.
తొలి సెంచరీ నుంచి తొలి సిరీస్ విజయం వరకు.. తెరకెక్కబోతున్న ఓ క్రికెట్ దిగ్గజం కథ! భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో తొలి ఘనతల చిరునామా లాలా!
భారత క్రికెట్ ఆరంభం గురించి చెప్పుకోవాలంటే… అందుకు ఆద్యుడైన లాలా అమర్నాథ్ గురించీ చెప్పుకోవాలి. ఇప్పుడెందుకంటే… ఆయన బయోపిక్ రూపంలో లాల్ కారా అనే సినిమా తెరకెక్కబోతోంది. లగాన్ తర్వాత ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో.. అమీర్ ఖాన్ లాలాగా… విక్రాంత్ మాసేతో పాటు, జితేంద్ర కుమార్, ధైర్య కార్వా వంటి నటులతో ఈ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయి.
Ads
మరో విశేషమేంటంటే.. ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంటే… త్రీ ఈడియట్స్ వంటి వెర్సటైల్ సినిమాల దర్శకుడు రాజు హిరానీ స్క్రిప్ట్ రైటింగ్ లో మరో ఇద్దరితో కలిసి భాగస్వామ్యమైతున్నాడు. ఇక సినిమా ఏ విధంగా ఉండబోతోందన్నది కొంత క్యూరియాసిటీ ఎలాగూ ఉండనే ఉంటుంది. అయితే, ఈ బయోపిక్ ఎంచుకోవడం వెనుక కారణమేంటో తెలుసుకోవాలంటే ఓసారి లాలా అమర్నాథ్ హిస్టరీలోకి వెళ్లాలి.

రికార్డుల వీరుడు! స్వాతంత్రమనంతరం భారతదేశానికి మొట్టమొదటి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం నుంచి ఎన్నో రికార్డులు సాధించిన ఘనత లాలా అమర్నాథ్ ది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం కపిల్, సచిన్, కోహ్లీ వీళ్లందరి గురించీ.. వారి వ్యక్తిగత రికార్డుల గురించి.. భారత క్రికెట్ టీంకు వారి సేవల గురించి చెప్పుకుంటాం. కానీ, అసలు భారత క్రికెట్ కు ఒక దిక్సూచి అయినవాడు.. తన ఆటతోనూ, కెప్టెన్సీతోనూ, వ్యక్తిత్వంతోనూ ప్రత్యేకంగా నిల్చినవాడు మాత్రం లాలా అమర్నాథ్ మాత్రమే. అందుకే ఈయన కథను ఆశుతోష్ గోవారికర్ ఎంచుకుని ఉండొచ్చు.
రికార్డుల పరంగా కూడా లాలా కెరీర్ ఆశ్చర్యపర్చేది. ముఖ్యంగా భారత టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటి సెంచరీ కొట్టిన ఆటగాడిగా లాలాది రికార్డ్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననంతరం పాకిస్థాన్ తో 1952లో పాక్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో 2-1 తేడాతో సీరిస్ ను గెలిపించిన కెప్టెన్ గా లాలా అమర్నాథ్ ఎప్పటికీ గుర్తుండే క్రీడాకారుడు. అంతేనా, బ్రాడ్ మన్ అంతటివాణ్ని హిట్ వికెట్ తో ఔట్ చేసిన ఏకైక బౌలర్.
భారత క్రికెట్ లో ఎన్నో చారిత్రక ఘనతలకు తొలి అడుగులు పడ్డవీ.. ఆయన ప్రయాణంతోనే. ఆటగాడిగానే కాదు.. కెప్టెన్ గా, కోచ్ గా, సెలక్టర్ గా, వ్యాఖ్యాతగా.. ఇలా పలు రూపాల్లో భారత క్రికెట్ కు సేవలందించిన క్రీడాకారుడు లాలా అమర్నాథ్.
ఆరంగేట్రం చేసిన టెస్టుతోనే చరిత్ర సృష్టించిన లాలా! 1911 సెప్టెంబర్ 11న పంజాబ్‌లో జన్మించిన లాలా అమర్‌నాథ్ అసలు పేరు.. నానిక్ అమర్‌నాథ్ భరద్వాజ్. 1933 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టారు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 118 పరుగులు సాధించి.. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అయితే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఆ రోజుల్లో భారత క్రికెట్ ఇంకా అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉంది. అలాంటి సమయంలో ఒక భారతీయ ఆటగాడు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడమంటే మాటలేం కాదు. కచ్చితంగా అదో విశేషమే.
స్వతంత్ర భారత తొలి కెప్టెన్! 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్ బాధ్యతలు చేపట్టారు. 1947 నుంచి 1952 వరకు వివిధ సందర్భాల్లో జట్టుకు నాయకత్వం వహించారు. ఆయన కెప్టెన్సీలో భారత్ 15 టెస్టులు ఆడింది. రెండు విజయాలు సాధించింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అయితే ఆయన నాయకత్వంలో సాధించిన గొప్ప విజయం.. పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ సిరీస్ గెలవడం.
1952లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మొదలవుతున్న ఆ తొలి రోజుల్లో.. ఆ విజయం భారత క్రికెట్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆ సీరిస్ బేస్డ్ గానే రాబోయే ఆశుతోష్ గోవారికర్ లాల్ కారా ఉంటుందన్న చర్చా జరుగుతోంది.
బ్రాడ్‌మన్‌ను హిట్ వికెట్ చేసిన ఏకైక బౌలర్! ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ పేర్లలో ఇప్పటికీ ఒకడిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ను అవుట్ చేయడమంటే బౌలర్లకు ముచ్చెమటలు పట్టేవి. ఒకవేళ ఎవరైనా ఔట్ చేస్తే.. అది ఆ బౌలర్ కెరీర్ లోనో ఓ గొప్ప విజయం, తృప్తి. అలాంటి ఘనతను లాలా అమర్‌నాథ్ సాధించాడు. బ్రాడ్‌మన్‌ను హిట్ వికెట్‌గా అవుట్ చేసిన ఏకైక బౌలర్‌గా ఆయన గుర్తింపు పొందాడు.
1947 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో.. బ్రాడ్‌మన్ 185 పరుగులు చేసిన తర్వాత లాలా అమర్‌నాథ్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో ఆ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.
గణాంకాలకు మించిన ఆటగాడు! లాలా అమర్‌నాథ్ తన టెస్ట్ కెరీర్‌లో 24 మ్యాచ్‌లు ఆడాడు. 878 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 45 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 96 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ.. ఆయన రికార్డులు విశేషమైనవే. 186 మ్యాచ్‌ల్లో 10 వేల 426 పరుగులు సాధించాడు. అందులో 31 సెంచరీలు, 39 అర్ధసెంచరీలున్నాయి. లాలా అమర్నాథ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 262 పరుగులు.
అయితే లాలా కెరీర్‌లో కొన్ని వివాదాలూ ఉన్నాయి. 1936లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా క్రమశిక్షణకు సంబంధించిన ఆరోపణలతో జట్టు నుంచి స్వదేశానికి పంపించారు. అప్పటికి ఆయన ఆ పర్యటనలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లలో లాలా ఒకడు. కానీ, అలాంటి ఎదురుదెబ్బలు.. ఆయన క్రికెట్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోయాయి. బహుశా రాబోయే సినిమాలో ఇవే మెయిన్ పాయింట్స్ అవుతాయేమో…
వారసత్వంగా కొనసాగిన లాలా కుటుంబ క్రికెట్ ప్రయాణం! లాలా అమర్‌నాథ్ కుటుంబ వారసత్వం కూడా.. భారత క్రికెట్‌కు సేవలందించింది. ఆయన కుమారులు మొహిందర్ అమర్‌నాథ్, సురేందర్ అమర్‌నాథ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మొహిందర్ అమర్‌నాథ్ 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక ఆటగాడు. సురేందర్ అమర్‌నాథ్ కూడా టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు.
ఆటగాడిగా రిటైరైన తర్వాత లాలా అమర్‌నాథ్ జాతీయ సెలెక్టర్‌గా, కోచ్‌గా, క్రికెట్ వ్యాఖ్యాతగా సేవలందించాడు. 1991లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించింది. 1994లో బీసీసీఐ అందించే కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని.. తొలిసారిగా అందుకున్న క్రీడాకారుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. 2000 ఆగస్టు 5న లాలా అమర్నాథ్ కన్నుమూశారు…
Share this Article