.
Gottimukkala Kamalakar …. చిన్నప్పుడు బాగా ఏడ్చిన సంఘటనలు ఇప్పుడు తలుచుకుంటే విరగబడి నవ్వేలా చేస్తాయి.
బాగా సంతోషపెట్టిన జ్ఞాపకాలు ఇప్పుడు ఏడిపిస్తాయి.
****
దసరా సెలవులకు నల్గొండ నుండి మా నెల్లపల్లికి ఆ అరవై కిలోమీటర్లు లతీఫ్ సాబ్ ప్రైవేటు బస్సులో సింపుల్గా ఏడు గంటల్లో వచ్చేవాణ్ని. ఎందుకంటే, నడిరోడ్డు మీద ఎవడికైనా చంకలో దురద పుట్టి గోక్కోవడానికి చెయ్యెత్తినా, లతీఫ్ సాబ్ బస్సాపేవాడు. వాడెక్కకపోతే బూతులు తిడుతూ వాడితో గొడవపడేవాడు; తద్వారా భవదీయుడికి బూతులు నేర్పేవాడు.
ఇంటికొస్తూన్న ఆనందం; చాలాసేపు బస్సులో కూర్చున్న సంతోషం యుగాలను క్షణాలుగా మార్చేది.
Ads
****
బతుకమ్మ తయారీ ముందస్తు సన్నాహాలు నేనూ, నాగార్జున్ రెడ్డీ కలిసి ఆడుకుంటూనే పోటీ పడుతూ చేసేవాళ్ళం..! చెరో రెండు బస్తాల గునుగు పూలు తెంపుకొచ్చేవాళ్లం..!
పాతకాలపు గునుగుపూలు పద్ధతిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను కొత్తకోంటి కృష్ణయ్య దుకాణంలో రకరకరకరకరరకాల రంగులు తెచ్చి నానేసి,ఆరేసి TDP; TRS; BSP; MIM; CPI పార్టీలలోకి వాటిని ఫిరాయింపజేసేవాణ్ని..!
పండగ రోజు పొద్దున్నే మళ్లీ మేమిద్దరం బస్తాలేసుకుని, వస్తాదుల్లా చెరువుగట్టు మీదికి, చెలకల్లోకీ బయల్దేరేవాళ్లం. ఆకుపచ్చ చీర కట్టి, పసుపు రాసుకున్న అమ్మవారిలా నేల అంతా విరబూసిన తంగేడు చెట్లు..! “ఆ చెట్టు నాది, ఆ చెట్టు నాది..!” అంటూ పంచేసుకుని పూలూ, పూతా తెంపుకునేవాళ్లం..! “అంతా నేనొక్కడినే తీసుకెళ్తే బావుణ్ను..!” అనే పిచ్చి కుళ్లు మనసులో ఉన్నా, నిజాయితీగా ఒప్పందాన్ని గౌరవించే వాళ్లం..!
బస్తా నింపుకుని ఇంటికి రాగానే, అరచెంబు నీళ్లతో అభ్యంగన స్నానం చేసి ఓ చాపేసుకుని ( అన్యథా భావించవలదు ), దాని మీద ఈ తంగేడు బస్తా ఖాళీ చేసి పూలూ, పూతా, చెత్తా అంతా సెపరేట్ చేసేవాణ్ని. అమ్మనూ, చెల్లెల్నీ ఆ పనిలో చేయి కాదు గదా, వేలు కూడా పెట్టనిచ్చేవాణ్ని కాదు…!
****
మధ్యాహ్నం తర్వాత అమ్మ షాపూర్జీ పల్లంజీలాగా ఓ పేద్ధ పళ్లెం పట్టుకుని రంగంలోకి దిగేది. మా పెరట్లో ఉన్న బంతులూ, కనకాంబరాలు ” మేం కూడా.. మేం కూడా..” అంటూ వచ్చి జత కలిసాక అమ్మ చకచకా క్వాంటిటీ, క్వాలిటీ సహిత బతుకమ్మను పేర్చేది.
అమ్మ పేర్చిన బతుకమ్మ ముందు బుర్జ్ ఖలీఫా దిగదుడుపు. అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!!

****
మా వాకిట్లోనే ఊరందరి బతుకమ్మాట. అప్పుడు మేం డీజేలు తెలియని వాజెమ్మలం..! డాండియా అంటే సేమియాలాంటి పాయసమేమో అని; గార్భా అంటే కడుపో, గార్దభమో అనుకునేంత మేధావులం..!
బతుకమ్మను “ఒక్కేసి పువ్వేసి సందమామా..!” అంటూ బతుకమ్మలా ఆడేవాళ్లు.
ఆడవాళ్ళే ఆడేవాళ్లు..!
అడక్కుండానే మగవాళ్లు స్పేస్ మెయింటైన్ చేసేవాళ్ళు..!
****
పెద షాహుకారు భార్య బూరుగు అనంతమ్మ; మా అమ్మా ఊపిరి పీల్చుకోకుండా బతుకమ్మ పాటలు పాడుతూంటే, ఊరంతా జత కలిపి కోరస్ పాడేది. పుప్పాల మాణిక్యమ్మా; చాకలి అచ్చమ్మా; ఒడ్లోళ్ల సావిత్రీ; కమ్మరి జంగమ్మా; కుమ్మరి పుల్లమ్మా; మంగలి ముత్యాలమ్మా; ఔసలి సుశీలమ్మా; ఏనెకింది మల్లమ్మా అందరూ ఆడిపాడేవాళ్లు. అప్పుడు అంటరానితనం అమలయ్యేది. మా మాలలూ, మాదిగలూ కొంచెం ఎడంగా ఉండి చూసేవాళ్ళు.
****
బాగా రాత్రయ్యాక బతుకమ్మల నిమజ్జనం మా ఊరి చెరువులోనే అయ్యేది. చివరికి అందరం, అంతా ఒకటే అని బోధ చేస్తున్నట్టు అన్ని బతుకమ్మలూ కలిసిపోయేవి. పోయేవి…!!
****
మొన్న అభిజ్ఞాన్ ని కాలేజీలో దింపి వెనక్కొస్తుంటే జీడిమెట్లలో తంగేడు; గునుగు పూలు అమ్ముతున్న దృశ్యం కనిపించింది. జ్ఞాపకాల ఉప్పెన గుండెల్లో గుప్పుమంటుంటే, కారాపి వెళ్లి బేరమాడాను. మార్కెట్ అంతా అయ్యప్ప పాటల హోరు..! అవే పది పదాలను తిప్పీ తిప్పీ పాడుతుంటే, నాకు డిసెంబరు చివరి వారం గుర్తొచ్చింది…!
తంగేడు పూలు తులం లెఖ్కన; గునుగుపూలు గ్రాముల్లెఖ్కన ధరలు చెప్పారు. ఈ రేటుతో నా చిన్నప్పటి బతుకమ్మను చేయాలంటే ఓ అరలక్ష ఈజీగా ఖర్చవుతుంది.
బతుకు కోసం బతుకమ్మను అమ్ముతున్న ఆ అమ్మకాల అమ్మకో దండవెట్టి కారు స్టార్ట్ చేసాను..!
***
ఊర్లో అందరం కలిసాం..! సమైక్యత, ఆత్మ చచ్చిపోయాయి..!
బూరుగు అనంతమ్మ కీర్తిశేషురాలు..!
అమ్మకు ఆర్థరైటిస్..!!
*****
Share this Article