.
మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదు. సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచ్చిపిళయార్ ఆలయం వద్దే దీపం వెలిగించి, వివాదాస్పద స్తంభాన్ని చీకట్లోనే వదిలేసింది.
దీంతో విజయ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Ads
వినడానికి ఆవేశం కలిగించే వాదనలే. కానీ రాజ్యాంగం ఆవేశంతో పనిచేయదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయలేదని, కేంద్రం వెంటనే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేయవచ్చా? అసలు ఆర్టికల్ 356 అంత సులభంగా ప్రయోగించగలిగే అధికారమా? ఇక్కడే చాలామంది మర్చిపోతున్న ఒక రాజ్యాంగ చరిత్ర ఉంది.

ఆర్టికల్ 356.. ఒకప్పుడు కేంద్రం చేతిలో రాజకీయ అస్త్రం! స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాల్లో ఆర్టికల్ 356 కేంద్ర ప్రభుత్వానికి ఒక తిరుగులేని రాజకీయ ఆయుధంగా ఉండేది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంటే చాలు, అక్కడ పాలన సరిగ్గా సాగడం లేదనో, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనో గవర్నర్ నివేదిక పంపడం, కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం జరిగేవి.
ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో ఈ అధికరణ దుర్వినియోగం విపరీతంగా జరిగిందన్న విమర్శలున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రద్దు చేసిన సందర్భాలు అనేకం. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉండటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పుగా మారిన రోజులవి.
కానీ ఈ పరిస్థితికి సుప్రీంకోర్టు ఒక గట్టి కళ్లెం వేసింది. ఎస్.ఆర్. బొమ్మై.. కేంద్ర ప్రభుత్వాల విచ్చలవిడితనానికి బ్రేక్! 1994లో ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు భారత సమాఖ్య వ్యవస్థలో ఒక మైలురాయి. ఆర్టికల్ 356ను కేంద్రం ఇష్టానుసారం ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని అనుకుంటే అసెంబ్లీలోనే తేల్చాలి. గవర్నర్ నివేదికే అంతిమ సత్యం కాదు. రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయం కూడా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉందన్న కారణంతో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదు.
అంతేకాదు, రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కూడా కోర్టు ఆ నిర్ణయం తప్పని తేల్చితే పాత ప్రభుత్వాన్ని, అసెంబ్లీని పునరుద్ధరించవచ్చు. అంటే ఒకప్పుడు కేంద్రం చేతిలో ఉన్న ఆర్టికల్ 356 అనే రాజకీయ ఆయుధానికి ఇప్పుడు రాజ్యాంగపరమైన భద్రతా కవచాలు ఏర్పడ్డాయి.
మోదీకి మమత ప్రభుత్వం నచ్చకపోతే రద్దు చేసి ఉండేదా? ఇక్కడే అసలు విషయం ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా ఏళ్ల తరబడీ ఎంతటి వైరుధ్యం ఉందో తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, గవర్నర్తో ఘర్షణలు, ఎన్నికల హింస, శాంతిభద్రతలపై ఆరోపణలు.. ఇలా అనేక అంశాల్లో కేంద్రం, రాష్ట్రం మధ్య నిరంతర సంఘర్షణ కొనసాగింది. అయినా మమత ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ప్రయోగించి కేంద్రం రద్దు చేయలేదు.
ఎందుకు? మమత ప్రభుత్వంపై విమర్శలు లేవనా? రాష్ట్రంలో సమస్యలు లేవనా? కేంద్రానికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే ప్రభుత్వం కాదనా? అలాంటిదేమీ కాదు.
కానీ ఒక రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందనో, కేంద్రంతో ఘర్షణ పడుతోందనో, గవర్నర్తో విభేదిస్తోందనో చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఇప్పుడు అంత తేలిక కాదు. రాజ్యాంగ యంత్రాంగం నిజంగానే విఫలమైందని నిరూపించగలిగే ఆధారాలు ఉండాలి. రాజకీయ అసౌకర్యం రాజ్యాంగ వైఫల్యం కాదు.

ఇక్కడ మోదీ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సమర్థించాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 356 ప్రయోగించకపోవడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వ సంయమనం మాత్రమే కాదు. సుప్రీంకోర్టు విధించిన రాజ్యాంగపరమైన పరిమితులు కూడా అంతే కీలకం.
మరి విజయ్ ప్రభుత్వం విషయంలో ఏం చేయాలి? మధురై దీపం వివాదంలో విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయకపోవడం తీవ్రమైన విషయం. పైగా అమలు చేస్తామని న్యాయస్థానానికి హామీ ఇచ్చిన తర్వాత కూడా దీపత్తూన్ వద్ద దీపం వెలిగించకపోవడం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరమైన పరిణామం.
కానీ విజయ్ ప్రభుత్వం తెలివిగా ట్రస్టు బోర్డును ముందుపెట్టింది… దేవాలయ ట్రస్టు సభ్యులు నిన్న రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు… ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే దేవాలయం లోపల కొండపై దీపం వెలిగించామని, ఆ దీపస్తంభం దగ్గర వెలిగించాల్సిన అవసరం లేదని, అక్కడ దీపం వెలిగించే సంప్రదాయం ఎప్పుడో కనుమరుగైందని, సంప్రదాయాలను పరిశీలించిన తరువాత ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బహిరంగంగా ప్రకటించారు…
ఇక్కడ సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ట్రస్టు సభ్యులు తీసుకున్న నిర్ణయం ముఖ్యమా? లేక కోర్టు ఇచ్చిన ఆదేశం ముఖ్యమా? అనే చిక్కుముడి ఏర్పడింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పనుందో చూడాలి, కలెక్టర్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంది… కోర్టు ధిక్కరణకు బాధ్యులైన అధికారులను, సంబంధిత వ్యక్తులను కోర్టు ప్రశ్నించవచ్చు. వారి వివరణ కోరవచ్చు. ఉద్దేశపూర్వక ధిక్కరణ నిరూపితమైతే చట్టప్రకారం శిక్షించవచ్చు. ఆదేశాన్ని అమలు చేయాల్సిందేనని మళ్లీ స్పష్టం చేయవచ్చు. అవసరమైతే బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తీసుకోవచ్చు.
అంతేకానీ ఒక కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించారన్న ఒక్క కారణంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీని పక్కన పెట్టేయడం మరో స్థాయి రాజ్యాంగ చర్య.
ఆర్టికల్ 356 ప్రయోగించాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొనసాగించడం అసాధ్యమైందని నిరూపించాలి. అది కూడా తగిన ఆధారాలతో. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంటు రెండు నెలల్లో ఆమోదించాలి. ఆ ప్రక్రియ కూడా న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది.
అందుకే 356 చివరి అస్త్రం.. మొదటి స్పందన కాదు! ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా గుర్తించాలి. విజయ్ ప్రభుత్వానికి సొంతంగా అసెంబ్లీలో మెజారిటీ లేదు. మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోంది. దీపత్తూన్ వివాదంలో కొన్ని మిత్రపక్షాలు రెండో చోట దీపం వెలిగించడానికి వ్యతిరేకంగా నిలిచాయి. ఆ రాజకీయ ఒత్తిడి కూడా విజయ్ నిర్ణయంపై ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది.
- అంటే ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశం, మరోవైపు మిత్రపక్షాల అభ్యంతరాలు, ఇంకోవైపు ప్రభుత్వ మనుగడ.. ఈ మూడు మధ్య విజయ్ ప్రభుత్వం చిక్కుకుంది. ఇది ఆ ప్రభుత్వ రాజకీయ బలహీనతను చూపవచ్చు. కానీ అదే ఆర్టికల్ 356 ప్రయోగించడానికి సరిపడే రాజ్యాంగ ప్రాతిపదిక కాదు.
ఒకవేళ ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, న్యాయస్థానాల ఆదేశాలను నిరంతరం అమలు చేయకుండా, రాజ్యాంగ యంత్రాంగం పనిచేయలేని పరిస్థితిని సృష్టిస్తే అప్పుడు కేంద్రం తన రాజ్యాంగ బాధ్యతలను పరిశీలించాల్సి రావచ్చు. కానీ ఒక నిర్దిష్ట వివాదంలో జరిగిన ఉల్లంఘనను మొత్తం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంగా పరిగణించలేం.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని కూల్చడం కంటే, ప్రభుత్వాన్ని రాజ్యాంగం ముందు నిలబెట్టడం ముఖ్యం. ఒకప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వాలను తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకునేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుల కారణంగా ఆర్టికల్ 356 అంత తేలిగ్గా ప్రయోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే…
Share this Article