Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!

November 3, 2026 by M S R

.

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ రప్పించి… ఆ క్రీడపై యువతలో అమితాసక్తిని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి … ఈసారి కర్రసాముకు ప్రాచుర్యం తీసుకురావాలని నిర్ణయించాడు… అందాల పోటీలు సహా ప్రతి నేషనల్, గ్లోబల్ ఈవెంటులోనూ తెలంగాణతనాన్ని జొప్పించి, గౌరవించడం తనకు అలవాటు కదా… ఈసారి తెలంగాణ మార్షల్ ఆర్ట్ కర్రసామును ఖేలో ఇండియాలో చేర్చి, జాతీయ గుర్తింపు దిశగా ఓ ముందడుగు వేస్తున్నాడు…

ఒకప్పుడు పల్లెల్లో పండుగలు, జాతరలు, ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించే కర్రసాము ఇక జాతీయ స్థాయి క్రీడా వేదికపైకి ఎక్కబోతోంది..? తెలంగాణకు ప్రత్యేకమైన ఈ సంప్రదాయ యుద్ధవిద్యకు ఖేలో ఇండియా క్రీడల్లో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది… ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యగా, శారీరక దృఢత్వాన్ని పెంచే సాధనగా, ఒకప్పుడు గ్రామీణ యువతలో ప్రాచుర్యం పొందిన కర్రసాముకు ఆధునిక క్రీడా ప్రపంచంలోనూ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు…

Ads

కర్రసాము అనగానే చేతిలో ఓ కర్ర పట్టుకుని చేసే విన్యాసాలు మాత్రమే గుర్తుకు వస్తాయి… కానీ దాని వెనుక క్రమశిక్షణ, వేగం, సమయస్ఫూర్తి, శరీర సమన్వయం, ప్రత్యర్థి కదలికలను పసిగట్టే నైపుణ్యం ఉంటాయి… కర్రను ఆయుధంగా ఉపయోగిస్తూ దాడిని ఎదుర్కోవడం, తప్పించుకోవడం, ప్రతిదాడి చేయడం ఇందులోని ప్రధాన అంశాలు… ఇద్దరు ఎదురెదురుగా నిలబడి చేసే పోరాట విన్యాసాలతో పాటు, సమూహ ప్రదర్శనలు, వివిధ రకాల కర్రలతో చేసే విన్యాసాలు కూడా ఈ విద్యలో భాగం… ప్రాంతాన్ని బట్టి పద్ధతులు, శిక్షణలో తేడాలు ఉండవచ్చు…

ఖేలో ఇండియాలో కర్రసాము… తెలంగాణ సంప్రదాయ యుద్ధకళకు జాతీయ వేదిక! కర్రసాము ప్రదర్శనల్లో కేవలం కర్రలను తిప్పడమే ఉండదు. ప్రత్యర్థి దాడిని అడ్డుకోవడం, వేగంగా పక్కకు తప్పుకోవడం, కర్రను తిప్పుతూ ప్రతిదాడి చేయడం వంటి ఎన్నో మెళకువలు ఉంటాయి… చేతి వేగం, కంటి చూపు, శరీర సమతుల్యత, ఏకాగ్రత అన్నీ కలిస్తేనే ఇందులో రాణించడం సాధ్యమవుతుంది…

తెలంగాణలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ విద్యకు మంచి ఆదరణ ఉండేది… పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల్లో కర్రసాము ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి… వినోదంతో పాటు యుద్ధవిద్యగా, ఆత్మరక్షణ సాధనంగా దీనికి గుర్తింపు ఉండేది… అయితే కాలక్రమంలో ఆధునిక క్రీడలు, ఇతర వినోద కార్యక్రమాల ప్రభావంతో ఆదరణ తగ్గింది… ఇప్పుడు కొందరు శిక్షకులు, కళాకారులు తిరిగి ఈ సంప్రదాయాన్ని యువతకు పరిచయం చేస్తున్నారు… హైదరాబాద్‌లోనూ కర్రసాము శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి… ఈ విద్యపై పరిశోధనలు కూడా జరిగాయి…

ఇలాంటి సంప్రదాయ యుద్ధకళకు ఖేలో ఇండియా వంటి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో చోటు దక్కితే దాని ప్రాచుర్యం మరింత పెరిగే అవకాశం ఉంది… అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది… ఆతిథ్య రాష్ట్రం కోటాలో కర్రసామును ఒక ప్రదర్శన క్రీడగా చేర్చే అవకాశాన్ని పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించాడు… ఈ చేర్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది…

తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా… ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది… దేశవ్యాప్తంగా ఆరువేల మందికి పైగా యువ క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది ఈ పోటీలకు హాజరుకానున్నారు… మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి… హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి…

karra saamu

క్రీడల నిర్వహణ అంటే కొన్ని రోజుల పాటు పోటీలు జరిపి, విజేతలకు పతకాలు అందించి ముగించడం మాత్రమే కాదు… దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది యువ క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలి… ప్రతి క్రీడకు తగిన ప్రమాణాలతో మైదానాలు, ఇండోర్ స్టేడియాలు, అవసరమైన పరికరాలు సిద్ధం చేయాలి… పోటీలు ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేలా సాంకేతిక ఏర్పాట్లు చేయాలి… ఇంత పెద్ద ఈవెంట్‌ను ఆరు నగరాల్లో నిర్వహించడం రాష్ట్ర యంత్రాంగానికి ఒక పెద్ద బాధ్యతే…

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు… క్రీడలకూ ఉపయోగం… ఈసారి ఖేలో ఇండియా నిర్వహణలో మరో ప్రత్యేకత కూడా ఉంది. డిసెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది… ఆ సమ్మిట్ కోసం సిద్ధం చేస్తున్న మౌలిక సదుపాయాలను ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు కూడా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించాడు…

తెలంగాణను జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను ప్రభుత్వం ఒక అవకాశంగా భావిస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • ఒకప్పుడు మద్యం మాఫియా అడ్డా… ఇప్పుడు కేసినోల జూదనగరి!
  • పోలీసు ఉద్యోగం చేస్తోంది… కానీ పోలీసులా బతకడం లేదు… మరెలా..?
  • విలన్లందరూ మంచోళ్లేనట..! మీరెక్కడ తయారయ్యారురా బాబూ..!!
  • ఇదీ సుగర్ వ్యాధిని తరిమికొట్టే దిశలో నిజమైన ముందడుగు!!
  • త్రివిక్రమ్..! ఏమాత్రం ‘గురూజీ కాదిక… ఓ సాదాసీదా దర్శకుడు మాత్రమే!’
  • ఈ బాలీవుడ్ హాస్యబ్రహ్మ- ఇక రిటైరయిపోతాడుట- ఆ నవ్వులకు ఇక ‘తెర’…
  • అరబ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు- ఇజ్రాయిల్‌కు ఆత్మహత్యా సదృశం
  • సినిమా రక్త చరిత్ర… రాప్తాడు రంపం వెనుక దాగున్న ‘విషం’…
  • నో, నో… *కొత్త బొద్దింకలు- మోదీ సర్కారు’పై కథనం కానేకాదు ఇది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions