Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…

November 7, 2026 by M S R

.

ఎలా ఉన్నా సరే, హీరోయిజమేనా..? వెండితెరకు హీరోయినిజం పనికిరాదా..? ఎంతసేపూ హీరోయిన్లు జస్ట్, హీరోయిక్ సినిమాల్లో ఓ దేభ్యం పాత్రల అంగడి సరుకునా..? ఈ ప్రశ్న సినిమా పుట్టినప్పటి నుంచీ ఉంది… ఫ్యాన్లు, దండలు, కేకలు, ఉద్వేగాలు, అఫ్‌కోర్స్ ఉన్మాదాలు… మరి హీరోయిన్లకు..? వాళ్లు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లేదా..? వాళ్లను ఎవడూ గుర్తించడా..?

నయనతారకు ‘మహాలక్ష్మి’ సినిమాకు సంబంధించి ఏకంగా 60 అడుగుల కటౌట్ పెట్టారనే వార్త అందుకే ఆకర్షించింది… అవును, నయనతార జస్ట్, ఓ షీరో కాదు, రియల్ హీరోయిన్… అంతటి బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంది… కానీ ఇప్పుడు వచ్చిన ఆమె సినిమా తీరు చూస్తే, ఆమె ఇలాంటి కథలే ఎంచుకుంటే ఆ వాల్యూ వేగంగా పడిపోతుందనీ అనిపించింది…

Ads

రామాయణ సినిమాలో సాయిపల్లవికన్నా నయనతార బాగుండేది అనే పోస్టులు నేనూ చదివాను… ఏమో, బాపు శ్రీరామరాజ్యంలో అద్భుతంగా చేసింది… నప్పింది… మెప్పించింది… ఆమె ఇప్పుడు ఏకంగా మహాశక్తిలా, అమ్మోరులా చేసింది… లుక్ కుదిరింది, సీనియర్ నటి కదా, ఏమీ తక్కువ గాకుండా పాత్రకు తగినట్టు నటించింది… ఈ సినిమాలో ఏమైనా ప్లస్ ఉందీ అంటే అది నయనతార ఉనికి… ప్లస్ రెజీనా…

రెజీనా పేరు వినగానే ఇప్పుడు సౌత్- నార్త్ పంచాయితీలు తీసుకురావద్దమ్మా అని కటువుగా జాన్వీకి, రాధికా ఆప్టేకు బదులిచ్చిన తీరు గుర్తొస్తుంది… బహుశా ఆమె ఒక్కతే అనుకుంటా ఇలా సమాధానం ఇచ్చిన తార… (అఫ్‌కోర్స్, మొన్నమొన్నటిదాకా రెజీనా అనగానే ఆమె చేసిన ‘మగాడు- మ్యాగీ రెండూ రెండు నిమిషాలే’ అనే ఓ వెగటు వ్యాఖ్య గుర్తొచ్చేది…)

nayantara

మహాలక్ష్మి సినిమా గతంలో వచ్చిన మూకుత్తి అమ్మన్ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్… అదెలా నడిచిందో గుర్తులేదు కానీ, ఈ మహాలక్ష్మి మాత్రం ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు… నిర్మాత- దర్శకులు ఏకంగా రామాయణ సినిమాకు పోటీగా బరిలో దిగారు… కానీ అంత సీన్ లేదు, కాదు, అసలు ఏమీ లేదు… దర్శకుడు సుందర్ సి పేలవంగా తెరకెక్కించాడు… చాలా పేరున్న ఓ రేంజ్ దర్శకుడు అంటారు, కానీ ఏమాత్రం సుందరంగా లేదు మాస్టారూ…

నిజం చెప్పాలంటే… నయనతార, తనకు దీటుగా వెలిగిన రెజీనా తప్ప ఇంకేమీ లేదు సినిమాలో… రెజీనాకు మంచి పాత్ర దొరికింది, సద్వినియోగం చేసుకుంది… కాకపోతే ఈ పాత్ర (దుష్టశక్తి- నెగెటివ్ ఫోర్స్) లుక్, ధోరణి చూస్తుంటే, గతంలో మంచు లక్ష్మి చేసిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో పాత్ర గుర్తొస్తుంది… అదే కాదు, సినిమా చూస్తుంటే… ఈ దర్శకుడు పెద్దగా కష్టపడకుండా… అరుంధతి, అమ్మోరు, మగధీర, మమ్మీ వంటి చిత్రాల్లోని సీన్లను కాపీ చేసుకుని, కథ నడిపించేశాడు అని నమ్మకం కుదురుతుంది…

గ్రాఫిక్స్‌ను నమ్ముకున్నట్టున్నాడు… కాస్త ఎఐ కూడా ఉపయోగించినట్టున్నాడు… కానీ బేసిక్‌గా కథ అనే ఆత్మ బాగా లేకపోతే ఏ హంగులూ పనికిరావు… పైగా ఇక్కడ ఆ టెక్నికల్ గ్రాఫిక్ హంగులు కూడా పేలవంగా ఉన్నయ్… దాంతో మహాలక్ష్మి శక్తి ప్రేక్షకులను రప్పించలేక చతికిలపడినట్టే… అందుకే అనేది… నయనతార ఇలాంటి సినిమాలే ఎంచుకుంటే, ఇక ఆ బ్రాండ్ కథ అంతే సంగతులు…

ఓ పోలీస్… పదే పదే ఆమెకు కల… ఏదో ఊరికి రమ్మంటూ… నిజంగానే అక్కడికి కోరుకుని మరీ పోతుంది… అక్కడ ఓ దుష్టశక్తితో వైరం స్టార్ట్… పెద్దగా మలుపులు, థ్రిల్లింగ్ ఎపిసోడ్లు ఏమీ ఉండవు… ఏవేవో పాత సినిమాలు ఒకేసారి ‘మిక్సీ’ చేసి చూస్తున్నట్టు సా-గు-తూ ఉంటుంది కథనం… అసలే డబ్బింగ్… ఆ పాటలు, ఆ మాటలు మనకు సరిగ్గా వినిపించవు…

ఎప్పటిలాగే, చాలామందిలాగే తమిళ మార్కెట్ కోసమే నిర్మించి, నాలుగు డబ్బులొస్తాయి కదాని తెలుగులోకి వదలడం… పైగా నయనతారకు ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉంది కదాని, సొమ్ముచేసుకోవచ్చు అనుకున్నారు కానీ నాణ్యత లేదు… దునియా విజయ్, సునీల్ కూడా ఉన్నారు… ఫేమస్ కమెడియన్ యోగిబాబు కూడా ఉన్నాడు, ఎందుకున్నాడో తనకే తెలియదు…

regina

సినిమా పూర్తయ్యాక పెద్ద రిలీఫ్ అనిపించేది ఏమిటయ్యా అంటే… పార్ట్-3 కూడా ఉంటుందని భయపెట్టే లీడ్ ఏమీ ఇవ్వలేదు… హమ్మయ్య ఇక్కడితో శుభం కార్డు అన్నమాట… గుడ్… కథను వినోదాత్మకంగా, థ్రిల్‌ పంచే ఎలిమెంట్స్‌ను జోడిస్తూ తీయగల సత్తా ఉన్న దర్శకుడు అంటరు కదా సుందర్‌ సి… ‘మహాశక్తి’ చూస్తే ఆ భావన పటాపంచలవుతుంది… నాయనతార మీద ఒట్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…
  • వీడియోకాన్ – దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద దివాలా కేసు !
  • రామాయణ సినిమా మాత్రమే కాదు… ఈ మహాభారతం ఘనత కూడా చదవండి!
  • మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!
  • ఔను… రామాయణంతోపాటే రావణాయణం కూడా… తప్పేముంది..?
  • వై నాట్ సిద్దిపేట..? ఏదీ ఎవరికీ కోట కాదు..! రేవంత్ చెబుతున్నది ఇదే..!!
  • సోషల్ మీడియా దిగ్గజాలకు భారత్ నుంచి కొత్త సవాల్ !
  • ఆ ‘ముగ్గురూ’ ప్లస్ ఆదానీ… విజయ్‌తో త్రిష… ఫోటో బాగుంది మాస్టారూ..!!
  • మన DNA లోనే రామాయణం ! – మన కుటుంబాల్లోనూ అవే పాత్రలు !!
  • తమన్ ఏమిటిది..? శివమణి ఏదో అంటున్నాడు..? ఏం జరుగుతోంది..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions