Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!

November 6, 2026 by M S R

.

సూర్యలాంటి స్టార్ హీరోను ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, అందులోనూ శారీరక సమస్యతో కూడిన విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌లో చూపించాలంటే దర్శకుడికి కొంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం జితు మాధవన్‌లో కనిపించింది. మలయాళంలో రోమాంచం, ఆవేశం సినిమాలతో తనదైన కామెడీ, కథన శైలిని చూపించిన జితు.. ఈసారి తమిళ స్టార్ సూర్యతో కలిసి చేసిన ప్రయోగమే ‘సీన్’…

కథ విషయానికి వస్తే.. పోలీస్ శాఖలో తనదైన గుర్తింపు ఉన్న ఇన్‌బరాజ్ (సూర్య) ఒక ప్రత్యేకమైన శారీరక సమస్యతో బాధపడుతుంటాడు. పోలీస్ ఉద్యోగానికి స్వస్తి చెప్పాలనుకుంటున్న సమయంలో ఒక క్లిష్టమైన హత్య కేసు అతని ముందుకొస్తుంది. తెలివితేటలతో, తనదైన విచిత్రమైన పద్ధతుల్లో ఆ కేసును ఎలా ఛేదించాడన్నదే సినిమా.

Ads

సూర్య కొత్తగా కనిపించాడు … ఈ సినిమాలో మొదట ఆకట్టుకునేది సూర్య లుక్. చాలా యంగ్‌గా, కూల్‌గా కనిపించాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ బాగుంది. ఒక స్టార్ హీరో సినిమా మొత్తంలో ఎక్కువ భాగం షార్ట్స్‌లో కనిపించడం కూడా కొంత కొత్తగానే అనిపిస్తుంది. అయితే ఇది కేవలం లుక్ మార్పు మాత్రమే కాదు. తన బాడీ లాంగ్వేజ్, మాటతీరు, హావభావాలతో పాత్రకు తగ్గట్టుగా నటించాడు. యాక్షన్ హీరో అనే ఇమేజ్‌ను పక్కనపెట్టి, కొంత కామెడీ, కొంత విచిత్రత్వం కలిసిన పాత్రలో సూర్య బాగానే ఒదిగిపోయాడు.

నస్లెన్ మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటివరకు అతన్ని ఎక్కువగా సాఫ్ట్, సరదా పాత్రల్లో చూసిన ప్రేక్షకులకు ఇందులోని విభిన్నమైన నెగెటివ్ షేడ్ ఆసక్తి కలిగిస్తుంది. అతని నటన, ముఖ్యంగా ప్రశాంతంగా కనిపిస్తూనే ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రవర్తించే తీరు బాగుంది. అయితే ఇంత మంచి నటుడి నుంచి మరికొంత బలమైన నటనను రాబట్టే అవకాశం ఉన్నా, కథనం ఆ దిశగా పూర్తిగా సాగలేదు.

నజ్రియా తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సూర్యతో కాంబినేషన్ కూడా కొత్తగా అనిపిస్తుంది. లాల్ పాత్రలో కామెడీ బాగా పండింది. ఆనందరాజ్ సహా మిగిలిన నటులు తమ పరిధిలో నటించారు.

scene

జితు మాధవన్ మార్కు ఎక్కడుంది? సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హత్య నేపథ్యం, నస్లెన్ పరిచయం, ఆ తర్వాత సూర్య ఎంట్రీ.. ఇవన్నీ కథపై ఆసక్తి పెంచుతాయి. సూర్య పాత్రలోని ప్రత్యేకతను పరిచయం చేసే విధానం కూడా కొత్తగా అనిపిస్తుంది. సాధారణ పోలీస్ కథల్లో కనిపించే సీరియస్ వాతావరణానికి భిన్నంగా, విచిత్రమైన పాత్రలు, వాటి మధ్య సంభాషణలు, బ్లాక్ కామెడీతో దర్శకుడు తనదైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు.

మొదటి భాగంలో ఈ ప్రయత్నం చాలావరకు ఫలించింది. హత్య కేసు, పోలీసుల వ్యవహారాలు, సూర్య పాత్ర చుట్టూ అల్లిన కామెడీ సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. ముఖ్యంగా లాల్ ట్రాక్ బాగుంది. సూర్య పాత్రకు సంబంధించిన ఒక కీలకమైన ట్విస్ట్ కూడా ఆసక్తి కలిగిస్తుంది.

