.
నేనొక సినిమా పరిచయం చేస్తాను… మన సినిమాల ప్రజెంట్ ట్రెండ్ ఏమిటి..? గ్యాంగ్స్టర్స్… వాళ్లను హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తూ… విపరీతమైన హింసను చూపిస్తూ… ఒక్కడే వందమందిని నరికేస్తే… వాళ్ల భాషలోనే చెప్పాలంటే తరుముతూ, తురుముతూ… ఈ ఎల్‌నినో కాలంలోనూ నెత్తుటి వరదను పారిస్తున్నారు కదా… అదేమంటే, మాస్ అంటారు… అక్కడికి మాస్ అంటే, కమర్షియల్ వాల్యూస్ అంటే… ముక్కలుగా నరకబడిన దేహాలు, పేలుళ్ల శిథిలాలు అనే పిచ్చి భ్రమల ట్రెండ్ కదా ఇప్పుడు…
కానీ… ఓ పిల్లాడు… ఎనిమిదేళ్లు… మూడో తరగతి… మరోవైపు జనం బాగా భయపడే ఓ గ్యాంగ్‌స్టర్… అనుకోకుండా ఆ స్కూల్ పిల్లాడి వల్ల ఈ గ్యాంగ్‌స్టర్ ప్రభుత్వ పాఠశాలలోని వాష్‌రూమ్‌లో పొరపాటున బంధించబడతాడు… బయటికి రాలేడు… వారం రోజులు… అదీ కథ…
Ads
ఏమీ లేవు… భీకరమైన థమన్ మార్క్ బాక్సులు పగిలిపోయే బీజీఎం లేదు… తెరపై నెత్తుటి ప్రవాహం లేదు… హీరో గారు కత్తులు కటార్లతో, భారీ మిషన్ గన్లతో రౌడీలను రప్పారప్పా నరికేయడం, కాల్చేయడం కూడా లేదు… కాస్త కామెడీ, బోర్ రానివ్వని పకడ్బందీ స్క్రీన్ ప్లే… అదే ఈ సినిమా… సినిమా టైటిల్… బత్తా… baththa…
అసలే విజయ్ సేతుపతి… ఇలాంటి కేరక్టర్ పడాలే గానీ ఇక ఆగుతాడా… తనలోని నటుడిని తృప్తిపరిచాడు… తనకు దీటుగా ఆ పిల్లాడు… సాయి పృథ్విరాజ్… ఈ ప్రధాన పాత్రలు, కథలోని వైవిధ్యంతో దర్శకుడు బాలాజీ తరణీతరన్ ఓ ఆట ఆడుకున్నాడు… దీని ప్రజెంటర్ ఎవరో తెలుసా..? ప్రముఖ దర్శకుడు అట్లీ…
రొటీన్ గ్యాంగ్‌స్టర్ ఫార్ములా డ్రామాలకు భిన్నంగా, క్లాస్, మాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ 2026 బెస్ట్ ఫీల్-గుడ్ తమిళ చిత్రం అనిపించుకుంటోంది… ఇంకొన్ని వివరాలు చెప్పుకుందాం…

కథాంశం: ఒక వినూత్నమైన ‘లాక్-అప్’ డ్రామా … కథ 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. నగరంలోనే అత్యంత ప్రమాదకరమైన, అందరూ చూసి భయపడే లోకల్ డాన్ బత్తా (విజయ్ సేతుపతి). అలాంటి డాన్, శబరి (సాయి పృథ్వీరాజ్) అనే ఒక ఎనిమిదేళ్ల భయస్తుడైన మూడో తరగతి స్కూల్ పిల్లాడి వల్ల ఒక ప్రభుత్వ పాఠశాల వాష్‌రూమ్‌లో పొరపాటున బంధించబడతాడు. శబరి ఆ రూమ్‌కు లాక్ వేసి, తాళం పోగొట్టుకుంటాడు.
ఆ తర్వాత స్కూలుకు వారం రోజులు సెలవులు రావడంతో, ఆ గదిలోనే బత్తా చిక్కుకుపోతాడు. ఒక వారం రోజుల పాటు ఒంటరితనం, ఆకలి, దాహం మధ్య ఆ గ్యాంగ్‌స్టర్ ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడు? తనను బంధించిన పిల్లాడిపై పగ పెంచుకున్నాడా లేక తనలోని పాత అమాయకత్వాన్ని గుర్తుచేసుకున్నాడా? హింసకు దూరంగా ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన ఒక అపూర్వమైన స్నేహం బత్తా జీవితాన్ని ఎలా మార్చింది? అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
సినిమా ప్లస్ పాయింట్స్ & నటీనటుల ప్రతిభ… విజయ్ సేతుపతి ‘వన్-మ్యాన్ షో’: ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఎక్కడా తన ‘స్టార్ ఇమేజ్’ లేదా ‘మాస్ ఎలిమెంట్స్’ చూపించలేదు. పూర్తిగా పాత్రకు లొంగిపోయి నటించాడు. ఫస్ట్ హాఫ్‌లో రఫ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన ఆయన, సెకండ్ హాఫ్‌లో వాష్‌రూమ్‌లో బంధించబడినప్పుడు పడే వేదన, ఆకలితో అలమటించే సీన్స్, తన అహాన్ని (Ego) కోల్పోయే సైకలాజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను అద్భుతంగా పలికించాడు…
చైల్డ్ ఆర్టిస్ట్ సాయి పృథ్వీరాజ్ వండర్ పర్ఫార్మెన్స్… సినిమాకు అసలైన బలం శబరి పాత్రలో నటించిన సాయి పృథ్వీరాజ్. విజయ్ సేతుపతి లాంటి నటుడి పక్కన నటిస్తున్నా ఎక్కడా భయం లేకుండా, ఒక సాధారణ స్కూల్ పిల్లాడి భయాన్ని, అమాయకత్వాన్ని ఎంతో సహజంగా పండించాడు. ఇద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తూనే, హృదయాన్ని హత్తుకుంటాయి.

లిజోమోల్ జోస్ పాత్ర… ‘జై భీమ్’ ఫేమ్ లిజోమోల్ జోస్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. కథకు అవసరమైన ఎమోషనల్ డెప్త్‌ను ఆమె తన నటనతో మరింత పెంచింది.
దర్శకత్వ ప్రతిభ…: దర్శకుడు బాలాజీ తరణీతరన్ (నడువుల కొంజం పక్కత కానోమ్ ఫేమ్) రాసుకున్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం. ఒకే లొకేషన్లో సాగే కథ అయినప్పటికీ, ప్రతి 15 నిమిషాలకు ఒక టెన్షన్ లేదా సహజమైన కామెడీ పుట్టేలా సీన్స్ రాసుకున్నారు. క్లైమాక్స్ ఎమోషనల్ టచ్ థియేటర్ నుండి వచ్చే ప్రేక్షకుడికి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
మైనస్ పాయింట్లు లేవా..? ఉన్నాయి… అక్కడక్కడా… 1980 నేపథ్యానికి తగిన పర్ఫెక్ట్ బీజీఎం కాదు… అసలు విషయం ఏమిటంటే..? ఇది తమిళ సినిమా… ప్రతి అడ్డమైన సినిమాను పాన్ ఇండియా పేరిట నాలుగైదు భాషల్లోకి డబ్ చేసి వదులుతున్న ఈరోజుల్లో దీన్ని తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు… హైదరాబాదులో కూడా సేమ్ వెర్షన్ పలు థియేటర్లలో…
మరి తెలుగులో చూడాలంటే..? సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి, ఇప్పుడు అట్లీ దీని తెలుగు వెర్షన్ తీసుకువస్తాను అంటున్నాడు… ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది… థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తారా..? లేక అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో రాబోయే ఓటీటీ రిలీజ్ సమయంలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల ఆడియోలను నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి తీసుకువస్తారా..? వెయిట్…!!
Share this Article