పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్ అని బీజేపీ ముద్రేయకుండా.. 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి!
…………………………………..
‘‘ నా అసలు ఇంటి పేరు సింగ్. నేను పంజాబీ రాజపుత్ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయ చేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల క్రితం (2019 ఎన్నికలకు ఏడు నెలల ముందు అంటే 2018 ఆగస్టు చివర్లో) తనను తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ఆప్ అభ్యర్ధిగా ప్రకటించాక నాటి మంత్రి ఆతిశీ మార్లెనా ఇచ్చిన విరణ ఇది.
17వ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్ధిగా బరిలోకి దిగినాక బీజేపీ నుంచి వచ్చే ఇబ్బందులను ముందుగానే ఊహించిన ఆతిశీ తన పేరులో రెండో మాట ‘మార్లెనా’ను అన్ని ‘ఆప్’ రికార్డుల నుంచి, ఎన్నికల ప్రచార సామాగ్రి నుంచి తొలగిస్తున్నానని ప్రకటించారు. జనం అనుకుంటున్నట్టు తనను క్రిస్టియన్ అని జనం పొరపడతారనే భయంతో మాత్రం మార్లెనా అనే మాటను పేరు నుంచి తొలగించలేదని కూడా ఆమె అప్పుడు క్లారిటీ ఇచ్చారు…
Ads
దీనిపై ఆమె కన్నా ముందు ఆ పార్టీ నేత ఒకరు ఆ రోజుల్లోనే వివరణ ఇస్తూ, ‘‘ ఆతిశీ పేరు మధ్యలో మాట మార్లెనాను బట్టి ఆమె విదేశీ మహిళ అని, క్రైస్తవ స్త్రీ అనే ప్రచారంతో బీజేపీ వాళ్లు ప్రజలను చీల్చి లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆమె మార్లెనా పదాన్ని ఎన్నికల ప్రచారంలో లేకుండా వదిలేశారు,’’ మీడియా ముందు ప్రకటించారు.
ఆతిశీ కూడా దీనిపై మాట్లాడుతూ, ‘‘ నేను ఎవరో (జాతి, మతం, కులం) పదే పదే నిరూపిస్తూ సమయం వృధా చేయడం నాకిష్టం లేదు,’’ అని చెప్పారు. 43 ఏళ్ల క్రితం పంజాబీ కమ్యూనిస్టు ప్రొఫెసర్లు తృప్తా వాహీ, విజయ్‌సింగ్ తోమర్‌కు జన్మించింది ఆతిశీ. వారికి ఇష్టులైన కారల్ మార్క్స్, వ్లాదిమిర్ లెనిన్ ఇంటి పేర్ల మొదటి పేర్లను కలిపి ‘మార్లెనా’ అనే మాటను కూతరు ఆతిశీ రెండో పేరుగా జోడించారు ఇద్దరు ప్రొఫెసర్లు. అలా ఆమె పేరు ఆతిశీ మార్లెనా సింగ్ అయింది గాని ఆమె తన మతం, కులాన్ని సూచించే సింగ్‌ను పెద్దగా వాడుకోలేదు.
తనను క్రిస్టియన్‌గా బీజేపీ వాళ్లు ముద్ర వేసి ప్రచారంచేసే అవకాశం ఇవ్వకుండా ఆతిశి 37 వయసులోనే అంతగా జాగ్రత్తపడ్డారు. అందుకే ఆమెకు ఇతర అర్హతలు కూడా తోడుగా చేరడంతో జిత్తులమారి పూర్వ ఐఆర్‌ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు కాగలిగారు.
ఆతిశీ థ్యాంక్స్ చెప్పాల్సింది మార్క్స్, లెనిన్‌కు కాదు సౌత్ లిక్కర్ లాబీకి!
……………………………………………………………………………….
ఆతిశీ పైన చెప్పినట్టు తన నాయకుడి బాటన నడవడం ఆరేళ్ల క్రితమే నేర్చుకున్నారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, మూడోసారి భారీ మెజారిటీతో గెలిచి దిల్లీలో అధికారం చేపట్టినప్పటి నుంచీ కేజ్రీవాల్‌ను బీజేపీ వెంటాడుతూనే ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో నరేంద్రమోదీతో కేజ్రీవాల్ తలపడడాన్ని బీజేపీ మర్చిపోలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా ఆప్ తొలి ముఖ్యమంత్రిని నానా తిప్పలు పెట్టింది నరేంద్రమోదీ–అమిత్ షాల నాయకత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు.
కాషాయపక్షాన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దారిలోనే నడిచారు కేజ్రీవాల్. 2020 ఫిబ్రవరి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికే బీజేపీ రాముడికి పోటీగా హనుమంతుడిని ఆయుధంగా చేసుకున్నారు హరియాణాలో కుటుంబ మూలాలున్న అగర్‌వాల్ వైశ్య నేత అరవింద్. హనుమాన్ చాలీసాతో బీజేపీని కట్టడి చేసే ప్రయత్నాలు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు నుంచి కాపాడలేకపోయాయి. జాతీయ మద్యం లాబీలో భాగమైన దక్షిణాది గ్రూప్ పుణ్యమా అని కేజ్రీవాల్ అరెస్టయ్యారు.
దక్షిణాది మద్యం వ్యాపారులు ఆఫ్రికా ఖండానికి వెళ్లి మరీ వ్యాపారం చేయగలరు గాని మోదీ– షా సర్కారు ‘కొట్టుడు’కు తట్టుకోలేరని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు పెద్ద రెడ్లు– మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పెనక శరత్ చంద్రా రెడ్డి (అరవిందో ఫార్మా) నిరూపించారు. అవినీతిపై యుద్ధం ప్రకటించి పెద్దగా అధికారాలు లేని దిల్లీ ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు కైవసం చేసుకున్న కేజ్రీవాల్ దక్షిణాది మద్యం లాబీ గాజు సీసాల దెబ్బతో తిహాఢ్ జైలుకు రెండుసార్లు పోయి చివరికి పదవికి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చిలోగా జరగాల్సిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు కొత్త రాజకీయ నాటకానికి తెరతీసిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో మరి. ఆయన వారసురాలిగా తెలివైన ఆతిశీ ‘ఆప్’ అదృష్టమే అనుకోవాలి.
ఏదేమైనా ‘సౌత్ గ్రూప్’గా దేశ రాజధానిలో పేరుమోసిన దక్షిణాది రాష్ట్రాల లికర్ లాబీ తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో హరియాణీ అగర్వాల్ వైశ్య నేతను ఇరికించబట్టే కమ్యూనిస్టు మహామహోపాధ్యాయులు కారల్ మార్క్స్, వ్లాదిమిర్ ఇల్యిచ్ లెనిన్‌ల ఇంటి పేర్లను కలిపి తన మిడిల్ నేమ్‌గా పెట్టుకున్న ఆతిశీ మార్లెనా సింగ్ దిల్లీ గద్దెనెక్కబోతున్నారు. ప్రచారానికి ఆమడ దూరంలో ఉండే ఆతిశీ భర్త ప్రవీణ్ సింగ్ ఎక్కువగా భార్య చాటు భర్త… తను ఐఐటీ, ఐఐఎంలతో చదివి నిరంతరం పరిశోధన చేస్తుంటారని మీడియా వార్తలు సూచిస్తున్నాయి… (మెరుగుమాల నాంచారయ్య)
Share this Article