.
భారతం కథల్లో ఆసక్తికరమైంది ప్రమీలార్జునీయం… ప్రమీల రాజ్యం మహిళలది… సైన్యం, పాలన అన్నీ వాళ్లే… చివరకు అర్జునుడిని కూడా అడ్డుకుని పోరాడుతుంది ఆమె, యాగాశ్వాన్ని బంధించి… యశ్‌రాజ్ ఫిలిమ్స్ వాళ్లు తీసిన, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న అక్క అనే వెబ్ సీరీస్ చూడగానే అదే గుర్తొచ్చింది… అంతేకాదు… ముంబై రెడ్ లైట్ ఏరియాను పాలించిన గంగూభాయ్ కూడా గుర్తొచ్చింది… ఎందుకంటే..?
గ్యాంగ్‌స్టర్ కథలంటే ఇప్పటివరకు మనకు గుర్తొచ్చేది మాఫియా డాన్లు, వారి అనుచరులు, ఆధిపత్య పోరాటాలు, పగలు, ప్రతీకారాలు… కానీ ఓ ప్రాంతంలో పురుషుల ప్రాబల్యానికి తావులేకుండా, మహిళలే అక్రమ వ్యాపారాలను శాసిస్తూ, ఓ క్రిమినల్ సామ్రాజ్యాన్ని నడిపిస్తే? ఆ ఆలోచనతో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామానే ‘అక్క’… కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారులు…
Ads
కథేమిటంటే… కథ 80వ దశకంలో సాగుతుంది… మాలేమార్ అనే ప్రాంతంలో మాతృస్వామ్య వ్యవస్థ అమలులో ఉంటుంది… అక్కడి అక్రమ వ్యాపారాలు, మద్యం దందాలు, అధికార వ్యవహారాలన్నీ మహిళా నాయకురాలి కనుసన్నల్లోనే సాగుతుంటాయి… ఆ సామ్రాజ్యానికి అధిపతి భవానీ (కీర్తి సురేష్)… ఆమెను అక్కడి ప్రజలు ‘అక్క’ అని గౌరవంగా పిలుస్తుంటారు…
భవానీ మాటే అక్కడ శాసనం… అలాంటి సామ్రాజ్యంపై ముంబై గ్యాంగ్‌స్టర్ రుద్ర (రాధికా ఆప్టే) కన్ను పడుతుంది… ఎలాగైనా ఆ ప్రాంతంపై పట్టు సాధించాలని, భవానీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని పథకాలు వేస్తుంది… దీంతో ఇద్దరు మహిళల మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది… ఈ పోరులో ఎవరు పైచేయి సాధించారు? భవానీ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుందా? అన్నది మిగతా కథ…

కొత్త ఆలోచన.. పాత కథనం! ‘అక్క’లో అన్నింటికంటే ఆసక్తి కలిగించే అంశం దాని నేపథ్యం… సాధారణంగా గ్యాంగ్‌స్టర్ కథల్లో పురుషులదే ప్రధాన పాత్ర… కానీ ఇక్కడ మహిళలే గ్యాంగ్స్టర్లు, మహిళలదే సామ్రాజ్యం, వారిదే అధికారం… ఈ సెటప్‌ను పరిచయం చేసిన తీరు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది… తొలి ఎపిసోడ్‌లోనే మాలేమార్ ప్రపంచాన్ని, అక్కడి వింతైన వ్యవస్థను పరిచయం చేయడంతో కథపై ఓ అంచనాకు వస్తాం… 80ల నాటి వాతావరణం, తీర ప్రాంతపు జీవనశైలి, అప్పటి పరిస్థితులను తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది… ఆర్ట్ డైరెక్షన్, కెమెరా పనితనం ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి…
కీర్తి సురేష్ భవానీ పాత్రలో గాంభీర్యాన్ని, ఓ రకమైన రాజసాన్ని ప్రదర్శించింది… ఓ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండాల్సిన అధికార దర్పం ఆమె నటనలో కనిపిస్తాయి… ఆమెతో పోలిస్తే రాధికా ఆప్టే రుద్రగా తేలిపోయింది… క్రూరత్వం, తెగువ, ప్రత్యర్థిని లెక్కచేయని మనస్తత్వం.. ఇలా పాత్రకు అవసరమైన లక్షణాలను చక్కగా ప్రదర్శించి ఉంటే కీర్తికి దీటుగా నిలబడేది…. వీరిద్దరి మధ్య సాగే ఆధిపత్య పోరే ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ కాబట్టి….
అయితే, ఇంత మంచి నేపథ్యం ఉన్నప్పుడు కథనం కూడా అదే స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉండాలి కదా! ఇక్కడే ‘అక్క’ కొంత నిరాశపరుస్తుంది… కొత్తగా కనిపించిన మాతృస్వామ్య గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యం క్రమంగా పాత గ్యాంగ్‌స్టర్ కథల దారిలోనే పయనిస్తుంది… కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, ఆధిపత్య పోరాటాలు.. అన్నీ ఉన్నా వాటిలో ఆశించినంత బలం కనిపించదు… కొన్ని మలుపులు ముందే ఊహించగలిగేలా ఉంటాయి… పాత్రల మధ్య సంఘర్షణను మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నా, స్క్రీన్‌ప్లే ఆ స్థాయిలో సాగలేదు… కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు, అందులో ప్రేక్షకులను ఎక్కువసేపు కట్టిపడేసే కథనాన్ని మాత్రం అందించలేకపోయాడు…
హింసకు హద్దుల్లేవు.. బూతులకూ మొహమాటం లేదు! ఓటీటీల్లో ఇదో దరిద్రం! కథలో సందర్భం ఉన్నా లేకపోయినా బూతులు దట్టించేయడం, క్రూరత్వాన్ని చూపించడంలో హద్దులు చెరిపేయడం ఈ మధ్య చాలా సిరీస్‌లలో సాధారణమైపోయింది. ‘అక్క’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. రక్తపాతం, క్రూరమైన హత్యలు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు అడుగడుగునా కనిపిస్తాయి. పాత్రల మధ్య సంభాషణల్లోనూ బూతులు, ఘాటైన పదప్రయోగాలకు కొదవలేదు.
80ల నాటి గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోని క్రూరత్వాన్ని చూపించాలనే ఉద్దేశం అర్థమవుతున్నా, కొన్ని సందర్భాల్లో హింస మరీ అతిగా అనిపిస్తుంది. కథలోని భావోద్వేగాల కంటే రక్తపాతానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుంటుంది. పైగా బూతులు కూడా కథలో సహజంగా భాగమైనట్టు కాకుండా, అడల్ట్ కంటెంట్ ముద్ర వేయడానికే వాడినట్టుగా అనిపించే సందర్భాలున్నాయి.
కుటుంబంతో కలిసి, ముఖ్యంగా పిల్లలతో చూడటం అసాధ్యం. హింస, బూతుల విషయంలో అభ్యంతరాలు ఉన్నవారు ఈ సిరీస్‌కు దూరంగా ఉండటమే మంచిది.
Share this Article