.
మేరంగి జమిందారీ.. హోదా ఇంటిపేరుగా మారిన శత్రుచర్ల! … Srinivas Ganjivarapu
మన జమీందార్లు
“బానిసత్వంలో సుఖం వెతికేవారికి స్వేచ్ఛ ఓ భారమే…”
ఉత్తరాంధ్ర అనబడే తూర్పు దిక్కు ప్రాంత చరిత్ర పుటలను తిరగేస్తే ఒక విలక్షణమైన భూస్వామ్య సంస్థానం కళ్లముందు కదలాడుతుంది. అదే ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలంలోని మేరంగి. ఒకప్పుడు గిరిజన గూడేలకు, మైదాన గ్రామాలకు మధ్య వారధిగా నిలిచిన ఈ సంస్థానం… సామంత రాజ్యంగా మొదలై, బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఎస్టేట్‌గా మారి, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థలో వివాదాలు చుట్టూ తిరుగుతూ భాగమైన తీరు ఒక ఆసక్తికరమైన చారిత్రక పరిణామం.
Ads
జయపురానికి సామంతుల నుంచి బ్రిటిష్ ఎస్టేట్ వరకు…
మేరంగి జమిందారీ పుట్టుక 17వ శతాబ్దంలో ఒడిశాలోని జయపురం (నేటి జైపూర్) రాజుల పాలనతో ముడిపడి ఉంది. సరిహద్దు ప్రాంతాలను రక్షించేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి జయపురం మహారాజు విశ్వంభర దేవ్… జగన్నాథ ధరణికి ఈ భూభాగాన్ని జాగీరుగా దఖలు పరిచారు. 18వ శతాబ్దంలో ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు మారాయి.
నిజాం ఉత్తర సర్కారు ఆధీనంలో పూసపాటి వంశీయుల నేతృత్వంలో విజయనగరం సంస్థానం బలపడటంతో, మేరంగి జమిందారులు తమ అంతర్గత స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే విజయనగరం రాజులకు వార్షిక కప్పం చెల్లించే ఏర్పాటులోకి వచ్చారు.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నాక మేరంగి చరిత్ర కొత్త మలుపు తిరిగింది. 1802లో లార్డ్ కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ చట్టం ద్వారా మేరంగి ఒక స్వతంత్ర ఎస్టేట్‌గా గుర్తింపు పొందింది. దీనితో విజయనగరం మధ్యవర్తిత్వం తొలగిపోయి, మేరంగి జమిందారులు నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి ‘పేష్కష్’ రూపంలో వార్షిక పన్ను చెల్లించే హక్కును పొందారు.
‘శత్రుచర్ల’, ‘వైరిచర్ల’… ఇంటిపేర్లు కాదు!
ఉత్తరాంధ్ర జమిందారీ చరిత్రలో ‘శత్రుచర్ల’ (మేరంగి), ‘వైరిచర్ల’ (కురుపాం) అనేవి పుట్టుకతో వచ్చిన ఇంటిపేర్లు కావు; అవి యుద్ధరంగంలో చూపిన పరాక్రమానికి, రాజభక్తికి గుర్తుగా జయపురం మహారాజులు ప్రసాదించిన గౌరవ హోదాలు. సరిహద్దు ప్రాంతాలైన మన్యం కొండల్లో గిరిజనుల తిరుగుబాట్లను అణచివేయడంలోనూ, శత్రువుల దాడుల నుండి జయపురం సామ్రాజ్యాన్ని రక్షించడంలోనూ ఈ ప్రాంత పాలకులు వీరత్వాన్ని ప్రదర్శించారు.
ఆ యుద్ధ నైపుణ్యానికి మెచ్చిన జయపురం రాజులు, మేరంగి పాలకులకు ‘శత్రువులను చీల్చి చెండాడేవాడు’ అనే అర్థంలో ‘శత్రుచర్ల’ అనే బిరుదును, వారి దాయాదులైన కురుపాం పాలకులకు ‘వైరులను సంహరించేవాడు’ అనే అర్థంలో ‘వైరిచర్ల’ అనే బిరుదును ప్రదానం చేశారు. కాలక్రమేణా, రాజరిక హోదాకు ప్రతీకలైన ఈ వీర బిరుదులే ఆయా రాజవంశాల స్థిరమైన ఇంటిపేర్లుగా (వంశనామాలుగా) రూపాంతరం చెంది, నేటికీ చరిత్రలో నిలిచిపోయాయి.

సాగునీటి చెరువులు… శిస్తుల భారాలు!
ఏ జమిందారీ వ్యవస్థనైనా ఒకే కోణంలో చూడలేం. మేరంగి పాలనలోనూ అభివృద్ధి, ఆధిపత్యం రెండూ సమాంతరంగా సాగాయి. వ్యవసాయాభివృద్ధి కోసం శత్రుచర్ల వంశీయులు అనేక చెరువులు, కాలువలు తవ్వించారు. మరోవైపు, సామాన్య రైతులు, గిరిజనుల కష్టాలు కూడా ఈ చరిత్రలో అంతర్భాగమే. బ్రిటిష్ ప్రభుత్వానికి నిర్ణీత గడువులోగా పేష్కష్ చెల్లించాల్సిన ఒత్తిడి ఉండటంతో, జమిందారీ యంత్రాంగం రైతులపై శిస్తు వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించేది.
మైదాన ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాలపై కూడా జమిందారీ ఆధిపత్యం ఉండటం, దానికి బ్రిటిష్ అటవీ చట్టాలు తోడవడంతో గిరిజనుల సంప్రదాయ హక్కులకు భంగం కలిగింది. ఫలితంగా 19, 20 శతాబ్దాల్లో ఈ ప్రాంతంలో గిరిజనుల్లో అసంతృప్తి రగిలింది. ఎన్నో పితూరీల ప్రభావం ఈ సరిహద్దు ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపించింది.
కోట గోడల నుండి ప్రజాస్వామ్య వేదికపైకి… శత్రుచర్ల ప్రస్థానం
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1948 ఎస్టేట్ రద్దు చట్టంతో మేరంగి జమిందారీ వ్యవస్థకు తెరపడింది. రాచరిక అధికారాలు కోల్పోయినప్పటికీ, మారిన కాలానికి అనుగుణంగా శత్రుచర్ల వంశీయులు ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ పరంపరలో మేరంగి జమిందారీ వారసుడైన శత్రుచర్ల విజయరామరాజు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత కీలకమైనది.
నాగూరు, కురుపాం శాసనసభ నియోజకవర్గాల నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా, పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో పనిచేస్తూ ఉత్తరాంధ్ర ఏజెన్సీ రాజకీయాలకు దశాబ్దాల పాటు కేంద్రబిందువుగా నిలిచారు. తన 79 ఏళ్ల వయసులో నవంబర్ 12న మృతి చెందారు. భూస్వామ్య వారసత్వం నుండి ప్రజాస్వామ్య నాయకత్వం వైపు సాగిన శత్రుచర్ల రాజకీయ ప్రస్థానం నిండా వివాదాలే!
గిరిజన హోదా వివాదం… న్యాయపోరాటాల సుడిగుండం!
అయితే, శత్రుచర్ల విజయరామరాజు రాజకీయ ప్రస్థానం సాఫీగా సాగలేదు. అది సుదీర్ఘమైన కుల ధ్రువీకరణ వివాదాలు, న్యాయపోరాటాల సుడిగుండంలో చిక్కుకుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగూరు, కురుపాం, పార్వతీపురం వంటి నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వ్డ్ స్థానాలుగా మారాయి. తాము ‘కొండదొర’ (గిరిజన) తెగకు చెందినవారమని శత్రుచర్ల వంశీయులు ఎస్టీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా రిజర్వ్డ్ స్థానాల నుండి పోటీ చేసి విజయం సాధించారు.
దీనిపై గిరిజన సంఘాలు, రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శత్రుచర్ల వంశీయులు జమిందారీ హోదా అనుభవించిన క్షత్రియులని, వారికి ‘కొండదొర’ గిరిజన హోదా వర్తించదని ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయించారు. ఒకవైపు తాము తరతరాలుగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కొండదొరలమేనని, తమ ఆచార వ్యవహారాలు గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగానే ఉంటాయని శత్రుచర్ల కుటుంబం వాదించింది.
మరోవైపు, జమిందారీ రికార్డులు, వివాహ సంబంధాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థులు న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలో విజయరామరాజు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో తీర్పులు రావడం, ఆయన పదవులు కోల్పోవడం, మళ్లీ న్యాయపరమైన ఉపశమనం పొందడం వంటి నాటకీయ పరిణామాలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.
మారిన సమీకరణాలు… పుష్ప శ్రీవాణి రాక!
దశాబ్దాల పాటు శత్రుచర్ల కుటుంబం చుట్టూ తిరిగిన కురుపాం రాజకీయాలు, 2014 తర్వాత కొత్త మలుపు తిరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగూరు రద్దయి కురుపాం పూర్తి స్థాయి ఎస్టీ నియోజకవర్గంగా మారిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాల్లో మార్పు మొదలైంది. శత్రుచర్ల కుటుంబానికి చెందిన వారి బదులు, పాముల పుష్ప శ్రీవాణి కురుపాం నుండి వరుసగా రెండుసార్లు (2014, 2019) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో ఆమె ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా (గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా) బాధ్యతలు చేపట్టడం ఒక చారిత్రక ఘట్టం.
ఒకప్పుడు జమిందారీ పాలనలో, ఆ తర్వాత జమిందారీ వారసుల రాజకీయ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం నుండి… ఒక గిరిజన మహిళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం మన్యం ప్రాంత సామాజిక, రాజకీయ చైతన్యానికి అద్దం పట్టింది. అయితే, విచిత్రమేమిటంటే… పుష్ప శ్రీవాణి వివాహం చేసుకున్నది శత్రుచర్ల విజయరామరాజు సోదరుని కుమారుడు అయిన శత్రుచర్ల పరీక్షిత్ రాజు కావడం గమనార్హం… ఈమె కుల ధ్రువీకరణ విషయంపైనా వివాదాలున్నాయి.
నేటి మేరంగి: గతానికి, వర్తమానానికి వారధి
నేడు మేరంగి ఒక సాధారణ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటికీ, దాని చారిత్రక నేపథ్యం ఆ ప్రాంతపు ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనంపై చెరగని ముద్ర వేసింది. ఒకప్పటి పరిపాలనా కేంద్రమైన మేరంగి కోట నేడు శిథిలావస్థకు చేరుకుని, గతాన్ని గుర్తుచేసే నిశ్శబ్ద సాక్షిగా మిగిలింది. నాగావళి, జంఝావతి నదుల పరీవాహక ప్రాంతానికి సమీపంలో ఉండటంతో వరి, చెరకు, పత్తి, జీడిమామిడి వంటి పంటలతో వ్యవసాయం ఇక్కడి ప్రధాన ఆర్థిక వనరుగా మారింది.
జయపురం సామంతులుగా మొదలై, జమిందారులుగా వెలిగి, ప్రజాస్వామ్య పదవుల వివాదాల నడుమ వందల ఏళ్లు సాగిన మేరంగి జమీందారీ చరిత్ర విజయరామరాజు మృతితో ఒక ముగింపుకు వచ్చినట్టే!
Share this Article