Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ… ఆ పొగల చాయ్ తాగితేనే కదా అసలు మజా !!

November 23, 2026 by M S R

.

పొద్దున్నే ఓ వార్త… అదేదో సర్వేనట… పొగలు గక్కే చాయ్ అలాగే తాగేస్తే కేన్సర్ ముప్పట, అన్నవాహికకు నష్టమట… ప్చ్, వీళ్లు చివరకు మాంచి వేడి వేడి చాయ్ తాగే తృప్తిని కూడా లాగేసుకుంటున్నార్రా బాబూ అనిపించింది…

అవును, చాయ్ అంటే దాన్ని తాగే పద్ధతిలోనే ఓ తృప్తి, ఓ థ్రిల్… ఓ రిలాక్స్… అదీ సీస గ్లాసులో పొగలు గక్కుతూ ఉండాలి… చేతులకు ఆ వెచ్చదనం తగలాలి… ఊదుకుంటూ ఒక్కో గుక్క, కాదు, కాస్త కాస్త సిప్ చేస్తుంటే కదా ఆ చాయ్ తాగిన అసలు ఫీల్… నాలుక చురుక్కుమనాలి… కాసేపలా లుంగలు చుట్టుకుపోవాలి అది…

Ads

నిజానికి ఇప్పుడంటే చాయ్ అనగానే… అప్పటికే మరిగీ మరిగీ ఫ్లాస్కుల్లో నిల్వ ఉన్న చాయ్ పేపర్ గ్లాసుల్లో పోసి ఇస్తున్నారు… అదొక ద్రవపదార్థం, అది టీ ఎందుకవుతుంది..? పైగా సీస గ్లాసుల్లో తాగితే వచ్చే మజా పెదాలు కాలే పేపర్ గ్లాసులతో ఎలా వస్తుంది..?

మన కళ్ల ముందే చాయ్ మరుగుతూ ఉంటే… అక్కడికక్కడ అల్లం దంచి అందులో వేశాక, కెటిల్ నుంచి గ్లాసులో పోస్తుంటే వచ్చే ఆ ఫ్లేవర్ ముక్కుపుటాలకు పండుగ కదూ… అందుకే అంటారు, చాయ్‌కు రంగూరుచీవాసనచిక్కదనాలు అన్నీ ముఖ్యమేనని… పైగా ఎందులో తాగుతున్నామనేదీ ప్రధానమేనని… చాయ్‌ ప్రత్యేకంగా తాగితేనే మజా… దానిలోకి బిస్కెట్లు, రస్కులు, సకినాలు, అటుకులు చేరిస్తే అసలు చాయ్ మాధుర్యం కల్లాస్…

ఇప్పుడు రకరకాల టీలు వచ్చాయి మార్కెట్‌లోకి… బ్లాక్ టీ, హెర్బల్ టీ ఎట్సెట్రా… పైగా పెద్ద హోటళ్లలో చాయ్ అడిగితే సామాన్లు తెచ్చిస్తాడు వాడు… వేడి నీళ్లను కప్పులో మనకు ఎంత కావాలో పోసుకోవాలి, పాలు మీ ఇష్టం, విడిగా తెస్తాడు, సుగర్ మీ రోగాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి… స్వీటనర్లు తప్పనిసరి… అందులోకి టీ బ్యాగ్ ముంచి, కాసేపు ముంచీ తేల్చీ, పర్లేదు, రంగు వచ్చింది అనుకోగానే తాగాలి, కాదు, తాగినట్టు నటించాలి…

writing

ఐనా హైదరాబాద్ టీ అంటే మాసబ్ ట్యాంక్ నీలోఫర్ టీ… ఆ రుచి జుబ్లీహిల్స్ టీలో ఉంటుందా..? ఉండదు..? ఇంటికొచ్చిన అతిథికి స్వీట్లూ, టిఫినీలు పెట్టకపోయినా మంచి టీ పోస్తే వచ్చే మర్యాదే వేరు… లేదంటే వాడు కనీసం చాయ్ కూడా పోయలేదురా అని తిట్టేస్తారు మరి…

వాస్తవంగా టీ ఆరోగ్యానికి మంచిదే… అతిగా సేవించకపోతే, పరిమితుల్లో ఉంటే… నో, నో, మాములూ టీ కాదు, బ్లాక్ టీ అయితేనే… అంటే రంగు, రుచి, వాసన, చిక్కదనం ఏదీ లేని ఉత్త ద్రావకం తాగితేనే ఆరోగ్యం అని డాక్టర్లు, యూట్యూబ్ డాక్టర్లు మరీ మరీ చెబుతుండేసరికి… టీ తాగాలనే ఉత్సాహమే ఆవిరవుతోంది సొసైటీలో…

అన్నట్టు పొగలు గక్కే టీతో కేన్సర్ ప్రమాదం అంటున్నాడు కదా వాడెవడో… అది చెప్పుకుందాం ఓసారి…

tea

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) 65 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలో ఉన్న పానీయాలను తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది…

దీనిని ‘ప్రాబబ్లీ కార్సినోజెనిక్’ (Group 2A) విభాగంలో చేర్చింది… అంటే క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశంపై శాస్త్రీయ ఆధారాలున్నాయి కానీ, ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని కాదు… ఇక్కడ ప్రమాదం టీ పొడిలోనో, పాలలోనో లేదు… మరీ ఎక్కువ వేడితో గొంతు నుంచి అన్నవాహిక వరకు లోపలి పొరలు పదేపదే దెబ్బతినడమే ప్రధాన ఆందోళన…

అంటే టీ చల్లారకూడదు… ఆరోగ్యం చెడకూడదు! ఈ రెండింటి మధ్య ఓ చిన్న సమన్వయమే ఇప్పుడు అసలు పరీక్ష..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ… ఆ పొగల చాయ్ తాగితేనే కదా అసలు మజా !!
  • కులగణన, స్కిల్ డెవలప్మెంట్… మోదీ నోట రే-రె (Re-Re) మాట..!!
  • ఎఐ రంగులు అద్దుకుని కొత్తగా వినిపిస్తున్న ఆపాత మధురాలు !
  • రాధికా ఆప్టే ఎద్దేవా నుంచి- సుప్రీంకోర్టు దాకా…. మేనరికాలు!!
  • తెలంగాణ కవితకు సహజమైన ఈ స్థానిక వాడుక భాష అర్థం కాలేదా..?!
  • ముఖ్యమంత్రి కాదు… మఠాధిపతి కాదు… ఆ అమ్మకు మాత్రం కొడుకే!
  • అడ్డంకులు తొలిగాయి- రేవంత్ కొరడా ఝళిపించాలి ఇక…
  • అయ్యా, న్యాయమూర్తి గారూ… రాజీనామా చేస్తే నేరం రద్దయిపోదు..!!
  • క్రైస్తవ మతప్రచారకుల ఇంట హిందూ వైదిక పెళ్లి తంతు..?!
  • ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా… తెలంగాణ అభివృద్ధి ఆగలేదు, ఆగదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions