ఆ షో ముగిశాక కూడా వార్తల్లో ఉంటోంది రకరకాల కారణాలతో… బాగా నెగెటివిటీని మూటగట్టుకున్న రన్నరప్ అమర్‌దీప్ ఏమైపోయాడు..? జాడలేడు, పత్తాలేడు… ఒక వార్త… ప్రియాంక జైన్ పెళ్లి త్వరలో, ఆ ప్రియుడితోనే… ఇంకో వార్త… అంబటి అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నాడు… మరో వార్త… 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని పాత బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ప్రకటన… మరొక వార్త… నన్ను డీఫేమ్ చేసి, కుట్రలు పన్నిన యూట్యూబర్ల అంతుచూస్తానని పల్లవిప్రశాంత్ భీషణ నిర్ణయం… ఓ వార్త…
ఇలాంటి బోలెడు సోది వార్తల నడుమ ఓ ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… ’’బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున వేస్ట్, టీం ఏ స్క్రిప్ట్ రాస్తే అది చదువుతాడు అంతే, చప్పచప్పగా హోస్ట్ చేస్తాడు, నార్మల్ ప్రశ్నలేస్తాడు, స్క్రూటైట్ చేసేవి, బెండు తీసే ప్రశ్నలు వేయడు, కూల్‌గా వస్తాడు, కూల్‌గా వెళ్లిపోతాడు, అందరూ ఆహోఓహో నాగార్జున ఇరగదీస్తాడు అనుకుంటారు, తను ఎపిసోడ్స్ చూసి వీకెండ్ షోలు డీల్ చేస్తాడు అనుకుంటారు కానీ కాదు…
టీం ఒక కంటెస్టెంట్‌తో తప్పు ఒప్పించాలనుకుంటే, ఫిక్సయితే నాగార్జున కూడా దానికే ప్రయత్నిస్తాడు… హోస్ట్ వేయలేని ప్రశ్నల్ని, చేయలేని పనిని నేను బిగ్‌బాస్ బజ్ ద్వారా చేస్తున్నా.., ఎన్టీయార్, నాని బాగా చేశారు… ఈ షోకు ఆర్టీవీ హోస్ట్ అయితే కథ వేరే ఉండేది…’’ అని చెబుతూ పోయింది గీతూ రాయల్… మొదట్లో రివ్యూలు చేస్తూ, తరువాతే తనే కంటెస్టెంట్‌గా మారి, మొన్నటి సీజన్‌లో బజ్ ఇంటర్వ్యూలు చేసిన ఈమె కారుపై మొన్నటి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడిచేశారు, అసభ్యంగా ప్రవర్తించారు… పోలీసులకు ఫస్ట్ ఫిర్యాదు తనే చేసింది…
Ads
ఇక నాగార్జునపై విమర్శలు అనేది దుస్సాహసమే… ఎవరూ అలా కామెంట్లు చేసే ధైర్యం చేయరు… ఇండస్ట్రీలో నాగార్జున పొజిషన్ ఏమిటో తెలిసీ, ఎహె, ఆయన హోస్ట్‌గా వేస్ట్ అనడం ఓరకంగా తెంపరితనమే… నిజానికి ఆమె చెప్పేవన్నీ నిజాలే… కాకపోతే ఈ తింగరి పిల్లకు హోస్ట్‌కూ, జడ్జికీ తేడా తెలియనట్టుంది… టీవీ రియాలిటీ షోలలో రియాలిటీ ఉండదు, అంతా స్క్రిప్టెడే… ఇదే కాదు, ఏ షో అయినా అంతే… ప్రొడ్యూసర్, క్రియేటివ్ టీం ఏది చెబితే అదే… కమర్షియల్ లైన్స్‌లో నడుస్తుంటయ్… ఏది చూపించాలో అదే చూపిస్తారు…
నాగార్జున కోణంలో చూద్దాం… తన స్టూడియోలో సెట్, ఆ కిరాయి వస్తుంది… తన సినిమాలేవీ నడవడం లేదు… తన కొడుకులు కూడా అంతంతే… తనకు బోలెడు వ్యాపకాలు… పని లేనట్టుగా బిగ్‌బాస్ ఎపిసోడ్లు, కంటెస్టెంట్ల వెర్రిచేష్టలు చూస్తూ కూర్చుంటాడా..? ఎంచక్కా హోస్టింగ్ డబ్బు కూడా వస్తోంది… అంతే… ఆ టీం ఏది రాసిస్తే అదే నటిస్తాడు, అవే డైలాగులు చెబుతాడు… ఏ భాషలోనైనా అంతే… హోస్ట్ కూడా ఓ పాత్ర… దాని స్క్రిప్ట్ మేరకు నటించాలి, వెళ్లిపోవాలి, అంతే… షో ఆదరణ, రేటింగ్స్, యాడ్స్, డబ్బులు, నిర్వహణ అన్నీ వేర్వేరు విభాగాలు… ఎవరి పని వాళ్లదే…
కాస్త తిక్కతిక్కగా మాట్లాడుతున్నట్టు అనిపించే ఈ గీతూ రాయల్ బజ్ ఇంటర్వ్యూ హోస్ట్‌గా వేసే ప్రశ్నలు కూడా స్క్రిప్టెడే… అబ్బే, ఆడియెన్స్ పంపించే ప్రశ్నల్నే వేస్తున్నాను అంటోంది… ఇబ్బందికరమైన ప్రశ్నలు గనుక వేసి ఉంటే మధ్యలోనే ఆమెను ఇంటికి పంపించేసేది బిగ్‌బాస్ టీం… కాకపోతే ఏ మూడ్‌లో ఉందో, ఏ లోకంలో ఉందో గానీ, నాగార్జున హోస్టింగ్ చెత్త అని తేల్చిపడేయడం మాత్రమే అసలు వార్త…! ఎస్, టీంకు ఆ చెత్తే కావాలి కాబట్టే వరుసగా ప్రతి సీజన్‌కూ తనే హోస్ట్… ఆ హౌజ్ వదలని చీఫ్ గెస్ట్…!!
Share this Article