తెలుగు పత్రికారంగంలో ఈనాడు, సాక్షి జోరుగా తన్నుకుంటూ ఉంటయ్… తన చంద్రబాబు కోసం జగన్ గురించి ఈనాడు పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉంటుంది… సాక్షి ముక్కుతూ మూలుగుతూ కౌంటర్లు రాసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది… ఏపీ రాజకీయ క్షేత్రంలో చంద్రబాబు, జగన్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థులు, తెల్లారిలేస్తే డిష్యూం డిష్యూం… ఎదుటోడిని జైల్లో పారేయించాలని వాళ్ల ప్రయాస… అలాగే ఎదుటి మీడియాను మూయించేయాలని ధ్యాస… కానీ..?
వైఎస్ మరణం ప్రమాదం కాదనీ, అంబానీ చలువ అనీ అప్పట్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అల్లర్లు రేపాయి… కేజీబేసిన్ గ్యాస్‌కు సంబంధించి ఏదో అడిగితే అంబానీకి కోపమొచ్చిందనే ప్రచారం కూడా సాగింది… నిజానిజాలు పెరుమాళ్లకెరుక… కానీ అదే అంబానీ జగన్‌కు సన్నిహితుడు… అంబానీ భాయ్ అడగ్గానే ఆయన మనిషి నత్వానీకి ఓ రాజ్యసభ సీటు కూడా ఇచ్చేశాడు… ఇప్పుడు ఎల్లరూ సుఖులే… సఖులే… ఇప్పుడైతే సొంత బాబాయ్ హత్యను జగనే చేయించాడు అన్నంతగా ఈనాడులో వాంగ్మూలాల కథలు కాలాల కొద్దీ, పేజీల కొద్దీ పబ్లిష్ అవుతున్నయ్… అయితే..?
అదే జగన్ కొత్త దోస్త్ అంబానీ అదే రామోజీరావుకు పార్టనర్… అవును, అదే ఈనాడు పత్రికలో పార్టనర్… ఎహె, ఈనాడు పూర్తిగా రామోజీరావుదే… మధ్యలో అంబానీ పార్టనర్‌షిప్ ఏమిటి..? మేం నమ్మలేం అంటారా..? చాలామంది నమ్మరు… కానీ రామోజీరావు, అంబానీ తెలుగు మీడియా దందాలో భాగస్వాములే… ఈనాడే స్వయంగా ఈరోజు అచ్చువేసి మరీ చెప్పింది ఈ విషయాన్ని… చూడండి…
Ads
మొత్తం పెట్టుబడిలో ఒకశాతంపైన భాగస్వామ్యం కలిగినవారి జాబితా అని డిక్లరేషన్ పబ్లిష్ చేసింది ఈనాడు… అఫ్‌కోర్స్, రూల్స్ ప్రకారం ఇలా చెప్పడం తప్పనిసరి… ఈ భాగస్వాముల జాబితా పరిశీలిస్తే… ఈనాడును ప్రచురించే ఉషోదయ పబ్లికేషన్స్‌లో రామోజీరావు, ఉషాకిరణ్ మూవీస్, కలోరమ ప్రింటర్స్, మార్గదర్శి చిట్స్, టీవీ18, తీస్తా రిటెయిల్ పేర్లు కనిపిస్తయ్… ఉషాకిరణ్, కలోరమ, మార్గదర్శి ఎలాగూ వాళ్లవే… మరి టీవీ18, తీస్తా..? వాటి మాతృసంస్థ రిలయెన్స్… అనగా అంబానీ..!! ఏ కంపెనీ పేరిట ఎంత వాటాలున్నాయో తెలియదు… బహుశా 40 శాతం వాటా టీవీ18 ఖాతాలో ఉన్నట్టుంది…
అప్పట్లో ఈనాడు టైటానిక్ పొజిషన్‌లో సంక్షోభంలో ఉన్నప్పుడు… చంద్రబాబు దౌత్యం కావచ్చు, ఇంకెవరైనా సాయం చేసి ఉండవచ్చు… అంబానీ ఈనాడును ఆదుకున్నాడు… వేల కోట్లను సమకూర్చాడు… తిరిగి తీర్చాల్సి వచ్చినప్పుడు… రామోజీరావు ఏం చేశాడు..? తినడమే తప్ప, పైసా సంపాదించని నష్టదాయక పది టీవీ చానెళ్లను అంబానీకి అంటగట్టాడు… ఫాఫం, అంబానీ తీసేసుకున్నాడు… ఆ పది ప్రాంతీయ చానెళ్లు ప్రస్తుతం టీవీ18 పేరిట ఉన్నయ్…
ఐనా అప్పు తీరకపోవడంతో ఈనాడులో భాగస్వామ్యం ఇచ్చినట్టు సమాచారం… అంతేగాకుండా ఖైరతాబాద్ బిల్డింగ్ కూడానట… నిజానికి దాని ఓనర్‌షిప్ మీద గొడవలున్నయ్… ఐతేనేం, అంబానీకి రాసిచ్చేసినట్టున్నారు… సరే, ఆ ఆస్తులు, అప్పులు, చెల్లింపుల గురించి వదిలేస్తే… జగన్ అంబానీ దోస్తులు… అంబానీ రామోజీరావు దోస్తులు… రామోజీరావుకు చంద్రబాబు ఆత్మీయుడు… అల్లిబిల్లిగా అల్లుకున్న బంధాలు… కానీ జగన్-చంద్రబాబు తన్నేసుకుంటుంటారు… సాక్షి-ఈనాడు కొట్టేసుకుంటుంటాయి… ఇది వైచిత్రి ఏమీ కాదు… తెర ముందు, తెర వెనుక దృశ్యాలు ఎప్పుడూ వేర్వేరుగానే ఉంటయ్..! ప్రత్యేకించి రాజకీయాల్లో, మీడియాలో, అధికారంలో…!!
Share this Article