Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎల్‌నినోపై BRS క్షుద్ర రాజకీయాలు ! ఇవి క్షుద్ర పూజలకన్నా డేంజర్ !!

October 25, 2026 by M S R

.

ఎల్‌నినో… ఈ పదం చాలా దేశాలను వణికిస్తోంది… ఎక్కడో చదివినట్టు గుర్తు… ఈ ఎల్‌నినో వల్ల మానసిక వ్యాధులు (మెంటల్ డిజార్డర్స్) పెరుగుతాయని..! సాధారణంగానే ప్రతి నలుగురిలో ఒకరికి మెంటల్ డిజార్డర్ ఉంది, అది ఈ మధ్య ఎక్కువ పెరుగుతోంది… ఎల్ నినో సమయంలో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది…

  • మొదట నమ్మలేదు… కానీ బీఆర్ఎస్ ఎల్‌నినో విపత్తుపై మొదలుపెట్టిన క్షుద్ర రాజకీయాలు చూస్తుంటే… అది నిజమే అనిపిస్తోంది… ఎల్‌నినో అనేది ఓ విపత్తు… దాన్ని అర్థం చేసుకోవాలి… అంగీకరించాలి… అధిగమించే దిశలో ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా తనూ జనంలో ఉండాలి, అండగా నిలవాలి… కానీ దీన్ని కూడా ‘కరువు పాలిటిక్స్’గా తీసుకుని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే పిచ్చి వ్యాఖ్యానాలకు, విమర్శలకు, క్షుద్ర రాజకీయాలకు తెరలేపింది…

నిజం చెప్పాలంటే… లక్షల కోట్ల అవినీతితో కాళేశ్వరం వంటి అడ్డదిడ్డం ప్రాజెక్టులు కట్టి.., తెలంగాణ ఖజానాను ముంచి.., తక్కువ ఖర్చుతో ఉపయుక్తంగా ఉండే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును బొంద పెట్టి.., కృష్ణా ప్రాజెక్టులను పఢావు పెట్టి.., తెలంగాణకు సుస్థిర నీటివసతిని దుర్లభం చేసింది కేసీయార్… తన పాలన… ఇప్పుడు ఏమాత్రం ఆత్మవిమర్శ లేకుండా మేడిగడ్డకు పోతారట, కన్నెపల్లి పంప్ హౌజ్ సందర్శిస్తారట బీఆర్ఎస్ నేతలు…

Ads

  • గతంలో కేసీయార్ చెప్పిన ఓ మాట గుర్తుందా..? ‘మేడిగడ్డకు ఏం పీకడానికి పోతున్నరు’… సేమ్, ఇప్పుడు ఆ కేసీయార్ మాటే అక్కడికి వెళ్లే తన పరమానందయ్య శిష్యులకూ వర్తిస్తుంది… ఏం చేస్తారు..? వాళ్లే కట్టిన ఆ పఢావు బరాజు దగ్గర సెల్ఫీలు దిగి, తమ ఘనతగా ప్రచారం చేసుకుంటారా..? వీటిని హరీష్ మార్క్ క్షుద్ర పూజలు అని కాదు, ఇవి ఇంకోరకం క్షుద్ర పూజలు అనాలా..?

రేవంత్ రెడ్డి బ్లఫ్ చేయడం లేదు… ఒకే ఒక పారసెటమాల్ గోళీతో కరోనాను ఖతం చేస్తామని కేసీయార్ అసెంబ్లీలో పలికాడు కదా… అదొక వింత జ్ఞాన సంపత్తి… రేవంత్ రెడ్డి అలాంటి విచిత్ర జ్ఞానంతో కాదు… నిజం ఏమిటో ప్రజలకు నేరుగా అర్థమయ్యేట్టుగానే చెబుతున్నాడు… ఎల్‌నినో మీద రాజకీయాలు కాదు, అందరమూ కలిసి ఎదుర్కుందాం, అధిగమిద్దాం అంటున్నాడు… ఎహె, అదెంత, దాని ప్రభావమెంత అంటూ కేసీయార్క్ మార్క్ భాషను, అబద్ధాల్ని ఆశ్రయించడం లేదు…

  • నిజం… విపత్తును అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి, అధిగమించే ప్రయత్నం చేయాలి… తెలంగాణ ప్రజల దురదృష్టం కొద్దీ ప్రధాన ప్రతిపక్షానికి ఆ సోయి లేదు, ఆ విజ్ఞత లేదు… గాయిగత్తర తప్ప మరే బాధ్యతా తెలియదు… ఎల్‌నినో తీవ్రత గురించి చెప్పాలంటే… బ్రీఫ్‌గా…

ఎల్‌నినో

_  1876-77 మధ్యన ఎల్‌నినో  ఏకంగా 5 కోట్ల మందికిపైగా బలి తీసుకుంది… అప్పుడు ప్రధానంగా నష్టపోయిన దేశాలు భారతదేశం, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇథియోపియా, మొరాకో, అమెరికా… కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు. ఆకలి, పోషకాహార లోపం, వ్యాధుల వల్ల అనేక మంది మరణించారు…

పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కటం వలన ఎల్‌నినో వస్తుంది (సాధారణంకంటే 2 డిగ్రీలు ఎక్కువ. ఇప్పుడు అంతకుమించి ఉంటుందంటున్నారు)… ఇది ఒక సముద్రపు మార్పు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలని, వ్యవసాయాన్ని, కోట్ల మంది ప్రజల తలరాతల్ని తలక్రిందులుగా చేయగల ఒక మహాశక్తి…

ప్రస్తుత ఎల్‌నినోతో ఎక్కువ ప్రభావితమయ్యేది మన దేశమే… ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు… ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో తీవ్రమైన పొడి వాతావరణం ఏర్పడుతుంది… అడవుల్లో మంటలు వ్యాపించి ఆసియాలో బియ్యం ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది… తూర్పు, దక్షిణ ఆఫ్రికా దేశాలైన జింబాబ్వే, సొమాలియా, జాంబియా, సోమాలియా, నైజీరియా, ఇథియోపియా, సుడాన్ వంటి దేశాల్లో తీవ్ర కరువు ఏర్పడి పంటలు పండవు, లక్షల, కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితి రావొచ్చు…

భూమికి అటువైపు ఉన్న దక్షిణ అమెరికా దేశాల్లో ప్రధానంగా పెరూ, ఈక్వెడార్, బ్రెజిల్, గ్వాటెమాలా, హోండూరాస్ లాంటి దేశాలకి వినాశకరమైన భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది.

  • మన దేశంలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రలో ప్రభావం ఎక్కువ అవటానికి కారణం మనం ఈ కాలంలో నీరు ఎక్కువగా తాగే పంటలని సాగు చేయటం, వర్షాధార వ్యవసాయం, ఈ ఎల్‌నినో సమయంలో నదీ పరివాహక ప్రాంతాలు ఎండిపోవటం, వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోవటం, విద్యుత్ సంక్షోభం ఏర్పడటం వంటివి… సాగునీరు, తాగునీరు, పవర్ క్రైసిస్ ఒకేసారి చుట్టుముట్టే ప్రమాదం…

అయితే ఎల్‌నినో ముగిసిన తర్వాత పసిఫిక్ మహాసముద్రం చల్లబడుతుంది,  దాన్ని “లానినా” అంటారు… ఇది మన దేశానికి భారీ వర్షాలు, లాభాలని తెచ్చిపెడుతుంది… సో, అన్ని అంశాల్లో సంయమనం, నియంత్రణ, పొదుపు వంటి చర్యలతో ఈ ఎల్‌నినోను అధిగమించాల్సిందే… ప్రకృతిని మనం సవాల్ చేయలేం, తలవంచి, అంగీకరించి, ప్రొటెక్షన్ చర్యలు ఆలోచించుకోవల్సిందే… అన్నింటికన్నా ముందు క్షుద్ర రాజకీయాలకు ప్రజల్ని పణంగా పెట్టొద్దు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎల్‌నినోపై BRS క్షుద్ర రాజకీయాలు ! ఇవి క్షుద్ర పూజలకన్నా డేంజర్ !!
  • ఏబీఎన్ రాధాకృష్ణ ‘కుట్ర వ్యాసాన్ని’ కార్నర్ చేసిన దేవులపల్లి అమర్..!!
  • రామాయణలో నేనెక్కడ ఉన్నాను..? మండోదరీ అగర్వాల్ అలిగింది !
  • ఓ సర్కారీ స్కూల్ టాయిలెట్‌లో ఇరుక్కున్న బడా గ్యాంగ్‌స్టర్… తరువాత..?
  • లోప్క తాగుడు- పీక్క తినుడు… ఇదా తెలంగాణ కల్చర్ అంటే..?!
  • ఇదేం పని..?! లేడీ సింగం ‘ఆయుధ పూజ’ తీరుపై సర్కారు నోటీసు !!
  • ప్రీతిరెడ్డి..! తెలంగాణ విద్యావ్యవస్థకు ఓ మణికిరీటం..!!
  • పాపం కేటీయార్… పాత తప్పుల్ని మరిచి… ఆకాశానికి మళ్లీ నిచ్చెనలు !!
  • వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ !!
  • మోహన్‌లాల్ బాడీ డబుల్ ! ఇదో దిక్కుమాలిన సోషల్ రాద్దాంతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions