.
Kovela Santoshkumar ….. from b.srinivas rao’s twitter post….
రూ.11 వేల ఇంజెక్షన్‌కు రూ.1.30 లక్షలా?
ఇది దోపిడీ కాదా? సమర్థించగలరా?
కార్పొరేట్ ఆసుపత్రుల మందుల దందాపై సుప్రీం కోర్టు ఆగ్రహం
కేంద్రానికీ చీవాట్లు.. తీర్పు రిజర్వ్
రూ.15 డ్రిప్ లైన్‌కు రోగుల నుంచి రూ.250 వసూలు
90 శాతం మందులు ధరల నియంత్రణ పరిధికి బయటే
మార్జిన్లు తగ్గిస్తే ఆసుపత్రులు కుప్పకూలుతాయన్న రోహత్గీ
‘దోపిడీతో కాదు, వేరే మార్గాల్లో బతకండి’: ధర్మాసనం
Ads
క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్యను ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు ఓ మందుల డీలర్. ఆమె కీమోథెరపీకి వాడే ఇంజెక్షన్‌ను ఆయనే పంపిణీ చేస్తుంటాడు. “సార్.. నేనే ఆ ఇంజెక్షన్ డీలర్‌ను. నాకు అది రూ.11 వేలకే వస్తుంది” అని ఆసుపత్రి యాజమాన్యాన్ని వేడుకున్నాడు. అతడు తెచ్చిన ఇంజెక్షన్ వేసేందుకు ఆసుపత్రి నిరాకరించింది.
అదే ఇంజెక్షన్‌కు రూ.1,30,000 వసూలు చేసింది. ఈ ఉదంతాన్ని మంగళవారం సుప్రీం కోర్టు ధర్మాసనమే స్వయంగా ప్రస్తావించింది. ఆసుపత్రి పేరు మాత్రం చెప్పలేదు. “ఈ దోపిడీని ఎలా సమర్థిస్తారు? ఇంత తేడా ఎందుకు? ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది?” అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
నాన్-షెడ్యూల్డ్ మందులు, వైద్య పరికరాలు, కన్స్యూమబుల్స్పై ధరల నియంత్రణ, ట్రేడ్ మార్జిన్ పరిమితి కోరుతూ న్యాయవాది కిషన్ చంద్ జైన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.
వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులే రాయాలని, నాన్- షెడ్యూల్డ్ మందులపై ప్రారంభ దశలోనే ధరల నియంత్రణ ఉండాలని, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీవో) కింద వైద్య పరికరాలపై చట్టబద్ధ మార్జిన్ పరిమితి విధించాలని పిటిషనర్ కోరారు.
మీ సర్దుబాటు దారి తప్పింది…
ధరల విధానాలను ప్రభుత్వం నిరంతరం సర్దుబాటు చేస్తూనే ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “మీ సర్దుబాటు పూర్తిగా దారి తప్పింది. రూ.11 వేల నుంచి రూ.1.30 లక్షలు సర్దుబాటు కాదు. రోగుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంత పెట్టుబడిదారీ ఆలోచన ఉండాలా?” అని ప్రశ్నించింది. నిస్సహాయ రోగులకు బేరమాడే శక్తి ఏమాత్రం ఉండదని, ఆసుపత్రులు వసూలు చేస్తున్న భారీ మార్జిన్లు ‘దోపిడీ’, ‘దారిదోపిడీ’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

90 శాతం మందులు నియంత్రణకు బయటే…
క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయినా మార్కెట్లోని దాదాపు 90 శాతం మందులు ఇప్పటికీ డీపీసీవో పరిధికి పూర్తిగా బయటే ఉన్నాయని ధర్మాసనం ఎత్తిచూపింది. “అసలు డీపీసీవో ఎందుకు? ప్రభుత్వమే ఇదంతా జరగనిస్తోంది. దీనిపై మూడు పార్లమెంటరీ కమిటీలు నివేదికలు ఇచ్చాయి. తెర వెనుక సూత్రధారులకు ఆ నివేదికలు అంత సౌకర్యంగా లేవు” అని వ్యాఖ్యానించింది.
రూ.15 డ్రిప్‌కు రూ.250…
మందులే కాదు, ఆసుపత్రుల్లో వాడే కన్స్యూమబుల్స్ ధరలపైనా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. రిటైలర్‌కు రూ.15కు వచ్చే సెలైన్ డ్రిప్ లైన్‌కు రోగుల నుంచి రూ.250 వసూలు చేస్తున్నారని పేర్కొంది. “మందుపై ఎంఆర్పీ రూ.100 అని ముద్రిస్తారు. రిటైలర్‌కు అది రూ.10 లేదా రూ.20కే వస్తుంది. మరి రూ.100 అని ఎందుకు ముద్రిస్తున్నారు? షెడ్యూల్డ్ మందు కాదు కాబట్టి నియంత్రించబోమని ప్రభుత్వం ఎలా చెబుతుంది?” అని కేంద్రాన్ని నిలదీసింది.
- ఆవిష్కరణల పేరుతో అధిక ధరలను సమర్థించుకోవడాన్నీ తప్పుపట్టింది. గత 30 ఏళ్లలో భారత ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చేసిన ఐదు కొత్త మాలిక్యూల్స్ పేర్లు చెప్పాలని సవాల్ విసిరింది. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కవరేజీ రూ.5 లక్షలకే పరిమితం కావడంతో, మిగిలిన భారీ బిల్లుల భారాన్ని సామాన్య కుటుంబాలే మోయాల్సి వస్తోందని గుర్తుచేసింది.
ఆసుపత్రులు కుప్పకూలుతాయట…
ప్రైవేట్ ఆసుపత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి ఉన్నందునే ప్రైవేట్ రంగం సేవలు అందిస్తోందని చెప్పారు. మందుల మార్జిన్లు తగ్గించాలని ఒత్తిడి చేస్తే ఆసుపత్రులు కుప్పకూలుతాయని వాదించారు. రోగులు బయటి నుంచి తెచ్చే మందులను నమ్మలేమని, మార్కెట్లో సగం మందులు నకిలీవేనని అన్నారు.
మందుల ధరలు తగ్గిస్తే ఇతర సేవల ధరలు పెరుగుతాయని, ఫలితంలో తేడా ఉండదని చెప్పారు. ఇరవై నాలుగు గంటలూ సదుపాయాలను సిద్ధంగా ఉంచేందుకు భారీ ఖర్చులు భరించాల్సి వస్తోందని వివరించారు.
ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. “ఆసుపత్రులు వేరే మార్గాల్లో నిలదొక్కుకోవచ్చు. ఈ దోపిడీతో కాదు. మీది వాణిజ్య ఆసుపత్రి. ప్రతిదానికీ ఛార్జీ వసూలు చేస్తారు. కానీ మందులను 100, 200 రెట్లు ఎక్కువకు ఎందుకు అమ్మాలి?” అని ప్రశ్నించింది. తయారీ సంస్థలు ఇచ్చే కార్పొరేట్ డిస్కౌంట్ అంశం ఇంకా బయటకు రాలేదని వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్నామన్న కారణంతో ఎంఆర్పీని సమర్థించుకోలేరని స్పష్టం చేసింది.
మార్కెట్ శక్తులకు, మందుల లభ్యతకు మధ్య సమతుల్యం పాటిస్తున్నామని కేంద్రం చెప్పింది. తయారీ వ్యయానికి, రిటైల్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని కేంద్రం పదేపదే వివరించలేకపోయిందని ధర్మాసనం ఎత్తిచూపింది. “మీరు ప్రజల ప్రాణాలతో వ్యవహరిస్తున్నారు. దీన్ని వ్యాపారంగా చూడొద్దు. ఇక్కడ సమతుల్యం అనేదే లేదు” అని వ్యాఖ్యానించి తీర్పును రిజర్వ్ చేసింది…
Share this Article