.
అవునా… బెంగుళూరు ఇంట్లో షర్మిల బిడ్డ పెళ్లి వద్దని జగన్ నిరాకరించడమే స్థానిక ఎన్నికల్లో జగన్ పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చిందా..? జనం అందుకే వైసీపీని తిరస్కరించారా..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రమే ఇలా ఏదైనా రాయగలడేమో… ఎన్నికల ఫలితాలకు ఇలాంటి శుష్క బాష్యాలూ చెప్పగలడేమో…
తను ‘కొత్త పలుకు’ వ్యాసంలో ఏం రాసుకొచ్చాడో ఓసారి చదవండి… ‘‘మేనకోడలు పెళ్లి విషయంలో జగన్‌రెడ్డి పేచీకి దిగడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత బహిర్గతం చేసింది. బెంగళూరులోని యలహంకలో తన కోసం తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన భవనంలో తన కుమార్తె పెళ్లి చేసుకోలేకపోవడంపై షర్మిల ఆవేదన చెందడం జగన్‌రెడ్డి మద్దతుదారులను కూడా ఆలోచనలో పడేసింది.
Ads
- షర్మిల తరఫున కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగారు. ‘మీకు ఎంత భద్రత కావాలంటే అంత భద్రత కల్పిస్తాం. రెండు ఇళ్ల మధ్య రేకులతో అడ్డుగోడ నిర్మిస్తాం. అక్కడ పెళ్లి చేసుకోనివ్వండి’ అని ముఖ్యమంత్రి శివకుమార్ స్వయంగా జగన్‌కు ఫోన్ చేసి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ‘మా మధ్య వివాదం సమసిపోయింది’ అని కర్ణాటక ముఖ్యమంత్రికి జగన్‌రెడ్డి అబద్ధం చెప్పారు.
మేనకోడలి పెళ్లికి మేనమామగా జగన్‌రెడ్డి అడ్డుపడటాన్ని సభ్య సమాజం ఎలా జీర్ణించుకుంటుంది? స్థానిక ఎన్నికల్లో ఈ ఉదంతం ప్రభావం ఉందని కూడా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి ఇలాంటి సంఘటనలన్నీ కారణం కాకుండా ఉంటాయా! జగన్‌రెడ్డి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది…

1. అవునా..? షర్మిల పెళ్లి కార్డు ఇవ్వడానికి కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దగ్గరకు వెళ్లినప్పుడు… అన్నా, నువ్వయినా మా అన్నకు చెప్పు… యలహంక ఇంట్లోనే పెళ్లి చేస్తాం… నువ్వు చెబితే వింటాడు ప్లీజ్ అనడిగిందా..?
2. సరే, ఆయన కాంగ్రెస్ సీఎం, ఈమె ఓ రాష్ట్ర పీసీసీ హెడ్… ఒకవేళ ఆమె అడిగిందే అనుకుందాం… తను వెంటనే జగన్‌కు ఫోన్ చేసి, ఎంత భద్రత కావాలన్నా ఇస్తాం, నీ మేనకోడలు పెళ్లి అందులోనే జరగనివ్వు అని చెబుతాడా..? కుటుంబ వ్యవహారాల్లో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటాడా..?
3. పైగా అవసరమైతే జగన్, షర్మిల నివాసాల నడుమ ఇనుపరేకులతో అడ్డుగోడ కట్టిస్తాను అంటాడా..? దీనికి జగన్ ‘మా మధ్య వివాదం సమసిపోయిందిలే’ అని అబద్ధం చెప్పి, డీకేను మభ్యపెట్టాడా..? హేమిటో, అంతా రాధాకృష్ణ మాయాసమాచారం…
4. పోలింగ్ శాతం తగ్గడానికి కూడా ఈ వివాదమే కారణమట… సభ్యసమాజం హర్షించదట… అందుకే జగన్ పార్టీకి ఇలాంటి చేదు ఫలితాలు వచ్చాయట… చివరకు జగన్ మద్దతుదారులు కూడా ఆలోచనలో పడ్డారట…
… ఇప్పుడు అర్థమైంది నిజం… రాజకీయ విశ్లేషకులు పాపం, కూటమి పాలనకు జైకొట్టారని, జగన్‌ను ఇప్పటికీ క్షమించలేకపోతున్నారనీ, స్థానిక ఫలితాలు దానికి రుజువు అనీ ఏదేదో చెబుతున్నారు, రాస్తున్నారు… సో, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మొహాలు చూసి కాదన్నమాట ఈ తీర్పు… జస్ట్, జగన్ మేనకోడలి పెళ్లి వివాదమేనా..? సరే, సర్… ఆర్కే గారూ, ఇంకేమిటి సంగతులు..?!
Share this Article