డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఆలీ చేసిన అత్యంత వెగటు ‘బొక’ ఎపిసోడ్ పీకేశారు అని ఒక వార్త… పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… మిస్టర్ బచ్చన్‌లో తెలుగువాడికి ఎక్కని హిందీ పాటలకు కూడా కత్తెర పెట్టారని మరో వార్త… ఇదీ ఊహించిందే… ప్రేక్షకుడి ఫీడ్ బ్యాక్, స్పందనలను బట్టి నిడివి కత్తిరింపులు, సీన్ల తొలగింపులు, జోడింపులు అసాధారణమేమీ కాదు… కానీ…
దర్శకుడు పూరి తప్పేమీ లేదు, అంతా ఆలీదే తప్పు… ఆ ఎపిసోడ్ రచన, దర్శకత్వం, నటన అన్నీ ఆలీవే… సో, మొత్తం ఆలీదే తప్పు అని కొందరు సూత్రీకరించేస్తున్న తీరు ఆశ్చర్యం అనిపించింది… అది ఆలీ చెత్త టేస్ట్… పూరి గత సినిమాల్లోనూ ఆలీ పాత్రలు కొన్ని ఇలాగే ఏడ్చాయి… ఐతే నిజంగానే ఈ బొక్క, సారీ బొక పాత్ర సృష్టికర్త ఆలీయే అయినా సరే… దాన్ని సినిమాలో అనాలోచితంగా పెట్టిన దర్శకుడిదే మొత్తం తప్పు…
నిర్మాత దర్శకుడికి క్రియేటివ్ బాధ్యతలు అప్పగిస్తాడు… సినిమా ఓవరాల్ ఔట్‌పుట్‌కు దర్శకుడిదే బాధ్యత… ప్రాజెక్టుకు కెప్టెన్ తనే… అసలు ఆ ఎపిసోడ్ ఎలా వచ్చిందో పూరి ఒక్కసారి చూసుకునే సోయి లేదా..? పైగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది… ఇప్పుడు ఎన్ని పీకేసినా, ఏం మేకప్పులు వేసినా సినిమా డిజాస్టర్‌గా మిగిలింది… ఆల్రెడీ లైగర్ గాయాలు ఈరోజుకూ పచ్చిపచ్చిగానే ఉన్నప్పుడు ఈ సినిమా మీద ఇంకా చాలా జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది కదా…
Ads
నిజానికి ఇక్కడ హీరో రాపో బాధ్యత కూడా ఉంది… తను కూడా సినిమా ఔట్ పుట్ మీద కాస్త కన్నేసి ఉంచాల్సింది… ఎందుకంటే, ఇది తనకూ కీలకమైన ప్రాజెక్టే… తనకూ ఇస్మార్ట్ శంకర్ తరువాత ఫ్లాపులు పడ్డాయి… సరే, రొటీన్ ఫార్ములా మాస్ కమర్షియల్ వాసనలుంటే చాలు అనే పాత రోజుల్లో ఉన్నాడేమో ఇంకా… ప్రేక్షకుల టేస్ట్, ప్రాధాన్యాలు వేగంగా మారిపోతున్నాయనీ, ఏదో కొత్తదనం లేకపోతే ప్రేక్షకుడు థియేటర్ వైపు రావడం లేదనే రియాలిటీని విస్మరించాడు…
మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అంతే… రవితేజ వరుసగా ఫ్లాపులు ఇస్తూనే ఉంటాడు… కానీ ఎనర్జీ తగ్గదు… అవకాశాలు తగ్గవు… అవి తనను వెతుక్కుంటూ వస్తుంటాయి… అలవోకగా చేసేస్తూ ఉంటాడు… అవి ఫట్‌మని పేలిపోతూనే ఉంటాయి… మరోవైపు ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్‌కూ చాన్నాళ్లుగా ఏ హిట్టూ లేదు… చేదు అనుభవాలే… అలాంటిది హీరో, దర్శకుడు ఈ సినిమా ఔట్పుట్ మీద ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకుంటూ ఉండాల్సింది, అది లోపించింది…
పైగా కొత్తమ్మాయి భాగ్యశ్రీ బోర్సెతో రవితేజకు శేఖర్ మాస్టర్ పెట్టిన స్టెప్పులు వెగటుగా, వికారంగా ఉన్నాయి కొన్ని… పైన చెప్పిన రెండు సినిమాల్లో వెగటు డైలాగులకూ కొదువ లేదు… ఈ ఇద్దరు పాపులర్ హీరోల సినిమాలు ఇలా ఉంటే… జూనియర్ బావమరిది, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నడక ప్రారంభించిన నితిన్ సినిమా ఆయ్కు కాస్త పాజిటివ్ టాక్ రావడం విశేషం… కథకన్నా కథను ప్రజెంట్ చేసిన తీరు దానికి ప్లస్ పాయింట్… కాబట్టి దర్శకులు హరీషూ, పూరీలూ… తప్పెవరిది అంటారు..?!
Share this Article