Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణతనం అంటే రక్తపాతమేనా? ఇదేం ‘భోగి’రా శర్వానందూ..!!

November 27, 2026 by M S R

.

రంగస్థలం మత్తులో మరో సినిమా… భోగి పేరుతో హింసాతాండవం! కథలో ఎమోషన్ లేదు… తెర నిండా నెత్తుటి మరకలు! తెలంగాణ మట్టి పేరుతో మూస సినిమాల వ్యాపారం!! అసలు ఏమాత్రం తెలంగాణతనం ఏమాత్రం మిగలని చంద్రబోస్ ఏదో పాట రాశాడూ అంటేనే డౌటొచ్చింది… అవును, సినిమా ఆ పాటలాగే కృతకంగానే ఉంది… జీరో తెలంగాణతనం…

తెలంగాణ పాట కావాలి, మాట కావాలి, నేపథ్యం కావాలి, కథ కావాలి, కాబట్టి శర్వానంద్‌కు ఓ వేషం తొడిగారు… ఆ బాటలో పిచ్చి వేషాలు, హింసకు దిగిన నాని ఈ శర్వానంద్ అనబడే త్రీటైర్ నటుడికి ఆదర్శం.,.. పూర్తిగా దారితప్పాడు…

Ads

గొర్రెల మందలో ఒకటి ముందు నడిస్తే వెనుక ఉన్నవన్నీ ఆలోచించకుండా అదే దారిలో వెళ్తుంటాయి. తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే తయారైంది. సుకుమార్ తీసిన రంగస్థలం ఒక కొత్త దారిని చూపించింది. ఆ సినిమాలో పల్లెటూరి వాతావరణం ఉంది. మట్టి వాసన ఉంది. మనుషుల మధ్య సంబంధాలున్నాయి. కుల, వర్గ ఆధిపత్యాలున్నాయి. అన్నింటికీ మించి గుండెను పిండేసే భావోద్వేగం ఉంది. అందుకే రంగస్థలం అంత పెద్ద విజయాన్ని అందుకుంది.

కానీ ఆ విజయాన్ని చూసినప్పటి నుంచి మన దర్శకులు రంగస్థలం అసలు ఆత్మను కాకుండా దాని పైపై రూపాన్ని పట్టుకున్నారు. ఒంటినిండా మట్టి, మాసిన బట్టలు, చేతిలో కత్తి, నోట్లో పల్లెటూరి యాస, వెనుక చెవులు చిల్లులు పడే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే చాలు… మరో రంగస్థలం తీసేసినట్టేననే భ్రమలో పడిపోయారు. తాజాగా విడుదలైన శర్వానంద్, సంపత్ నంది ‘భోగి’ కూడా ఇదే కోవ…

anupama

తెలంగాణ అంటే కత్తులు, గొడ్డళ్లేనా? 1962 నాటి ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం నేపథ్యంలో భోగి కథను రూపొందించారు. ఒక ఊరు, అక్కడ పటేల్ ఆధిపత్యం, అమాయక ప్రజలపై అరాచకాలు, వాటిని ఎదిరించే హీరో… ఈ కథా నేపథ్యం ఆసక్తికరమైనదే. తెలంగాణ చరిత్రలో భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి, అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు కొదవ లేదు. అలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు దర్శకుడికి గొప్ప అవకాశం ఉంటుంది.

కానీ ఈ సినిమాకు ప్రధాన శాపం దర్శకుడే, మొన్న ఎక్కడో చెబుతున్నాడు, ఉర్దూ ప్రభావం పడని రోజుల కథ అని… అదేదో పెద్ద కనెక్టింగ్ పాయింట్ అన్నట్టుగా… ముందు తెలంగాణతనం ఏమిటో అర్థం చేసుకుంటే ఈ సొల్లు, బేకార్ మాటలు వచ్చేవి కావు…

కానీ ఆ అవకాశాన్ని తెరపై ఎంత బలంగా ఆవిష్కరించగలిగాడు? ఇదే అసలు ప్రశ్న. ఒక ప్రాంతపు చరిత్రను చూపించాలంటే అక్కడి మనుషుల జీవితాలను అర్థం చేసుకోవాలి. వారి భాష, యాస, సంస్కృతి, ఆచారాలు, సామాజిక సంబంధాలు, కష్టాలు, తిరుగుబాటు వెనుక ఉన్న కారణాలు చూపించాలి. అంతేగానీ ప్రతి పది నిమిషాలకోసారి ఒకరిని నరకడం, రక్తం పారించడం తెలంగాణతనాన్ని ప్రతిబింబించదు.

బాబోయ్… ఇంత హింస అవసరమా? హింస, రక్తపాతం మోతాదు మించిపోయాయి… యాక్షన్ సన్నివేశాలు సాగదీశారు, ఒక దశ తర్వాత ఆ హింసను భరించడం కూడా కష్టంగా మారింది… థియేటర్ వదిలేప్పుడు, రేయ్, ఎవుర్రా మీరంతా అనే పాపులర్ మీమ్‌తో తిట్టాలనిపిస్తుంది…

bhogi

నిజానికి హింస చూపించకూడదని ఎవరూ అనరు. కథలో భాగంగా హింస ఉండవచ్చు. చరిత్రలో జరిగిన దారుణాలను చూపించాల్సి రావచ్చు. దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రక్తపాతం ఉండవచ్చు. కానీ ఆ హింస వెనుక ఒక బలమైన కారణం ఉండాలి. ప్రేక్షకుడి మనసును కదిలించే ఎమోషన్ ఉండాలి.

హీరో కత్తి పట్టుకున్నప్పుడు ప్రేక్షకుడికి కోపం రావాలి. విలన్‌ను ఎదిరించినప్పుడు చప్పట్లు కొట్టాలనిపించాలి. అందుకు ముందు ఆ హీరో పడిన బాధ, ఆ కుటుంబం అనుభవించిన కష్టం, ఆ ఊరి ప్రజల వేదన ప్రేక్షకుడికి తెలియాలి. అప్పుడే తిరుగుబాటులో అర్థం ఉంటుంది.

అలా కాకుండా తెరమీద రక్తం ఏరులై పారిస్తే అది ఎమోషన్ కాదు. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించడం మాత్రమే!

ఇంకా విచిత్రమేమిటంటే, ఇంత హింసను చూపించినా దానికి తగ్గ భావోద్వేగం పండలేదు… సెకండాఫ్‌లో కథనం దారి తప్పడం, క్లైమాక్స్ సాగదీయడం, నేపథ్య సంగీతం హోరెత్తించడం కూడా సినిమాకు ప్రతికూలంగా మారాయి…

శర్వానంద్‌కు ఈ మాస్ ప్రయోగం అవసరమా? శర్వానంద్‌కు ఒక ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు ఉంది. శతమానం భవతి, మహానుభావుడు, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో అతని సహజమైన నటన, భావోద్వేగాలను పలికించే తీరు ప్రేక్షకులకు నచ్చాయి. ఇప్పుడు పూర్తిగా రఫ్ అండ్ రస్టిక్ మాస్ అవతారంలో కనిపించాలన్న ప్రయత్నం చేశాడు. సేమ్, నానిలాగే మాస్ అంటే హింస అనే పిచ్చి భ్రమల్లోకి జారిపోవడం…

తెలంగాణ పేరుతో వ్యాపారం వద్దు! ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ సినిమా పాటలు చంద్రబోస్ రాశాడు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు పాటల్లో తెలంగాణ భాష, యాస, జీవన సంస్కృతి ఎంత సహజంగా ప్రతిఫలించాయన్నది కూడా చర్చించాల్సిన అంశమే. తెలంగాణతనం అనేది అక్కడక్కడా కొన్ని యాస పదాలు చొప్పించడం కాదు. అది ఒక జీవన విధానం. ఒక ప్రాంతపు సామాజిక చరిత్ర. ఆ నేల మనుషుల ఆలోచనా ధోరణి…

తెలంగాణ నేపథ్యం ఉందని చెప్పి, తెలంగాణ ప్రజల చరిత్రను తెరపైకి తెస్తున్నామని ప్రచారం చేసుకుని, చివరకు రక్తపాతం, అరుపులు, కత్తులతో సరిపెడితే ఎలా? తెలంగాణ కథకు అంతకంటే గొప్ప గౌరవం ఇవ్వాలి…

తెలంగాణ ప్రేక్షకులకు కూడా మంచి కథలు కావాలి. తమ మట్టిని, తమ మనుషులను, తమ జీవితాలను తెరపై సహజంగా చూడాలనుకుంటారు. అంతేగానీ ప్రతిసారీ ఒక దొర, ఒక హీరో, ఒక తిరుగుబాటు, పదుల సంఖ్యలో హత్యలు చూపిస్తే చప్పట్లు కొట్టాలని లేదు…

ఒక్క మాటలో చెప్పాలంటే… తెలంగాణ మట్టి వాసన రావాలంటే తెరపై రక్తం చిందించాల్సిన అవసరం లేదు. తెలంగాణ మనుషుల మనసుల్లోకి వెళ్లాలి. కత్తులు, గొడ్డళ్లు చూపించడం సులభం. ఆ మనుషుల జీవితాలను చూపించడమే అసలైన దర్శకత్వం!

చివరకు ఆ అనుపమకూ అర్థమైనట్టుంది... అందుకే మీ బొంద ప్రమోషన్లు, ఐ డోన్ట్ కేర్ అని దూరంగా ఉండిపోయింది... గుడ్...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణతనం అంటే రక్తపాతమేనా? ఇదేం ‘భోగి’రా శర్వానందూ..!!
  • ఓ రాత్రి- ముసురు, చీకటి, చలి – ఓ బస్టాపులో ఆ ముగ్గురు… తరువాత?
  • వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!
  • ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు
  • కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!
  • దేవుడా- ఓ మంచి దేవుడా… మాకెందుకయ్యా ఈ ఇండిగోను ఇచ్చావ్
  • మూడుసార్లు దెయ్యాన్ని చూశా! నరక ద్వారాలూ కనిపించాయి !!
  • పెద్ద నంబర్ గేమ్ మళ్లీ ! ఈసారి సినిమాలో చాలా ట్విస్టులు!!
  • అసలు అదొక పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రం
  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions