.
ఇతరుల పాటల్ని కాపీ కొట్టాడంటూ తమన్‌పై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి… ఆ ఆరోపణల్ని, ఆ ట్రోలింగును తమన్ కూడా పెద్ద సీరియస్‌గా తీసుకోడు… పట్టించుకోడు… కంపోజర్ అన్నాక కాపీ చేయకుండా ఎలా కుదురుతుంది అని అవసరమైతే దబాయించగలడు కూడా… కానీ ఇప్పుడు ట్రోలింగ్ వేరు…
తన సొంత పాటనే… అంటే తనే కంపోజ్ చేసిన ఓ పాత ట్యూన్‌ను ఇప్పుడు రీసైకిలింగ్ చేస్తూ, ఓ కొత్త సినిమాకు కొత్త ట్యూన్‌గా కలర్ ఇచ్చాడు… అదీ వివాదం… అఫ్కోర్స్, అదీ పట్టించుకోడు తను… ఏం..? అదీ నా పాటేగా… నిర్మాతలకు లేని నొప్పి మీకెందుకు అని ఉల్టా ప్రశ్నించగలడు… నా ట్యూన్ మళ్లీ వాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా అనగలడు…
Ads
కాపీ చేస్తే తప్పు అంటారు… అనుకరణ అంటారు… చోరీ అంటారు… మరి తన పాటనే మళ్లీ కొత్త ట్యూన్ పేరిట ఇస్తే..? తప్పుపడతారేం పాపం..? ఓసారి ఎప్పుడో తనే చెప్పినట్టు గుర్తు… తను పాట ట్యూన్ చేయగానే ఓ కంప్యూటర్ ప్రోగ్రాంకు అప్పగిస్తాడట… అలాంటి ట్యూన్ గతంలో వచ్చిందా, కాపీ అనిపిస్తోందా, అని చెక్ చేసి చెబుతుందట అది…
ప్చ్… ఇతరుల ట్యూన్లను కాపీ కొడితే చెబుతుందేమో గానీ… తన పాత ట్యూన్లనే రీసైకిల్ చేస్తే పట్టుకోలేదేమో అది… అదుగో అక్కడ ఉంది పొరపాటు… అసలు వివాదం ఏమిటో చెప్పనే లేదు కదూ…
వెంకటేశ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘మాలా’ … ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది… రొమాంటిక్ మెలోడీగా చిత్ర బృందం పరిచయం చేసిన ఈ పాటను విన్న కొందరికి మాత్రం కొత్త అనుభూతి కలగలేదు… పైగా, పాత జ్ఞాపకాలు తెరమీదకు వచ్చేశాయి…
అదేంటంటే… గతంలో తమన్ సంగీతం అందించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలోని ‘ఓ బావా మా అక్కని సక్కగా చూస్తావా’ పాట గుర్తొస్తోంది…! రెండు పాటల్లోని బీట్స్, రిథమ్, ట్యూన్ సాగే తీరులో పోలికలున్నాయి… ఇంకేముంది… మీమ్స్ మొదలయ్యాయి…. ‘తమన్ తన పాత పాటనే తాను కాపీ కొట్టేశాడు’ అంటూ సెటైర్లు పేలుతున్నాయి…

అసలే డీఎస్పీ నుంచి, అనిరుధ్ నుంచి బలమైన పోటీ ఎదురవుతోంది… పదే పదే కొత్త ట్యూన్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మరి… అందుకే తన పాత ట్యూన్‌నే మళ్లీ కొత్తగా సవరించి వదిలాడు, అదీ తప్పేనా..? ఒకసారి వండిన వంటకం నచ్చితే మళ్లీ చేసుకోకూడదా? ఇంట్లో అయితే మిగిలిన కూరను మరుసటి రోజు వేడి చేసుకుని తింటారు… మరి సంగీతంలో పాత ట్యూన్‌ను కాస్త అటూఇటూ చేసి వడ్డిస్తే తప్పెలా అవుతుంది..? కాకపోతే, ఇక్కడ పాత పాట గుర్తొచ్చి కొత్త పాట రుచి కాస్త తగ్గిందంతే..!
ఇక ఈ పాట విషయంలో తమన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్పైనా విమర్శలు వస్తున్నాయి… వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు పాటల ఎంపికలో మరింత కొత్తదనం ఉండాలని ప్రేక్షకులు ఆశించడం సహజం… పైగా, త్రివిక్రమ్ సినిమాల్లో పాటలకు, వాటి చిత్రీకరణకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది… అలాంటి కాంబినేషన్ నుంచి వచ్చిన పాటే పాత పాటను గుర్తుచేస్తే అభిమానులు నిరాశపడటం ఆశ్చర్యమేమీ కాదు…!!
Share this Article