Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సవాళ్లు- డిమాండ్లు- తోపులాటలు… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస!

July 3, 2026 by M S R

.

నిన్న రెండు ఆందోళనలు… ఒకటి కల్వకుంట్ల కవిత, రెండు హరీష్ రావు… పోలీసులతో తోపులాట, అరెస్టు, వ్యానుల్లో ఎక్కించి ఏదో పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవడం, తరువాత వదిలేయడం… ఈలోపు ఫోటోలు, వీడియోలు, కేకలు, నినాదాలు, పోలీసులతో పెనుగులాడుతున్నట్టు షో ఆఫ్… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస?

కవిత ఉప్పల్ భగాయత్‌లో ఆందోళన… దేనికి..? ఉద్యమకారులకు భూములివ్వాలని! అసలు ఉద్యమకారులంటే ఎవరు..? ఎవరు ధ్రువీకరించాలి..? అర్హతలు, ప్రామాణికాలు ఏమిటి..? జనమంతా ఉద్యమించారు కదా, కొందరిని ఎలా ప్రత్యేకంగా గుర్తించాలి..? అది తేల్చడానికే కదా ప్రభుత్వం ఓ కమిటీని వేసింది…

Ads

మరి అప్పుడే తలా 250 గజాల్ని ఎవరు ఇవ్వాలి, అదీ ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల ఇస్తారా..? అసలు ఉద్యమకారుల గుర్తింపు జరిగిందా? లేక కవిత ఏదైనా లిస్టు ఇస్తే వాళ్లకు ఇచ్చేయాలా..? దీనికి భూపోరాటం అని పేరు..!! పోలీసులు రాగానే వాళ్లు చెప్పిన వ్యానులోనో, వాహనంలోనే వెళ్లి కూర్చుంటే చిన్నతనమా..? అలా చేస్తే పోరాటం స్థాయి ఏమైనా బలహీనపడుతుందా..? హేమిటో!!

ఏదైనా సమస్యపై ఒక రాజకీయ పార్టీగా పోరాడాలి, తమ నిరసన ప్రకటించాలి, కానీ ఆమె తొందరపడుతోంది… తల్లి పార్టీ బీఆర్ఎస్‌ను దాటేయాలని తహతహ… ప్రబల ప్రత్యర్థి హరీష్ రావుకన్నా ముందుండాలనే తాపత్రయం అవసరమా..?

మొన్న కేవీరెడ్డి అనే జర్నలిస్టు అరెస్టుపైనా ఆమె స్టాండ్ అలాంటిదే… తెలంగాణవాడు అయితే ఇక వేరే రాష్ట్రాల్లో కేసులు ఏమున్నా సరే, అరెస్టులు చేయకూడదా..? అసలు క్యాంపెయిన్, ప్రాపగాండా యూట్యూబర్లు జర్నలిస్టులేనా? కవితే క్లారిటీ ఇవ్వాలి… ఐనా కాలం చెల్లిన ఈ ఆందోళన పద్ధతులు, పోలీసులతో పెనుగులాటను పెద్ద పోరాటంగా షో చేయడం గాకుండా… ఏదైనా కొత్తగా నిరసన, డిమాండ్ పద్ధతుల్ని ఆలోచించొచ్చు కదా!

మరోవైపు హరీష్ రావు కథా అలాగే ఉంది… అసలు చర్చకు సిద్ధమా అనే ప్రశ్న రాజకీయాల్లో అత్యంత భ్రమాత్మకం… ఏదో మీడియాలో ఆ సవాల్ ప్రచారానికి రావాలనేదే తప్ప, నిజంగా రాజకీయ నాయకులు ఏదో ఓ చోట కూర్చుని హుందాగా, పరిణతితో, సంస్కారవంతంగా చర్చించే వాతావరణం ఉందా..? మరెందుకు ఈ శుష్క సవాళ్లు…

కాంగ్రెస్ మంత్రులదీ అదే పోకడ… ఎందుకు చర్చకు సవాల్ పేరిట గోకినట్టు..? చివరకు పారిపోయారు అనే బ్యాడ్ రిజల్ట్ దేనికి..? తెల్లారిలేస్తే మొత్తం పత్రికల నిండా ఇవే వార్తలు, ఇవే ఫోటోలు… ప్రయోజనం..? పెద్ద గుండు సున్నా!! మీడియాకు పని, స్పేస్ ఫిల్లింగ్… అసలు వాటిని ఎవరైనా చదువుతున్నారా అనే సోయి కూడా లేదు… పోనీ, ఇందులో ప్రజాప్రయోజనం ఏమైనా ఉందా..? ఒక ప్రజాసమస్యపై పోరాటమా ఇది?

గురుకుల టెండర్లలో అక్రమాలు అనేది బీఆర్ఎస్ ఆరోపణ, మీడియాలో వచ్చింది, జనం చదివారు, చూశారు, సరిపోదా..? ప్రభుత్వం తరఫున ఎవరో మంత్రి వివరణ ఇచ్చాడు, అదీ జనం చదివారు, సరిపోదా..? ఈ సవాళ్ల పోరాటం దేనికి..?

నిజానికి ప్రస్తుత తరం రాజకీయ ప్రచార ప్రదర్శనల్ని ఏవగించుకుంటోంది.,. ప్రత్యేకించి రాస్తారోకోలు వంటి సందర్భాల్లో అవస్థలు పడుతున్న జనం బండబూతులు తిడుతున్నారు ఆందోళనకారుల్ని..! ఏదేని ప్రజావ్యతిరేక పోకడ మీద నిరసన వ్యక్తం చేయాలంటే ధర్నా చౌక్ వంటి వేదికలున్నాయి… కానీ అక్కడ కూర్చుంటే మీడియా దేకదు…

అందుకని వీథ్లులోకి రావడం, జనాన్ని అవస్థలకు గురిచేయడం… పోలీసులకు కూడా ఇదే పని… బందోబస్తు, అరెస్టులు… పొద్దున్నే పేపర్లలో, టీవీల్లో పోలీసుల జులుం పేరిట శాపనార్థాలు… బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఒకరు ఆమధ్య చెప్పాడు కదా, ప్రజలు ఆందోళనలకు రాకపోతే ఆఫీసులు, రైలుపట్టాల పనిపట్టాలి అని… ఫామ్ హౌజులో కూర్చుని ఒకాయన నిర్వేదంగా, నిర్లిప్తంగా చూస్తుంటాడు, తనకు ఇవేమీ పట్టవు అన్నట్టుగా..!!

ఎస్, రాజకీయ ప్రచార లబ్ధికి పార్టీలు పన్నే శుష్క ఎత్తుగడల్ని జనం హర్షించడం లేదు… ఎటొచ్చీ పార్టీలకే అది అర్థం కావడం లేదు… మీడియాకు అస్సలు అర్థం కావడం లేదు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సవాళ్లు- డిమాండ్లు- తోపులాటలు… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస!
  • NEET – ప్లస్ టూ మార్కులకు వెయిటేజీ- లేదా 70% వస్తే నీట్ అర్హత?
  • ఎట్టకేలకు జననాయకుడికి మోక్షం! 2, 3 రోజుల్లో CBFC క్లియరెన్స్!
  • గడీలోకి వెళ్తే మరో జీవన్‌రెడ్డి – కాషాయం ఇక రానివ్వదు – మరేమిటి..?!
  • పెళ్లి తంతు కూడా ముఖ్యమే! రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు!!
  • అంతటి స్టార్ డైరెక్టర్ దాసరి ఆ హీరో కాళ్లు ఎందుకు మొక్కాడు..?!
  • డర్టీ మొగుడు- కామ ఖాకీ…! చామెట్ యాప్‌లో బరిబాతల దందా!
  • Unsung Hero – అమెరికన్ గడ్డ మీద ఓ ఇండియన్ గదర్!
  • ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర! – సూత్రధారి ఈ సెంథిల్ బాలాజీ..?
  • H-Fast – హైదరాబాద్‌ కడుపుకి చికిత్స – ఫుడ్ సేఫ్టీ హల్‌చల్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions