.
ఆడదాని కారణంగా కుప్పకూలిన రాజ్యాలు, జరిగిన యుద్ధాలు అనేకం చరిత్రలో… మగాడి ఆ బలహీనత ఏదైనా చేయగలదు… చిప్‌ల తయారీ బ్లూచిప్ కంపెనీ ఎన్వీడియా షేర్ల పతనం- ఆ సీఈవో హఠాత్ రాజీనామా, చైనా హానీట్రాప్ ఆరోపణల కథ కూడా ఇదే చెబుతోంది… ఎన్వీడియా సామ్రాజ్యంలో కుదుపు…
ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన టెక్ దిగ్గజం ఎన్వీడియా సీఈవో జెన్సన్ రాజీనామా చేసి, నిష్క్రమించాడు… తాత్కాలిక సీఈవోగా కోలెట్ క్రెస్…. ఒక్కరోజులోనే కుప్పకూలిన షేర్లు… తదుపరి సారథి భారతీయుడేనా?
Ads
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు అందరి దృష్టి ఎన్విడియా (NVIDIA) మీదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవానికి చోదకశక్తిగా నిలిచిన ఈ సంస్థలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, మూడు దశాబ్దాలకు పైగా సీఈవోగా కొనసాగిన జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశాడు. ఒక వ్యక్తిగత వ్యవహారంతో మొదలైన వివాదం, చైనా గూఢచర్య అనుమానాలు, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన ప్రశ్నలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న సంబంధాలు.. చివరకు ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాలో నాయకత్వ సంక్షోభానికి దారితీశాయి.
గురువారం (నవంబర్ 12) హువాంగ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించారు. శాశ్వత వారసుడి ఎంపిక కోసం బోర్డు అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించనుంది.
(colette kress)
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
ఈ కథలో కీలకమైన పేరు ఆలిస్ హువాంగ్ (Alice Huang). ఆమె జెన్సన్ హువాంగ్‌కు బంధువు కాదు. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ (Megaspeed) అనే క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలో గతంలో పనిచేసిన వ్యాపారవేత్త. ఎన్విడియా చిప్స్‌ను ఉపయోగించి AI కంప్యూటింగ్ సేవలు అందించే సంస్థలతో ఆమెకు సంబంధాలున్నాయి.
అయితే అమెరికా నిఘా వర్గాలకు ఆమెపై అనుమానాలు మొదలయ్యాయి. చైనాకు చెందిన గూఢచార వ్యవస్థతో ఆమెకు సంబంధాలున్నాయని, ఎన్విడియా అత్యాధునిక చిప్స్‌కు సంబంధించిన సమాచారం చైనాకు చేరవేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అమెరికా అధికారులు అనుమానించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ముఖ్యంగా అమెరికా ఎగుమతి ఆంక్షలను ఉల్లంఘించి ఎన్విడియా అత్యాధునిక AI చిప్స్ చైనాకు చేరాయా? ఈ వ్యవహారంలో మెగాస్పీడ్ పాత్ర ఏమిటి? అన్న అంశాలపై అమెరికా దర్యాప్తు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ తైవాన్, సింగపూర్, కాలిఫోర్నియాల్లో కలిసి కనిపించిన ఫొటోలు కూడా చర్చకు వచ్చాయి. ఇక్కడే ఈ వ్యవహారం సాధారణ వ్యక్తిగత వివాదం నుంచి అంతర్జాతీయ భద్రతా సమస్యగా మారింది.

హనీట్రాప్.. చైనా గూఢచర్యానికి ప్రేమాయణమే ఆయుధమా?
ఈ వివాదంలో అత్యంత సంచలనమైన అంశం హనీట్రాప్ (Honey Trap) అనుమానం. ఒక వ్యక్తితో ప్రేమ లేదా సాన్నిహిత్యం పెంచుకుని, అతడి వ్యక్తిగత జీవితంలోకి చొరబడి, కీలకమైన సమాచారం సేకరించడం లేదా తనకు అనుకూలంగా వ్యవహరించేలా ఒత్తిడి చేయడం గూఢచర్య ప్రపంచంలో ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. దీన్నే హనీట్రాప్ అంటారు.
అమెరికా నిఘా వర్గాలు ఆలిస్ హువాంగ్‌ను చైనా గూఢచార వ్యవస్థకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నాయని వార్తలు వచ్చాయి. ఆమె జెన్సన్‌తో ఏర్పరచుకున్న అక్రమ సంబంధం వెనుక కూడా ఇలాంటి వ్యూహం ఉందా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ఇదిలా ఉంటే, జెన్సన్‌కు ఎన్విడియాలోనే తనకు రిపోర్ట్ చేసే ఓ సీనియర్ మహిళా ఉద్యోగితో కూడా సంబంధం ఉన్నట్టు మరో ఆరోపణ బయటపడింది. ఆ మహిళ కింబర్లీ పావెల్ (Kimberly Powell) అని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
ఒకవైపు విదేశీ గూఢచర్య అనుమానాలు, మరోవైపు సంస్థలోని ఉన్నతాధికారితో వ్యక్తిగత సంబంధాల ఆరోపణలు.. బోర్డుపై ఒత్తిడి పెంచాయి.

ట్రంప్‌కు ముందే తెలుసా? ఏం జరిగింది?
ఈ కథలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర కూడా ఆసక్తికరంగా మారింది. జెన్సన్ హువాంగ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితమైన టెక్ రంగ ప్రముఖుల్లో ఒకడు. అమెరికాలో AI అభివృద్ధి, చిప్స్ తయారీ, చైనాకు చిప్స్ ఎగుమతుల అంశాల్లో ట్రంప్ ప్రభుత్వంతో జెన్సన్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి.
వాషింగ్టన్ నుంచి వచ్చిన కథనాల ప్రకారం, 2025 అక్టోబరులోనే అమెరికా నిఘా వర్గాలు ఆలిస్ హువాంగ్‌పై అనుమానాలను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత 2026 మేలో చైనా పర్యటనకు వెళ్తున్న సమయంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ వ్యవహారంపై ట్రంప్‌ను హెచ్చరించినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
అయినా జెన్సన్‌ను ట్రంప్ చైనా పర్యటనలో తన వెంట తీసుకెళ్లాడు. ఎన్విడియా చిప్స్ చైనాకు విక్రయించేందుకు కూడా ట్రంప్ ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి.
నవంబర్ 9న మీడియాతో మాట్లాడిన ట్రంప్, జెన్సన్‌తో తాను మాట్లాడానని, ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి అని తనకు తెలియదని అతడు చెప్పినట్టు వెల్లడించాడు. జెన్సన్ మాటలను తాను నమ్ముతున్నానని కూడా అన్నాడు. అంటే అప్పటికి ట్రంప్ బహిరంగంగా జెన్సన్‌కు మద్దతుగా నిలిచాడు. కానీ నవంబర్ 12న రాజీనామా వార్త బయటకు వచ్చిన తర్వాత ఆయన మరో ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ఎన్విడియాకు తదుపరి సీఈవోగా టిమ్ కుక్‌ను నియమించాలని సూచించాడు.
ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్టులో, జెన్సన్ స్థానంలో టిమ్ కుక్ మాత్రమే సరైన వ్యక్తి అని పేర్కొంటూ, ‘ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇది ట్రంప్ వ్యక్తిగత సూచన మాత్రమే. ఎన్విడియా బోర్డు తీసుకున్న నిర్ణయం కాదు.
తాత్కాలిక సీఈవోగా కోలెట్ క్రెస్… జెన్సన్ నిష్క్రమణతో ఎన్విడియా సీఈవో బాధ్యతలను తాత్కాలికంగా కోలెట్ క్రెస్ చేపట్టింది. ఆమె 2013 నుంచి ఎన్విడియాలో పనిచేస్తోంది. అంతకుముందు మైక్రోసాఫ్ట్, సిస్కో, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి సంస్థల్లో ఉన్నతస్థాయి ఆర్థిక బాధ్యతలు నిర్వహించింది.
సంస్థ CFOగా పెట్టుబడిదారులకు, మార్కెట్ వర్గాలకు ఆమె ఇప్పటికే పరిచయం ఉన్న వ్యక్తి. తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతోపాటు CFO పదవిలోనూ కొనసాగుతుంది. ఎన్విడియా బోర్డు తొలిసారిగా హార్వీ జోన్స్‌ను బోర్డు చైర్మన్‌గా నియమించింది. శాశ్వత సీఈవో ఎంపిక కోసం అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించనున్నట్టు ప్రకటించింది.
అంటే కోలెట్ క్రెస్ నియామకం తాత్కాలికమే. ఆమెనే పూర్తిస్థాయి సీఈవోగా కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తిని తీసుకొస్తారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఎన్విడియాకు భారతీయ సీఈవో వస్తారా? ఇక్కడే భారతీయులకు ఆసక్తి కలిగించే మరో పేరు తెరపైకి వచ్చింది. అతడే జయ్ పురి (Jay Puri). భారతదేశంలో జన్మించిన జయ్ పురి అసలు పేరు అజయ్ కె. పురి. 2005లో ఎన్విడియాలో చేరిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. గ్లోబల్ సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, అంతర్జాతీయ మార్కెట్ల నిర్వహణలో విశేష అనుభవం ఉంది.
యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, కాల్టెక్ నుంచి మాస్టర్స్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పూర్తి చేశాడు. అయితే ఇక్కడ ఓ కీలకమైన విషయం ఉంది. జయ్ పురి 2026 ఆగస్టులోనే తన ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకుని సీనియర్ అడ్వైజర్‌గా మారాడు. అందువల్ల ఆయన పేరు వినిపిస్తున్నప్పటికీ, తిరిగి పూర్తిస్థాయి సీఈవో బాధ్యతలు చేపడతాడని చెప్పడానికి ఆధారాలు లేవు.
(jay puri)
మరోవైపు ఎన్విడియాలోనే దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇయాన్ బక్ (Ian Buck) పేరు కూడా వినిపిస్తోంది. ఎన్విడియా చిప్స్‌ను AI ప్రపంచంలో అత్యంత కీలకంగా మార్చిన CUDA సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాడు. సాంకేతిక పరిజ్ఞానం, సంస్థ అంతర్గత అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన పేరు పరిశీలనలో ఉంది. ఆర్మ్ సంస్థ సీఈవో రెనే హాస్ పేరు కూడా బాహ్య అభ్యర్థిగా ప్రస్తావనకు వచ్చింది.
కుప్పకూలిన షేర్లు.. వందల బిలియన్ డాలర్ల సంపద ఆవిరి! జెన్సన్ రాజీనామా వార్త మార్కెట్లను కూడా కుదిపేసింది. నవంబర్ 12న అమెరికా మార్కెట్ల ప్రారంభంలో ఎన్విడియా షేర్లు ఒక దశలో 12 నుంచి 14 శాతం వరకు పడిపోయాయి. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగింది.
రాయిటర్స్ ప్రకారం, ప్రారంభ పతనంతోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ వారంలో అంతకుముందు జరిగిన పతనాలను కూడా కలిపితే మార్కెట్ విలువలో నష్టం మరింత ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం జెన్సన్ హువాంగ్ వ్యక్తిగతంగా ఎన్విడియా వ్యవస్థలో ఎంత కీలకమైన వ్యక్తిగా మారాడన్నదే.
1993లో సంస్థను స్థాపించినప్పటి నుంచి ఆయన నాయకత్వంలోనే ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డుల తయారీ సంస్థ నుంచి ప్రపంచ AI విప్లవానికి కేంద్రంగా ఎదిగింది. చిప్స్ తయారీ మాత్రమే కాకుండా, AI డేటా సెంటర్లు, క్లౌడ్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో కలిసి ఒక భారీ వ్యవస్థను నిర్మించింది.
ఆ వ్యవస్థలో జెన్సన్ పాత్ర కేవలం సీఈవో స్థాయికి పరిమితం కాలేదు. వ్యాపార వ్యూహం, సాంకేతిక ప్రణాళికలు, భాగస్వామ్యాలు, పెట్టుబడులు.. అన్నింటిలోనూ ఆయన కీలకంగా వ్యవహరించాడు. అందుకే ఆయన నిష్క్రమణతో కంపెనీ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది…!!
Share this Article