కానీ ఒక మంచి ఆలోచనను పూర్తి స్థాయి ఆసక్తికరమైన కథనంగా మార్చడంలోనే దర్శకుడు కొంత తడబడ్డాడు. సూర్య పాత్రలోని ప్రత్యేకతను మరింత సృజనాత్మకంగా ఉపయోగించుకోవాల్సింది. అతని సమస్య చుట్టూ వచ్చే సన్నివేశాల్లో ఇంకాస్త బలమైన హాస్యం, కొత్త ఆలోచనలు ఉండాల్సింది. కొన్ని చోట్ల ఆసక్తికరమైన ఐడియా ఉన్నా, అది తెరమీద అంతగా పేలలేదు.

ఇక రెండో భాగం దగ్గరికి వచ్చేసరికి సినిమా వేగం తగ్గుతుంది. మొదటి భాగంలో పరిచయం చేసిన పాత్రలు, ఇన్వెస్టిగేషన్, నస్లెన్ వ్యవహారాలు.. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన స్థాయిలో ముందుకు సాగినట్టు అనిపించదు. కేసు విచారణలో ఉత్కంఠ పెరగాల్సిన చోట కథనం సాధారణంగా మారిపోతుంది. కామెడీ కూడా ఒకే తరహాలో సాగడంతో నవ్వుల తీవ్రత తగ్గుతుంది.

సూర్య తెలివితేటలతో కేసును ఛేదించే క్రమంలో మరింత ఆసక్తికరమైన ఎత్తుగడలు ఉండాల్సింది. అతనికి సహాయపడే కుటుంబ సభ్యుల ట్రాక్‌లో కొన్ని సన్నివేశాలు నవ్వించినా, మొత్తం మీద ఆ వ్యవహారం అంతగా కుదరలేదు.

క్లైమాక్స్‌లో సూర్య, నస్లెన్ మధ్య ముఖాముఖి ఆసక్తికరంగా ఉండాల్సింది. నస్లెన్‌ను ఒక తెలివైన, ప్రమాదకరమైన వ్యక్తిగా పరిచయం చేసినప్పుడు.. అతన్ని పట్టుకోవడానికి సూర్య వేసే ఎత్తుగడలు కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ చివరకు కేసు పరిష్కారమయ్యే విధానం మరీ మామూలుగా అనిపిస్తుంది. ఇలాంటి విభిన్నమైన కథకు సాధారణ యాక్షన్ తరహా ముగింపు సరిపోలేదు.

సుషిన్ శ్యామ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. పాటలు వేస్ట్. నేపథ్య సంగీతం మాత్రం చాలా సన్నివేశాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సినిమా విచిత్రమైన మూడ్‌ను కొనసాగించడంలో బీజీఎం ఉపయోగపడింది. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా ఇంకాస్త వేగంగా సాగేది.

‘సీన్’లో మంచి ఐడియాలు ఉన్నాయి. ఆసక్తికరమైన పాత్రలున్నాయి. సూర్య కొత్తగా కనిపించాడు. నస్లెన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. జితు మాధవన్ తన గత సినిమాల్లో చూపించిన ప్రత్యేకమైన హాస్య శైలిని ఇక్కడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడక్కడా బాగా కుదిరిన సన్నివేశాలు ఉన్నంత మాత్రాన మొత్తం సినిమా బాగున్నట్టుకాదు కదా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!
  • ఔను… రామాయణంతోపాటే రావణాయణం కూడా… తప్పేముంది..?
  • వై నాట్ సిద్దిపేట..? ఏదీ ఎవరికీ కోట కాదు..! రేవంత్ చెబుతున్నది ఇదే..!!
  • సోషల్ మీడియా దిగ్గజాలకు భారత్ నుంచి కొత్త సవాల్ !
  • ఆ ‘ముగ్గురూ’ ప్లస్ ఆదానీ… విజయ్‌తో త్రిష… ఫోటో బాగుంది మాస్టారూ..!!
  • మన DNA లోనే రామాయణం ! – మన కుటుంబాల్లోనూ అవే పాత్రలు !!
  • తమన్ ఏమిటిది..? శివమణి ఏదో అంటున్నాడు..? ఏం జరుగుతోంది..?
  • రామాయణం నాకు ఎక్కడ నచ్చింది..? ఎక్కడెక్కడ నచ్చలేదు..?
  • సల్మాన్ ఖాన్.., ముక్తిధామ్ గుడికొచ్చి క్షమాపణ చెప్పు… మన్నిస్తాం..!!
  • రామాయణం… ఓ గ్రాండియర్..! మహారాజసం… పాన్-వరల్డ్ వైభవం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions