.
2030 నుంచి ప్రియాంకకు గ్రహబలం.. 2034 తర్వాత రాజకీయంగా అత్యున్నత స్థాయి! ఆస్ట్రో శర్మిష్ఠ అంచనా వెనుక ఆసక్తికర చర్చ.. 2029 ఎన్నికల తర్వాత రాహుల్ పరిస్థితి ఏమిటి?
రాజకీయాల్లో ఎవరి భవిష్యత్తు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఈరోజు తిరుగులేని నాయకుడిగా కనిపించినవారు రేపు వెనుకబడవచ్చు. పెద్దగా ప్రాధాన్యం లేనివారు ఒక్కసారిగా రాజకీయ యవనికపై వెలిగిపోవచ్చు. ప్రజల మూడ్, ఎన్నికల సమీకరణాలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ వ్యూహాలు.. ఇలా ఎన్నో అంశాలు రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే వీటన్నింటికీ తోడు గ్రహగతులను కూడా పరిగణనలోకి తీసుకునే జ్యోతిష్యులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ వాద్రా భవిష్యత్తుపై అలాంటి ఆసక్తికరమైన చర్చే మొదలైంది.
Ads
సోషల్ మీడియాలో జ్యోతిష్య విశ్లేషణలతో గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రో శర్మిష్ఠ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణం. కాంగ్రెస్ నాయకులందరిలో ప్రియాంక గాంధీయే ఆశాకిరణమని, 2030 నుంచి ఆమెకు ప్రజాదరణ పెరగడం ప్రారంభమవుతుందని ఆమె అంచనా వేశారు. ప్రియాంక జాతకంలో చంద్ర మహాదశ ప్రారంభం కావడమే ఇందుకు కారణమని విశ్లేషించారు. 2034 తర్వాత ఆమె రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశముందని పేర్కొన్నారు.
అంటే.. మరో ఎనిమిదేళ్లు ఆగితే కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ కొత్త శకానికి తెరతీస్తారా? నెహ్రూ కుటుంబానికి మళ్లీ రాజకీయంగా మహర్దశ పట్టబోతోందా? మరి అప్పటివరకు రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటి? 2029 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు.

జ్యోతిష్యంలోనూ.. రాజకీయాల్లోనూ ప్రియాంక గురించే చర్చ! ఆస్ట్రో శర్మిష్ఠ పేరు సోషల్ మీడియాలో చాలామందికి పరిచయమే. శర్మిష్ఠ దాస్ పేరుతో గుర్తింపు పొందిన ఆమె, సంప్రదాయ వైదిక జ్యోతిష్యాన్ని ఆధునిక విశ్లేషణతో మేళవిస్తూ రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రముఖుల భవిష్యత్తుపై అంచనాలు వెల్లడిస్తుంటుంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కు 12 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని చెబుతున్నారు. సమకాలీన రాజకీయ పరిణామాలను గ్రహగతులతో అనుసంధానించి విశ్లేషించడం ఆమెకు సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చిన అంశాల్లో ఒకటి.
ఇంజినీరింగ్ విద్య తర్వాత జ్యోతిష్యంపై ఆసక్తితో ఈ రంగంలో శిక్షణ పొందినట్లు ఆమె గురించి ప్రచారంలో ఉంది. వ్యక్తిగత జాతకాల నుంచి దేశ రాజకీయాల వరకు అనేక అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. గతంలో చేసిన కొన్ని అంచనాలు వాస్తవ పరిణామాలతో సరిపోలాయని ఆమె అభిమానులు చెబుతుంటారు.
ఇప్పటికే యాక్టివ్.. 2030 కోసం ఎందుకు ఎదురుచూడాలి? ప్రియాంక గాంధీ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే, ఆమె ఇప్పుడే క్రియాశీల పాత్ర పోషిస్తోంది. 2019లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించడం ప్రారంభించిన ఆమె, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ కార్యకలాపాలకు నాయకత్వం వహించింది. 2024లో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించి, తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టింది.
తాజా పరిణామాలు కూడా ఆమె రాజకీయ చురుకుదనాన్ని సూచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పునర్వ్యవస్థీకరణ, 2027 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాల్లో ఆమె మళ్లీ కీలకంగా వ్యవహరిస్తోందని అక్టోబర్ 24న ది ప్రింట్ ప్రచురించిన కథనం పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు చర్చల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు రావాలనే అంశంపై కూడా ఆమె దృష్టి పెట్టినట్లు తెలిపింది.
అంటే ప్రియాంక రాజకీయాల్లోకి రావడానికి లేదా చురుకుగా మారడానికి 2030 వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే రాజకీయ రంగంలో ఉంది. ఇప్పుడు చూడాల్సింది ఆమె చురుకుదనం ఏ స్థాయికి చేరుతుంది? పార్టీ నిర్ణయాల్లో ఆమెకు ఎంత ప్రాధాన్యం లభిస్తుంది? జాతీయ రాజకీయాల్లో స్వతంత్రంగా తనదైన ముద్ర వేయగలదా అన్నదే…
ప్రియాంకకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే… నెహ్రూ కుటుంబ వారసత్వంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడగల నాయకురాలిగా ఆమె తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. ఆమె ప్రసంగాలు, పార్లమెంటులో ప్రస్తావించే అంశాలు, అధికార పక్షంపై విమర్శలు, ఎన్నికల వ్యూహాల్లో భాగస్వామ్యం.. ఇవన్నీ ఆమె రాజకీయ పాత్రను క్రమంగా విస్తరిస్తున్నాయి…
2029 తర్వాత రాహుల్‌కు ఇబ్బందేనా? … ఇక్కడే అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ప్రియాంకకు 2030 నుంచి రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతున్నప్పుడు, అంతకుముందు జరిగే 2029 లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి?
ఒకవేళ 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే, పార్టీ నాయకత్వంపై సహజంగానే చర్చ మొదలవుతుంది. అలాంటి పరిస్థితిలో ప్రియాంకకు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపించే అవకాశం ఉందా? రాహుల్‌తోపాటు ప్రియాంక కూడా జాతీయ నాయకత్వంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడుతుందా? ఇవి రాజకీయ పరిశీలకులు చర్చించదగిన ప్రశ్నలు.
రాజకీయాల్లో నాయకత్వ మార్పుల చర్చ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా నెహ్రూ– గాంధీ కుటుంబం చుట్టూ తిరిగిన కాంగ్రెస్‌లో, తదుపరి తరం నాయకత్వం ఎలా రూపుదిద్దుకుంటుందన్నది పార్టీ భవిష్యత్తుతో ముడిపడిన అంశం…
ఆస్ట్రో శర్మిష్ఠ అంచనా ప్రకారం 2030 నుంచి ప్రియాంకకు అనుకూలమైన దశ ప్రారంభమవుతుంది. 2034 తర్వాత రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరే అవకాశముందని ఆమె చెబుతోంది. ఈ అంచనాలు నిజమవుతాయో లేదో కాలమే నిర్ణయించాలి… కానీ ప్రియాంక ఇప్పటికే రాజకీయంగా చురుకుగా మారుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం చర్చకు ఆసక్తికరమైన నేపథ్యాన్ని కల్పించింది… సో, మోదీ కలలగన్న కాంగ్రెస్ ముక్త భారత్ సాకారం కాదన్నమాటేనా..!!
Share this Article