.
కేసీఆర్ నివాసంపై దాడి చేయడం దుర్మార్గం. ఆ దాడిని అడ్డుకోవడానికి మేము వెళ్తే, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి మాపై కూడా దాడికి యత్నించారు… ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలే నా పీఏ, పీఆర్వోలపై దాడి జరిగినా పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ (FIR) కూడా నమోదు చేయలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడతాం…… – ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
ఇదేకాదు… పొద్దున ఏదో ట్వీట్… ’’మూకదాడి ఎల్లప్పుడూ ఒక హత్యగా మాత్రమే ప్రారంభం కాదు… కొన్నిసార్లు అది పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లో, యూనిఫాంలో ఉన్న అధికారుల సమక్షంలో, జాగ్రత్తగా ప్రణాళిక వేసి చేసే దాడిగా మొదలవుతుంది… ప్రభుత్వ యంత్రాంగం గూండాయిజానికి మద్దతునిస్తూ, ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే, అతి త్వరలోనే వీధుల్లో మూకదాడులు చూస్తామేమోనని నాకు ఆందోళనగా ఉంది… అణచివేతకు తలొగ్గని ఏ తెలంగాణ పౌరుడికైనా ఇది జరగవచ్చు..’’
Ads
నిన్నటి నుంచీ గులాబీ క్యాంపు సోషల్ మీడియాలో, మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు… కేటీయార్ ఏకంగా మూకదాడుల దాకా వెళ్లిపోయాడు… అంటే ఈ ప్రచారం చూస్తుంటే నిజంగానే తెలంగాణలో అంత భీకరమైన పరిస్థితులు ఉన్నాయా అని కాంగ్రెసోళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి..,
గాలి నుంచి టన్నుల కొద్దీ బురదను అలవోకగా సృష్టించి… పడని వ్యక్తులపై, పార్టీలపై గుమ్మరించే పార్టీ కదా బీఆర్ఎస్… ఇదీ ఆ బాపతు గాయిగత్తరే కాకపోవచ్చు అనుకుని, ఏమైనా ఆధారాలు గులాబీ క్యాంపు నుంచి బయటికి వస్తాయేమోనని నిన్నటి నుంచీ ఎదురుచూస్తున్నది పాత్రికేయ సమాజం…
1) దాడులకు గురైన సదరు ఉద్యమ జర్నలిస్టులు కమ్ కేటీయార్ స్టాఫ్‌ను విలేకరుల ఎదుటకు తీసుకొస్తారేమోనని… ఏమైనా ఆధారాలు చూపిస్తారేమోనని అనుకున్నారు… ఏమీ లేదు… రౌడీలా, లేక పోలీసులకే ముసుగులు వేసి దాడి చేయించారా అనీ కేటీయార్ సందేహం వ్యక్తం చేసి, సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు…
2) ఒక వీడియో కనిపించింది బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్ ఒకాయన దాడికి ప్రయత్నం జరిగింది అని చెబుతున్నాడు… కానీ కేటీయార్ దాకా ఆ లీడర్లు మాత్రం దాడి జరిగింది, పైశాచికం, దుర్మార్గం అని చెబుతూనే ఉన్నారు… నిజంగానే పొలిటికల్ కక్షసాధింపు అంటూ ఉంటే కేటీయార్ స్టాఫ్ మీద ఎందుకు చేస్తారు..? వాళ్లసలు రాజకీయ నాయకులే కాదు కదా…
3) మరి నిజంగా ఠాణాలో ఏం జరిగింది..? ఎస్, నిజంగానే ముసుగులు ధరించిన ఆగంతకులు పోలీసుల ఆధీనంలో ఉన్న వారిపై, పోలీస్ స్టేషన్‌లోనే దాడి చేస్తే అరాచకమే… కానీ దాడి జరిగిందా..? వాళ్లు దాడి కోసమే వచ్చారా..? పోలీసులకు నిజమేమిటో చెప్పుకునే సోయి లేదు, కౌంటర్ ప్రయాస కాంగ్రెస్‌కూ లేదు… చేతకాదు…
4) ఒకవేళ ఎవరైనా దాడికి నిజంగానే ప్రయత్నిస్తే దానికి ఉసిగొల్పిన కారణాలు ఏమిటి..? ఇంతకీ వాళ్లెవరు..? ఆ మాస్కుల మాటేమిటి… వాళ్లపై నిజంగా దాడి అనేదే ఓ నిజమైతే… అసెంబ్లీ ఎదుట ఇన్సిడెంట్ తరువాత గాయపడ్డారనే పేరిట పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు తెలంగాణ భవన్‌లో చికిత్స అనే ఫోటోలు రిలీజ్ చేశారు, ఇక్కడ అదీ లేదు…
5) పోనీ, సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా..? లేదు… తరువాత పోలీస్ స్టేషన్ దగ్గర గుమిగూడిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు మినహా వేరే వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు…
6) ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి వివరణ ఇస్తూ… ‘‘స్థానికులు కొందరు గణేష్ మండపం వద్ద డీజే అనుమతి (పర్మిషన్) కోరుతూ వచ్చారు… సైఫాబాద్ సీఐ వారిని కసురుకున్నాడు… ఆ సమయంలో అక్కడే ఉన్న కేటీఆర్ పీఆర్వోను ఆ యువకుల్లో ఒకరు గుర్తించి… అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వాళ్లనేమో పీఎస్‌లో మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతారు, మాకేమో పర్మిషన్ ఇవ్వరా అని వారితో వాగ్వాదానికి దిగారు… తరువాత పోలీసులు వాళ్లను వెళ్లగొట్టారు, సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశాం, ఏ దాడీ ఎవరిపైనా జరగలేదు’’ అని చెప్పుకొచ్చింది…
7) ఒకవేళ నిజంగానే పోలీసుల సహకారంతో వాళ్లపై దాడికి ఓ కుట్ర జరిగిందే అనుకుందాం… మరెందుకు వాపస్ వెళ్లిపోయినట్టు..? సో, అక్కడ ఏదో జరిగింది అనేదే ప్రశ్నార్థకం… పోలీసులు అక్కడికి పిలిచింది అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ప్రేరేపిత కుట్ర అని పోలీసులు పెట్టిన కేసు… పోలీసులపై కూడా బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆరోపణ కదా, ఎవరు అక్కడ ఉద్రిక్తతను ప్లాన్ చేశారనేది పోలీసులు సాగిస్తున్న దర్యాప్తు…
8) ఒకవేళ నిజంగానే అసెంబ్లీ గేటు దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు అనుకుంటే… ఈ పీఏ, ఈ పీఆర్వో ప్రమేయం ఏమీ లేదని తేలాలని అనుకున్నా సరే, పోలీసులకు బీఆర్ఎస్ సహకరించాలి కదా… మధ్యలో ఈ కొత్త కథ దేనికి పుట్టుకొచ్చింది..?
9) గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రాపగాండా బాధ్యులను అరెస్టు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఏరకమైన అవాంఛనీయ ఉసిగొల్పడాలు గట్రా లేవు కదా… మరి ఈ పీఏ, ఈ పీఆర్వోల మీద మాత్రమే ఎవరికి, ఎందుకు ప్రత్యేకంగా కక్ష ఉంటుంది..?
.
Share this Article