Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికా చెంపదెబ్బ..! ఒక్క వ్యాఖ్యతో పరువూ, డబ్బూ మటాష్..!!

February 26, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి…………  బయటికి వెళ్ళేటప్పుడు తిధి, వార, నక్షత్రాలతో పాటు రాహు కాలం [రాహు కాలం అంటే పంచాంగంలో చెప్పబడేది అన్నమాట ] చూసుకొని వెళ్ళాలి కదా ? కనీసం వర్జ్యం అన్నా చూసుకొని వెళ్లాలని శాస్త్రం! అలాంటిది వేరే దేశం వెళ్తున్నప్పుడు ఇంకెన్ని చూసుకోవాలి ?

మొన్న అంటే గురువారం ఉదయం 5 గంటలకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మాస్కో చేరుకున్నాడు రెండు రోజుల పర్యటన కోసం… సరే వచ్చాడు కదా అని పుతిన్ తన జూనియర్ మంత్రిని పంపించాడు విమానాశ్రయానికి స్వాగతం పలకడానికి… అప్పటికే పుతిన్ రష్యా ప్రజలని ఉద్దేశించి జాతీయ టెలివిజన్ లో ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు… ఉదయం 6.30 కి తన సైన్యానికి ఉక్రెయిన్ మీద దాడి చేయమని ఆదేశాలు ఇచ్చాడు…

ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో ఉండగానే పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేయమని ఇచ్చిన ఆదేశాలని విని… ఇమ్రాన్ ఖాన్ ‘నేను చాలా ఉద్వేగానికి గురి అవుతున్నాను‘ అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించాడు. ఇది చూసిన జో బిడెన్ యుద్ధం చూసి ఎక్సైట్ అవడం ఏమిటీ అంటూ మండి పడ్డాడు. వెంటనే తన అధికారులకి ఆదేశాలు ఇస్తూ ఏమన్నా చర్య తీసుకొని అవకాశాలు ఉంటే వెంటనే తీసుకోండి అన్నాడు…

Ads

అప్పటికే ఇమ్రాన్ మాస్కో పర్యటన మీద గుర్రుగా ఉన్న అధికారులు వెంటనే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ని సంప్రదించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్న రీతిన ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ అధికారులు పాకిస్తాన్ నేషనల్ బాంక్ ఖాతాలని జల్లెడ పట్టారు. కొన్ని నిధులు పాకిస్థాన్ నేషనల్ బాంక్ నుండి పక్క దారి పట్టినట్లు గమనించారు. వెంటనే విషయం జో బిడెన్ కి తెలిపారు.

యాంటీ మనీ లాండరింగ్ చట్టం కింద తగిన నిబంధనలు పాటించలేదు అంటూ పాకిస్థాన్ నేషనల్ బాంక్ మీద 55 మిలియన్ డాలర్లు జరిమానా విధించారు… అంటే అమెరికాలో ఉన్న పాకిస్తాన్ నేషనల్ బాంక్ లో ఉన్న నిధులలో నుండి జరిమానా మొత్తం ఆటోమాటిక్ గా బయటికి వెళ్ళిపోయాయి ! అసలే పారిస్ లో FATF పూర్తి స్థాయి సమావేశం జరుగుతున్న సమయంలో అమెరికా ఏకంగా యాంటి మనీ లాండరింగ్ అంటూ జరిమానా విధించడం FATF కి ఉప్పు అందించినట్లయింది. ఏమో… ఇవ్వాలోరేపో పాకిస్థాన్ ని బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాన్ని మాస్కో వెళ్లి మరీ అందించాడు ఇమ్రాన్… శుంఠ!

రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఉద్వేగానికి గురయ్యాను అంటూ జారిన ఒక్క మాట 55 మిలియన్ డాలర్లకి ఎసరు పెట్టినట్లయింది. అసలు యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో ఇమ్రాన్ మాస్కో వెళ్లి ఏం సాధిస్తాడు అంటూ ముందుగానే పాకిస్థాన్ ప్రతిపక్షాలు ఎద్దేవా చేసాయి ఇమ్రాన్ ని… మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం పుతిన్ మోడీని కాదని పాకిస్తాన్ కి సహాయం చేయడు అంటూ ప్రతిపక్షాలు ముందే అపశకునాలు పలికాయి. చివరికి అదే జరిగింది !

ప్రస్తుతం మాస్కో నుండి తిరిగి పాకిస్థాన్ తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పటికే అధికారులు అమెరికా వేసిన జరిమానా గురించి తెలిపే ఉంటాడు. విమాన పెట్రోలు రంధ్రం అనుకుంటే, దానికితోడు 55 మిలియన్ డాలర్లకి ఎసరు పెట్టాడు అంటూ ఇక రేపటి నుండి ప్రతిపక్షాల శాపనార్ధాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇమ్రాన్!

దౌత్యనీతి : రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో పర్యటనని వాయిదా వేసుకొని వెనక్కి రావాలి, కానీ పుతిన్ తో మంతనాలు చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది! అసలే విదేశీ చెల్లింపులు డాలర్ల రూపంలో చేయాల్సిన తరుణంలో, తగినన్ని డాలర్లు లేని తరుణంలో ఇలా 55 మిలియన్ డాలర్లు వృధాగా జరిమానా రూపంలో పోవడం చాలా పెద్ద దెబ్బ పాకిస్తాన్ కి…

పాకిస్థాన్ వ్యూహకర్తల అతి తెలివికి ఈ సంఘటన ఒక ఉదాహరణ ! వీళ్ళు ఎంత తెలివి గలవాళ్ళో వీళ్ళ వ్యూహాలు చూస్తుంటేనే అర్ధం అయిపోతున్నది. యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా రష్యా మీద కోపంగా ప్రకటనలు చేస్తున్న సమయంలో మాస్కో పర్యటన చాలా పెద్ద తప్పిదం ! పోనీ వెళ్ళిన వాడు నోరు మూసుకొని ఉంటే పోయేది కానీ చాల ఎక్సైట్ అవుతున్నాను అనడం ఒక దేశ ప్రధాని స్థాయికి తగ్గ వ్యాఖ్య కాదు. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. పాకిస్థాన్ మీద పరోక్షంగా ఆర్ధిక ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నారు జో బిడెన్ అధికారులు. అవి ఏమిటి ? ఎలా ఉండబోతున్నాయి ? బహుశా మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది ! ఇక ‘అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న ‘ అన్న రీతిలో ఉక్రెయిన్ కూడా పాకిస్థాన్ తమ్ముడే !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions