Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!

November 27, 2026 by M S R

.

బిస్కెట్ల నుంచి జాతకాల దాకా… అంబానీ కన్ను పడితే వదిలేదెక్కడ! ఇప్పుడు జ్యోతిష్య మార్కెట్‌లోకి జియో ఎంట్రీ… AIతో జాతకాలు చెప్పే JioAstro ప్రారంభం!

బిస్కెట్లు కావాలా… డ్రింకింగ్ వాటర్ కావాలా… పెట్రోల్ కావాలా… ఫైనాన్స్ సేవలు కావాలా… ఇంటర్నెట్ కావాలా… సినిమా, వినోదం కావాలా… చివరకు షాపింగ్ చేయాలన్నా రిలయన్స్ సామ్రాజ్యంలో ఏదో ఒక దారి కనిపిస్తుంది. మనిషి నిత్యజీవితంలో ఎదురయ్యే అవసరాల్లో దాదాపు ప్రతిదానికీ ఓ వ్యాపార అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లే ముఖేష్ అంబానీ సామ్రాజ్యం ఇప్పుడు మరో ఆసక్తికరమైన రంగంలోకి అడుగుపెట్టింది. అదే జ్యోతిష్యం!

Ads

అవును… ఇకపై జాతకాలు చెప్పడానికి కూడా జియో సిద్ధమైంది. AI ఆధారిత వేద జ్యోతిష్య సేవలతో JioAstro పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను జియో ప్లాట్‌ఫామ్స్ తీసుకొచ్చింది. ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో, ఇప్పుడు భారతీయుల నమ్మకాలు, విశ్వాసాలు, భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి చుట్టూ ఏర్పడిన భారీ డిజిటల్ మార్కెట్‌పై కన్నేసింది. ఆస్ట్రోటాక్, ఆస్ట్రోసేజ్ వంటి సంస్థలకు పోటీగా రంగంలోకి దిగింది.

మస్క్ అంతరిక్షంలో గ్రహాలను వెతుకుతుంటే… ఎఐని టూల్‌గా చేసుకుంటే… అంబానీ భూమ్మీదే గ్రహచారాన్ని వెతికి పట్టుకున్నాడు. ఒకడు గ్రహాల ఉనికి మీద గురిపెడితే… మరొకడు గ్రహాల పేరుతో మార్కెట్ మీద గురిపెట్టాడు!

 

jio astro

జియోఆస్ట్రో ఏం చేస్తుంది? ఇదేదో రోజువారీ రాశిఫలాలు చెప్పే సాధారణ యాప్ కాదు. వినియోగదారుడు తన పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ప్రాంతం వివరాలు నమోదు చేస్తే వాటి ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని రూపొందిస్తుంది. Swiss Ephemeris అనే ఖగోళ గణన వ్యవస్థ ఆధారంగా లగ్న చక్రం (D1), నవాంశ చక్రం (D9)లను రూపొందించే సదుపాయం ఇందులో ఉంది. ఉత్తర భారత, దక్షిణ భారత పద్ధతుల్లో జాతక చక్రాలను చూసుకోవచ్చు.

40కి పైగా యోగాలను గుర్తించడం, మాంగళిక, కాలసర్ప, పితృ, గ్రహణ దోషాల విశ్లేషణ, వింశోత్తరి దశలు, శని సాడేసాతి వంటి అంశాలపై వివరాలు అందించడం దీని ప్రత్యేకతలుగా చెబుతున్నారు.

అంతేకాదు… ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, వివాహం, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం, ఆధ్యాత్మికత వంటి అంశాలపై AI జ్యోతిష్కుడిని ప్రశ్నించవచ్చు. రోజువారీ, వార్షిక జాతకాలు, పంచాంగం, ముహూర్తాల సూచనలు కూడా అందుబాటులో ఉంటాయిట. ఒకే ఖాతాలో నలుగురు కుటుంబ సభ్యుల జాతక వివరాలు నమోదు చేసుకోవచ్చు. వ్యక్తిగత జాతక నివేదికలను PDF రూపంలోనూ పొందవచ్చు.

ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు మాత్రం ఈ నాలుగు భాషల్లో లేదు. మొబైల్ యాప్ ప్రస్తుత వెర్షన్ ఆహ్వానం ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు సమాచారం.

జ్యోతిష్యంలో ఇంత వ్యాపారం ఉందా? ముఖేష్ అంబానీ ఈ రంగంలోకి ఎందుకు వస్తున్నాడో అర్థం చేసుకోవాలంటే డిజిటల్ జ్యోతిష్య మార్కెట్‌ను ఒకసారి చూడాలి. భారతదేశంలో జ్యోతిష్యం అనేది కేవలం పంచాంగం చూసుకోవడానికో, పెళ్లి ముహూర్తం నిర్ణయించుకోవడానికో పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం రాకపోయినా, పెళ్లి కాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, కుటుంబంలో సమస్యలు ఎదురైనా… ఏదో ఒక దశలో జ్యోతిష్కుడిని సంప్రదించే అలవాటు కోట్లాది మందిలో ఉంది.

ఇదే ఆసక్తిని డిజిటల్ వేదికలపైకి తీసుకొచ్చిన సంస్థలు ఇప్పుడు భారీ వ్యాపారాలుగా ఎదుగుతున్నాయి. ఆస్ట్రోటాక్ వంటి సంస్థలు ఫోన్ కాల్స్, చాట్స్ ద్వారా జ్యోతిష్కులతో సంప్రదింపులు జరిపే సేవలతో పెద్ద మార్కెట్‌ను సృష్టించాయి.

  • బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం, 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో జ్యోతిష్య యాప్స్‌కు 15 కోట్ల డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 75 శాతం ఎక్కువ. MarkNtel Advisors అంచనా ప్రకారం భారత డిజిటల్ జ్యోతిష్య మార్కెట్ విలువ 2026లో సుమారు 390 మిలియన్ డాలర్లు. 2032 నాటికి 2.32 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.

అంటే ఇది చిన్న మార్కెట్ కాదు. అంబానీ దృష్టిని ఆకర్షించడానికి సరిపడా అవకాశాలు ఉన్న రంగం!

astros

అంబానీ వ్యాపార సూత్రం ఇదేనా? రిలయన్స్ వ్యాపార విస్తరణను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడితో ఆగిపోవడం కాకుండా, వినియోగదారుడి జీవితంలోని ఇతర అవసరాలనూ తన వ్యాపార పరిధిలోకి తీసుకురావడంపై సంస్థ దృష్టి పెడుతుంది.

పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ నుంచి రిటైల్ వరకు… రిటైల్ నుంచి టెలికాం, డిజిటల్ సేవల వరకు… ఇప్పుడు AI, జ్యోతిష్యం వరకు ప్రయాణం సాగుతోంది. బిస్కెట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి రోజువారీ వినియోగ వస్తువుల మార్కెట్లోనూ రిలయన్స్ తన ఉనికిని విస్తరిస్తోంది. సేవల రంగంలోనూ కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇప్పుడు మనిషికి తన భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా వ్యాపార అవకాశమేనని జియో గుర్తించింది.

  • ఇందులో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. జ్యోతిష్యం అనేది తరతరాలుగా వ్యక్తిగత అనుభవం, సంప్రదాయం, నమ్మకాల ఆధారంగా కొనసాగుతున్న రంగం. ఇప్పుడు అదే వ్యవహారంలోకి కృత్రిమ మేధను తీసుకొచ్చి, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జ్యోతిష్కుడిని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది జియో.

అయితే AI చెప్పే జాతకం ఎంతవరకు సంప్రదాయ జ్యోతిష్య పద్ధతులకు అనుగుణంగా ఉంటుంది? దాని విశ్లేషణను వినియోగదారులు ఎంతవరకు విశ్వసిస్తారు? ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అనేవి తేలాల్సి ఉంది.

అంబానీ జాతకంలో ఏ గ్రహం ఉచ్చస్థితిలో ఉందో తెలియదు కానీ... జ్యోతిష్య మార్కెట్‌పై మాత్రం ఆయన కన్ను పడింది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేణుస్వామీ, అంబానీ వచ్చేస్తున్నాడు ! ఆయన దేన్నీ వదలడు..!!
  • ఖేలో ఇండియా- ఖేలో తెలంగాణ … రాష్ట్రవ్యాప్తంగా 20 పోటీ వేదికలు
  • కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!
  • దేవుడా- ఓ మంచి దేవుడా… మాకెందుకయ్యా ఈ ఇండిగోను ఇచ్చావ్
  • మూడుసార్లు దెయ్యాన్ని చూశా! నరక ద్వారాలూ కనిపించాయి !!
  • పెద్ద నంబర్ గేమ్ మళ్లీ ! ఈసారి సినిమాలో చాలా ట్విస్టులు!!
  • అసలు అదొక పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రం
  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!
  • ఇక ఇండియాపై చైనా- పాక్ జాయింట్ ఉపగ్రహ నిఘా!!
  • Miss & Mrs Universe… ఏడేళ్ల కూతురికి తల్లి… ఈసారి విశ్వసుందరి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions