచ్చి తమ బిడ్డలను అక్కున చేర్చుకొని, ‘తిరిగి చూస్తామనుకోలేదు’ అంటూ కన్నీళ్లు కార్చడం, వారి అంతరంగ ఆవేదనకు సంకేతం. వారంతా పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయమని అభినందించారు. మారిన పరిస్థితుల వాస్తవికతను అర్థం చేసుకున్న ఆ పీడిత ప్రజలకు మేం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయామని, మా పొరపాటును మన్నించాలని చెప్పాం.
పునరావాస కేంద్రాలలో దాదాపు 10 మాసాలకు పైగా వున్న మాకు పోలీసులు ఈ దేశంలో పౌరులకు కావలసిన ప్రతి ఒక్క గుర్తింపు దస్తావేజును సమకూర్చారు. మాపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డు డబ్బును మాత్రమే మా బ్యాంకు అకౌంట్లో వేశారు. ఇంకా రివార్డు మనీ అందాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. మీడియాలో వచ్చే తలల వెలలకు, ప్రభుత్వాలు అందించే మొత్తాలకు పొంతన వుండదని డబ్బులు అందుతున్నపుడు అర్థమవుతోంది. ముఖ్యంగా, పునరావాస కేంద్రాలలో మా అందరి ఆరోగ్యాల విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చికిత్సలు చేయించారు. వృత్తి శిక్షణా కోర్సులలో ఇచ్చిన ప్రాథమిక ట్రేనింగ్ తరువాతి జీవితంలో సెటిల్ కావడానికి ఒక దృవీకరణ పత్రం అనుకోవాలి.

మేం ‘లొంగిపోయిన’ తరువాత దేశ వ్యాప్తంగా వున్న ఉద్యమ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గెరిల్లాలు నా పిలుపును సమర్థిస్తూ అనుసరించారు. వారంతా మారిన పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదే అన్నారు. ఫలితంగానే, లోకసభలో కేంద్ర హోంమంత్రి మావోయిస్టు రహిత భారతదేశంగా 31 మార్చ్ నాడు చెప్పుకున్నాడు. అయితే, దేశంలో ఇంకా మావోయిస్టులు వున్నారంటూ కలలు కంటున్నవారిని కలలో తేలియాడనివ్వండి. వారికి అదే సౌకర్యవంతంగా వుంటుంది పాపం.
మేం పునరావాస కేంద్రంలో వున్నపుడు మారిన సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మేమున్న విదర్భ ప్రాంతాన్ని చూడడానికి అవకాశం ఇవ్వాలనీ పోలీసులను కోరాం. వారు ఆ ఏర్పాట్లు చేశారు. ఆ పర్యటన సందర్భంగా నాకు మా గత కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ కడార్ల సత్యనారాయణ రెడ్డి (కోసా దాదా) రాసిన ఉత్తరంలోని విషయాలే పదే పదే గుర్తొచ్చాయి.
‘‘ఏ నిర్మాణంలో పని చేసిన అనుభవం లేనివాళ్లను భర్తీ చేసుకోవడంతో వాళ్లకు ఏ సామాజిక జ్ఞానం లేక అలాగే విప్లవ రాజకీయాలు తెలియక ఉత్సాహంతో 13- 18 సంవత్సరాల వాళ్లు అధికంగా రావడంతో, వాళ్లకు మన రాజకీయ అవగాహన కల్పించడానికి చాలా కాలం పడుతుంది’’…
ఆ పర్యటన పూర్తయ్యాక మా కేడర్లు తాము గతంలో ఎన్నడూ చూడని, చూస్తామని ఊహించని అనేక విషయాలను పరస్పరం పంచుకున్నారు. తాము ఎంతో నేర్చుకున్నామని భావించారు.
నేను చాలా ఆలస్యంగానే అయినప్పటికీ ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడంతో, వేలాది మంది పార్టీ కేడర్లు ప్రాణాలతో బయటపడ్డారు. మా తరువాత బయటకొచ్చిన కొందరు నాయకులు మారిన పరిస్థితులలో తమ రాజకీయ లక్ష్యాల సాధన కోసం పని చేయడానికి పూనుకుంటున్నారు. చాలా మంది కార్యకర్తలు తమ ఇళ్లకు చేరుకొని కుటుంబాలతో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
గ్రామస్థులతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వారంతా తెలియచేసే ప్రధాన విషయం, ‘గ్రామస్థులు మారిన పరిస్థితులలో తీసుకున్న రాజకీయ నిర్ణయం సరైనది. ఈ నిర్ణయం ఇంకా ముందే తీసుకొని వుంటే ఇంకా చాలా మంది మీలాగే మా మధ్య వుండేవారు’
ఔను. ఇంకా ముందే తీసుకోలేకపోయాం. కానీ, కనీసం కలిసి తీసుకోలేకపోయినందుకు దోషులెవరనే జనం ప్రశ్నకు జవాబు కావాలి. కాలం తీర్పుకు కట్టుబడివుందాం.
మొదట నన్ను నిందించినవారు సైతం క్రమంగా మేధో మథనానికి పూనుకోవడం సంతోషం. ధైర్యంగా గత తప్పులకు క్షమాపణలతో జనం ముందుకు రావాలని విజ్ఞప్తి. మారిన పరిస్థితులలో మీరు మారాలనీ, మీ భావాలకు పదను పెట్టాలనీ, జనం మధ్య నిజాయితీగా నిలవాలనీ మీ నుండి మా యేడాది అనుభవాల నుండి మరోసారి ఆకాంక్షిస్తున్నాను.
– మల్లోజుల వేణుగోపాల్
Share this Article