Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!

November 25, 2026 by M S R

.

సోనియా గాంధీ రాసిన ‘Belonging: A Journey of Love’ పుస్తకం ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది… అయితే ఈసారి పుస్తకంలోని విషయాల కంటే అందులో ప్రస్తావించకుండా వదిలేసిన అంశాలే ఆసక్తిని రేపుతున్నాయి… తాజాగా తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో జరిగిన సంభాషణలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి…

తన తల్లి రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందని, చివరకు ఎంతో గౌరవనీయులుగా చెలామణి అయ్యే వ్యక్తులు కూడా ఆమెను దారుణంగా అవమానించారని (brutalised, humiliated and abused) రాహుల్ చెప్పాడు… అయితే ఆ వ్యక్తుల గురించి సోనియా తన పుస్తకంలో ప్రస్తావించలేదని, బహుశా తాను ఎప్పుడో ఒకరోజు ఆ విషయాలు బయటపెడతానని అన్నాడు…

Ads

అదే సంభాషణలో తన తండ్రి రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని కూడా రాహుల్ ఆరోపించాడు… ఆయనకు తగిన రక్షణ లేకుండా చేసి, హత్యకు అనువైన వాతావరణాన్ని సృష్టించారని తన అభిప్రాయాన్ని (కుట్ర?) వెల్లడించాడు…

రాహుల్ ఎవరి పేర్లు చెబుతాడు రాబోయే కాలంలో..? ఈ ప్రశ్నను వదిలేస్తే రాజీవ్ హత్య వెనుక విస్తృత కుట్ర కోణాన్ని పరిశీలించినప్పుడు గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి… అలాంటి పేర్లలో ఒకటి నేమీచంద్ జైన్ అలియాస్ చంద్రస్వామి!

చంద్రస్వామి

ఎవరీ చంద్రస్వామి? ఒకప్పుడు దేశ రాజకీయ, పారిశ్రామిక, అంతర్జాతీయ వర్గాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తిగా చంద్రస్వామికి గుర్తింపు ఉండేది… రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, విదేశీ ప్రముఖులతో ఆయనకు పరిచయాలుండేవి… పీవీ నరసింహారావుతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం కూడా ఉండేది…

అయితే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రస్వామికి ఆయనతో విభేదాలు ఏర్పడ్డాయని, రాజీవ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన రాజకీయ ప్రయత్నాల్లో చంద్రస్వామి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి… జస్టిస్ ఎం.సి. జైన్ కమిషన్ రాజీవ్ గాంధీ హత్య వెనుక కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నప్పుడు చంద్రస్వామి పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది…

ఆయనకు రాజీవ్ గాంధీపై తీవ్ర వ్యతిరేకత ఉండేదని, రాజీవ్‌ను అంతం చేస్తానంటూ వ్యాఖ్యలు చేసినట్టు కొందరు సాక్షులు చెప్పిన అంశాలను కమిషన్ పరిశీలించింది… కేవలం రాజకీయ వ్యతిరేకతతోనే ఆగకుండా, హత్యకు అవసరమైన నిధుల సమకూర్పులోనూ చంద్రస్వామి పాత్ర ఉండి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమైంది…

సీబీఐ కూడా అనుమానించింది! 1998లో జైన్ కమిషన్ తుది నివేదిక అనంతరం రాజీవ్ హత్య వెనుక విస్తృత కుట్ర కోణంపై మరింత దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ పరిధిలో మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ (MDMA) ఏర్పాటు చేసింది…

2004 డిసెంబర్‌లో ఈ దర్యాప్తు సంస్థ తరఫున సీబీఐ అధికారి బి.ఎన్. మిశ్రా ఢిల్లీ కోర్టుకు కీలకమైన విషయాన్ని వెల్లడించాడు… రాజీవ్ గాంధీ హత్యకు చంద్రస్వామి నిధులు సమకూర్చి ఉండవచ్చనే ఆరోపణపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపాడు… చంద్రస్వామికి ఈ హత్యతో సంబంధం ఉండవచ్చనే అనుమానాలను లేవనెత్తే ఆధారాలు ఉన్నాయని కూడా కోర్టుకు వివరించాడు…

ఇదే సమయంలో జైన్ కమిషన్ నివేదికలోనూ చంద్రస్వామి పాత్రపై మరింత దర్యాప్తు చేయాలని సూచనలు ఉండటంతో ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది… కానీ 2005 జనవరిలో అప్పటి దర్యాప్తు సంస్థలు ఆయనకు రాజీవ్ హత్యతో సంబంధం ఉందని నిరూపించడానికి తగిన ఆధారాలు సంపాదించలేకపోయాయని వార్తలు వచ్చాయి… దర్యాప్తు కొనసాగినా ఆయనపై ఈ హత్యకు సంబంధించి నేరం నిరూపితం కాలేదు…

రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీఈ ప్రత్యక్షంగా బాధ్యత వహించిందన్నది న్యాయపరంగా నిర్ధారణ అయిన అంశం… అయితే దాని వెనుక మరేదైనా విస్తృత కుట్ర ఉందా? ఉంటే అందులో ఎవరి పాత్ర ఎంత? అనే ప్రశ్నలపై దర్యాప్తు చరిత్రలో అనేక సందేహాలు మిగిలాయి… 2022లో ఈ విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎండీఎంఏను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడమే ఇందుకు నేపథ్యం…

ఇక్కడే 2013లో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’ సినిమా గుర్తుకొస్తుంది… రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన శ్రీలంక అంతర్యుద్ధం, ఎల్టీటీఈ కార్యకలాపాలు, రా రహస్య ఆపరేషన్ల నేపథ్యంలో సాగిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కొన్ని ఆసక్తికరమైన హింట్స్ వదులుతుంది… సినిమాలోని కథ, పాత్రలు కల్పితమైనవే అయినా వాటి వెనుక అప్పటి వాస్తవ రాజకీయ, నిఘా వ్యవస్థల పరిణామాల ఛాయలు కనిపిస్తాయి… ముఖ్యంగా ఒక రా అధికారి హనీట్రాప్‌కు గురయ్యే ఎపిసోడ్‌కు నిజ జీవితంలో జరిగిన మరో ఘటన నేపథ్యంగా నిలిచింది… అయితే ఆ ఘటనకు రాజీవ్ హత్యతో సంబంధం లేదు…

మరికొన్ని ప్రచారాలూ అప్పట్లో సాగేవి… చంద్రస్వామితో సౌదీ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీ బంధాలు… చంద్రస్వామితో పీవీ బంధాలు… ఒకప్పటి టాప్ హాట్ మోడల్ పమేలా బోర్డెస్‌ ప్రస్తావనతో అప్పట్లో చాలా ప్రచారాలు వినిపించేవి…

సో, రాజీవ్ హత్యలో ఫలానా ఫలానా వ్యక్తుల ప్రమేయాన్ని సోనియా పరోక్షంగా కూడా ప్రస్తావించకపోవడం ఆమె ఇష్టం… రాహుల్ ఎవరి పేర్లను చెబుతాడనేదీ వేచి చూడాల్సిందే… కాకపోతే ఆ పాత చంద్రస్వామి ఉదంతాన్ని గుర్తుచేయడమే ఈ కథన ఉద్దేశం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!
  • ఏకంగా అమెరికా భద్రత వ్యవస్థల్లోకే జొరబాటు..! ఏదో పెద్ద మిస్టరీ !!
  • విజయ్- త్రిష బంధం ఓకే… మరి మధ్యలోకి ఉదయనిధి ఎందుకొచ్చాడు?!
  • చిరంజీవికి ఎవరూ చెప్పినట్టు లేదు- ఆ ‘వర్స్’ అనే పదమే అశుభసంకేతం!!
  • కార్తీకదీపం కంట్రవర్సీ! ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? ఆర్టికల్ 356 ఆషామాషీ కాదు!!
  • Suicidal – ఉక్రెయిన్ యుద్ధం.. రష్యాకు కనిపించని మహా విపత్తు!
  • ఎవరు ఈ మూర్తి..? ఏమిటి ఈ వెలి..? ఇదేం జర్నలిజం..?
  • లేదు, అక్కడ ‘కార్తీకదీపం’ వెలిగించలేదు- కోర్టు తీర్పులూ బేఖాతరు!
  • వైభవం! ఒకే మ్యాచులో ఏకంగా ఎనిమిది వరల్డ్ రికార్డులు!
  • వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions