Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియల్ మాటల మాంత్రికుడు- గురూజీ ఈయనే… పేరు పింగళి !!

November 29, 2026 by M S R

.

Bharadwaja Rangavajhala … పింగళీయం
తెలుగు వారు క్లాసిక్కులని కాలెరెత్తుకుని చెప్పుకునే సినిమాల్లో సగానికి పైగా ఆయన కలంసాయంతో బయటకు వచ్చినవే.
తెలుగు సినిమా మాట, పాట మీద ఆయన వేసిన ప్రబావం సామాన్యమైనది కాదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ కలం పేరు పింగళి నాగేంద్రరావు.

గురూ అనే పదం ఇప్పటికీ పాపులర్రే. తస్మదీయులు ఇప్పటికీ తెలుగు పేపర్ల మకుటాల్లో కనిపిస్తూనే ఉంటుంది. వీరతాడు సెటైరికల్ గా రాయడానికి ప్రయత్నించిన ప్రతి తెలుగు రచయితా దీన్ని దాటి పోలేదు.
ఆయన రాసిన పాటల మకుటాలతో వచ్చిన సినిమాలన్నీ జనరంజకాలే అయ్యాయి.

Ads

  • ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఒక ఉదాహరణ. ఆయన్ని మాటల మాంత్రికుడని కొలుచుకుంది సినీ ప్రపంచం. ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్ అని తన్ను తాను ప్రశ్నించుకుని అనేక కొత్త పదాలతో …భావాలతో…తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆ కలం పేరు పింగళి నాగేంద్రరావు.

పాతాళభైరవి లో నేపాళమాంత్రికుడుగా ఎస్వీఆర్ చెప్పిన మంత్రాలన్నీ సంధ్యావందనం మంత్రాలే.
ప్రతి మంత్రాన్నీ చివర్లో ఫట్ ఛట్ లాంటి పదాలు తొడిగి వామాచారం చేశారు పింగళి.
సినిమా రచయితకు ఉండాల్సింది అదే.

old classics

కొత్తదనం, చమత్కారం, సులువైన భాష సూటిగా రాయడం, తనకి తోచిందేదో తను రాసుకుపోవడం కాకుండా కథకి, కథలోని పాత్రల స్వభావాలకు అద్దం పట్టేలా రాయడం ఇలాంటి లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న రచయిత పింగళి నాగేంద్రరావు.
పింగళి నాగేంద్రరావు సొంతూరు విజయనగరం జిల్లా రాజాం. అయితే ఆయన పెరిగింది మచిలీపట్నంలో.
అప్పటి మచిలీపట్నం స్వతంత్ర పోరాటానికే కాదు …. కాదు స్వతంత్ర భావాలకూ, భారతీయ తాత్విక చింతనకూ ఊతంగా నిలచిన ఊరు.

ముట్నూరి కృష్ణారావు, కోపెల్ల హనుమంతరావు, భోగరాజు పట్టాభిగార్లు పూనుకుని ప్రారంభించిన ఆంధ్ర జాతీయ కళాశాల … అది ముందుకు తీసుకువచ్చిన జాతీయ విద్యావిదానం ఇవన్నీ పింగళి పూర్వరంగం.
ఈ నేపధ్యంలో పెరగడం వల్లే ఆయన వింధ్యరాణి లాంటి నాటకం రాయగలిగారు.
మాయాబజార్ లో జ్ఞానము ప్రధానం గానీ పాండిత్యం కాదని ఘటోత్కచుడితో అనిపించగలిగారు.

పింగళి నాగేంద్రరావు ఆంధ్ర జాతీయ కళాశాల విద్యార్ది. అక్కడ సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలతో పాటు సాంకేతిక విద్య కూడా నేర్చుకున్నారాయన.
ఇంజనీర్ సర్టిఫికెట్ కూడా సాధించారు. దాని ఆధారంగానే ఖరగపూర్ లో రైల్వేలో ఉద్యోగం సంపాదించారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తితో జన్మభూమి అనే కవితా సంకలనాన్ని ప్రకటించారు.
ప్రభుత్వం దాన్ని నిషేదించింది. కొంత కాలం బెజవాడ సబ్ జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. అలాగే ఆయన రాసిన బేజున్నీసా నాటకాన్ని కూడా ప్రభుత్వం నిషేదించింది.
హిందూ ముస్లింలు కఖ్యతతో మెలగాల్సి ఉందనే సందేశాన్నిస్తూ రాసిన నాటకం బేజున్నీసా.

pingali

శివాజీలోని పట్టుదలను ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూసి ఔరంగబేజు కుమార్తె జేబున్నీసా ప్రేమిస్తుంది. ఇదీ కథాంశం. ఆయన రాసిన సినిమా రచనల్లోనూ ఈ అభ్యుదయాంశ కనిపిస్తూనే ఉంటుంది.
అందమైన జేబున్నీసాను ఎదుట పెట్టి శివాజీతో సిద్దాంతం మాట్లాడించాడు పింగళి అని జేబున్నీసా నాటకం మీద చెణుకు విసిరారు అప్పట్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి.

బేజున్నీసా నిషేదానికి గురైన రోజుల్లోనే పింగళి పనిచేస్తున్న శారద పత్రిక కూడా మూతపడింది.
దీంతో అలనాటి మేటి రంగస్థల నటులు డి.వి సుబ్బారావు పిల్చి మరీ తన ఇండియన్ డ్రమటిక్ అసోసియేషన్ కార్యదర్శిగా పింగళిని నియమించారు.
అక్కడుండగానే భారతి పత్రికలో నారాజు అచ్చుపడింది. వింధ్యరాణి , మేవాడ్ రాజ్యపతనం లాంటి నాటకాలు రాశారు. నారాజు నాటకం కృష్ణదేవరాయల కాలంలో జరిగిన సంఘటనల నేపధ్యంలో సాగుతుంది.

నారాజు అంటే తిమ్మరసు రాయలను పిలిచే పిలుపు. అందుకేనేమో మహామంత్రి తిమ్మరసు తీయాలనుకున్నప్పుడు పింగళినే రచయితగా తీసుకున్నారు నిర్మాత రామబ్రహ్మం.
పింగళి నాగేంద్రరావు స్వతంత్ర సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
పట్టాభి మాట ప్రకారం వెనక్కొచ్చి ఉద్యోగం చేసుకుంటూ తల్లిని పోషించుకున్నారు.
అయితే భావపరంగా దూరం కాలేదు. ఆయన నాటకాలన్నీ దాదాపు మహాత్మాగాంధీ భావాలను ప్రచారం చేసేవిగానే సాగుతాయి.
అలాగే ఆయన ఆధునిక ఆలోచనల్ని విపరీతంగా ప్రోత్సహించేవారు.

చలం రచించిన సావిత్రి నాటకాన్ని ఎవరూ అచ్చు వేయ సాహసించని వేళ బందరులో తన బాధ్యత మీద అచ్చేయించారు నాగేంద్రరావు గారు. అంతే కాదు. చలం సావిత్రిని తనే ముందుమాట కూడా రాశారు.
పింగళి నాగేంద్రరావును సినిమాల్లోకి ఆహ్వానించింది కమలాకర కామేశ్వరరావు. ఆయన కూడా కృష్ణా పత్రికలో పనిచేసిన వారే. సినీఫాన్ పేరుతో అప్పట్లో సినిమా సమీక్షలు రాసేవారు. ఆయన రాసిన ఓ సమీక్ష నచ్చి సినిమాల్లోకి ఆహ్వానించారు హెచ్.ఎమ్ రెడ్డి.
ఆయన ప్రోత్సాహంతోనే కాదు…ఇతర మిత్రుల సూనలకు ప్రేరణగా తారుమారు మళ్లీ పెళ్లి సినిమాలకు పనిచేశారు.

ఆ తర్వాత వింద్యరాణి నాటకాన్ని డి.వి.సుబ్బారావుతో తీస్తే ఆ సినిమా కోసం చెన్నై వెళ్లారు. ఆ సినిమా పెద్దగా నడవలేదు. నాటకంగా పెద్ద విజయం సాధించిన కథ సినిమాగా విఫలం చెందడానికి కారణం దర్శకుడే అని పింగళి అభిప్రాయం. ఆ తర్వాత చేసిన సినిమా గుణసుందరి కథ.

కె.వి.రెడ్డి వాహినీ కోసం షేక్సిపియర్ రచించి ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ నాటకం ప్రేరణతో ఒక లైను అనుకున్నారు.
దాన్ని తెరానువాదం చేసి సంభాషణలు పాటలు రాయగల రచయిత కోసం చూస్తున్నారు. అదే సమయంలో కమలాకర కామేశ్వరరావు సలహా మేరకు పింగళి నాగేంద్రరావును పికప్ చేశారు. గుణసుందరి కథ తర్వాత విజయా వారికి అంగీకరించిన చిత్రానికి కూడా పింగళినే రచయితగా తీసుకున్నారు కె.వి.రెడ్డి.
అల్లాఉద్దీన్ అద్భుత దీపం కథ ఆధారంగా పాతాళబైరవిని తీర్చిదిద్దారు.

గుణసుందరి కథను బిఎన్ సోదరుడి పత్రిక చందమామలో సీరియల్ గా వేయించారు. రచయిత నాగేంద్ర అని రాయించారు.
ఆ తర్వాతే సినిమా విడుదల చేశారు. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. పాతాళబైరవి కూడా హిట్టయ్యే సరికి పింగళిని తమ ఆస్తాన కవిగా నియమించుకున్నారు విజయాధినేతలు. నెల జీతానికి ఆయన పనిచేసేవారు. ఆ తర్వాత విజయా బ్యానర్ లో వచ్చిన అన్ని చిత్రాలకూ ఆయనే రచయిత. కె.వి డైరక్టరైతే మాటలూ పాటలూ రాసేవారు. ఎల్వీ డైరక్టరైతే పాటలొకటే రాసేవారు.

వినుటయేగానీ వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా లాంటి భావాలతో పాటలు రాయడం పింగళికి తప్ప మరొకరికి సాధ్యం కాదు. గురువుగారూ మీరు బ్రమ్మచారి కదా… డ్యూయట్లూ అవీ ఎలా రాస్తారండీ అని అడిగాడట రేలంగి. నువ్వు నటించడం లేదూ అలాగే అని పింగళి వారి సమాధానం. ఆయన సినిమాలకు రాసే డైలాగులే కాదు విడిగా ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా చమత్కారంగా ఉండేవనేవారు వేటూరి.
కారణాలేవైనా పింగళి పెళ్లి చేసుకోలేదు.

తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నారు. తల్లి చనిపోయాక ఒంటరివాడయ్యారు. మొదటి నుంచీ డబ్బు సంపాదించాలనే తపన తక్కువే.
అందుకే విజయా వారిచ్చే వేతనంతో సర్దుకుపోయేవారు తప్ప బయట ఓ పది సినిమాలు ఒకేసారి ఒప్పేసుకుని రాసేసి అలా సంపాదించాలనే యావ కనిపించదు. బయట వారు ఎవరైనా అడిగినా విజయా వారు అనుమతిస్తేనే రాశారు.
పెద్ద మనుషులుకు రాయడానికి చక్రపాణి అనుమతించలేదు. దీంతో ఆగిపోయారు.

అక్కినేని సహకారంతో తెరకెక్కిన మహాకవి కాళిదాసుకు మాత్రం పింగళి పనిచేయడానికి అనుమతిచ్చారు. వేదాంతాన్ని కూడా ఎంత హాయిగా చెప్తారో పింగళి అనిపిస్తుందా సినిమాలో పాటలు వింటుంటే…
కె.వి.రెడ్డి స్వంత సంస్ధ జయంతి పిక్చర్స్ కూ చక్రపాణి పర్మిషన్ తోనే పింగళితో రాయించుకున్నారు. పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీ కృష్ణార్జున యుద్దం చిత్రాలకు పింగళి పనిచేశారు. ఒక రకంగా కె.వి యూనిట్ గానే పింగళిని చూసేవారు.

విజయాలో కె.వి తీసిన చివరి చిత్రాలు హరిశ్చంద్ర, ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఫ్లాప్ అయిన సందర్భంలో కె.వి యూనిట్ కు ఉద్వాసన చెప్పారు. అప్పుడు అనివార్యంగా పింగళి విజయా నుంచీ బయటకు వచ్చేశారు.
కె.వి స్వీయ నిర్మాణంలో వచ్చిన రెండు సినిమాల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ రాశారు పింగళి.

  • విజయా నుంచి బయటకు వచ్చాక విఠలాచార్య తీసిన రాజకోట రహస్యం చిత్రానికీ, సింగీతం తొలిచిత్రం నీతినిజాయితీ చిత్రాలకు పాటలు రాశారు.
    నీతి నిజాయితీ లో …. భలే మజాలే భలే ఖుషీలే పాట ఆయన రాసినదే. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం కల్సి పాడారు.
    ఓ సందర్భంలో బాలు నేను పింగళి రాసిన పాటలు పాడలేకపోయాను అని బాధ పడ్డారు … కానీ ఆయన పాడారు. అయితే .. మరచినట్టున్నారు.

కృష్ణవంశీ చంద్రలేఖలో సాహసమే చెయ్యరా ఢింభకా అనే పాట మీద ఈ నీతి నిజాయితీ పాట ప్రభావం ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది.
స్టంట్ పిక్చర్ తీస్తా
ధనము దోచుకుంటా
అమెరికాకు పోతా అనుభవాలు రాస్తా …
ఇలా నడుస్తుందా పాట …

డి.ఎల్. రాయ్ రాసిన బెంగాలీ నాటకాలను తెలుగులోకి నేరుగా అనువదించారు పింగళి.
రాయ్ రాసిన చాణక్య నాటకాన్ని ఆయన కొంత అనువదించారు.
దాన్నే ఎన్టీఆర్ తీసుకుని చాణక్య చంద్రగుప్త తీశారు.
మూల కథ పింగళి అని వేస్తారా సినిమాలో …
అలాగే కె.వితో కోరి ఎన్టీఆర్ తీయించుకున్న శ్రీ కృష్ణ సత్య సినిమాకు కూడా పింగళి పనిచేశారు. కె.వి కీ పింగళికీ కూడా అదే చివరి చిత్రం కావడం విశేషం.

శ్రీ కృష్ణ సత్య సినిమా రిలీజ్ అయ్యింది 1971 డిసెంబర్ నెల్లో…
పింగళి అదే సంవత్సరం మే నెల ఆరో తేదీన కన్నుమూశారు.
తెలుగు సినిమా మాటకూ పాటకూ ఆయన తీర్చిన ఒరవడిలోనే తదనంతరం వచ్చిన చాలా మంది కవులు రచయితలూ కొనసాగారు.

  • పింగళి చివరి రోజుల్లో ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నది …. నిర్మాత నర్రా రామబ్రహ్మం గారు.
    గౌతమీ పిక్చర్స్ బ్యానర్ మీద ఆయన ఎన్టీఆర్ తో సినిమాలు తీశారు.
    ఆయనా బ్రహ్మచారే. పింగళికి కాన్సర్ అని తెల్సినప్పుడు రాయవెల్లూరులో నిమ్మకూరుకు చెందిన డాక్టర్ ఎవరో ఉంటే … ఆయనతో మాట్లాడి అక్కడ ట్రీట్మెంట్ ఏర్పాటు చేశారు ఎన్టీఆర్.
    ఆ సందర్భంగా అయిన ఖర్చు …. చాణక్య చంద్రగుప్త సినిమా మూలకథ నిమిత్తం పారితోషికంగా చెల్లించినట్టు ఆయన అకౌంట్లలో రాసుకున్నారు.

పింగళి లైబ్రరీ కొంత ఆరుద్ర దగ్గరా ఇంకొంత నరసరాజు గారి దగ్గరా చేరింది.
పానగల్ పార్క్ దగ్గర పేవ్మెంట్ పార్లమెంట్ నిర్వహించేవారు మల్లాదీ, పింగళీ.
ఏ రోజైనా పింగళి త్వరగా వచ్చేస్తే … ఏంటి తొందరగా వచ్చావ్ అని అడిగేవారట మల్లాది రామకృష్ణ శాస్త్రి ….
బేరాల్లేక దుకాణం సర్దేశా అని సమాధానం చెప్పేవారట పింగళి ..
అంటే ఏం రాయాలో తట్టలేదు అందుకే వచ్చేశా అనేది ఆయన భావం.
ఆయన రైటింగ్ టేబుల్ మాత్రం సింగీతం శ్రీనివాసరావు గారింట ఉండేది … మరిప్పుడు ఉందో లేదో
మరి ఇటీవలే వారూ వెళ్లిపోయారు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియల్ మాటల మాంత్రికుడు- గురూజీ ఈయనే… పేరు పింగళి !!
  • రాజకీయం వీథి నాటకమైతే…. కనిపించేవి ‘బావర్చి బిర్యానీ’ సీన్లే !!
  • హోప్‌లెస్ సీఎం విజయ్… హీరో గారి జ్ఞానశూన్యతపై ఇదీ చార్జ్‌షీట్…
  • దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?
  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!
  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…
  • నేలపై మెతుకులు ఏరుకున్న ‘పెళ్లి భోజనం’! దిక్కుమాలిన పెళ్లి జాతర!!
  • పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు!
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్థానీ కంటెంట్ వివాదం! కేంద్రం ఊరుకోవాలా..?!
  • యూపీ సభా? బహిరంగసభా? డీలిమిటేషన్‌ పర్వంలో ఓ ఉపకథ!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions