.
బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతావురా.. ఇక్కడ ఇక్కడ రా! ఎంకన్న ఎంకన్న ఎక్కడ పోతావురా.. ఇక్కడ ఇక్కడ రా! 1969లో వచ్చిన ఓ హిందీ సినిమాలో ఈ పాట వినిపించిందంటే ఇప్పటి తరానికి ఆశ్చర్యం కలగొచ్చు. అందులోనూ ఈ పాట పాడింది మరెవరో కాదు.. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మహమ్మద్ రఫీ!
పక్కనే మహిళా గొంతుతో జవాబులు.. తెరపై మెహమూద్, హెలెన్ నృత్యాలు! ఇప్పుడు ఈ పాత పాట సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతోంది. ఇన్నేళ్ల తర్వాత ఈ వీడియో ఎందుకు హఠాత్తుగా వైరల్ అవుతోందో తెలియదు. కానీ పాటలోని బతుకమ్మ పలకరింపు మాత్రం ఈతరం తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Ads
ఆ సినిమా పేరు ‘షత్రంజ్’. 1969లో విడుదలైన ఈ చిత్రంలో రాజేంద్ర కుమార్, వహీదా రెహమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మెహమూద్, హెలెన్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాలోని క్లబ్ సన్నివేశంలో వచ్చే ఈ పాటకు సంగీతం అందించింది శంకర్–జైకిషన్ జోడీ. హిందీ పాటల ప్రపంచంలో తమదైన శైలితో ప్రేక్షకులను అలరించిన ఈ సంగీత దర్శకుల పేర్లు మనకు పరిచయమే. కానీ వారి సంగీతంలో తెలంగాణ బతుకమ్మ కూడా చోటు చేసుకుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.

శంకర్‌కు హైదరాబాద్‌తో అనుబంధం! శంకర్ సింగ్ రఘువంశీ, జైకిషన్ దయాభాయ్ పంచాల్.. ఈ ఇద్దరూ కలిసి శంకర్–జైకిషన్‌గా భారతీయ సినిమా సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే వీరిద్దరిలో శంకర్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉండటం ఈ పాట గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం. శంకర్ బాల్యంలో హైదరాబాద్‌లో పెరిగాడని, చిన్నతనంలోనే సంగీతం, తబలా వాయిద్యంపై ఇక్కడే ఆసక్తి పెంచుకున్నాడని చెబుతారు.
అంటే, తెలంగాణ సంస్కృతికి పరిచయం ఉన్న వ్యక్తి హిందీ సినిమా సంగీత ప్రపంచంలోకి వెళ్లి, అక్కడి ప్రేక్షకుల కోసం బాణీలు కడుతున్న సమయంలో బతుకమ్మ వంటి ప్రాంతీయ సంస్కృతికి సంబంధించిన పదాలు ఓ పాటలో వినిపించడం ఆసక్తికరమే.
1964లోనూ బతుకమ్మ ప్రస్తావన! ఇదే సంగీత దర్శకుల జోడీ 1964లో వచ్చిన ‘రాజ్‌కుమార్’ సినిమాలోనూ ‘నాచ్ రే మన్ బడ్కమ్మా’ అనే పాటకు సంగీతం అందించింది. అంటే, ‘షత్రంజ్’ పాటతోనే బతుకమ్మ తొలిసారి హిందీ సినిమాకు పరిచయమైందని చెప్పలేం. అంతకుముందే బతుకమ్మ ప్రస్తావన హిందీ పాటలో కనిపించింది.
అయితే ‘బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతావురా’ అంటూ తెలుగులోనే పలకరించే ‘షత్రంజ్’ పాట ప్రత్యేకత వేరు. రఫీ వంటి దిగ్గజ గాయకుడి గొంతులో తెలుగు పదాలు వినిపించడం, మహిళా గొంతు నుంచి ‘ఎంకన్న ఎంకన్న’ అంటూ జవాబు రావడం, దానికి మెహమూద్, హెలెన్ నృత్యాలు తోడవడం.. ఈ కలయికే పాటను ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఎన్టీఆర్ సినిమాలోనూ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’! ఈ కథలో మరో ఆసక్తికరమైన మలుపు ఉంది. 1971లో విడుదలైన ఎన్టీఆర్ ‘జీవిత చక్రం’ సినిమాకు కూడా సంగీతం అందించింది శంకర్–జైకిషన్ జోడీయే! ఆ సినిమాలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో’ అనే పాట ఉంది. డాక్టర్ సి. నారాయణరెడ్డి సాహిత్యం అందించగా, పి. సుశీల, బి. వసంత గానం చేశారు.
హిందీ సినిమాలో బతుకమ్మను పలకరించిన సంగీత దర్శకులే, రెండేళ్ల తర్వాత తెలుగు సినిమాలో బతుకమ్మ ఉయ్యాలో పాటకు బాణీలు అందించడం విశేషం. ‘జీవిత చక్రం’ పాటలో తెలంగాణ సంప్రదాయపు పదాలు, పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పాటను విన్నవారికి బతుకమ్మ పండుగ సందడి గుర్తుకు రావడం సహజం.
ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? రష్మిక, విజయ్ జంట బతుకమ్మ ఉత్సవాలు, పీవీ సింధు వెండి బతుకమ్మ కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్… ఈ పాత హిందీ పాట కూడా… నిజానికి పాత సినిమాల పాటలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొత్త జీవితాన్ని పొందుతుంటాయి. ఒకప్పుడు సినిమా థియేటర్లలోనో, రేడియోలోనో, సంగీత కార్యక్రమాల్లోనో వినిపించిన పాటలు.. ఇప్పుడు చిన్న వీడియోల రూపంలో కొత్త తరానికి చేరుతున్నాయి.
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఈ పాటను వైరల్ చేశారా, కారణాలేమిటి అన్నది మాత్రం తెలియదు. కానీ ఈ పాటను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విషయం ఒక్కటే.. మన బతుకమ్మ పేరు, మన ప్రాంతపు పలకరింపు అర్ధ శతాబ్దానికి పైగా క్రితమే హిందీ సినిమాలో వినిపించాయి!
https://www.youtube.com/watch?v=aAJ4asMYepc
Share this Article