.
మొత్తానికి జగిత్యాల దత్తత కేసు ముగిసినట్టే… మూడేళ్ల పిల్లాడి దత్తత కేసులో అధికారుల అత్యుత్సాహం, అర్ధ జ్ఞానం ప్రభుత్వానికి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి… చివరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జోక్యం చేసుకుని, బాధ్యులైన అధికారులకు క్లాస్ పీకితే గానీ సమస్య చక్కబడలేదు… ఖచ్చితంగా ఈ కేసును పూర్తిగా వక్రగతి పట్టించిన ఆ డీడబ్ల్యూవో బాధ్యుడా..? ఏమాత్రం సద్యాలోచన, నిర్వహణ సామర్థ్యం లేని కలెక్టర్ బాధ్యుడా ఇక రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆలోచిస్తాడా..? యాక్షన్ తీసుకుంటాడా..? చూద్దాం…
నిజానికి ఇందులో దత్తత తీసుకున్న తల్లిదండ్రులది ఏ తప్పూ లేదు… జిల్లాను పాలించే అధికారులకే రెండురకాల చట్టాలపై క్లారిటీ లోపించింది… ఏమో, ఇంకేమైనా మర్మముందో తెలియదు… (రెండు చట్టాల తేడా దిగువన చెప్పుకుందాం…) అధికారులు కనీసం తన బేసిక్ కామన్ సెన్స్ వాడలేదు అనే కటువైన వ్యాఖ్య చేయడానికి సందేహించాల్సిన పనిలేదు…
Ads
మూడేళ్ల క్రితం పిల్లాడి తల్లిదండ్రుల నుంచి హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నారు ఈ కేసులో… అప్పటి నుంచి ఏ వివాదమూ లేదు… ఎవరో బంధువు ఫిర్యాదు చేశాడట, వెంటనే అధికారులు పిల్లాడిని స్వాధీనం చేసుకుని నరకప్రాయమైన శిశుగృహలో ‘నిర్బంధించారు’… చివరకు హైకోర్టు రిలీజ్ చేయాలని చెప్పినా మొరాయించారు… అంతేనా..? హైకోర్టులో రివిజన్‌కు అప్పీల్ చేయాలనీ కలెక్టర్ నిర్ణయం తీసుకోవడం మరింత బాధ్యతారాహిత్యం…

దత్తత అంశంలో… రెండు చట్టాలు ముందుగా చెప్పుకుందాం… 1. హిందూ దత్తత చట్టం… 1956 HAMA… ( Hindu Adoptions and Maintenance Act ) ఇది హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు వర్తిస్తుంది… ఇది కుటుంబాల నడుమ దత్తత… తల్లిదండ్రులు లేదా అర్హులైన సంరక్షకుల నుంచి దత్తత తీసుకోవాలి…
ఈ కేసులో పిల్లాడి తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల్లేవు… (నిన్న అధికారులు ఈ చట్టం కింద దత్తత ప్రక్రియను చేయించారు… దానికి తల్లిదండ్రులు వచ్చారు… ఈ పనేదో వివాదం వచ్చినప్పుడే చేస్తే సరిపోయేది కదా… మరెందుకు ఓవరాక్షన్ చేసినట్టు..? మంత్రి అక్షింతలు వేశాక గానీ అసలు కర్తవ్యం బోధపడలేదా..?)
2. CARA అంటే Central Adoption Resource Authority… కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే చట్టబద్ధ సంస్థ… ఇది ప్రధానంగా అనాథలు, తల్లిదండ్రులు వదిలివేసిన పిల్లలు, తల్లిదండ్రులు చట్టబద్ధంగా అప్పగించిన పిల్లల దత్తత ప్రక్రియను పర్యవేక్షిస్తుంది… దత్తత ఈ సంస్థ పర్యవేక్షణలో జరుగుతుంది… అన్ని వివరాల పరిశీలన జరుగుతుంది… కలెక్టర్ దత్తత సర్టిఫికెట్ ఇస్తాడు…
HAMA ప్రకారం జరిగిన దత్తత కేసులో ఇక CARA అక్కర్లేదు… రెండూ వేర్వేరు… ఒకవేళ హిందూ దత్తత చట్టం ప్రకారం రిజిష్టర్ జరగకపోతే, అది చేయించుకొమ్మని చెబితే సరిపోయేది… (అవసరం లేదు కూడా…) ఈ కేసులో కాదు గానీ, నిజానికి CARA కూడా సమాజానికి అవసరమే, దత్తత పేరిట చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా ప్రభుత్వ నిఘా, పర్యవేక్షణ ద్వారా… ఓ వ్యవస్థ ద్వారా దత్తత ప్రక్రియ జరుగుతుంది…
కానీ ఇక్కడ దత్తత జరిగింది ఓ పిల్లాడు… పైగా ఆల్రెడీ హిందూ సంప్రదాయంలో దత్తత జరిగింది… దాన్ని వివాదం చేసి, చివరకు హైకోర్టు దాకా వెళ్లి, తల్లిదండ్రులను సతాయించి, ఏడిపించి, పైగా కోర్టు చెప్పినా వినకుండా… జనం వ్యతిరేకించేదాకా తీసుకొచ్చి, తరువాత కూడా కోర్టులో రివిజన్ కోసం పోరాడటానికి రెడీ అయిన ఈ అధికార యంత్రాంగం ప్రజలకు ఎప్పుడూ ఓ తలనొప్పే..!!
సమస్యల్ని చక్కదిద్దాల్సిన అధికారగణమే జనానికి ఓ తలనొప్పిగా మారితే ప్రశ్నించాల్సింది ఎవరు..?! ఏమాటకామాట, కోర్టులో మళ్లీ విచారణ జరిగితేనే బాగుండేదేమో... ఎందరికి అక్షింతలు పడేవో..!!
- HAMA కింద దత్తతకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు… చట్టంలోని షరతులు, బిడ్డను ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ ముఖ్యం… రిజిస్టర్డ్ డీడ్ ఉంటే సెక్షన్ 16 ప్రకారం దానికి సాక్ష్యపరమైన ప్రాధాన్యం ఉంటుంది…CARA ప్రతి దత్తతకు అవసరం కాదు… HAMA కింద దత్తతకు CARA ప్రక్రియ వర్తించదు… CARA మార్గంలో కూడా తుది దత్తత ఉత్తర్వులు జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేస్తాడు…
Share this Article