.
Mohan Goteti …. ఆయన ఒక డిగ్నిఫైడ్ రైటర్!
నేను చిన్నప్పటి నుంచీ కృష్ణ గారి అభిమానిని!
అందుకే ఆయని సినిమా వచ్చిందంటే చాలు.. చూసేయడమే!
ఆ సినిమాలోని డైలాగులు ఆ వయసులో అర్థమైనా అవ్వకపోయినా సరే.. చుట్టూ వున్న వాళ్లతో కలిసి చప్పట్లు కొట్టేసేవాడిని.
నేను నైన్త్ క్లాసులో వుండగా అనుకుంటా.. ‘మాయదారి మల్లిగాడు’ సినిమా వచ్చింది.
కృష్ణగారి లుంగీ.. ఆ మీసాలు.. ఆ రఫ్ గెటప్ చూసి .. ఇక ఆగలేకపోయాను.
కొత్తపేట మారుతి టాకీస్ లో అనుకుంటా చూడానికి వెళ్లాను.
సినిమా అంతా సరదాగా.. మాంచి హుషారుగా సాగిపోతోంది..
మంచి మాటలు.. మంచి పాటలు.. మంచి సన్నివేశాలూ.. మా కృష్ణగారి స్టయిలూ.. అంతా.. సూపర్ గా వుంది.
ఉన్నట్టుండి కథ ఒక్కసారిగా మలుపుతిరిగింది..
Ads
మల్లిగాడి (కృష్ణగారు) మీద హత్యా నేరం మోపి జైలులో పెట్టారు.. ప్రాణం చివుక్కుమంది.
ఇంతలో కోర్టు సీన్ వచ్చింది..
పంకజం (జయంతి గారు)ను బోనులో నిలబెట్టారు.
డిఫెన్స్ లాయర్ (కృష్ణంరాజు గారు) ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు.
“పంకజం గారూ.. అర్ధరాత్రి స్వామివారు మీ ఇంటికి ఎందుకు వచ్చారు?” అన్నాడు లాయర్.
“అర్థం లేని ప్రశ్న.. అర్ధ రాత్రుళ్లు ఏ మగాళ్లయినా మా ఇంటికి ఎందుకొస్తారు.. అలాగే స్వామి కూడా వచ్చారు” అని చెప్పింది.
“అంటే.. స్వామివారు కూడా సామాన్యులేనంటారా?” అన్నాడు లాయర్ .
“ఎంతటి అసామాన్యులైనా మా ఇంటికి వచ్చేసరికి అతి సామాన్యులు అయిపోతారు” అంది.
“అబద్ధం.. స్వామివారు దైవాంశసంభూతులు.. స్వామివారిని అపహాస్యం చేస్తున్నారు.. ఆయనపై మీకు పగా? కక్షా? ” అని ప్రశ్నించాడు లాయర్ గట్టిగా.
ఆ మాటకి ఆమె చిన్నగా నవ్వింది..
“నన్నిలాంటి బ్రతుకు బ్రతకమని శాసించిన సమాజంపైనే నాకు కక్షలేదు .. ఇక ఆయనపై ఎందుకు వుంటుంది?” అంది నిస్సహాయంగా.. నిట్టూరుస్తూ.
“ఎలాంటి బ్రతుకు? అనడిగాడు తెలివిగా.
“ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా? అనడిగింది.
“కోర్టు వారికి అర్థమయ్యేలా చెప్పండి” అన్నాడు లాయర్.
ఆమె సిగ్గు, అవమానంతో ఒక్క క్షణం మాట్లాడలేదు..
అతనే మళ్ళీ వాదిస్తూ “అందాన్ని అమ్ముకోవడం నీచంగా అనిపించలేదా?” అనడిగాడు.
“ఇది అనాదిగా వస్తున్నదే.. ఎవరికున్నది వాళ్లు అమ్ముకుంటారు.. కొందరు పరపతిని అమ్ముకుంటారు.. కొందరు పదవిని అమ్ముకుంటారు.. కొందరు మాటని అమ్ముకుంటారు.. కొందరు ఓటుని అమ్ముకుంటారు. కొందరు వరకట్నం పేరుతో కొడుకుల్ని అమ్ముకుంటారు.. కొందరు కన్యాశుల్కం పేరుతో కూతుళ్ళని అమ్ముకుంటారు.. మన దగ్గర వున్న దాన్ని కొనేవాళ్లు వున్నప్పుడే కదా, అమ్మకం జరుగుతుంది.. తప్పేముంది?” అంది ధైర్యంగా పంకజం.
ఆ అబల నిస్సహాయ స్థితి నుంచి వచ్చిన ఆ మాటలకి ప్రేక్షకులు విపరీతంగా క్లాప్స్ కొట్టారు..
అలా క్లాప్స్ కొట్టిన వాళ్లలో నేనూ వున్నాను.. ఆ వయసులో ఆ మాటల లోతు తెలియకపోయినా.
ఆ మాటలు రాసింది సత్యానంద్ గారు!

ఆయనకు అదే తొలి చిత్రం..
అప్పటికి ఆయనది చిన్న వయసే.. అయినా తూటాల్లా పేలిన ఆ పెద్ద పెద్ద మాటలు రాసి.. ఒక్కసారిగా పెద్ద రచయిత అయిపోయాడు!
ఆ సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి సత్యానంద్ గారు మేనల్లుడు.
తొలి చిత్రంతోనే మామయ్యకు తగ్గా మేనల్లుడు అనిపించుకున్నాడు.
టాలెంటు లేనిదే మేనల్లుడికి కాదు కదా.. కొడుక్కి కూడా చాన్స్ ఇవ్వని మొహమాటం లేని నిక్కచ్చి మనిషి ఆదుర్తి గారు.
ఆయన మేనల్లుడిలోని ప్రతిభను గుర్తించారు కాబట్టే అంత పెద్ద సినిమాకి చాన్స్ ఇచ్చారు.
అది ఆ మేనల్లుడు నిలబెట్టుకున్నాడు.
ఆయన రాసిన ఆ డైలాగులు హిట్.. పాటలు హిట్.. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ హిట్.. డైరెక్షన్ సూపర్ హిట్.. వెరసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్!
అంతే .. సత్యానంద్ గారు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుసగా ‘మంచిమనుషులు’, ‘ఊర్వశి’, ‘జ్యోతి’.. అలా అలా పడిపోయాయి.
సినిమా డైలాగులు రాయడంలో ఆయనదొక ట్రెండ్!
కమర్షియల్ సినిమాకి కరెక్టుగా సూటయ్యే డైలాగులు రాయడంలో దిట్ట!
మాటలు రాయడంలో ఆయన ఏ ఇజాల జోలికీ పోలేదు.. అన్నీ నిజాలే రాశాడు.. మానవ నైజాలే చెప్పాడు.
రొమాన్స్ మనోహరంగా రాసి కైపెక్కించాడు..
సెంటిమెంటు రాసి కన్నీళ్లు తెప్పించాడు..
కామెడీ కొసరికొసరి వడ్డించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు..
ఎమోషన్ రాసి హృదయాలు కదిలించాడు..
అసలు ఆయన టచ్ చేయనిది ఏముంది?
‘కొండవీటి సింహం’లో ఎటువంటి డైలాగులు?
‘జస్టిస్ చౌదరిలో’ ఏం సంభాషణలు?
‘యముడికి మొగుడు’లో మాటలు అదర గొట్టేయలేదా?
‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’లో అసలు ఆ డైలాగులు మామూలు డైలాగులా?
ఇక ‘అల్లుడుగారు’ చెప్పేక్కర్లేదు కదా?
కొదమసింహం..
క్షణక్షణం..
రౌడీ అల్లుడు
ఎన్ని సినిమాలు..
ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. శోభన్ బాబు.. మోహన్ బాబు.. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేశ్.. ఆ తర్వాతి తరం.. అందరికీ మాటలు రాసి మాట నిలబెట్టుకున్న మేధావి రచయిత ఆయన!
అప్పట్లో..
ఓపక్క జంధ్యాల గారు.. మరోపక్క ఈయన!
పోటాపోటీ సినిమాలు.. పోటీపడి డైలాగులు!
ఇద్దరూ ఇద్దరే.. దాసరి, రాఘవేంద్రరావు గార్లలా!
ఒకళ్లు ఒక హిట్ సినిమాకి రాస్తే.. మరొకరు మరొక హిట్ సినిమా కొట్టేవారు.
అసలు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి, కోదండరామిరెడ్డి గారికి ఎక్కువ సినిమాలకు మాటలు రాసింది సత్యానంద్ గారే!
రావడం రావడమే ఆయన స్టార్ ఇమేజ్ తో వచ్చారు.
ఆ ఇమేజ్ అలా.. అలా.. పెరిగిపోయింది..
సత్యానంద్ గారు ఒక డిగ్నిఫైడ్ రైటర్..
‘రైటర్ డిగ్నిటీ’ అన్నది ఆయనను చూసి నేర్చుకోవాలి!
స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గని డిగ్నిటీ!
అది ఆయన తెచ్చుకున్నది కాదు.. దానికదే ఆయనకు వచ్చేసింది.. దానిని ఆయన జారిపోకుండా అలా ఒడిసిపట్టుకుని నిలబెట్టుకున్నారు.
‘నొప్పింపక తానొవ్వక’ అన్నది ఆయనకు హండ్రడ్ పర్సంట్ వర్తిస్తుంది.
ఎవరితోనూ గొడవలు వుండవు.. ఎవరితోనూ రాసుకుని పూసుకుని తిరగడాలూ వుండవు.
ఆయనకంటూ ఓ ఎలైట్ సర్కిల్ వుంది.
ఆయనే కావాలని కోరుకునే సర్కిల్ అది!
ఆయన కంపెనీని ఆస్వాదించే పెద్ద కంపెనీ అది!
అలాంటి సర్కిల్ ఎంతమంది ఇక్కడ సంపాదించుకున్నారు?
ఆయనలా ‘జంటిల్మన్ రైటర్’ అనే పేరు ఎంతమంది తెచ్చుకున్నారు.. ఏమో.. నాకైతే లెక్క తెలియదు!
సత్యానంద్ గారు మొదటి నుంచీ మీడియాకు అంటీ ముట్టనట్టు వుంటారు.
షూటింగులో కలిసినప్పుడు మనం విష్ చేస్తే తనూ చేస్తారు..
మనం మాట్లాడిస్తే మాట్లాడతారు.. ఏది అడిగినా వినయంగా చెబుతారు.
‘నేను ఇన్ని వందల సినిమాలకు రాశాను తెలుసా?’ అన్నది ఆయనలో ఎప్పుడూ కనపడదు.
అందుకే.. అన్నేళ్ల నుంచీ నేను జర్నలిస్టుగా వున్నా.. ఎన్నో సార్లు షూటింగులలో కలుసుకుని మాట్లాడుకున్నా.. రెండు మూడు సార్లు మాత్రమే ఆయనని ఇంటర్వ్యూ చేసి వుంటాను.
స్క్రీన్ ప్లే అంటే ఎవరికైనా ఆయనే గుర్తొస్తారు.
ఆయా సీన్లు ఆయన కలానికి సలాం అంటూ అలా ఒదిగిపోతాయి మరి..
అందుకే.. ఇప్పటికీ ఎవరైనా స్క్రీన్ ప్లే విషయంలో ఆయననే సంప్రదిస్తూ వుంటారు.
అన్నట్టు మీకో విషయం తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ తాను చేయబోయే సినిమా కథను ఒకసారి ఆయనకు వినిపించి.. సలహా తీసుకుంటూ వుంటారు.
ఆయనకు ఆయనంటే అంతటి గురి!
ఇప్పటివరకు వందలాది సినిమాలకు కథలు రాసి.. మంచి మాటలు సత్యానంద్ గారు ఇప్పటికీ కొత్త రచయితలానే ప్రతి రోజూ ఫేస్ బుక్కులో ఒక్కో కథ రాస్తూనే వున్నారు.
అవి సినిమా కథలు కాకపోయినా .. సినిమాల చుట్టూ తమాషాగా తిరిగే వ్యంగ్య కథలు..
ఆయన రాస్తున్నవన్నీ జీవిత సత్యాలు.
కొన్ని చురుక్కుమంటాయి..’
మరికొన్ని చమక్కు మంటాయి..
ఇంకొన్ని మన మత్తు వదిలిస్తాయి..
ఆయన కలం ఆగదు ..
అలా రాస్తూనే వుంటుంది..
మనకు అందమైన కథలు చెబుతూనే వుంటుంది!
అది నిత్యసత్యానందం! (నిన్న ఆయన జన్మదినం)….
-మోహన్ గోటేటి
Share this Article