Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం విశ్వక్‌సేన్ ! కల్ట్ కాదు… ఇది ఓ పే-ద్ద కన్‌ఫ్యూజన్ !!

November 3, 2026 by M S R

.

సినిమా అంటే ప్రయోగాలు చేయాలి. కొత్త జానర్లను పరిచయం చేయాలి. మూస కథలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రయోగం పేరుతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే మాత్రం కుదరదు. పైగా ఆ ప్రయోగం మీద విపరీతమైన నమ్మకంతో, సంచలన ప్రకటనలతో సినిమాను మార్కెట్‌లోకి తీసుకొస్తే అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘కల్ట్’ విషయంలో జరిగింది ఇదే!

ఇండియాలోనే తొలి స్లాషర్ థ్రిల్లర్ అంటూ విశ్వక్ చేసిన ప్రచారం ఒక ఎత్తయితే, సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. తీరా తెర మీద చూస్తే స్లాషర్ థ్రిల్లర్ సంగతి పక్కన పెడితే, అసలు ఇది ఏ తరహా సినిమా? ఎవరిని ఆకట్టుకోవాలనుకుంటోంది? ఏ అనుభూతిని ఇవ్వాలనుకుంటోంది? అన్న ప్రశ్నలే మిగులుతాయి.

Ads

కథ కంటే నరుకుడే ఎక్కువ! హోంమంత్రి కొడుకు ఎల్విన్ తన పుట్టినరోజు వేడుకలను గోవాలోని ‘కల్ట్’ నైట్‌క్లబ్‌లో జరుపుకుంటాడు. పార్టీ మొదలైన కాసేపటికే క్లబ్ బయట ఆర్‌డీఎక్స్ బాంబులు పెట్టారన్న సమాచారం వస్తుంది. లోపలున్నవాళ్లు బయటికి వెళ్లలేని పరిస్థితి. అదే సమయంలో క్లబ్‌లో ఒక్కొక్కరుగా హత్యలకు గురవుతుంటారు. అక్కడే ఉన్న డీఎస్పీ సంకల్ప్ (విశ్వక్ సేన్) హంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బయటపడే విషయాలు, హత్యల వెనుక అసలు కారణాలు కథకు ఆధారం.

కథగా చూస్తే ఇందులో థ్రిల్లర్‌కు కావాల్సిన సరంజామా ఉంది. ఒకే ప్రదేశంలో చిక్కుకుపోయిన మనుషులు, బయటకు వెళ్లే మార్గం లేదు, లోపల ప్రాణాలు తీస్తున్న ఓ హంతకుడు… ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అనుమానించాలి? తర్వాతి హత్య ఎప్పుడు జరుగుతుంది? ఎవరు బతుకుతారు? అనే ఉత్కంఠను సృష్టించవచ్చు. కానీ ‘కల్ట్’లో ఆ ఉత్కంఠ కంటే రక్తపాతం, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.

స్లాషర్ థ్రిల్లర్ అంటే కేవలం కత్తులు, గొడ్డళ్లు, రక్తపాతం కాదు. హింస వెనుక ఓ కారణం ఉండాలి. పాత్రల్లో భయం కనిపించాలి. ప్రతి హత్య తర్వాత కథలో ఏదో మార్పు రావాలి. ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ కలగాలి. ఇక్కడ మాత్రం హత్యలు జరుగుతుంటాయి. మనుషులు నరుక్కుంటూ ఉంటారు. కానీ ప్రేక్షకుడిలో భయం కంటే విసుగు ఎక్కువవుతుంది.

తనకు తానే హీరో.. తనకు తానే దర్శకుడు! ఈ సినిమాకు అసలు సమస్య విశ్వక్ సేన్ పాత్రలోనే కాదు, అతడి మొత్తం ఆలోచనలో కనిపిస్తుంది. హీరోగా తాను ఎలా కనిపించాలనుకున్నాడో, దర్శకుడిగా ఎలాంటి సినిమా తీయాలనుకున్నాడో ఈ రెండింటి మధ్య కనీస సమన్వయం కనిపించదు. డీఎస్పీ సంకల్ప్ అనే పోలీసు అధికారి పాత్రకు ఉండాల్సిన అథారిటీ, ఇంపాక్ట్ తెర మీద కనిపించవు. పైగా పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నా హీరో ప్రవర్తనలో ఆ తీవ్రత కనిపించదు.

ఒకవైపు క్లబ్‌లో మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు హీరో ప్రవర్తన మాత్రం సందర్భానికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తనను చావగొడుతుంటే భయపడాల్సిన చోట ఆనందించడం, తిరిగి దాడి చేస్తే ఎదుటివాళ్లు కంగారు పడటం… కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఒక షాట్ ఎక్కడ వేయాలో తెలియక మరొక చోట వేసినట్టుగా అనిపిస్తుంది.

దర్శకుడిగా విశ్వక్ పాత్రల మానసిక స్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఒక పబ్‌లో ఇరుక్కుపోయి, కళ్లముందే స్నేహితులు, పరిచయస్తులు హత్యలకు గురవుతుంటే అక్కడున్నవాళ్లలో ఎలాంటి భయం, ఆందోళన ఉండాలి? ఆ వాతావరణాన్ని ప్రేక్షకుడికి అనుభూతి చేయించాలి కదా! కానీ తెర మీద జరుగుతున్నదంతా ఏదో వీడియో గేమ్‌లో హింసాత్మక సన్నివేశాలు చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.

cult

రైటింగ్‌లోనే అసలు విలన్! సినిమాకు ప్రధానమైన బలహీనత రచన. గంటన్నరలో చెప్పగలిగే కథను రెండున్నర గంటలకు సాగదీయడంతో ఫస్టాఫ్ బాగా భారంగా మారింది. పార్టీ సీన్లు, హైదరాబాద్ నుంచి గోవాకు వచ్చిన ముగ్గురు యువకుల కామెడీతో చాలాసేపు గడిచిపోతుంది. అవి కూడా పెద్దగా నవ్వించవు. హీరో ఎంట్రీనే ఇంటర్వెల్‌కు కాస్త ముందు రావడంతో అప్పటివరకు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష తప్పదు.

ఇక హంతకుడు ఎవరో ముందే ఊహించగలగడం, ఫ్లాష్‌బ్యాక్‌లో బలం లేకపోవడం థ్రిల్లర్‌కు ఉండాల్సిన ప్రధాన ఆకర్షణను దెబ్బతీశాయి. బయటకు వెళ్లకుండా గేటు దగ్గర బాంబులు, ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, ల్యాండ్‌లైన్‌లో ఇన్‌కమింగ్ మాత్రమే ఉండటం వంటి అడ్డంకులు సృష్టించారు. హోంమంత్రి తన కొడుకు డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటకు రాకూడదని తాపత్రయపడటం మరో అంశం. కథను ఒకే ప్రదేశానికి పరిమితం చేయడానికి దర్శకుడు వేసిన ఎత్తుగడలు బాగానే ఉన్నాయి. కానీ వాటన్నింటినీ చివరికి నమ్మించేలా ముడిపెట్టడంలో విఫలమయ్యాడు.

క్లైమాక్స్‌లో ఎస్పీజీ కమాండోలు చుట్టూ తుపాకులు గురిపెట్టి నిలబడతారు. కానీ లోపల ఎంత హింస జరుగుతున్నా ఒక్కరూ కాల్పులు జరపరు. ఇలాంటి సన్నివేశాలు థ్రిల్లర్‌లో ఉత్కంఠను పెంచకపోగా, దర్శకుడి అవగాహన మీదే సందేహాలు కలిగిస్తాయి.

ఇక తరుణ్ భాస్కర్ నుంచి ఇంత బలహీనమైన సంభాషణలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైతే పాత్రలకు సహజత్వం వచ్చినట్టా? ఒక దశ దాటాక అవే విసుగు తెప్పిస్తాయి.

సాంకేతికంగా ఒక్కటే ఊరట! రవి బస్రూర్ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు కొంత బలాన్నిచ్చింది. పార్టీ వాతావరణానికి తగ్గట్టుగా, హింసాత్మక సన్నివేశాలకు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించినా ప్రత్యేకంగా చెప్పుకునేంతగా లేదు. యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం క్రూరమైన హత్యలు, రక్తపాతం చుట్టూనే తిరుగుతుంది.

గాయత్రి భరద్వాజ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. తారక్ పొన్నప్ప రాజకీయ నాయకుడి చెడిపోయిన కొడుకుగా రొటీన్‌గా కనిపించాడు. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్‌లకు కూడా కొత్తగా చేసేదేమీ దక్కలేదు. క్లైమాక్స్‌కు ముందు కీలక పాత్రలో కనిపించే చేపూరి వివేక్ మాత్రం తనకు దక్కిన కొద్ది సన్నివేశాల్లో మెప్పించాడు. ముఖ్యంగా పిచ్చివాడిలా ప్రవర్తించే స్థితి నుంచి సాధారణ స్థితికి వచ్చే సన్నివేశాల్లో నటనతో ఆకట్టుకున్నాడు.

కల్ట్ కాదు.. కన్ఫ్యూజన్! ఒక సినిమా తీసేటప్పుడు దర్శకుడికి తనదైన విజన్ ఉండొచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారన్న దానికంటే తాను చెప్పాలనుకున్నది చెప్పడమే ముఖ్యమని భావించవచ్చు. కానీ ఆ విజన్ తెర మీదకు వచ్చేటప్పుడు దానికి ఓ రూపం, ఓ క్రమం, ఓ భావోద్వేగం ఉండాలి. లేకపోతే అది ప్రయోగం కాదు.. ప్రయోగం పేరుతో చేసిన గందరగోళం మాత్రమే.

విశ్వక్ సేన్ ఈ సినిమాతో కొత్త జానర్‌ను పరిచయం చేయాలనుకున్నాడా? హింసాత్మకమైన కథతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడా? లేక ప్రేక్షకులు ఇంతవరకు చూడని విధంగా ఏదో చేయాలనుకున్నాడా? ఏది చేసినా దానికి తగ్గట్టుగా కథ, పాత్రలు, సంభాషణలు, ఎడిటింగ్‌పై శ్రద్ధ పెట్టాల్సింది. కానీ ఇక్కడ అవన్నీ వెనుకబడిపోయాయి.

చివర్లో ‘కల్ట్ యూనివర్స్’ అంటూ మరో సినిమాకు హింట్ ఇచ్చాడు. ముందు ఈ కథకు ఓ సరైన ముగింపు ఇవ్వగలిగితే బాగుండేది. యూనివర్స్ నిర్మించాలంటే ముందుగా అందులోని సినిమా నిలబడాలి కదా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లేడీ డాన్లు- ఆధిపత్య పోరాటాలు … యథేచ్ఛగా బూతులు- హింస
  • పాపం విశ్వక్‌సేన్ ! కల్ట్ కాదు… ఇది ఓ పే-ద్ద కన్‌ఫ్యూజన్ !!
  • హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…
  • ఈ రామాయణంలో బాల రావణుడు కూడా ఉన్నాడండోయ్ !!
  • రేవంత్ రెడ్డిపై BRS, BJP ఉమ్మడి పోరాటం – అమిత్ షా రాక వెనుక !?
  • ఈ ముఖ్యమంత్రి గారి రెండో పెళ్లి వెనుక చాలా పెద్ద కథే ఉంది…!!
  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • ఒకప్పుడు మద్యం మాఫియా అడ్డా… ఇప్పుడు కేసినోల జూదనగరి!
  • పోలీసు ఉద్యోగం చేస్తోంది… కానీ పోలీసులా బతకడం లేదు… మరెలా..?
  • విలన్లందరూ మంచోళ్లేనట..! మీరెక్కడ తయారయ్యారురా బాబూ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions