.
శ్రీరామనవమి వచ్చిందంటే చాలు… రాములోరి పెళ్లి వేదికలు, టీవీలలో ఈపాట తప్పక వినబడుతుంది… అంతేకాదు… ఒక తరం పెళ్లి క్యాసెట్లు ఈపాట లేకుండా లేవంటే అతిశయోక్తి కాదు… ఆహా, రాసిన సిరివెన్నెలకు ఈ ఘనతలో అగ్రతాంబూలం… ఆ తరువాతే మణిశర్మ, కృష్ణవంశీ, సునీత, మహేశ్ బాబు, సోనాలి బెంద్రేలు ధన్యులయ్యారు…
అవును, ఆ పాట పేరు ‘‘అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి’’… సీతారాముల కల్యాణం పాటలు మన తెలుగు సినిమాల్లో బోలెడు… కల్యాణము చూతమురారండి పాట ఆల్టైమ్ హిట్, దీన్ని కొట్టేది లేదు… కానీ ఇది సీతారాముల పెళ్లి పాట కాదు… ఓ హిందూ వధూవరులను మురిపెంగా గొప్పగా వర్ణించుకుంటూ, మీ దేవుళ్లపెళ్లికన్నా మా ఇంట పెళ్లి ఏం తక్కువ అంటూ సంబరంగా పాడుకునే పాట…
Ads
అంతేకాదు, రాముడి పెళ్లిలోలాగా ఇక్కడ ధనస్సులు విరిగిపడే శబ్దాలు లేవు… శివుడి పెళ్లిలోలాగా మన్మథుడి దేహం కాలిపోవడమూ లేదు… ఈ ఇంట పెళ్లిలో అన్నీ మురిపాల ముచ్చట్లే అని చెబుతాడు సిరివెన్నెల… సునీత గొంతులో ప్రతి పదమూ ఓ మంగళవాయిద్యంలా వినిపిస్తుంది… అబ్బురం అని కాదు, అలా బాగా కుదిరింది… ఈ పాట దక్కడం ఆమె అదృష్టం… మణిశర్మ గొప్ప ట్యూన్లు, కంపోజింగ్ కెరీర్లో బహుశా ఇదే టాప్ వన్ కావచ్చు…
ఆ రామచంద్రుడికి మా పిల్లాడు అన్నింట్లోనూ సాటి అంటూనే… మన తెలుగుతనాన్ని, పౌరుషాన్ని కూడా కనెక్ట్ చేసి, సగటు తెలుగువాడిని వర్ణిస్తాడు కవి… ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నింట్లోనూ మేటి అంటూ… తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన అట… తెలుగింటిలో వేరే పాలసంద్రం ఉంటుందా..? ఉండదు కానీ… శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ అట… అంటే లక్ష్మి, క్షీరసాగరంలో పుట్టిన లక్ష్మి, విష్ణువును వరించిన ఆ లక్ష్మి మా తెలుగింట్లో పుట్టినదే అని వర్ణన… సిరివెన్నెలది తెలుగు గడుసుతనం…
- ఓ చందమామా ఓసారి కిందకు చూడమ్మా, ఈ నేల మీద నెలరాజుని చూసి నివ్వెరబోకు అంటాడు కవి… ఇన్నేళ్లూ చంద్రుడి జెండర్ మేల్ అనే ఖరారు చేసుకున్నాం కదా, కాదు, ఫిమేల్ జెండర్, ఓసారి కిందకు చూడు, ఈ చంద్రుడిని చూసి నివ్వెరపోతావు నువ్వే అనడం ఆ సిరివెన్నెలకే చెల్లింది…
వెన్నెలను కూడా ఓ పడతిలా మార్చి, ఓసోస్, నీ వన్నెలు చాలు, మా అన్నుల మిన్నకు సరిచాలనని నువ్వే వెలవెలబోతావు అంటాడు కవి… వెన్నెల వెలవెలబోవడం మంచి భావన…
- పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు, ఆమె పచ్చని మెడపై వెచ్చగ రాస్తాయట ఏవో చిలిపి రహస్యాలు… ఆ తారకలే ముత్యాల తలంబ్రాలై నేలకు జారతాయట… అందాల జంట కంటికి విందులు చేస్తోంది కదా, తళతళ మెరిసే ఆనందపు తడితో అక్షితల ఆశీస్సులు కురిపించండి అనడుగుతాడు… ఎక్కడా గొట్టు పదాల్లేవు, సాహితీ ప్రకర్ష లేదు… సరళమైన పదాలతో, అందంగా, అలవోకగా రాశాడు…
అసలు మీ దేవుళ్ల పెళ్లిళ్లు ఏం గొప్పోయ్, రాముడి పెళ్లిలో శివుడి విల్లు విరిగిన ఫెళఫెళారావాలు… ఆ శంకరుడి పెళ్లికి ముందు మన్మథ దహనపు సెగలు, పొగలు… కానీ ఇదుగో మా తెలుగింటి పెళ్లిలో సంబరాలు తప్ప ఏ అపస్వరాలు లేవు తెలుసా అని గుర్తుచేస్తాడు…
సోనాలి బింద్రేను ప్రతి తెలుగింటి బిడ్డగా మార్చింది, మహేశ్ బాబుకు హఠాత్తుగా తెలుగు ప్రేక్షకగణం యాక్సెప్టెన్సీని తీసుకొచ్చింది ఈ సినిమా… ప్రత్యేకించి ఈ పాట… సునీతకు జతకలిసిన జిక్కి స్వరం, ఎంత బాగుందో..!!
అన్నట్టు ‘మురారి’ని ఓసారి తలుచుకొండి ఇది చదివి....
Share this Article