.
సాయిపల్లవి, రకుల్ మాత్రమే కాదు… యశ్ ఇంటర్వ్యూలు కూడా రాబోయే రామాయణ సినిమాలోని ప్రధాన పాత్రల కేరక్టరైజేషన్ మీద అంతులేని గందరగోళాన్ని వ్యక్తం చేస్తున్నాయి… అప్పటి ఆదిపురుష్ అజ్ఙానంతో నిర్మితమైతే, ఇదేమో పది తలల వికట ప్రయోగాల్ని తలపిస్తోంది… ముందుగా యశ్ ఓ రీసెంట్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఏమన్నాడో చదవండి…
- ‘‘రావణుడి పది తలలను కేవలం రూపానికి పరిమితం చేయకూడదు… మనిషిలో బలం, బలహీనత, సందేహం, అతివిశ్వాసం వంటి విభిన్న భావాలు ఉంటాయి… వాటినే పది వ్యక్తిత్వాలుగా చూపించాలనుకున్నాం… ప్రతి వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గొంతు, హావభావాలు ఉండాలని నిర్ణయించుకున్నాం…
Ads
- కొన్ని వ్యక్తిత్వాలకు గతంలో చూసిన పాత్రల నుంచి ప్రేరణ తీసుకున్నాం… మరికొన్నింటిని ఊహలతో రూపొందించాం… ఈ విషయంలో నితీష్ తివారీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు… అయితే సాంకేతికంగా పెద్ద సమస్యలను ఎదుర్కొన్నాం… ఇది మేకప్ ఆర్టిస్ట్ ప్రశాంత్ సహకారంతోనే సాధ్యం అయింది… ఒక్కో సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఏడు రోజులు పట్టింది…’
మామూలుగా మనం అర్థం చేసుకునే పది తలల థియరీ ఏమిటి..? సగటు మనిషికన్నా పదింతల మేథస్సు ఉన్నవాడని… అఫ్కోర్స్, తన పిచ్చి నిర్ణయాలను ఆ పది తలల తెలివీ ఆపలేకపోయింది, అది వేరే కథ… ఐతే ఈ సినిమాలో ప్రతి తలకూ వేర్వేరు వ్యక్తిత్వాలు అనేది పెద్ద గందరగోళానికి దారితీస్తుంది… సరే, వాటిని ఎలా చూపారనేది సినిమా రిలీజయ్యాక చూద్దాం గానీ… పది తలలకు ఓ పది ప్రశ్నలు మనల్ని వేధిస్తాయి… ఇలా…

పది తలలు.. పది వ్యక్తిత్వాలు! అంతిమ నిర్ణయం ఏ తల తీసుకుంటుంది?
నిజంగానే పది తలలు అంటే పది మెదళ్లా? పది రకాల వ్యక్తిత్వాలా? పది స్వతంత్ర ఆలోచనా విధానాలా? ఈ ప్రశ్నలు వేసుకుంటే ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది…
ప్రతి తలకూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక తల యుద్ధం చేయాలని నిర్ణయిస్తే, మరో తల శాంతి చర్చలు జరపాలని సూచించవచ్చా? ఒక తల సీతను అపహరించడం తప్పని చెబితే, ఇంకో తల దాన్ని సమర్థించవచ్చా?
అసలు అంతిమ నిర్ణయం ఏ తల తీసుకుంటుంది? పది తలలూ తమలోతాము చర్చించుకుంటాయా? ఏకాభిప్రాయానికి వస్తేనే నిర్ణయం అమలు చేస్తాయా? లేక మెజారిటీ అభిప్రాయమే అంతిమ నిర్ణయమా? పది తలల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే రావణుడు ఎవరికి ప్రాధాన్యం ఇస్తాడు?
ఇలా ఆలోచిస్తే పది తలలకూ పది వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నాయనే భావన కొంత అసంబద్ధంగా కనిపిస్తుంది… పది తలలు ఉన్నాయంటే పది స్వతంత్ర మనుషులు ఉన్నట్లు కాదు కదా! ఒకే వ్యక్తికి పది రెట్లు మేధస్సు, జ్ఞానం, ఆలోచనా సామర్థ్యం ఉన్నాయని భావించడం మరింత తార్కికంగా ఉంటుంది…
పది తలలు అంటే పది కోణాల్లో ఆలోచించగలగడం, ఒక సమస్యను పది రకాలుగా విశ్లేషించగలగడం, సాధారణ వ్యక్తి కంటే విస్తృతమైన మేధోపరిధి కలిగి ఉండటం అనే ప్రతీకాత్మక అర్థం తీసుకోవచ్చు… పది తలలూ ఒకే వ్యక్తికి చెందినవే కాబట్టి ఆలోచనలు- కోణాలు వేర్వేరుగా ఉన్నా, నిర్ణయం తీసుకునే చైతన్యం ఒక్కటే కావాలి…
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది… ఇంతటి మేధస్సు, జ్ఞానం ఉన్న రావణుడు చివరకు తన అహంకారం, మూర్ఖత్వం కారణంగానే పతనమయ్యాడు… అంటే పది తలలుండటం, అపారమైన జ్ఞానం ఉండటం వేరు… ఆ జ్ఞానాన్ని సరైన నిర్ణయాల కోసం ఉపయోగించుకోవడం వేరు…
పది తలలు పది రెట్ల మేధస్సుకు ప్రతీకలైతే… ఆ పది రెట్ల మేధస్సు ఉన్న రావణుడు ఒక్క తప్పు నిర్ణయంతో ఎందుకు పతనమయ్యాడు..? జ్ఞానం ఎక్కువగా ఉండటం గొప్పా? ఆ జ్ఞానాన్ని నియంత్రించే వివేకం ఉండటం గొప్పా? మరి పది వేర్వేరు వ్యక్తిత్వాలు ఎలా చూపిస్తారు..? దేహాన్ని, దాని చర్యలను ఏ తల శాసిస్తుంది..?
ఈ ప్రయోగం వికటిస్తే... ఎవడికీ అర్థం గాకపోతే... అర్థమయ్యేలా చూపించకపోతే... సగటు ప్రేక్షకుడు మాత్రం పదింతల వెర్రితనం అని ఛీత్కరించే ప్రమాదం ఉంది..!!
Share this Article