.
సంచలనం సృష్టించిన శాస్త్రవేత్తల ప్రయోగం: మధుమేహాన్ని (Diabetes) తరిమికొట్టే దిశగా అద్భుతమైన ముందడుగు!
మానవ ప్యాంక్రియాస్ (Pancreas) నుంచి సేకరించిన కొద్దిపాటి స్టెమ్ కణాలను వృద్ధి చేసి, కోట్లాది ఇన్సులిన్-తయారీ మినీ అవయవాలుగా (Organoids) మార్చడంలో శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. చైనాలోని షాంఘైలో ఉన్న ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’కి చెందిన యి ఏరియల్ జెంగ్ (Yi Arial Zeng) నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అద్భుతమైన ప్రయోగాన్ని నిర్వహించింది.
Ads
ఈ ప్రయోగం విశేషాలు: అద్భుతమైన వృద్ధి… దాతల ప్యాంక్రియాస్ నుంచి సేకరించిన అరుదైన కణాలను ప్రయోగశాలలో 3D క్లస్టర్లుగా (ఆర్గనాయిడ్స్) పెంచారు… ఐదు నెలల కాలంలో సుమారు 10 దశల వృద్ధి ద్వారా ఇవి దాదాపు 300 మిలియన్ రెట్లు పెరిగాయి…
సహజసిద్ధమైన పనితీరు: ఇవి కేవలం పెరగడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) గుర్తించి సరిగ్గా అసలు ప్యాంక్రియాస్‌లాగే ఇన్సులిన్‌ను విడుదల చేశాయి…

ఎలుకలపై విజయవంతమైన ప్రయోగం: డయాబెటిస్ ఉన్న ఎలుకలకు ఈ ఆర్గానాయిడ్స్‌ను అమర్చగా, కేవలం వారంలోపే వాటి అధిక రక్త చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి… ఈ ఫలితం దాదాపు ఏడాది పాటు (11 ఎలుకలపై సుదీర్ఘంగా పరిశీలించారు) స్థిరంగా నిలిచింది… అయితే, ఆ అమర్చిన గ్రాఫ్ట్‌లను తొలగించిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు మళ్లీ ఒక్కసారిగా పెరగడం విశేషం…
వైద్య రంగంలో దీని ప్రాముఖ్యత ఏమిటి? టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారికి దాతల నుంచి సేకరించే ‘ఐలెట్ ట్రాన్స్‌ప్లాంట్స్’ (Islet transplants) ఎంతో కొంత ఉపశమనం ఇస్తాయి… కానీ, దాతల ప్యాంక్రియాస్‌లు అవసరానికి తగినట్లుగా ఎప్పుడూ దొరకవు… ఈ నేపథ్యంలో ప్రయోగశాలలోనే ఇలా పునరుత్పత్తి చేసుకోగలిగే స్టెమ్ కణాలు అందుబాటులోకి వస్తే డయాబెటిస్ చికిత్సలో ఇదొక పెద్ద విప్లవం కాగలదు…
అంతేకాకుండా, ఇవి పిండ సంబంధిత (embryonic) లేదా రీప్రోగ్రామ్ చేసిన స్టెమ్ కణాలు కాకుండా వయోజన కణాల (adult cells) నుంచి సేకరించినవి కావడం వల్ల, క్యాన్సర్ వచ్చే ముప్పు (tumor risk) చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు… కోతులపై (Macaque monkeys) చేసిన ప్రయోగాలలో కూడా ఇవి ఇన్సులిన్ అవసరాలను దాదాపు సగానికి తగ్గించాయి…
ప్రస్తుతానికి ఈ ఫలితాలు ప్రధానంగా ఎలుకలపైనే సాధించారు… అంతేకాకుండా, ఈ రీసెర్చ్ పేపర్ ఇంకా పూర్తి స్థాయిలో పీర్-రివ్యూ (Peer-review) కావాల్సి ఉంది… అయినప్పటికీ, భవిష్యత్తులో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల నుంచి శాశ్వత విముక్తి కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు…
Share this Article