.
50 శాతం సీట్ల పెంపు, ప్రతిపక్ష కూటమిలో చీలికలు, మెజారిటీకి ప్రయాసలు, ఎత్తుగడలు, తలోదిక్కూ చీలిపోతున్న ప్రాంతీయ పార్టీలు, ఏ రాష్ట్రం సీట్లు ఎంత పెరగొచ్చు… వంటి అనేకానేక వార్తల నడుమ మరో ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఇంట్రస్టింగు… అది యూపీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి… దీనికోసం రాజ్యాంగం సవరించే బిల్లులో మరో క్లాజు సపరేటుగా పెట్టాల్సి వస్తోందిట… వివరాల్లోకి వెళ్తే…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 403 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రకారం ఈ సంఖ్య దాదాపు 605కు చేరనుంది. అంటే ఇప్పుడున్న దానికంటే మరో 202 మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు. దేశంలో మరే రాష్ట్ర అసెంబ్లీ కూడా ఇంత భారీగా ఉండబోదు. ఒకే సభలో 600 మందికి పైగా సభ్యులు!
Ads
వాళ్లందరికీ కూర్చోవడానికి చోటు, మాట్లాడటానికి సమయం, నియోజకవర్గాల సమస్యలు వినడానికి మంత్రులు.. ఇవన్నీ ఎలా సాధ్యం? అసలు ఇంత పెద్ద అసెంబ్లీని నిర్వహించడం సాధ్యమేనా? ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
500 మంది దాటితే రాజ్యాంగమే అడ్డం! కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ప్రకారం లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రస్తుత సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచాలనేది ప్రధాన ప్రతిపాదన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(1) ప్రకారం ఒక రాష్ట్ర అసెంబ్లీలో గరిష్ఠంగా 500 మంది సభ్యులే ఉండాలి. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో సగం పెంపు అమలు చేస్తే సంఖ్య 605కు చేరుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిమితిని దాటిపోతుంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం మరో ప్రతిపాదన చేసింది. అసెంబ్లీల గరిష్ఠ సభ్యుల సంఖ్యను 500 నుంచి 650కి పెంచాలని బిల్లులో పేర్కొంది. అంటే యూపీకి మాత్రమే ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం లేదు. అన్ని రాష్ట్రాలకూ ఈ గరిష్ఠ పరిమితి వర్తిస్తుంది. 50 శాతం పెంపుతో యూపీ అసెంబ్లీ 605 మంది సభ్యులతో ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.

ఒక్క రాష్ట్రం.. 120 మంది ఎంపీలు! యూపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభలోనూ ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి 80 మంది ఎంపీలు లోక్‌సభకు ఎన్నికవుతున్నారు. ప్రతిపాదన అమలైతే ఈ సంఖ్య 120కి చేరుతుంది. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంగా యూపీ ప్రాధాన్యం మరింత పెరుగుతుంది.
మొత్తం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇందులో రాష్ట్రాల నుంచి 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ఉండవచ్చు. ప్రస్తుతం 543 మంది ఎన్నికైన సభ్యులున్న లోక్‌సభ సంఖ్య సుమారు 816కు చేరవచ్చని అంచనా.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. జనాభా పెరుగుదల ఆధారంగా రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల నిష్పత్తిని పూర్తిగా మార్చడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు యథాతథంగా ఉంచే ప్రతిపాదన ఉంది. అందుకే ఉత్తరప్రదేశ్‌కు 120 సీట్లు వచ్చినంత మాత్రాన ఇతర రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకు తమిళనాడుకు కూడా 39 నుంచి సుమారు 59 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్యలో ఉన్న అంతరం మాత్రం మరింత పెరుగుతుంది.

1971 జనాభా లెక్కలు ఒకదానికి.. 2011 లెక్కలు మరొకదానికి! డీలిమిటేషన్ చర్చలో ఇది మరో కీలకమైన అంశం. రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల నిష్పత్తిని 1971 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తూనే, నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు మాత్రం బిల్లు అమల్లోకి వచ్చే సమయానికి అందుబాటులో ఉన్న తాజా ప్రచురిత జనాభా లెక్కలను ఉపయోగించాలని ప్రతిపాదించారు. అప్పటికి కొత్త జనాభా లెక్కలు అందుబాటులో లేకపోతే 2011 లెక్కలే ప్రాతిపదిక అవుతాయి.
అంటే రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలనే విషయంలో పాత నిష్పత్తిని కాపాడుతూ, ఆ రాష్ట్రంలోని నియోజకవర్గాల సరిహద్దులను మాత్రం కొత్త జనాభా వివరాల ప్రకారం మార్చే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
మహిళలకు దాదాపు 200 సీట్లు! ఈ సీట్ల పెంపు వెనుక మరో ప్రధాన కారణం మహిళా రిజర్వేషన్ల అమలు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించాలనే నారీ శక్తి వందన్ చట్టం అమలుకు డీలిమిటేషన్‌ను అనుసంధానించారు. యూపీ అసెంబ్లీ 605 స్థానాలకు పెరిగితే అందులో మూడో వంతు అంటే సుమారు 202 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారు, ఏ స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయి అనేది మాత్రం తర్వాత నిర్ణయిస్తారు.
యూపీని నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలా? దాదాపు 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. పాలనా సౌలభ్యం కోసం ఈ రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదనలు చాలాకాలంగా ఉన్నాయి. 2011 నవంబరులో అప్పటి ముఖ్యమంత్రి మాయావతి ప్రభుత్వం ఈ దిశగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. యూపీని పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అయితే ఆ తీర్మానం ముందుకు సాగలేదు.
- ఇప్పుడు 403 మంది సభ్యులున్న అసెంబ్లీ కాస్తా 605 మందికి చేరే పరిస్థితి రావడంతో రాష్ట్ర విభజన చర్చ మళ్లీ తెరపైకి వస్తోంది. అంతమంది సభ్యులతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే అవకాశం కల్పించడం, మంత్రులు సమాధానాలు చెప్పడం, కొత్త అసెంబ్లీ భవనం నిర్మించడం.. ఇవన్నీ చిన్న విషయాలేమీ కాదు. అయితే అసెంబ్లీ పెద్దదవుతోందని రాష్ట్ర విభజన తప్పనిసరి అవుతుందని మాత్రం చెప్పలేం. అది పూర్తిగా రాజకీయ, పాలనా నిర్ణయం. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమే, కానీ యూపీ విభజన ఇప్పట్లో ఉండదు. తరువాత సంగతి చెప్పలేం…
ఈ డీలిమిటేషన్ బిల్లు నవంబర్ 30న లోక్‌సభ ముందుకు రానుంది. అయితే రాజ్యాంగ సవరణ కావడంతో రెండు సభల్లోనూ మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అంతేకాదు, రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనల్లో మార్పు చేస్తున్నందున కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా తప్పనిసరి…
Share this Article