Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకప్పుడు మద్యం మాఫియా అడ్డా… ఇప్పుడు కేసినోల జూదనగరి!

November 2, 2026 by M S R

.

లక్కీ డే… మా క్రూయిజ్ నడిపే కెప్టెన్ ఆనందంగా చెబుతున్నాడు… రెండు వేల్స్, కాస్త పక్కన డాల్ఫిన్ల గుంపు… వాటిని చూస్తూ క్రూయిజులోని పిల్లల కేరింతలు, ఫోటోలు, వీడియోలు… ‘కొన్నిసార్లు ఎంతసేపు తిరిగినా డాల్ఫిన్ కనిపించదు, కానీ ఈరోజు వేల్స్, డాల్ఫిన్స్ గుంపులు కనిపించాయి… అందుకే లక్కీ డే’ అంటూ అక్కడక్కడే క్రూయిజును చాలాసేపు చక్కర్లు తిప్పాడు…

ఇదీ అట్లాంటిక్ సిటీ తీర ప్రాంతంలో… అట్లాంటిక్ సముద్రంలోకి ఆరేడు కిలోమీటర్ల వెళ్లాక నా అనుభవం… పదండి, ఆ సిటీ కథలోకి వెళ్దాం ఓసారి… అట్లాంటిక్ సిటీ… పాత ఇళ్ల మధ్య కొత్త విలాసాలు, సముద్రంలో డాల్ఫిన్ల సందడి, ప్రకృతికి మనిషి విసురుతున్న సవాళ్లు!

Ads

అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రానికి తూర్పు తీరంలో, అట్లాంటిక్ మహాసముద్రం ఒడ్డున ఉన్న పట్టణం అట్లాంటిక్ సిటీ (Atlantic City). పేరు వింటేనే ఏదో మహానగరమేమో అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే మొదట కలిగే భావన మాత్రం భిన్నం. చిన్న పట్టణం… పాతకాలపు వీధులు… ఎప్పటివో పాత ఇళ్లు… కొన్ని ప్రాంతాల్లో కాలం అక్కడే ఆగిపోయిందా అనిపించే వాతావరణం. కానీ సముద్రం వైపు చూస్తే మాత్రం మరో ప్రపంచం కనిపిస్తుంది. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే హోటళ్లు, రిసార్టులు, బార్లు, కేసినోలు, బీచ్‌లు… అందుకే దీనికి ‘సిటీ ఆఫ్ కేసినోస్’ అనే పేరు కూడా వచ్చింది.

అయితే ఈ నగరానికి కేసినోలతోనే చరిత్ర మొదలుకాలేదు. ఒకప్పుడు అమెరికాలో మద్యం నిషేధం అమలులో ఉన్నప్పుడు అక్రమ మద్యం వ్యాపారానికి అట్లాంటిక్ సిటీ ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. 1920 నుంచి 1933 వరకు అమెరికాలో మద్య నిషేధం అమలైంది. ఆ సమయంలో మద్యం తయారీ, విక్రయాలు, రవాణాపై నిషేధం ఉండేది. కానీ చట్టం ఒకవైపు ఉంటే, దాన్ని ఉల్లంఘించి సంపాదించుకునే మాఫియా మరోవైపు ఉండేది. అట్లాంటిక్ సిటీలో అప్పట్లో రాజకీయ నాయకులు, స్థానిక అధికార యంత్రాంగం, మాఫియా ముఠాల మధ్య ఉన్న సంబంధాలు అక్రమ మద్యం వ్యాపారానికి అండగా నిలిచాయి.

చార్లెస్ ‘లక్కీ’ లూసియానో వంటి మాఫియా నాయకుల పేర్లు ఈ చరిత్రలో వినిపిస్తాయి. స్థానిక రాజకీయ బాస్ ఎనాకీ జాన్సన్ (Nucky Johnson) పేరు కూడా ఈ నేపథ్యంలో ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. రట్జర్స్ యూనివర్సిటీ చరిత్ర వివరాల ప్రకారం 1926 నుంచి 1933 మధ్య అమెరికాలోకి అక్రమంగా వచ్చిన మద్యంలో దాదాపు 40 శాతం అట్లాంటిక్ సిటీ లేదా దాని పరిసరాల మీదుగా ఒడ్డుకు చేరిందని అంచనా. అంటే దేశవ్యాప్తంగా నిషేధం అమలవుతున్నా, ఇక్కడ మాత్రం అక్రమ మద్యం వ్యాపారం పెద్ద స్థాయిలో సాగేదన్నమాట!

1933లో అమెరికాలో మద్య నిషేధం ముగిసింది. దాంతో అక్రమ మద్యం వ్యాపారానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు విలాసవంతమైన సముద్రతీర విహార కేంద్రంగా పేరొందిన అట్లాంటిక్ సిటీ ఆ తర్వాత పర్యాటకుల ఆదరణ కోల్పోయింది. పాత హోటళ్లు కళ తప్పాయి. ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఒక దశలో ఈ పట్టణానికి పునరుజ్జీవం అవసరమైంది.

అక్కడే కేసినోల కథ మొదలైంది… 1976లో న్యూజెర్సీ ఓటర్లు అట్లాంటిక్ సిటీలో మాత్రమే కేసినో జూదానికి అనుమతించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 1978 మే 26న ‘రిసార్ట్స్ ఇంటర్నేషనల్’ పేరుతో మొదటి కేసినో ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా భారీ హోటళ్లు, కేసినోలు, వినోద కేంద్రాలు వెలిశాయి. ఒకప్పుడు అక్రమ మద్యం వ్యాపారంతో వార్తల్లో నిలిచిన నగరం, ఇప్పుడు చట్టబద్ధమైన జూదం, వినోద పరిశ్రమతో గుర్తింపు పొందుతోంది. అమెరికాలో లాస్ వెగాస్ తర్వాత కేసినోల గురించి మాట్లాడేటప్పుడు అట్లాంటిక్ సిటీ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది.

ఇక్కడి విశేషం ఏమిటంటే, కొత్తగా వెలిసిన భారీ భవనాల పక్కనే పాత అట్లాంటిక్ సిటీ కూడా ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని వీధుల్లో పాతకాలపు ఇళ్లు, చిన్న చిన్న నివాసాలు, స్థానికుల దైనందిన జీవితం కనిపిస్తాయి. ఒకవైపు విలాసవంతమైన కేసినో హోటళ్లలో వేల డాలర్ల లావాదేవీలు జరుగుతుంటే, మరోవైపు సాధారణ అమెరికన్ పట్టణ జీవితం కొనసాగుతుంటుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక్కడి బీచ్‌లు, బోర్డువాక్ కూడా ప్రత్యేక ఆకర్షణలు. అమెరికాలో తొలి బోర్డువాక్‌లలోనే కాదు, దేశంలోనే మొట్టమొదటి సముద్రతీర బోర్డువాక్‌గా అట్లాంటిక్ సిటీకి గుర్తింపు ఉంది. 1870లో నిర్మించిన ఈ చెక్క నడకదారి తర్వాత నగరానికి ప్రతీకగా మారింది. సముద్రం పక్కనే నడుచుకుంటూ వెళ్లడం, మధ్యలో ఐస్‌క్రీమ్‌లు, సాల్ట్ వాటర్ టాఫీ వంటి స్థానిక ప్రత్యేకతలు ఆస్వాదించడం, చిన్న చిన్న వినోద కేంద్రాలు చూడటం ఇక్కడి పర్యాటక అనుభవంలో భాగం.

మరో ఆసక్తికరమైన అంశం ఇక్కడి వెకేషన్ ప్రాపర్టీలు. కొందరు అమెరికన్లు తమ శాశ్వత నివాసాలకు భిన్నంగా సముద్రతీర ప్రాంతాల్లో మరో ఇల్లు కొనుక్కుంటారు. వీటిని సెకండ్ హోమ్స్ లేదా వెకేషన్ ప్రాపర్టీస్ అంటారు. వారాంతాల్లో, సెలవుల్లో కుటుంబంతో కలిసి వచ్చి గడపడానికి వీటిని ఉపయోగిస్తారు. అట్లాంటిక్ సిటీ చుట్టుపక్కల ఉన్న మార్గేట్, వెంట్నర్, బ్రిగంటైన్ వంటి తీరప్రాంత పట్టణాల్లో ఇలాంటి రెండో ఇళ్ల సంస్కృతి బాగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా అక్కడే ఉండకపోయినా, సముద్రతీరంలో తమకంటూ ఒక చిన్న ప్రపంచం ఉండాలని కోరుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు.

dolphins

ఇక నాకు ఈ పర్యటనలో అన్నింటికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన అంశం డాల్ఫిన్లను చూడటానికి సముద్రంలోకి వెళ్లే క్రూయిజ్ ప్రయాణం. అట్లాంటిక్ సిటీలోని గార్డనర్స్ బేసిన్ నుంచి పర్యాటకులను తీసుకెళ్లే బోట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా డాల్ఫిన్ వాచింగ్ క్రూయిజ్‌లు నిర్వహిస్తారు. సముద్రంలో డాల్ఫిన్లు కనిపిస్తాయనే ఆశతో జనం ఆసక్తిగా పడవల్లోకి ఎక్కుతారు. అట్లాంటిక్ బాటిల్‌నోస్ డాల్ఫిన్లు ఈ ప్రాంత సముద్రజలాల్లో కనిపిస్తుంటాయి. అవి నీటి మీదకు ఎగిరి, పడవ పక్కనుంచి ఈదుకుంటూ వెళ్తుంటే పర్యాటకుల ఆనందానికి అవధులుండవు.

నాకూ ఆ అనుభవం ఎదురైంది. డాల్ఫిన్లతో పాటు రెండు వేల్స్ కూడా కనిపించాయి. సముద్రంలో వాటి జాడ కనిపించగానే పడవలో ఉన్నవారి ఉత్సాహం చూడాలి! కెమెరాలు బయటకు వస్తాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కేరింతలు కొడతారు. సముద్రపు అలల మధ్య స్వేచ్ఛగా కదులుతున్న ఆ జీవులను చూడటం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి.

కానీ అక్కడే ఒక చిన్న వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు మనం సముద్రంలో డాల్ఫిన్లు, వేల్స్ కనిపిస్తే ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం. మరోవైపు కొన్నిచోట్ల సముద్ర తీరాలకు కొన్ని వేల్స్ మృతదేహాలు కొట్టుకొస్తున్నాయన్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. సముద్ర జీవుల ఉనికే ప్రమాదంలో పడుతోందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

న్యూజెర్సీ, న్యూయార్క్ తీరప్రాంతాల్లో హంప్‌బ్యాక్ వేల్స్ మరణాలు, ఒడ్డుకు కొట్టుకొచ్చే ఘటనలపై శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) వివరాల ప్రకారం వీటి మరణాలకు ఒకటే కారణం ఉందని చెప్పలేం. ఓడలు ఢీకొనడం, చేపల వలల్లో చిక్కుకోవడం, అనారోగ్యం, సముద్ర కాలుష్యం, ఆహార లభ్యతలో మార్పులు వంటి అనేక అంశాలు కారణాలు కావచ్చు. 2016 నుంచి అమెరికా అట్లాంటిక్ తీరంలో హంప్‌బ్యాక్ వేల్స్ అసాధారణ మరణాలపై ప్రత్యేక అధ్యయనం కొనసాగుతోంది. పరిశీలించిన కొన్ని మృతదేహాల్లో ఓడల ఢీకొనడం లేదా వలల్లో చిక్కుకోవడం వంటి మానవ ప్రమేయానికి ఆధారాలు కూడా లభించాయి.

ocean

అట్లాంటిక్ సిటీ విషయంలో మరో అంశం గమనించదగ్గది. ఇక్కడి తీరానికి భారీ కార్గో నౌకలు, కంటైనర్ షిప్పుల రాకపోకలు కనిపించవు. ఇది న్యూయార్క్- న్యూజెర్సీ తరహా భారీ వాణిజ్య నౌకాశ్రయం కాదు. ప్రధానంగా పర్యాటకం, వినోదం, హోటళ్లు, కేసినోల చుట్టూనే నగర ఆర్థిక వ్యవస్థ తిరుగుతుంది. సముద్రతీరంలో పర్యాటక పడవలు, వినోద క్రూయిజ్‌లు కనిపిస్తాయి కానీ భారీ సరుకు రవాణా నౌకల సందడి ఉండదు. అయితే అట్లాంటిక్ సిటీకి చరిత్రలో ఓడరేవు ప్రాధాన్యం కూడా ఉంది. నేటి పరిస్థితిని చూసి ఇక్కడ ఎప్పుడూ పోర్టు లేదనుకోవడం మాత్రం పొరపాటు.

మొత్తానికి అట్లాంటిక్ సిటీ ఒక విచిత్రమైన కలయిక. పాతకాలపు అమెరికా పట్టణం, ఒకప్పటి మద్యం మాఫియా చరిత్ర, ఆధునిక కేసినో సంస్కృతి, విలాసవంతమైన హోటళ్లు, సముద్రతీర విహారాలు… అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఒకవైపు మనుషుల వినోదం కోసం వెలిగిపోతున్న రంగుల ప్రపంచం ఉంటే, మరోవైపు మనుషుల కంటికి కనిపించని సముద్ర జీవుల ప్రపంచం ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకప్పుడు మద్యం మాఫియా అడ్డా… ఇప్పుడు కేసినోల జూదనగరి!
  • పోలీసు ఉద్యోగం చేస్తోంది… కానీ పోలీసులా బతకడం లేదు… మరెలా..?
  • విలన్లందరూ మంచోళ్లేనట..! మీరెక్కడ తయారయ్యారురా బాబూ..!!
  • ఇదీ సుగర్ వ్యాధిని తరిమికొట్టే దిశలో నిజమైన ముందడుగు!!
  • త్రివిక్రమ్..! ఏమాత్రం ‘గురూజీ కాదిక… ఓ సాదాసీదా దర్శకుడు మాత్రమే!’
  • ఈ బాలీవుడ్ హాస్యబ్రహ్మ- ఇక రిటైరయిపోతాడుట- ఆ నవ్వులకు ఇక ‘తెర’…
  • అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం
  • సినిమా రక్త చరిత్ర… రాప్తాడు రంపం వెనుక దాగున్న ‘విషం’…
  • నో, నో… *కొత్త బొద్దింకలు- మోదీ సర్కారు’పై కథనం కానేకాదు ఇది!!
  • BiggBoss10… రేయ్, ఎవుర్రా మీరంతా..!! ఎంపికలు ఎవరి నిర్వాకం..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions