Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ

November 4, 2026 by M S R

.

అమెరికా ఎన్నికలంటే అధ్యక్ష ఎన్నికలే గుర్తుకొస్తాయి. ట్రంప్ గెలిచాడా? బైడెన్ గెలిచాడా? ఎవరు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు? ప్రపంచమంతా ఆసక్తిగా చూసేది ఈ ఎన్నికలనే. కానీ అమెరికాలో అంతకంటే మరో కీలకమైన ఎన్నికల ప్రక్రియ ఉంది. అదే మిడ్‌టర్మ్ ఎన్నికలు.

ఇవి అధ్యక్షుడిని ఎన్నుకోకపోయినా, అధ్యక్షుడి అధికారాలకు కళ్లెం వేయగల శక్తి ఈ ఎన్నికలకు ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచం చూపు అమెరికా వైపు మళ్లింది. ఇప్పుడు అమెరికాలో ఇదే మిడ్ టరమ్ పొలిటికల్ హీట్ నడుస్తోంది… పోలింగ్ దాదాపు పూర్తి అయినట్టే…

Ads

రెండేళ్లకోసారి ఎన్నికలు… అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికలు ప్రతి రెండేళ్లకోసారి జరుగుతాయి. తేదీ విషయంలోనూ ఒక ప్రత్యేకత ఉంది. నవంబర్‌లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే ఫెడరల్ ఎన్నికల రోజు. ఏ సంవత్సరం వచ్చినా ఇదే పద్ధతి. అధ్యక్ష ఎన్నికలు మాత్రం నాలుగేళ్లకోసారి జరుగుతాయి. అంటే అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత వచ్చే కాంగ్రెస్ ఎన్నికలనే మిడ్‌టెర్మ్ ఎన్నికలు అంటారు. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలుగా పిలుస్తారు.

అమెరికా పార్లమెంటు వ్యవస్థలో రెండు సభలుంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (దిగువ సభ), సెనేట్ (ఎగువ సభ). ఈ రెండింటినీ కలిపి కాంగ్రెస్ అంటారు. హౌస్‌లో మొత్తం 435 స్థానాలుంటాయి. సభ్యుల పదవీకాలం రెండేళ్లే. అందుకే ప్రతి రెండేళ్లకోసారి మొత్తం 435 స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయి.

సెనేట్‌లో 100 మంది సభ్యులుంటారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున ఎన్నికవుతారు. వీరి పదవీకాలం ఆరేళ్లు. అందువల్ల ప్రతి రెండేళ్లకోసారి సుమారు మూడో వంతు స్థానాలకే ఎన్నికలు జరుగుతాయి. ఈసారి 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ట్రంప్‌కు ఈ ఎన్నికలు ఎందుకు కీలకం? అమెరికా అధ్యక్షుడికి చాలా అధికారాలున్నాయి. అయినప్పటికీ ఆయన ఏది అనుకుంటే అది చేసేయడానికి వీల్లేదు. చట్టాలు చేయాలన్నా, బడ్జెట్ ఆమోదం పొందాలన్నా కాంగ్రెస్ సహకారం అవసరం. ముఖ్యంగా హౌస్, సెనేట్ రెండింటిలోనూ తన పార్టీకి మెజారిటీ ఉంటే అధ్యక్షుడికి పాలన సులభమవుతుంది. అదే ప్రతిపక్షం మెజారిటీ సాధిస్తే పరిస్థితి మారిపోతుంది.

ప్రస్తుతం ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ మద్దతు ఉంది. కానీ ఈ మిడ్‌టెర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు హౌస్‌లో మెజారిటీ సాధిస్తే ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. ఆయన ప్రతిపాదించే బిల్లులను అడ్డుకోవచ్చు. ప్రభుత్వ ఖర్చులు, బడ్జెట్ వ్యవహారాల్లో ఇబ్బందులు సృష్టించవచ్చు. ట్రంప్ పాలనపై విచారణలు చేపట్టవచ్చు. ఆయన ప్రభుత్వంలోని అధికారులను కాంగ్రెస్ ముందుకు పిలిచి ప్రశ్నించవచ్చు. అవసరమైతే పత్రాలు, సాక్ష్యాలు కూడా కోరవచ్చు.

us senate

సెనేట్‌లోనూ డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ట్రంప్‌కు మరింత ఇబ్బంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కీలక ప్రభుత్వ పదవులకు అధ్యక్షుడు ప్రతిపాదించే నియామకాలను సెనేట్ ఆమోదించాలి. అక్కడ ప్రతిపక్షానికి ఆధిక్యం వస్తే అలాంటి నియామకాలకూ అడ్డంకులు ఎదురవుతాయి.

అంటే ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. కానీ ఆయన అనుకున్న ప్రతి పనీ అనుకున్నట్టు చేసుకునే పరిస్థితి ఉండదు. మిగిలిన రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ నుంచి నిరంతరం ప్రతిఘటన ఎదురుకావచ్చు. ఇదే మిడ్‌టెర్మ్ ఎన్నికల అసలు ప్రభావం. ట్రంపు నిర్ణయాలతో భారతీయ వలసదార్లు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సగటు ఇండియన్‌కూ ఈ ఎన్నికల మీద దృష్టి ఉంది…

ఇంపీచ్ చేయొచ్చు కదా..? ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్‌ను పదవి నుంచి తొలగించవచ్చని కొందరు భావించవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇంపీచ్‌మెంట్ అంటే అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడం కాదు. ఆయనపై అధికారికంగా నేరారోపణ చేయడం మాత్రమే.

ఈ ప్రక్రియలో మొదట హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అధ్యక్షుడిపై రాజ్యాంగపరమైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడు అధ్యక్షుడు ఇంపీచ్ అయినట్టవుతుంది. గతంలో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో రెండుసార్లు ఇంపీచ్ అయ్యాడు. అయితే రెండు సందర్భాల్లోనూ సెనేట్‌లో నిర్దోషిగా బయటపడ్డాడు.

హౌస్ ఆమోదించిన అభిశంసన తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అక్కడ న్యాయస్థానంలో విచారణ జరిగినట్టుగా ఇంపీచ్‌మెంట్ ట్రయల్ నిర్వహిస్తారు. అధ్యక్షుడి విషయంలో ఈ విచారణకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. హౌస్ తరఫున ప్రతినిధులు నేరారోపణలను వివరిస్తే, అధ్యక్షుడి తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు.

చివరగా సెనేట్‌లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది దోషిగా తేల్చి ఓటు వేస్తేనే అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. (మన దేశంలోనూ ఎలక్షన్ కమిషనర్లు, న్యాయమూర్తుల అభిశంసన తీరు దాదాపు ఇదే)… కేవలం సాధారణ మెజారిటీ సరిపోదు. అందుకే హౌస్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించినా, సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం దాదాపు అసాధ్యం. అంతేకాదు, ఇంపీచ్‌మెంట్ తీర్మానం ఆమోదం పొందడం మాత్రమే పదవీ తొలగింపునకు హామీ కాదు.

ట్రంప్‌కు గట్టి హెచ్చరికేనా? ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు హౌస్‌తోపాటు సెనేట్‌లోనూ మెజారిటీ సాధిస్తే ట్రంప్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఆయన నిర్ణయాలపై విచారణలు, ప్రభుత్వ విధానాలపై ప్రతిఘటన, కీలక బిల్లులకు అడ్డంకులు ఎదురవుతాయి. అయితే అధ్యక్షుడిగా ఆయన అధికారాలు మాత్రం వెంటనే రద్దుకావు. పదవి నుంచి తొలగించడమూ అంత సులభం కాదు.

అందుకే ఈ ఎన్నికలను ట్రంప్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలుగా చూడకూడదు. ఆయన పాలనకు ప్రజలు ఇస్తున్న మధ్యంతర తీర్పుగా (రెఫరెండమ్?) చూడాలి. మరో రెండేళ్లపాటు ఆయన ఎంత స్వేచ్ఛగా పాలించగలడు? కాంగ్రెస్ ఎంతవరకు అడ్డుకట్ట వేయగలదు? అమెరికా రాజకీయాల్లో అధికార సమతూకం ఎవరి వైపు మారుతుంది? ఈ ప్రశ్నలకు ఈ ఎన్నికలు సమాధానం చెప్పబోతున్నాయి.

అధ్యక్షుడిని మార్చలేకపోయినా.. అధ్యక్షుడి దూకుడును తగ్గించగలవు. ఇదే మిడ్‌టెర్మ్ ఎన్నికల అసలు ఇంపాక్ట్!



1. ప్రతినిధుల సభ (House of Representatives): డెమొక్రాట్లకు స్పష్టమైన గాలి… పోలింగ్ ఆధిక్యం: నేషనల్ జనరిక్ బ్యాలెట్ పోలింగ్‌లో డెమొక్రాట్లు సగటున 7 నుండి 8 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. గెలుపు అవకాశాలు: Decision Desk HQ మోడల్ ప్రకారం డెమొక్రాట్లు హౌస్ మెజారిటీని సాధించడానికి 84% అవకాశం ఉందని, ఫోకల్‌డేటా (Focaldata) అంచనా ప్రకారం ఏకంగా 99% అవకాశం ఉందని విశ్లేషించాయి.

సీట్ల అంచనా: డెమొక్రాట్లు దాదాపు 237 నుండి 241 సీట్లను దక్కించుకునే అవకాశం ఉందని (మెజారిటీకి 218 సీట్లు అవసరం) అంచనా వేస్తున్నారు.

2. సెనేట్ (Senate): హోరాహోరీ పోరు – డెమొక్రాట్లకే కాస్త మొగ్గు… ప్రస్తుత సమీకరణం: ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53-47 ఆధిక్యం ఉన్నప్పటికీ, ఈసారి డెమొక్రాట్లు సెనేట్‌ను కూడా చేజిక్కించుకునే దిశగా పాయింట్లు సాధిస్తున్నారు.

మోడలింగ్ అంచనాలు: పోలింగ్ ఏజెన్సీల చివరి విశ్లేషణ ప్రకారం డెమొక్రాట్లు సెనేట్‌ను కైవసం చేసుకునే అవకాశం 64% నుండి 67% వరకు ఉంది. కీలక బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాలు:టెక్సాస్, ఓహియో, ఐయోవా, నార్త్ కరోలినా, మైనే , మిచిగాన్ రాష్ట్రాల్లో పోటీ అత్యంత సమీపంగా (Toss-up) ఉంది. ముఖ్యంగా టెక్సాస్ (కేన్ ప్యాక్స్టన్ ఉద్వాసన నేపథ్యం), ఓహియో, ఐయోవాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థులు రిపబ్లికన్ల కంటే స్వల్ప ఆధిక్యంలో ఉండి పోటీని రసవత్తరంగా మార్చారని Forbes నివేదించింది.

3. ఓటర్ల ట్రెండ్స్ & పోలింగ్ విశ్లేషణల వెనుక ముఖ్య కారణాలు… డోనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్: ట్రంప్ అధ్యక్ష పాలనపై ఉన్న వ్యతిరేకత (అప్రూవల్ రేటింగ్ 38%-40% కి పడిపోవడం), ఆయన ఆర్థిక విధానాలపై ప్రజా వ్యతిరేకత ప్రతిపక్ష డెమొక్రాట్లకు కలిసి వచ్చిందని విశ్లేషణలు చెబుతున్నాయి.

ద్రవ్యోల్బణం & విదేశీ వ్యవహారాలు: నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇరాన్ వివాదం, ద్రవ్యోల్బణంపై ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

ముందస్తు ఓటింగ్ (Early Voting) సరళి: యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యాబ్ డేటా, రాష్ట్రాల ఓటింగ్ రికార్డుల ప్రకారం డెమొక్రాటిక్ ఓటర్లు ముందస్తు ఓటింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం డెమొక్రాటిక్ వేవ్ (‘Blue Wave’) కి దారితీసే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ
  • అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది…!
  • టీసీఎస్ మారథాన్ … విశ్వవ్యాప్తంగా 14 ఈవెంట్లు… లక్షలాది రన్నర్లు…
  • విశ్వ కుబేరుడి బిడ్డ షేరింగ్ అద్దె ఇంట్లో… మోడల్‌గా సొంత జీవితం..!!
  • లేడీ డాన్లు- ఆధిపత్య పోరాటాలు … యథేచ్ఛగా బూతులు- హింస
  • పాపం విశ్వక్‌సేన్ ! కల్ట్ కాదు… ఇది ఓ పే-ద్ద కన్‌ఫ్యూజన్ !!
  • హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…
  • ఈ రామాయణంలో బాల రావణుడు కూడా ఉన్నాడండోయ్ !!
  • రేవంత్ రెడ్డిపై BRS, BJP ఉమ్మడి పోరాటం – అమిత్ షా రాక వెనుక !?
  • ఈ ముఖ్యమంత్రి గారి రెండో పెళ్లి వెనుక చాలా పెద్ద కథే ఉంది…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions