Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

త్రివిక్రమ్..! ఏమాత్రం ‘గురూజీ కాదిక… ఓ సాదాసీదా దర్శకుడు మాత్రమే!’

November 2, 2026 by M S R

.

మాటల మాంత్రికుడికి ఏమైంది? ప్రేక్షకులు మారారు… త్రివిక్రమ్ మారలేదా?… ఒకప్పుడు ఆయన రాసిన ఒక్కో సంభాషణ థియేటర్లలో ఈలలు వేయించేది. సినిమాలో చిన్న పాత్రకు కూడా చప్పట్లు కొట్టే డైలాగులు రాసి, ఆ పాత్రను ప్రేక్షకుల జ్ఞాపకాల్లో పదిలం చేసేవాడు… కథలో పెద్దగా ఏమీ లేకపోయినా, ఆయన మాటలు సినిమాను నిలబెట్టేవి… దర్శకుడిగా మారిన తర్వాత కూడా కొన్ని హిట్ సినిమాలను అందించాడు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు… ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తర్వాత ఆయనపై విమర్శల దాడి మరింత పెరిగింది…

ఇదంతా చూసి త్రివిక్రమ్ వ్యతిరేకుల పని అని కొట్టిపారేయవచ్చా? సినిమా నచ్చకపోతే విమర్శించే హక్కు ప్రేక్షకులకు లేదా? అసలు ఒకప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులను తన మాటలతో మంత్రముగ్ధులను చేసిన దర్శకుడు ఇప్పుడు ఎందుకిలా తయారయ్యాడు? క్షమించాలి, ఆండ్రోపాజ్..?!

Ads

ప్రేక్షకుల స్థాయి పెరిగిందా? దర్శకుడి స్థాయి తగ్గిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే కొంచెం వెనక్కి వెళ్లాలి…

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాల్లో త్రివిక్రమ్ రచనా ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… వెంకటేష్ పాత్రలకే కాదు, బ్రహ్మానందం, సునీల్, ప్రకాష్‌రాజ్ వంటి నటుల పాత్రలకు కూడా ఆయన రాసిన సంభాషణలు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి… హాస్యం, భావోద్వేగం, కుటుంబ అనుబంధాలు, చమత్కారం… అన్నీ సహజంగా కలిసిపోయేవి…

దర్శకుడిగా ‘అతడు’ ఆయనలోని మరో కోణాన్ని పరిచయం చేసింది… ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు ఆయనకు స్టార్ దర్శకుడి హోదాను తీసుకొచ్చాయి… ఆయన సినిమాల్లో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి…

అయితే ఆ విజయాలే ఇప్పుడు ఆయనకు ఒక రకంగా భారంగా మారాయేమో! పాత త్రివిక్రమ్ కనిపించడం లేదేం?

‘ఆదర్శ కుటుంబం’లో తొలి భాగం అక్కడక్కడా నవ్విస్తుంది… వెంకటేష్ తన సహజమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు… సత్య కూడా కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు… కానీ ఒక ఆసక్తికరమైన కుటుంబ కథగా మొదలైన సినిమా, విరామం తర్వాత ఎటో వెళ్లిపోయింది…

క్రైమ్ గ్యాంగ్, పోలీసుల వ్యవహారం, హత్యలు, యాక్షన్ ఎపిసోడ్లు… ఇలా కథనం మరో దిశలో ప్రయాణిస్తుంది… ఆ మార్పును ప్రేక్షకుడు అంగీకరించాలంటే అందుకు తగ్గ కథాబలం, ఉత్కంఠ, భావోద్వేగాలు ఉండాలి… అవే ఇక్కడ కొరవడ్డాయి…

trivikram

విలన్లు భయపెట్టలేకపోయారు… పోలీసు ట్రాక్ ఆసక్తి కలిగించలేదు… మలుపులు ముందే ఊహించగలిగేలా ఉన్నాయి… పాత్రల మధ్య భావోద్వేగ సంబంధాలు కూడా బలంగా ఏర్పడలేదు… ఒకప్పుడు చిన్న సన్నివేశంతోనే ప్రేక్షకుడి మనసును తాకగలిగిన త్రివిక్రమ్, ఈ సినిమాలో పెద్ద పెద్ద సన్నివేశాలతోనూ ఆ ప్రభావాన్ని సృష్టించలేకపోయారు…

ఇది చిన్న విషయం కాదు… మాటల మాంత్రికుడి మాటలే ఇప్పుడు సమస్యగా మారుతున్నాయా?   త్రివిక్రమ్‌కు ఉన్న ప్రధాన బలం సంభాషణలు… కానీ అదే బలాన్ని అతిగా ఉపయోగిస్తే బలహీనతగా మారుతుంది… ప్రతి సందర్భంలోనూ ఒక తాత్వికమైన మాట చెప్పాలనుకోవడం, ప్రతి పాత్ర చేతా జీవిత సత్యాలు పలికించడం, ప్రతి సన్నివేశంలోనూ ఒక పంచ్ ఉండాలనుకోవడం… ఇవన్నీ ఒక దశ తర్వాత విసుగు తెప్పిస్తాయి…

ఒకప్పుడు ఆయన సంభాషణలు పాత్రల స్వభావం నుంచి పుట్టేవి… ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పాత్రల కంటే రచయితే ఎక్కువగా కనిపిస్తున్నారనే విమర్శలోనూ కొంత వాస్తవం ఉంది… సినిమాలో మాటలు బాగుంటే సరిపోదు… కథ బాగుండాలి… కథనంలో వేగం ఉండాలి… పాత్రలు సహజంగా ప్రవర్తించాలి… ప్రేక్షకుడికి ముందే తెలిసిపోయే మలుపులను కొత్తదనంగా చూపించే ప్రయత్నం చేయకూడదు…

ముఖ్యంగా ‘ఆదర్శ కుటుంబం’లో కనిపించిన సమస్య ఇదే… కథలోని సాధారణమైన అంశాలను కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం… ఒకప్పుడు సాధారణ కథనానికే తన మాటలతో, సన్నివేశాల రూపకల్పనతో ప్రత్యేకత తీసుకొచ్చిన దర్శకుడు ఇప్పుడు సాధారణ దర్శకుడి స్థాయిలో సినిమా తీసినట్లు అనిపించడం…

ప్రేక్షకులు నిజంగానే మారిపోయారు! ఇక్కడ ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును కూడా గుర్తించాలి… ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇతర భాషల సినిమాలు, ప్రపంచ సినిమా అందుబాటు పరిమితంగా ఉండేది… ఇప్పుడు ఓటీటీ వేదికలు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అద్భుతమైన కంటెంట్‌ను ఇంటి గుమ్మం ముందుకు తెచ్చాయి…

కొత్త కథలు, కొత్త కథన పద్ధతులు, విభిన్నమైన పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకులకు పరిచయమయ్యాయి… ఒక సినిమా చూస్తున్నప్పుడు దాని కథ ఎటు వెళ్తుందో, సన్నివేశం ఎందుకు పెట్టారో, పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తోందో విశ్లేషించే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది…

అంతేకాదు, ఇప్పుడు స్టార్ హీరోలున్నారని మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టడం లేదు… కథలో కొత్తదనం లేకపోతే, సినిమా రెండున్నర గంటలు ఆసక్తిగా కూర్చోబెట్టలేకపోతే ఎంత పెద్ద పేరున్న దర్శకుడైనా ప్రేక్షకుల విమర్శలకు గురికావాల్సిందే… ఈ మార్పును అర్థం చేసుకోవాల్సింది దర్శకులే.

వెంకటేష్‌ను నమ్ముకున్నాడా? తనను తాను మరిచిపోయాడా?

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెంకటేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది… ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ కాంబినేషన్‌ను గుర్తుచేసుకుంటూ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు… అలాంటి సందర్భంలో త్రివిక్రమ్ నుంచి రావాల్సింది మరో మంచి కుటుంబ వినోదాత్మక చిత్రం… లేదంటే పూర్తిగా కొత్త కథనంతో కూడిన ప్రయోగం…

కానీ ఈ రెండింటి మధ్య ఎక్కడో తడబడ్డాడు… కుటుంబ హాస్యాన్ని, క్రైమ్ థ్రిల్లర్‌ను కలిపే ప్రయత్నం చేశాడు… కానీ రెండింటికీ న్యాయం చేయలేకపోయాడు… వెంకటేష్ తన వంతు ప్రయత్నం చేశాడు… ఆయన నటనపై పెద్దగా విమర్శలు లేవు… కానీ ఒక నటుడు తన భుజాలపై ఎంతసేపు బలహీనమైన కథనాన్ని మోయగలడు?

ఇక్కడ తప్పు వెంకటేష్‌ది కాదు… కథను, కథనాన్ని సమర్థంగా నడిపించాల్సిన బాధ్యత దర్శకుడిదే… త్రివిక్రమ్ ఇప్పటికైనా మారాలి!

త్రివిక్రమ్‌పై వస్తున్న విమర్శలన్నీ ట్రోలింగ్ కావు… కొన్ని విమర్శలు అతిశయోక్తిగా ఉండవచ్చు… వ్యక్తిగత దూషణలు ఉండవచ్చు… ఒక సినిమా ఫలితంతో ఆయన గత విజయాలన్నింటినీ తుడిచిపెట్టలేం… కానీ నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రం స్వీకరించాలి…

ముఖ్యంగా తనలోని రచయితను మళ్లీ మేల్కొలపాలి… కొత్త కథలు ఎంచుకోవాలి… కొత్త రచయితలతో చర్చించాలి… తన ఆలోచనలనే అంతిమ సత్యాలుగా భావించకుండా ఇతరుల అభిప్రాయాలకూ చోటివ్వాలి… స్టార్ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలను వంచడం మానేసి, కథకు అవసరమైన పాత్రలను సృష్టించాలి…

ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర ఉండాలనే తాపత్రయం కంటే, ప్రతి సినిమాలోనూ ఒక మంచి కథ చెప్పాలనే తపన ఉండాలి…

మరీ ముఖ్యంగా, ఒకప్పుడు తాను సాధించిన విజయాలనే పదే పదే గుర్తుచేసుకుంటూ సినిమాలు తీస్తే సరిపోదు… ఆ విజయాలు ఎందుకు వచ్చాయో విశ్లేషించుకోవాలి… అప్పటి ప్రేక్షకులు ఇప్పుడు లేరు… అప్పటి సినిమా వాతావరణమూ లేదు… కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు మారాయి… దర్శకుడు కూడా మారాలి…

చివరగా ఒక్క మాట! త్రివిక్రమ్‌ను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించలేదు… ఆయన నుంచి ఏదో ఆశిస్తున్నారు కాబట్టే ఇంత చర్చ జరుగుతోంది… ఒక సాధారణ దర్శకుడి సినిమా బాగోలేకపోతే ఇంతగా పట్టించుకోరు కూడా! పాత డైలాగులు చెప్పుకుంటూ కొత్త సినిమాలు తీయలేరు గురూజీ! ప్రేక్షకులకు ఇప్పుడు మీ మాటలకంటే ముందు మీ కథ కావాలి… మీ పంచ్‌లకంటే ముందు మీ సినిమాలో పట్టు కావాలి… మీ గత వైభవం కాదు… కొత్తదనం కావాలి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • త్రివిక్రమ్..! ఏమాత్రం ‘గురూజీ కాదిక… ఓ సాదాసీదా దర్శకుడు మాత్రమే!’
  • ఈ బాలీవుడ్ హాస్యబ్రహ్మ- ఇక రిటైరయిపోతాడుట- ఆ నవ్వులకు ఇక ‘తెర’…
  • అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం
  • సినిమా రక్త చరిత్ర… రాప్తాడు రంపం వెనుక దాగున్న ‘విషం’…
  • నో, నో… *కొత్త బొద్దింకలు- మోదీ సర్కారు’పై కథనం కానేకాదు ఇది!!
  • BiggBoss10… రేయ్, ఎవుర్రా మీరంతా..!! ఎంపికలు ఎవరి నిర్వాకం..!?
  • 5 స్టార్స్ !! రామాయణకు ఈ ప్రముఖ విశ్లేషకుడి అసాధారణ రేటింగ్ !!
  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions